యోగ పరిభాషలో ఈ శరీరాన్ని మనం ఐదు పొరల లేదా ఐదు తొడుగుల వ్యవస్థగా చూస్తాం. యోగ విధానంలో బుద్ధి అనేది లేదు. అంతా శరీరంలాగే చూస్తాం. వీటిని అన్నమయకోశం,మనోమయకోశం,ప్రాణమయకోశం,విజ్ఞ్యానమయకోశం ఇంకా ఆనందమయకోశంగా పిలుస్తాం. ‘అన్న’ అంటే మనం తిన్న అన్నం.”నా శరీరం” అని మనం పిలిచేది మనం తిన్న అన్నమే. అదొక ఆహారపు గుట్ట - చిన్నదో పెద్దదో అది మీ ఇష్టం. పైకి మనం పోగు చేసుకున్న శరీరం ఉన్నట్టే, ఒక మానసిక శరీరం కూడా ఉంటుంది. మనం బుద్ధి అన్నామంటే అది అక్కడా ఇక్కడా ఉండదు. మన శరీరంలోని ప్రతి కణంలోనూ  మేధస్సు ఉంటుంది. అంటే బుద్ధికీ ఒక శరీరం ఉంది.

దీన్నే మానసిక శరీరం లేదా మనోమయకోశం అంటాం. అది(అన్నమయ కోశం) Hardware ఇది(మనోమయ కోశం) Software. ఈ రెండూ కూడా తమకి తాముగా పనిచెయ్యలేవు. వాటికి ఒక శక్తి సాధనం కావాలి. కాబట్టీ ఈ మూడో పొరని మనం ప్రాణమయకోశం లేదా శక్తి శరీరం అంటాం. ఈ మూడూ భౌతికమైనవి. వీటి తర్వాతి పొర ఒక మార్పు చెందే శరీరం లాంటిది. దీన్ని విజ్ఞ్యానమయ కోశం అంటారు. ఇది ఒకసారి భౌతికతనీ మరోసారి అభౌతికతనీ సంతరించుకుంటూ అటూ ఇటూ మార్పు చెందుతూ ఉంటుంది. దీనికి పూర్తిగా భౌతికతని ఆపాదించలేం, అలాగని ఇది పూర్తిగా భౌతికం కూడా కాదు. వీటి తర్వాత ఐదవది ఆనందమయకోశం.

అలా అన్నాం కదా అని అదొక రకమైన నీటి బుడగలాగా ఉంటుందనుకోకండి. దాన్ని తాకగానే మనకి తెలీని ఒక ఆనందపు అనుభవం కలుగుతుంది గనుక దీన్నలా పిలుస్తాం. అలాగని ఆ శరీర లక్షణమే ఆనందం అనుకోకండి. అది మనకి ఆ ఆనందాన్ని కలిగిస్తుంది అంతే. దాని లక్షణం అది కాదు. ఈ కోశం ఒక అభౌతిక పార్శ్వం. కానీ ఇదే భౌతికమైన అనుభావాలన్నిటికీ కారణం. మీరు మీ స్థూల శరీరాన్నీ, మానసిక శరీరాన్నీ ఇంకా శక్తి శరీరాన్నీ ఒక క్రమంలో అమర్చి నిలుపగలిగి సమతౌల్యం సాధిస్తే మీకిక యే శారీరిక, మానసిక రోగాలూ రావు. వీటి అసమతౌల్యత(imbalance) వల్లే ఈ సమస్యలన్నీ. శరీరం చక్కని స్థితిలో వచ్చిన తరువాత రోగాలనేవి ఉండవు. అంటే మీరు ఈ మూడిటి అమరికనీ సరిచేస్తే నాలుగోదైన  ఆనందమయకోశాన్ని స్పృశిoచే మార్గం దొరుకుతుంది. అప్పుడు మీరు సహజమైన పారవశ్యానుభూతి పొందుతారు. మీరు ఆరోగ్యాన్ని పొందాలంటే మూడు ప్రాధమిక విషయాలను చూసుకోవాలి. ఆహారం, కార్యకలాపాలు ఇంకా విశ్రాంతి.

ఆహారం

ఆహారానికి వస్తే మీరు చాలా చేతనతో వ్యవహరించాలి. మీరు ఏ ఆహారం తీసుకున్నా అది ఎంత త్వరగా అరిగి మీలో భాగామైపోతోందో జాగ్రత్తగా గమనించాలి. ఏ ఆహారమైనా సరే, అది అరగటానికి మూడుగంటల కన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంటే, అది చెడు ఆహారమనీ దాన్ని మానేయ్యటమో లేదా తగ్గించటమో చెయ్యాలని తెలుసుకోండి. మీరు తిన్న మూడు గంటలలోపే మీ పొట్టలో ఉన్న ఆహారం బైటికి పోతుంటే, మీ శరీరం నిర్వహించలేని ఆహారం ఏదో మీరు తిన్నారని అర్ధం చేసుకోండి. అది మంచి ఆహారమే అయినా మీ శరీరం దాన్ని తట్టుకోలేకపోతే దాన్ని వదిలెయ్యాలి. ఇంకా భోజనానికీ - భోజనానికీ మధ్య మీరు ఒక ఐదారుగంటల విరామాన్ని ఇవ్వగలిగితే అంటే మధ్యలో ఏమీ తినకుండా, అతి సూక్ష్మ కణ స్థాయిలో మీ శరీర ప్రక్షాళన ప్రక్రియ అద్భుతంగా జరుగుతుంది.ఈ ప్రక్రియ సంపూర్ణ ఆరోగ్యానికి అవసరం, ముఖ్యం కూడా.

మీరు పడుకోవటానికి వెళ్ళేటప్పుడు మీ కడుపులోని ఆహారం అరిగిపోయేలాగా చూసుకుంటే మిగతా భాగాల మీద వొత్తిడి పడదు.
భోజనాల మధ్య కనీసం ఐదారు గంటల విరామం ఉండాలి. మీరు ముప్పైయ్యేళ్ళు పైబడ్డవారైతే రోజుకి రెండు భోజనాలు, రెండే రెండు మంచి భోజనాలు చాలు. ఒకటి ఉదయం, రెండవది సాయంత్రం. సాయంత్ర భోజనం తరువాత మీరు నిద్రకి ఉపక్రమించటానికి కనీసం మూడు గంటలుండాలి. భోజనం తరువాత ఏదైనా వ్యాయామం మంచిది. అది కఠినమైనది అయ్యి ఉండక్కర్లేదు. మామూలు నడకైనా లేదా తేలికపాటి డాన్స్ అయినా సరిపోతుంది.

ఒక ఇరవైఐదు నించీ ముప్పై నిముషాలు ఎదో ఒక శారీరిక కదలిక ఉండేలా చూస్కోండి. ఇది చేస్తే చాలా వరకూ మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కడుపులో భోజనంతో నిద్రలోకి వెళ్తే, పొట్టలో తెలీని ఒక జడత్వం వచ్చేస్తుంది.ఈ లక్షణం దాదాపు మరణం వైపు ప్రయాణం వేగతరం చెయ్యటం లాంటిది. మరణం అనేది సంపూర్ణ జడత్వం. అదే మీరు కడుపులో ఆహారంతో నిద్రపోతే, అది కూడా ఎంతో కొంత జడత్వాన్ని కలుగజేస్తుంది.ఇంకొక కోణంలో చూస్తే, కడుపు నిండి ఉంటే, అది కడుపు చుట్టుపక్కల ఉన్న మిగతా శరీర భాగాల మీద వొత్తిడి కలిగిస్తుంది. దానితో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది చాల ముఖ్యమైన విషయం. మీరు పడుకోవటానికి వెళ్ళేటప్పుడు మీ కడుపులోని ఆహారం అరిగిపోయేలాగా చూసుకుంటే మిగతా భాగాల మీద వొత్తిడి పడదు. పైగా మనం రకరకాల భంగిమల్లో పడుకోవటంవల్ల కూడా అదనపు వొత్తిడి ఉంటుంది..అది చూస్కోవాలి.

వ్యాయామం

భోంచేశాక ఏ పన్లు చెయ్యాలో, నేను మీకో నియమావళి ఇవ్వలేను. మనకి తెలిసిన విషయం ఏంటంటే, మన శరీరం ముందుకీ వెనక్కీ పక్కలకీ వంగగలదు.ఈ ప్రక్రియ జరుగుతుండాలి. మీరు ఎలా చేసినా సరే. హఠ యోగం చేస్తే, ఇవన్నీ జరిగిపోతాయి.నిజానికది వ్యాయామానికి చాలా శాస్త్రీయమైన పద్ధతి. అది చెయ్యలేకపోతే ఎలాగోలాగ ప్రతి రోజూ ముందుకీ వెనక్కీ వొంగటం, పక్కలకి ఒంగటం, గొంతుక్కూర్చోవటం,వెన్నుని నిటారుగా నిలబెట్టటంలాంటివి చెయ్యాలి. ఆరోగ్యాన్ని ఎప్పటికీ నిలకడగా ఉంచుకోవాలన్నా,పెరుగుతున్న వయసుని హాయిగా గడపాలన్నా, మీ నరాల పనితీరు బావుండాలన్నాఇవన్నీ ఖచ్చితంగా ప్రతి రోజూ అందరూ చేసి తీరాలి.

విశ్రాంతి

ఒక మనిషికి ఎంత విశ్రాంతి కావాలనే విషయం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది.ఒక ముఖ్య కారణం ఏంటంటే, మనం తినే ఆహార రకం, మోతాదు. ఆహారంలో రకం అంటే, మీరు రకరకాల ఆహారాలు తిని గమనించాలి. ఏ రకమైన ఆహారం వల్ల మీ పొట్ట నిండుగా అనిపిస్తోంది?భారంగా అనిపిస్తుంది?ఏ ఆహారం సులువుగా తేలిగ్గా ఉంది?ఇలా. మీ ఆహారంలో సుమారు నలభైశాతం ఆహారం పళ్ళు, కాయగూరలతో నింపేయండి, మీకు మీ శరీరం ఎంత తేలికగా అనిపిస్తుందో తెలుస్తుంది. అప్పుడు మీకు ఒక చిన్న విశ్రాంతి కావాలి అంతే. పెద్దగా నిద్ర కూడా అవసరం పడదు. చాలామంది నిద్రే విశ్రాంతి అనుకుంటారు.కాదు. మీరు కూర్చున్నా నుంచున్నా కూడా విశ్రాంతిగా ఉండచ్చు. దూకుడుగా ఉన్నా నిలకడగా ఉన్నా కూడా విశ్రాంతిగా ఉండటం నేర్చుకుకోవచ్చు. జీవితంలోని క్షణ క్షణం మీరు విశ్రాంతి స్థితిలో ఉంటే, మీకు అవసరమయ్యే నిద్రా సమయం క్రమంగా తగ్గిపోతుంది. పడుకున్నప్పుడు, మీ కీళ్ళలో ఉండే ద్రవాలు చిక్కబడి ఒకచోట తేరుకుని, రక్త ప్రసరణ తగ్గుతుంది. దీనితో మీరు నిద్ర లేవగానే మీ శరీరాన్ని అటూ ఇటూ కదిలిస్తూ చిన్నపాటి కదలికలు చెయ్యటం అవసరం. అందుకే లేచిన వెంటనే మీ కీళ్ళను కదిలించి సులువైన వ్యాయామాలు చెయ్యాలి. https://www.youtube.com/watch?v=rvlNwEIaKdo&t

ప్రేమాశీస్సులతో,
సద్గురు