Table of Content
1. శాకాహారిగా ఎలా మారాలి
2. వృక్షాధారిత ఆహారమా లేక మాంసాహరమా?
3. శాకాహారిగా ఉండడం ఎందుకు?
4. ఆహారం, మానసిక ఆరోగ్యం
5. సరైన ఎంపికలు చేసుకోవడం

 సద్గురు: మీరు ఎలాంటి ఆహారం తినాలి అనేది, ఆహారంపై మీకున్న అభిప్రాయం లేదా మీ నైతికవిలువలపై కాకుండా, మీ శరీరం ఏమి కోరుకుంటుందనే దానిపై ఆధారపడి ఉండాలి. ఆహారం అనేది శరీరానికి సంబంధించినది. ఏ రకమైన ఆహారంతో శరీరం నిజంగా సుఖంగా ఉంటుందో మీరు శరీరం నుంచే తెలుసుకోండి. రకరకాల ఆహారాలను తీసుకుని, అవి తిన్న తర్వాత మీ శరీరానికి ఎలా అనిపిస్తుందో చూడండి. మీ శరీరం చాలా చురుకుగా ఇంకా శక్తిమంతంగా ఉందని మీకు అనిపిస్తే, శరీరం సుఖంగా ఉందని అర్థం. శరీరానికి బద్ధకంగా అనిపించినా లేదా చురుగ్గా ఉండటానికి కెఫీన్ లేదా నికోటిన్ తీస్కువాల్సి వచ్చినా, శరీరం సుఖంగా లేదని అర్థం.

...మీరు తినే ఆహారం జీవమే. మన జీవితాన్ని నిలబెట్టడానికి ఇతర జీవాలు తమ జీవితాన్ని అర్పిస్తున్నాయి. వాటన్నింటి పట్ల అపారమైన కృతజ్ఞతతో మనం తినగలిగితే, ఆహారం మనలో చాలా విభిన్నంగా ప్రవర్తిస్తుంది.

శరీరం చెబుతున్నది మీరు వింటే, అది ఎలాంటి ఆహారంతో సుఖంగా ఉంటుందో, అది మీకు స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ప్రస్తుతం, మీరు మీ మనస్సు చెప్పేది వింటున్నారు. మీ మనస్సు మీకు ఎప్పుడూ అబద్ధాలే చెబుతుంది. మీ మనస్సు మీకు ఇంతకు ముందు అబద్ధాలు చెప్పలేదా? మనసు, ఈ రోజు మీకు "ఇదే సరైనది!’’ అని చెబుతుంది. రేపు, క్రితం రోజున మీరు ఏదైతే నమ్మారో, అది నమ్మినందుకు, మిమ్మల్ని మీరే మూర్ఖులు అని అనుకునేలా చేస్తుంది. కాబట్టి మీ మనసు చెప్పినట్లు వెళ్ళకండి. మీరు మీ శరీరం చెప్పేది వినడం నేర్చుకోవాలి.

శాకాహారిగా ఎలా మారాలి

గుణ పరంగా, మాంసాహారం కంటే శాకాహారం మీ వ్యవస్థకు చాలా మంచిది. ఒకసారి ఈ ప్రయోగం చేసి చుడండి. జీవం గల శాకాహారాన్ని తిని, మీ శరీరంలో చోటుచేసుకునే మార్పులను గమనించండి. వీలైనంత ఎక్కువగా, జీవం గల ఆహారాన్ని - అంటే వండకుండా, అలాగే తీసుకోగల ఆహారాన్ని - తినడం మంచిది. ఒక జీవం గల కణం, మన వ్యవస్థను నిలబెట్టడానికి కావాల్సిన ప్రతి దాన్నీ కలిగి ఉంటుంది. జీవం గల ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మీ వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరో స్థాయిలో ఉండడాన్ని మీరే గమనిస్తారు. మనం ఆహారాన్ని వండినప్పుడు, దానిలోని జీవాన్ని నాశనం చేస్తాము. ఈ విధ్వంసం జరిగాక మనం ఆ ఆహారాన్ని తింటే, మన వ్యవస్థకు, అదే మోతాదులో జీవశక్తి లభించదు. కానీ మీరు జీవం గల ఆహారాన్ని తిన్నప్పుడు, అది మీలో మరో స్థాయి సజీవతను తీసుకువస్తుంది. రోజూ కనీసం ముప్పై నుండి నలభై శాతం వరకు జీవం గల ఆహారాన్ని- అంటే మొలకలు, పండ్లు ఇంకా వండకుండా తినగలిగే కూరగాయలను - తీసుకున్నప్పుడు, అది మీలోని జీవానికి ఎంతగానో తోడ్పాటు అందించడాన్ని మీరే గమనిస్తారు.

అన్నింటికీ మించి మీరు తినే ఆహారం జీవమే. మన జీవితాన్ని నిలబెట్టడానికి ఇతర జీవులు తమ జీవితాన్ని అర్పిస్తున్నాయి. వాటన్నింటి పట్ల అపారమైన కృతజ్ఞతతో మనం తినగలిగితే, ఆహారం మనలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తుంది.

వృక్షాధారిత ఆహారమా లేక మాంసాహరమా?

ప్రశ్న) సద్గురు, నేను భోజన ప్రియుడిని. నాకు సరైనదనిపిస్తే మాంసాహారం తినడం సబబేనా?

సద్గురు: మీరు మొక్కను తిన్నా లేదా జంతువును తిన్నా, ఏదైనా సరే అది హింసే. మొక్కలు కూడా సున్నితంగా స్పందిస్తాయని చెప్పటానికి ఈ రోజు గణనీయమైన ఆధారం ఉంది. బాధతో అవి అరుస్తున్నాయి అని అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. మీకు వినపడదు, అంతే. ఇక్కడ ఒక వెయ్యి, పది వేల చెట్లు ఉన్నాయనుకుందాం, ఒక ఏనుగు వచ్చి ఒక చెట్టు ఆకులను తినడం ప్రారంభించింది. అప్పుడు ఆ చెట్టు తన జాతికి చెందిన ఇతర చెట్లన్నింటికీ ఇలా ఏనుగు దానిని తింటున్నట్లుగా వెంటనే సందేశాలు పంపుతుంది. నిమిషాల వ్యవధిలో, ఏనుగు ఇతర చెట్ల వద్దకు వెళితే, అన్నీ చెట్ల ఆకులలో కొంత మొత్తంలో విష పదార్థాలు ఏర్పడతాయి. ఏనుగు ఆకులను తినడానికి ప్రయత్నించినప్పుడు, అవి చేదుగా ఉంటాయి. కాబట్టి అది వాటిని తినదు. చెట్లు అంత సున్నితమైనవి.

మిమ్మల్ని మీరు భోజన ప్రియునిగా చెప్పుకోకండి, ఎందుకంటే ఆహారం ఎప్పుడూ ఒక గుర్తింపు కాకూడదు.

పండ్లను, కూరగాయలను తెంచి తిన్నా, జంతువును కోసి తిన్నా, అంతా క్రూరమే. మనం దీన్ని కొంత సున్నితంగా చేయాలి, అవసరమైన మేరకు మాత్రమే చెయ్యాలి. మీరు భోజన ప్రియులు అనే ఈ ఆలోచనను విరమించుకోవాలి. మనమందరం ఆహారం తినాలి; లేదంటే మన శరీరం పట్ల మనం క్రూరంగా ప్రవర్తించినట్లు అవుతుంది. కానీ మిమ్మల్ని మీరు ఆహారంతో గుర్తించుకోవడం సరికాదు. ఎందుకంటే అలాంటప్పుడు మన మనసుకు నచ్చినట్టు తింటాము, కానీ తినడం అనేది కేవలం మనల్ని మనం పోషించుకోవడం కోసం మాత్రమే. ఒక జీవంగా, మనల్ని మనం పోషించుకునే హక్కు మనకు ఉంది - ఈ సృష్టిలో ఆహార చక్రం అలానే ఉంది - కానీ మన ఇష్టం కోసం, ఆనందం కోసం మరొక జీవాన్ని తినే హక్కు మనకు లేదు. మనం అలా చెయ్యకూడదు. ఈ జీవాన్ని పోషించుకునే హక్కు మనకు ఉంది, కానీ మరొక జీవి ప్రాణాన్ని తీసి తద్వారా ఆనందం పొందే హక్కు మనకు లేదు. మిమ్మల్ని మీరు భోజన ప్రియులు అని చెప్పుకోకండి. ఎందుకంటే ఆహారం ఎప్పుడూ ఒక గుర్తింపుగా మారకూడదు. బ్రతకడం ఇంకా పోషణ కోసం ఆ క్షణంలో ఏది తినాలో అది తిందాం.

శాకాహారిగా ఎందుకు ఉండాలి?

మీ మనుగడే ఒక ప్రశ్నగా మారినప్పుడు, మనుగడ ఎలాగ అన్న ఆలోచనతోనే మీ జీవితమంతా జరిగిపోతుంది. కానీ ఒక్కసారి మనుగడ కోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాక "అసలు ఈ జీవితం దేని గురించి?" అని మీరు విస్తుపోతారు. ఎందుకంటే మనుగడే ఒక ప్రశ్నగా ఉన్నప్పుడు, మనుగడ కోసం తగిన ఏర్పాట్లు జరిగాక అంతా అద్భుతంగా ఉంటుంది అని మీరు అనుకుంటారు. కానీ ఒక్కసారి మనుగడకు కావల్సినవి ఏర్పరుచుకున్నాక, అది నిజం కాదని మీరు గ్రహిస్తారు, మీలోని జీవం ఇంకేదో పొందాలని ఆరాటపడుతుంది.

భారతదేశంలో, మనుగడ చాలా సాధారణమైనది ఇంకా సులభమైనది. ఇది బాగా పంటలు పండే భూమి, అందుకని ప్రజలు మనుగడ గురించి చింత లేకుండా జీవించారు. ఆ కారణంగా, వారు అంతర్ముఖులయ్యారు. దేశ జనాభాలో దాదాపు డెబ్బై శాతం మంది ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక పథంలోనే ఉండేవారు. 

అంతర్ముఖులవడం అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేది. అందువల్ల, వారు అంతర్ముఖులైనప్పుడు, వారు ఎటువంటి ఆహారాన్ని తింటుంన్నారు అనేది ముఖ్యమైన విషయం అని వారు గ్రహించారు. మీరు కేవలం బాగా కండ గలిగిన శరీరంలా మారాలనుకుంటే, మీరు చాలా మాంసం తినవచ్చు, కండరాలను పెంచుకోవచ్చు ఇంకా ఒకరితో ఒకరు కుస్తీ పోటీలు చెయ్యవచ్చు. కానీ మీరు జీవితం పట్ల సున్నితంగా ఉండడం ఇంకా సాధారణ అవగాహనకు మించిన విషయాలను గ్రహించడం ఎలా అని ఆలోచిస్తున్నట్టైతే, మీరు ఏమి తింటున్నారనేది చాలా ముఖ్యం.

తమ శరీర స్వభావాన్ని గమనించిన వారు సహజంగానే శాకాహారులుగా మారారు.

అన్ని మాంసాహార జంతువులలో, ఆహార నాళం దాని శరీరం పొడవు కంటే దాదాపు మూడు రెట్లు మాత్రమే ఉంటుంది. అన్ని శాకాహారులలో, ఆహార నాళం పొడవు, శరీరం పొడవు కంటే ఐదు నుండి ఆరు రెట్లు ఉంటుంది. మానవునిలో ఇది ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది అడుగుల మధ్య ఉంటుంది, అంటే ఇది మన శరీరం పొడవుకి దాదాపు ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువ పొడవు. మీరు ఈ రకమైన ఆహార నాళంలోకి మాంసాహారాన్ని పంపిస్తే, అది చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. పచ్చి మాంసం వ్యవస్థ గుండా వెళ్ళడానికి దాదాపు డెబ్బై నుండి డెబ్బై రెండు గంటల సమయం పడుతుంది. అదే, వండిన మాంసం అయితే అందుకు యాభై నుండి యాభై రెండు గంటలు పడుతుంది. వండిన కూరగాయల భోజనం అయితే ఇరవై నాలుగు నుండి ముప్పై గంటలు పడుతుంది. పచ్చి కూరగాయలు అయితే పన్నెండు నుండి పదిహేను గంటలు పడుతుంది. పండు అయితే ఒకటిన్నర నుండి మూడు గంటలు పడుతుంది.

ఎలాంటి ఆహారం చాలా త్వరగా ఇంకా చాలా తక్కువ అవశేషాలతో శరీరం గుండా వెళుతుందో, దానిని మనం గుర్తించడం ప్రారంభించాము. యోగాలో, మనం చూసే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఏదైనా తింటే, రెండున్నర గంటలలోపు కడుపు ఖాళీ అవ్వాలి. కడుపు ఖాళీ అవుతుంది, కానీ మనము శక్తిమంతంగానే ఉంటాము, అందువల్ల వెంటనే తినాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా, ఈశా యోగా కేంద్రంలో, అందరూ రెండు పూటలే భోజనం చేస్తారు - ఉదయం పది గంటలకు , మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకు. నేను సాధారణంగా ఒక్క పూట మాత్రమే తింటాను. నేను ప్రయాణంలో ఉంటే, కాస్త ఇంకేమైనా తింటాను, కానీ సాధారణంగా నేను ఇంట్లో ఉంటే మాత్రం, ఒక్క పూటే భోజనం చేస్తాను, సాధారణంగా సాయంత్రం 4:30 నుండి 5:00 మధ్యలో. అది నన్ను మొత్తం ఇరవై నాలుగు గంటల పాటూ శక్తిమంతంగా ఉంచుతుంది. ఇదేమి ఒక నియమం కాదు. ఏదైనా ఒక రోజు ఎక్కువ శారీరక శ్రమ చేస్తే, నేను కాస్త అల్పాహారం లేదా పండు లాంటిది తింటాను. ఆహారాన్ని ఒక సిద్ధాంతంగానో లేదా ఒక మతపరమైన ప్రక్రియగానో మార్చకూడదు. ఆహారం అనేది శరీరానికి ఒక అవసరం, అంతే.

మీరు మీ శరీరాన్ని గమనిస్తే, వృక్షాధారిత ఆహారం తీసుకున్నప్పుడు, సహజంగానే శరీరం ఎంతో సౌఖ్యంగా, తేలికగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. ఇది అనువైనది, శరీరాన్ని తేలికగా ఉంచుతుంది ఇంకా కొద్దిపాటి అరుగుదల ప్రక్రియ సరిపోతుంది. తమ శరీర స్వభావాన్ని గమనించిన వారు సహజంగానే శాకాహారులయ్యారు. మనుగడే ప్రశ్న అయినప్పుడు, వేటాడి, చంపగలిగిన దాన్ని తినడం అనేది సహజమైన ప్రక్రియ. కానీ ప్రజలు సమాజాలుగా స్థిరపడిన తర్వాత, వారు కోరుకున్నది పెంచుకునే అవకాశం వారికి ఉండింది. దాంతో తమని తాము గమనించడం ప్రారంభించినప్పుడు, అలాగే వారి జీవితాలు మనుగడ గురించి కాకుండా అయినప్పుడు, వారి జీవితాలు ఉన్నత స్థాయి అవగాహన కోసం ఇంకా అనుభవం కోసం తమని తాము మెరుగు పరుచుకోవడం గురించి అయినప్పుడు, సహజంగానే వారు శాకాహారులుగా మారారు. ఎక్కడైనా సరే, అలా జరిగి తీరాల్సిందే.

ఆహారం, మానసిక ఆరోగ్యం

pablo-merchan-montes-Orz90t6o0e4-unsplash

ప్రశ్న) మనం తినే ఆహారానికీ ఇంకా మన మానసిక స్థితి, భావోద్వేగ స్థితి, మానసిక ఆరోగ్యం - వంటి వాటికీ మధ్య ఏదైనా సంబంధం ఉందా? సాధారణంగా, మన శరీరం ఇంకా మైండ్ మధ్య ఉండే సంబంధం ఏమిటి?

సద్గురు: యోగా సంప్రదాయం - శరీరాన్ని, మైండ్ ని - రెండు భిన్నమైన అంశాలుగా గుర్తించదు. మనం సాధారణంగా మైండ్ అని సూచించేది కొంత జ్ఞాపకశక్తి ఇంకా మేధస్సు మాత్రమే. మీ మెదడు మీ శరీరంలోని ఒక భాగం. మెదడు ఆలోచనా ప్రక్రియని నిర్వహించడం వల్ల, ప్రజలు - సాధారణంగా, మెదడే అంతా అనుకుంటారు. కానీ మెదడునీ మిగిలిన శరీరాన్నీ పోలిస్తే, ఎక్కువ ఎక్కువ జ్ఞాపకశక్తి ఇంకా మేధస్సు దేనికి ఉన్నాయి? మీరు దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే, మీ శరీరానికి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకశక్తి ఉంటుంది. మీ పూర్వీకులు ఎలా ఉండేవారో అది స్పష్టంగా గుర్తుంచుకుంటుంది. మైండ్ కి అటువంటి జ్ఞాపకశక్తి లేదు. మేధస్సు విషయానికి వస్తే, ఒక్క DNA అణువులో ఏమి జరుగుతుందో, అది మీ మెదడుకు అందనంత సంక్లిష్టంగా ఉంటుంది. యోగా సంప్రదాయంలో, భౌతిక శరీరం ఉంది ఇంకా మానసిక శరీరం ఉంది - కానీ మేధస్సు, జ్ఞాపకశక్తి అనేవి శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి.

మేధస్సు విషయానికి వస్తే, ఒక్క DNA అణువులో ఏమి జరుగుతుందో, అది మీ మెదడుకు అందనంత సంక్లిష్టంగా ఉంటుంది.

మనం తినే ఆహారం, మైండ్ పై చాలా ప్రభావం చూపుతుంది. సగటు అమెరికన్ సంవత్సరానికి 90 కేజీల మాంసాన్ని తింటాడని చెబుతారు. దానిని 22 కేజీలకు తగ్గిస్తే, 75% మందికి యాంటీడిప్రెసెంట్ ల అవసరం ఇక ఉండదని నేను అంటాను. మీరు ఎడారిలోనో లేదా అడవిలోనో ఉంటే జీవించడానికి మాంసం మంచి ఆహారమే. మీరు ఎక్కడో తప్పిపోయినట్లయితే, ఈ మాంసం ముక్క మీ జీవాన్ని నిలబెడుతుంది, ఎందుకంటే ఇది సాంద్రీకృత పోషణను కలిగి ఉంటుంది. కానీ ఇతర రకాల ఆహారం ఉన్నప్పుడు, మాంసం, మీరు తినే రోజువారీ ఆహారం కాకూడదు.

ఇది అర్థం చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే - జంతువులకు, చనిపోయే కొన్ని క్షణాల ముందు, తాము చనిపోబోతున్నామనే విషయాన్ని తెలుసుకునే తెలివితేటలు ఉంటాయి. మీరు దాన్ని ఎంత చాకచక్యంగా చేసినా, ఎంత శాస్త్రీయంగా చేసినా, వాటికి అది తెలిసిపోతుంది. భావోద్వేగాలను వ్యక్తం చేసే సామర్థ్యం ఎంతో కొంత ఉన్న ఏ జంతువు అయినా, తను చంపబడుతోందని గ్రహించగలుగుతుంది. ఈ రోజు చివరిలో మిమ్మల్ని వధించబోతున్నారని మీకు ఇప్పుడే తెలిసిందనుకోండి, మీలో జరిగే సంఘర్షణను ఊహించుకోండి, మీలో రసాయన ప్రతిచర్యల విస్ఫోటనం జరుగుతుంది. ఒక జంతువులో కనీసం దానిలో కొంత భాగం అయినా జరుగుతుంది. అంటే మీరు జంతువును చంపినప్పుడు, ఆ మాంసంలో ప్రతికూల ఆమ్లాలు ఇంకా ఇతర రసాయనాలు ఉంటాయి. మీరు ఆ మాంసాన్ని తిన్నప్పుడు, అది మీలో అనవసరమైన మానసిక ఒడిదుడుకులను సృష్టిస్తుంది.

మానసిక రుగ్మత గల చాలా మందిలో, అది వ్యాధి వల్ల కలుగుతున్నది కాదు, అది తెచ్చి పెట్టుకుంటున్నది. మన సామాజిక వ్యవస్థలో మనం ఏదో ఒక విధంగా దానిని పెంచి పోషిస్తే తప్ప, సాధారణంగా ఇంత ఎక్కువ శాతం మంది మానసిక అనారోగ్యంతో ఉండరు.

మీరు యాంటీడిప్రెసెంట్స్‌ వాడే వ్యక్తులకు, జాగరూకతో శాకాహార ఆహారం మాత్రమే ఇస్తే, దాదాపు మూడు నెలల వ్యవధిలో, వారిలో చాలామందికి ఇక ఆ మందుల అవసరం ఉండదు. ఈశా యోగా కేంద్రానికి వచ్చిన చాలా మందిలో ఇలా జరగడాన్ని మేము గమనించాము.

సరైనవి ఎంచుకోవడం

ధూమపాన వ్యతిరేక ప్రచారం వంటి సమర్థవంతమైన ప్రచారం, ఆహారం కోసం కూడా అమెరికాలో చెయ్యాలని నేను భావిస్తున్నాను. 70వ దశకంలో, మీరు యునైటెడ్ స్టేట్స్‌లో ఏ బహిరంగ ప్రదేశంలోనైనా పొగ త్రాగవచ్చు. దానివల్ల మీరు ప్రొగ మధ్యలో నుంచి వెళ్తున్నట్టుగా ఉండేది. అప్పుడు వారు గట్టి, సమర్దవంతమైన ప్రచారాన్ని ప్రారంభించారు, దాని వల్ల ఈ పరిస్థితి మెరుగుపడింది. ఈ రోజు మీరు రెస్టారెంట్‌లోకి వెళితే అక్కడ ఈ పొగ సమస్య లేదు. కానీ పానీయంలో కార్బన్ - డయాక్సైడ్ ఇప్పటికీ ఉంది! ఒకప్పుడు, చాలా మందికి ధూమపానం ఒక అవసరం కాదు, అది ఫ్యాషన్. ఇతరుల ముఖాల్లోకి పొగను ఊదడం సబబే. సరైన ప్రచారంతో ఒక్క తరంలోనే ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనం ఏమి తినాలి ఇంకా ఏమి తాగాలి అనే దాని గురించి కూడా ఇదే విధమైన విజయవంతమైన ప్రచారం అవసరం.

Editor's Note: సంపాదకుని గమనిక: Food Body అనే చిన్న పుస్తకంలో సద్గురు శరీరానికి అత్యంత సౌకర్యవంతమైన ఆహారాలను వివరిస్తారు ఇంకా అలాంటి ఆహారాలను తీసుకోవడానికి అత్యంత సరైన మార్గాలను సూచిస్తారు. మీ శరీరాన్ని ట్యూన్ లోకి తీసుకురావడానికి ఇంకా దానికి ఏది బాగా సరిపోతుందో గుర్తించడానికి ఈ 33 -పేజీల బుక్‌లెట్ మొదటి అడుగు కాగలదు.

 Photo by Anna Pelzer on Unsplash