తరచుగా శివుడిని అనాసక్త యోగిగా అభివర్ణిస్తారు. అయితే శివుని గురించి మనం ఏం మాట్లాడినా అందుకు పూర్తి వ్యతిరేకంగా కూడా తను ఉండగలరని నిరూపిస్తాడు. అందుకు తార్కాణంగా, ఏదీ పట్టని ఈ యోగి ఒకప్పుడు పీకలోతు ప్రేమలో మునిగిపోయాడు.

సద్గురు: పుణ్యాక్షి అనే ఆమె గొప్ప అవగాహన కలిగిన మహిళ, భారత ఉపఖండంలోని దక్షిణ ప్రాంతంలో నివసించే ఒక దైవజ్ఞ ఆమె. శివుణ్ణి  వరించి ఆయనకు భార్య కావాలన్న ఆకాంక్ష  కాలక్రమేణా ఆమెలో ఎక్కువైంది. కొంతకాలానికి శివుని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని నిశ్చయించుకుంది. ఇక శివుని దృష్టి తనపై పడడానికి, తనని తాను ఆయనకు తగిన విధంగా మలుచుకోవడం ప్రారంభించింది. శివుడే తన జీవనాధారంగా చేసుకున్న ఆమె భక్తి, ప్రపత్తులు అన్ని హద్దులు దాటి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కాదు.

పుణ్యాక్షి నివసించే ఊరిలో ప్రజలు, పెళ్లి చేసుకుంటే ఆమె భవిష్యత్తును చూసే శక్తిని కోల్పోతుందని, తమను రక్షించి, దారి చూపే వారు ఉండరని అనుకున్నారు.

పుణ్యాక్షికి తనపై ఉన్న తీవ్రమైన ఆకాంక్షను గమనించిన శివుని మనస్సులో ఆమెపై ప్రేమ ఇంకా కరుణ పుట్టాయి,  ఆమెను వివాహం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. కానీ పుణ్యాక్షి నివసించే ఊరిలో ప్రజలు, పెళ్లి చేసుకుంటే ఆమె భవిష్యత్తును చూసే శక్తిని కోల్పోతుందని, తమను రక్షించి, దారి చూపే వారు ఉండరని అనుకున్నారు. కనుక పుణ్యాక్షిపై శివునికి ఉన్న ప్రేమ వారిని ఆందోళనకు గురి చేసింది. వాళ్లు ఈ వివాహాన్ని ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. కానీ పుణ్యాక్షికి శివునిపై ఉన్న భక్తిని, పట్టుదలను ఒక్కింతైనా తగ్గించలేకపోయారు.

ఇది తెలుసుకున్న శివుడు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించి, ఉత్సాహంగా పుణ్యాక్షి వద్దకు బయలుదేరాడు. అప్పుడు మార్గమధ్యంలో పుణ్యాక్షి ఊరి పెద్దలు శివుడితో, ”ఓ శివా, నువ్వు పుణ్యాక్షిని పెళ్లి చేసుకుంటే మా భవిష్యత్తును తెలుసుకొని సరి చేసుకునే అవకాశాన్ని కోల్పోతాము కనుక దయచేసి ఆమెను పెళ్లి చేసుకోవద్దు” అని వేడుకున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా శివుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

దాంతో ఊరి పెద్దలు శివుడిని అడ్డుకొని, “నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే కన్యాశుల్కంగా మాకు కొన్ని షరతులు ఉన్నాయి” అని అన్నారు.

 శివుడు, “సరే, కన్యాశుల్కంగా ఏమి కావాలో చెప్పండి. అది ఏదైనా నేను ఇస్తాను.” అన్నాడు.

అప్పుడు అందరూ కలిసి పుణ్యాక్షికి కన్యాశుల్కంగా వారికి కావలసిన మూడు వస్తువులను శివునికి తెలిపారు. శివునితో “మాకు కణుపులు లేని చెరుకు గడలు, ఈనెలు లేని తమలపాకులు, కళ్ళు లేని కొబ్బరికాయలు కావాలి” అన్నారు.

ఇవన్నీ అసహజమైనవి. చెరుకు గడలపై ఖచ్చితంగా కణుపులు ఉంటాయి, ఈనెలు లేని తమలపాకులు ఉండవు. అలాగే కళ్ళు లేని కొబ్బరికాయలు దొరకవు. ఈ కన్యాశుల్కం అసంభవమైనది గనుక ఈ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది అనుకున్నారు.

పుణ్యాక్షిపై ప్రేమతో, ఏది ఏమైనా కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న శివుడు, సృష్టి నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఈ మూడు వస్తువులను తన మంత్ర శక్తులను ఉపయోగించి సృష్టించాడు.

పుణ్యాక్షిపై ప్రేమతో, ఏది ఏమైనా కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న శివుడు, సృష్టి నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఈ మూడు వస్తువులను తన మంత్ర శక్తులను ఉపయోగించి సృష్టించాడు. ఈ అనితర సాధ్యమైన కన్యాశుల్కాన్ని చెల్లించడానికి, శివుడు ప్రకృతి సహజమైన ప్రాథమిక నియమాలను కూడా ఉల్లంఘించాడు.  వీరి షరతులను నెరవేర్చి పెళ్లి చేసుకోవడానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 

అప్పుడు ఆ ఊరి పెద్దలు అందరూ కలిసి, ఆఖరి షరతుగా శివుడితో, “సూర్యోదయానికి ముందే మీ పెళ్లి జరగాలి, ఆలస్యం అయితే మా అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి లేదు” అన్నారు.

ఇది విన్న శివుడు హడావిడిగా, భారతదేశ చిట్టచివరి భూభాగానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ దూరాన్ని శరవేగంగా అధిగమించి, సమయానికి పుణ్యాక్షిని చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా శివుడు వాటన్నిటినీ అధిగమించి పుణ్యాక్షికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు. ఊరి పెద్దలందరూ ఆందోళన చెందారు.

శివుడు హడావిడిగా ప్రయాణిస్తూ, తన వివాహ స్థలానికి కొద్ది దూరంలో ఉన్న సుచీంద్రం అనే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ సూర్యోదయం కావడం చూసి, శివుడు దానిని నమ్మలేకపోయాడు. కానీ, నిజానికి అది, ఊరి పెద్దలు అందరూ కలిసి వివాహాన్ని ఆపడానికి చేసిన చిట్టచివరి ప్రయత్నం. వారందరూ కృత్రిమంగా సూర్యోదయాన్ని సృష్టించారు. అందుకోసం వారందరూ ఒక భారీ కర్పూర దిబ్బని ఏర్పరిచి, నిప్పంటించారు. తీవ్రమైన ప్రకాశంతో కాలుతున్న కర్పూరాన్ని దూరం నుంచి చూసిన శివుడు, సూర్యోదయం అవుతోందని భ్రమపడి, తన కార్యంలో విఫలమయ్యాను అనుకున్నాడు. కేవలం కొద్ది దూరంలో, ఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ వీళ్ళందరూ చేసిన మోసం వల్ల, “తనకు ఆలస్యమైందని పుణ్యాక్షికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానని” శివుడు అనుకున్నాడు.

ఆ కోపావేశంలో ఆమె దక్షిణాన ఉన్న చిట్టచివరి భూభాగానికి వెళ్ళింది. అక్కడే నిలబడి యోగ సాధనతో తన శరీరాన్ని వదిలేసింది.

వీళ్ళ వివాహాన్ని ఆపడానికి ఊరి వారందరూ కలిసి చేస్తున్న ప్రయత్నాల గురించి ఏమీ తెలియని పుణ్యాక్షి, శివునితో అంగరంగ వైభవంగా తనకి పెళ్లి జరుగుతుందని సంతోషంగా తయారవుతోంది. నిజంగా సూర్యోదయం అయ్యేసరికి, శివుడు రావడం లేదని గ్రహించింది. దాంతో ఆమెకు తీవ్రమైన  కోపం వచ్చింది. అక్కడే వారి వివాహ మహోత్సవానికి సిద్ధం చేసిన ఆహార పదార్థాలతో నిండి ఉన్న కుండలు కనిపించేసరికి, వాటన్నింటినీ తన్ని చిందరవందర చేసింది. ఆ కోపావేశంలో ఆమె దక్షిణాన ఉన్న చిట్టచివరి భూభాగానికి వెళ్ళింది. అక్కడే నిలబడి యోగ సాధనతో తన శరీరాన్ని వదిలేసింది. ఆమె తనువు చాలించిన ప్రదేశంలో కట్టిన గుడి ఈ రోజుకీ ఉంది. ఆ ప్రదేశమే కన్యాకుమారి.

పుణ్యాక్షికి ఇలా జరగడానికి తానే కారణమని శివునికి తనపై తనకే కోపం వచ్చింది. ఆ నిరుత్సాహంతో, కోపంతో ఆయన వెనుదిరిగాడు. ఆ నిరుత్సాహాన్ని, కోపాన్ని అదుపు చేసుకోవడానికి ఆయనకు ఒక ప్రదేశం కావాలి, అందుకు వెల్లియంగిరి పర్వతాలను ఎక్కి, శిఖరం పై కూర్చున్నాడు. ఇక్కడ ఆయన ఆనందంగానో లేక ధ్యానంలోనో కూర్చోలేదు. తనపై తనకున్న ఓ విధమైన కోపంతో, నిరుత్సాహంతో అక్కడ కూర్చున్నారు. చాలా కాలం పాటు అదే స్థితిలో శివుడు అక్కడే కూర్చోవడం వల్ల ఆ శక్తిని పర్వతం గ్రహించుకుంది. ఈ విధమైన శక్తి మరి ఎక్కడా లేదు.

మన సాంప్రదాయంలో, శివుడు ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం నివసిస్తే, ఆ ప్రాంతాన్ని కైలాసంగా పరిగణిస్తారు. కనుక ఈ పర్వతాలను దక్షిణ కైలాసంగా అభివర్ణిస్తారు. ఎత్తులో, రంగులో ఇంకా పరిమాణంలో వెల్లియంగిరి పర్వతాలకూ, హిమాలయాల్లోని కైలాస పర్వతానికి అసలు ఎటువంటి పోలికా లేదు. కానీ అందంలో, శక్తిలో ఇంకా పవిత్రతలో ఇది కైలాస పర్వతానికి ఏమాత్రం తీసిపోదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఎందరో ఋషులు, యోగులు ఇంకా ఆధ్యాత్మికవేత్తలు ఈ పర్వతాలపై నివసించారు. వారి ఆధ్యాత్మికతకు ఈ పర్వతాలు సాక్షిగా నిలిచాయి. దేవతలు కూడా అసూయ పడేంత మహోన్నతంగా వీరు జీవించారు. అటువంటి ఎందరో మహనీయులు ఈ పర్వతాలకు ధారపోసిన శక్తి, ఎప్పటికీ అంతరించిపోదు.