దేవీ అంటే ఏమిటి?

సద్గురు: మనం దేన్నయితే స్త్రీత్వంగా పిలుస్తామో అది ఒక మార్గము. అది ఒక ప్రవేశము. ఇది అంతర్దృష్టి ఇంకా అంతరజ్ఞానం యొక్క పరిమాణం. స్త్రీ రూపంలో దైవాన్ని స్థాపించడం, దర్శించడం ఇంకా అనుసరించడం అనేది భూమి మీద అన్నీ చోట్లా జరుగుతూనే వచ్చింది. ప్రతి సంస్కృతిలో ఏదో ఒక సమయంలో స్త్రీ రూపంలో దైవాన్ని పూజించడం జరిగింది.

ఇప్పటికీ దేవీ ఆరాధన క్రియాశీల ప్రక్రియగా ఉన్న ఏకైక దేశం భారతదేశమే.

దౌర్జన్య స్వాభావం గల, పురుష ఆధిక్యం గల పిడివాద సంస్కృతులు ప్రపంచంపై అధికార ఆకాంక్షతో, తమ ప్రజలను ఒక విధమైన యుద్ద సైన్యంగా చేసారు. వాస్తవానికి ఏదైతే ఒక అంతర్గత ప్రక్రియగా ఉండాలో, దాన్ని ఇలా సైనికీకరణ చేయడం అనేది, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో దేవీ ఆరాధన తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. అయినా, ప్రతిచోటా అది ఇంకా నామమాత్రంగా ఉంది. కానీ, ఇప్పటికీ దేవీ ఆరాధన క్రియాశీల ప్రక్రియగా ఉన్న ఏకైక దేశం భారతదేశమే.

దైవిక స్త్రీత్వం ఇంకా పర్యావరణం

మీరు పురుషత్వాన్ని పూజిస్తునప్పుడు, స్వర్గం వైపు చూడటం చాలా సహజం.  ఆకాశాన్ని పురుష దేవతగా పేర్కొంటారు.  మీరు స్త్రీని ఆరాధించేటప్పుడు, అనివార్యంగానే, మీరు జీవిస్తున్న భూమి వైపు చూస్తారు. మనం భూమిని ఇంకా మట్టిని, తల్లిగా పేర్కొనడం యాదృచ్ఛికమో లేదా భాషాశాస్త్రం యొక్క పరిణామమో కాదు.  ఇలా అనడంలో సహజసిద్ధమైన మేధస్సు ఉంది. భూమి అన్నప్పుడు, అది జీవాన్ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి, సహజంగానే భూమిని స్త్రీ గా  భావిస్తారు.  మనల్ని పోషించే ప్రతిదీ భూమి నుంచే వస్తుంది.  ఈ సంబంధం వల్ల, అలాగే ప్రతి మనిషిలోని సహజమైన అంతర్గత అనుభవం వల్ల, భూమి అని అన్నప్పుడు, దాన్ని స్త్రీత్వంగా భావిస్తాము.

ఈనాటి ప్రపంచంలో, మనం వివిధ స్థాయిలలో సంక్షోభాలను, ముఖ్యంగా పర్యావరణ సమస్యలను ఎదురుకొంటున్నప్పుడు, దేవీ ఆరాధన గురించి చైతన్యం తీసుకురావడం చాలా ముఖ్యం.  మన సొంత సామర్థ్యాలు, శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం ఇంకా వ్యవస్థలు, మన జీవాధారాన్నే నాశనం చేస్తున్న ఇలాంటి తరుణంలో, దేవీ ఆరాధన చాలా ముఖ్యమైనది.

భూమిని తల్లిగా భావించి, ఆరాధించే దృక్పథంతో ఉన్న సంస్కృతులు, తమ చుట్టూ ఉన్న పర్యావరణానికి ఎప్పుడూ ఎక్కువ హాని కలిగించలేదు.  ఎక్కడైతే ప్రజలు విజయాన్ని జీవన విధానంగా చూసారో, అక్కడ మాత్రమే అది జరిగింది.  భూమికి ఇంత నష్టం కలిగించిన తర్వాత కూడా, తగినంత ఆహారం ఉన్నప్పటికీ, సగం మంది ప్రజలు సరిగ్గా తినలేకపోతున్నారు.  స్త్రీత్వం ప్రభలంగా ఉంటే, కచ్చితంగా  ప్రజలందరి కడుపూ నిండుతుంది.  కరుణ, ప్రేమ ఇంకా సౌందర్యాత్మకత ప్రధానమైనవి అవుతాయి, విజయం కాదు.

సంతులనాన్ని కనుగొనడం

స్త్రీత్వం ప్రభలంగా ఉంటే, లేదా కనీసం స్త్రీత్వం పురుషత్వం సమతుల్య స్థాయిలో ఉంటే, మనకు పర్యావరణ విపత్తు ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే స్త్రీత్వం ఇంకా భూమిని పూజించడం అనేవి రెండూ ఎప్పుడూ పరస్పరం సానుకూలంగా ఉంటాయి.

స్త్రీత్వం ప్రభలంగా ఉంటే, కచ్చితంగా ప్రజలందరి కడుపూ నిండుతుంది. కరుణ, ప్రేమ ఇంకా సౌందర్యాత్మకత ప్రధానమైనవి అవుతాయి, విజయం కాదు.

ఈ భూమ్మీద, స్త్రీత్వం ఇంకా బాగా వ్యక్తం అయ్యుంటే, మన స్టాక్ మార్కెట్, 20,000 తాకేది కాదేమో… కానీ, ప్రజలు ఇంకాస్త నవ్వుతూ బతికేవారు; ఇంకాస్త ఆనందంగా, ప్రేమగా ఉండేవారు. జీవితం ఇంకాస్త అందంగా మారేది; మనకి కావాల్సింది కూడా అదే కదా? ఏదేమైనా, మనం ఇవన్నీ చేస్తున్నది మానవ శ్రేయస్సు కోసమే, అవునా?. కానీ మనం అది పూర్తిగా మర్చిపోయాం; ఎందుకంటే, పురుషత్వం యొక్క విధానం అదే! అది అలా 'ఒక్క' దిశలోనే వెళ్తూ ఉంటుంది. స్త్రీత్వం ఎక్కడికో వెళ్ళాలి, అని ప్రయత్నించదు; అది ఎక్కడ ఉంటే, అక్కడే సంతోషంగా ఉంటుంది. వీటి మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం అదే. అయితే, ఈ రెండూ సమతుల్యంగా ఉంటే, అప్పుడు మనం ఉన్న చోట ఆనందంగా ఉంటూనే, కావాలనుకున్న చోటుకు చేరుకోవచ్చు. ప్రపంచంలో, ఇలా జరగడం చాలా అవసరం.

ఎలా అయితే దైవాన్ని పురుష రూపంలో పూజించవచ్చో, అలానే  స్త్రీ రూపంలో కూడా పూజించవచ్చని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవడం ముఖ్యం.  దానర్ధం  పురుష దేవుడు ఇంకా స్త్రీ దేవత అని ఇద్దరు ఉన్నారని కాదు, దానర్ధం దైవాన్ని చేరుకోవడానికి, మనలో మనం అవలంభించగల రెండు విభిన్న మార్గాలు ఉన్నాయి అని.  మనము దైవాన్ని పితృస్వామ్య, పురుష మార్గంలో లేదా మాతృస్వామ్య, స్త్రీ మార్గం లో చేరుకోవచ్చు.  మానవాళి శ్రేయస్సు కోసం మనలోని ఈ రెండు గుణాలను గుర్తించడం అవసరం.