ప్రశ్న: మన సొంత వారితో గొడవలు, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు- ఉదాహరణకి తల్లిదండ్రులతో లేదా తోబుట్టువులతో- కారణాలు ఏవైనప్పటికీ, వారితో సయోధ్య ఎలా కుదుర్చుకోవాలి? 

సద్గురు: మీరు తల్లిదండ్రులు, తోబుట్టువులు అంటున్నారు కాబట్టి, మీకొక సాకు దొరికింది. మీరు వీరిని ఎంచుకోలేదు.  అదే భార్య లేదా భర్త అయ్యుంటే, అది మీ నిర్ణయం- ఇతరుల్ని నిందించే అవకాశం లేదు.

కుటుంబం అనేది, మీకు మీ పరిమితుల్ని గుర్తు చేసే ఒక మంచి శిక్షణా ప్రదేశం. మీరు కొంతమందితో కలిసి ఉండాల్సి వస్తుంది- అంటే, ప్రతోరోజు, మీరు ఏం చేస్తున్న సరే, ఒకరినొకరు ఎదుర్కోక తప్పదు. వారు మీకు నచ్చని పనులు కూడా చెయ్యచ్చు. అయినా సరే, మీరు వారితోనే ఉండక తప్పదు. మీకు ఎవరైనా నచ్చకపోతే, తీసేయడానికి అది 10,000 మంది ఉన్న మీ ఫేస్‍బుక్ ఫ్యామిలీ లాంటిది కాదు.

కుటుంబం అనేది, మీకు మీ పరిమితుల్ని గుర్తు చేసే ఒక మంచి శిక్షణా ప్రదేశం.

ఇష్టాఇష్టాలను అధిగమించడానికి కుటుంబం ఒక చక్కటి ప్రదేశం. మీ ఇష్టాఇష్టాలు మీలోని నిర్బంధాలపై ఆధారపడి ఉంటాయి. మీరు వీటిలో చిక్కుకున్నప్పుడు, ఎరుక అనే విషయమే తలెత్తదు. మీరు దేన్నైనా ఇష్టపడిన లేదా ఇష్టపడని క్షణాన, మీరు సహజంగానే నిర్బంధంగా, అంటే మీకు నచ్చిన దానికి అనుకూలంగా, నచ్చనిదానికి ప్రతికూలంగా ప్రవర్తిస్తారు.

ఎరుకతో మెలగడం

కుటుంబం అనేది ఒక  పట్టుగూడు లాంటిది, మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు కొంతకాలం వాళ్ళతో కలిసుండక తప్పదు. అయితే, మీరు దీనిని ఒక చేదు అనుభవంగానైనా మార్చుకోవచ్చు లేదా మీ ఇష్టాయిష్టాలను అధిగమించుకునేందుకైనా ఉపయోగించుకోవచ్చు. మీ భర్తలో మీకు అస్సలు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయనుకుందాం. ఒకవేళ కొంత కాలం తరువాత మీరు, “వారు అంతే, అయినా పర్వాలేదు” అనుకునే స్థితికి వచ్చారనుకోండి, అతనేం మారకపోయిండచ్చు, కానీ మీరు ఒక విధమైన ప్రవర్తన పట్ల లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయం పట్ల మీకున్న అయిష్టాన్ని అధిగమించారు. అదే మీరు, బాధపడుతూ లేదా తలొగ్గి  “నేను భరించక తప్పదు- ఏం చెయ్యలేం” అన్నట్లు ఉంటే, అందరితో కలిసుండడానికి మీరు పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. కానీ మీరు, “అవును, వారలానే ఉంటారు, అయినా నాకేమీ పరవాలేదు. నేను వీరితో ఆనందంగానే ఉండగలను,” అనుకుంటే, మీరు ఎరుకతో అధిగమించగలరు.

కానీ మీరు, “అవును, వారలానే ఉంటారు, అయినా నాకేమీ పరవాలేదు. నేను వీరితో ఆనందంగానే ఉండగలను,” అనుకుంటే, మీరు ఎరుకతో అధిగమించగలరు..

మీరు మీ ఇషాయిష్టాలను అధిగమించినపుడు, తెలియకుండానే, మీరు ఎరుకతో ఉంటారు. తెలియకుండానే, మీరు ఆధ్యాత్మికంగా మారుతారు, ఇలా ఆధ్యాత్మికంగా మారడం అనేది ఉత్తమ విధానం. “నేను ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాను” అని చెప్పడం వల్ల కాదు, ఓ జీవంగా, మీలో తగినంత ఎరుక కలిగి,   ‘ఆధ్యాత్మికత’ అనే పదం వాడకుండానే, మీ పరిమితులను, ఇష్టాయిష్టాలను దాటి వెళ్లాలని ప్రయత్నించినపుడే మీరు ఆధ్యాత్మికులు అయినట్లు.  ఆధ్యాత్మికంగా మారడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, మీరు ఇకపై నిర్బంధతతో స్పందించని స్థాయికి ఎరుకతో అభివృద్ధి చెందడం. మీరు ఆ దశగా శిక్షణ పొందేందుకు కుటుంబం ఒక చక్కటి ప్రదేశం. మీరు ఎప్పటికీ అందులోనే చిక్కుకుని ఉండిపోరు. మీరు ఎటువంటి కుటుంబంలో ఉన్నా సరే, అది కేవలం కొంత కాలం వరకే. మీ ఈ సమయాన్ని మీ ఇష్టాయిష్టాలను అధిగమించడానికి ఉపయోగించుకోవాలి.

మీ చుట్టూ ఉన్న వారు మీతో ఏకీభవించకపోతే, మీరు చాలా మంచి చోట ఉన్నట్లే. నేను ఆశ్రమంలో ఉన్న వారికి ఎప్పుడూ చెబుతూ ఉంటాను, “మీకు అస్సలు ఇష్టం లేని వారితో ఉండి ఆనందంగా కలిసి పనిచెయ్యడం నేర్చుకోండి. అది అద్భుతాలు చేస్తుంది” అని. మీకు నచ్చిన వారితోనే  ఉండాలనుకుంటే, ఎప్పుడూ అటువంటి వారితోనే ఉండాలనుకునే నిర్భంద స్థితిలోకి వెళ్ళిపోతారు. కుటుంబం సమస్య కాదు. మీకు నచ్చిన వారితో మాత్రమే ఉండాలని కోరుకోవడం సమస్య. మీకు నచ్చిన దానిని ఎంచుకోకండి. ఉన్న దానిని ఎలా అద్భుతంగా మార్చాలో చూడండి. మీ జీవితంలో ఏం వస్తుందో మీకు అనవసరం, దానిని ఎలా మలచుకుంటారన్నది  మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది.

మీ చుట్టూ ఉన్న వారు మీతో ఏకీభవించకపోతే, మీరు చాలా మంచి చోట ఉన్నట్లే.

ప్రజలు వాతావరణాన్ని చూసి, “అబ్బా, ఇవాళ భలే ఉంది” లేదా “ ఇవాళ అసలేం బాలేదు” అని అంటుంటారు. కేవలం మేఘాలు ఉన్నంత మాత్రాన అది చెడ్డ రోజు అయిపోదు. వాతావరణం గురించి ప్రకృతికి వదిలెయ్యండి. ఒక రోజు ఎండ, మరో రోజు మేఘాలు; ఒక రోజు వాన, మరో రోజు మంచు ఉన్నా పర్లేదు. ఎండగా ఉంటే, చొక్కా విప్పేసి వెళ్ళండి; వర్షం పడుతుంటే రైన్‍కోట్  వేసుకోండి ; మంచు పడుతుంటే, స్నోబోర్డు మీద వెళ్ళండి. ఎలా ఉన్నా సరే, ఆ రోజుని మంచి రోజుగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. 

అదే విధంగా, మీ పక్కన ఎవరు కూర్చున్నరన్న దాని గురించి పట్టించుకోకండి. ఆ వ్యక్తితో  కూర్చోవడాన్ని ఒక అద్భుతమైన అనుభూతిగా మార్చుకోండి. దానర్ధం వారితోనే ఎల్లకాలం కూర్చొమ్మని కాదు. ప్రతి ఒక్కరూ వస్తూ పోతూ ఉంటారు. వాళ్లైనా వస్తూ పోతుంటారు లేదా మీరైనా వస్తూ పోతుంటారు. ఇక్కడ ఎవరున్నా, ఏదున్నా- ప్రస్తుతం దానిని ఉత్తమంగా మార్చుకోండి. మీకు వేరేవి ఏమైనా ముఖ్యమనిపిస్తే, వాటిని ఎంచుకోవచ్చు. కాని ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఆనందంగా ఎంచుకోవాలి. అది ఎరుకతో తీసుకున్న నిర్ణయం అయ్యి ఉండాలి కానీ, నిర్బంధతతో తీసుకున్నది కాకూడదు. అంటే మీరు ఇక్కడ ఉండలేరు కాబట్టి వేరే చోటుకి మారడంలా కాదు. మీరు అలాంటి స్థితిలో మారితే, మీరు ఎక్కడికి వెళ్ళినా అలానే ఉంటారు. మీకు ఇక్కడ ఎలా వ్యవహరించాలో తెలియకపొతే, ఎక్కడికి వెళ్ళినా అది తెలియదు. 

ఫలితాలను సరిచూసుకోవడం

మరి ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రక్రియ పని చేస్తుందో లేదో మీరు ఎలా తెలుసుకుంటారు? కేవలం ఫలితాల ద్వారానే. మీరు అదే వ్యక్తులతో ఉంటూ, ఇంకొంచెం ఆనందంగా నిద్రలేచి, ఇంకొంచెం హాయిగా ఉంటూ, వారితో మీకు మునుపటిలా విసుగు రాకుండా ఉంటే- దానర్ధం మీరు అభివృద్ధి చెందుతున్నారని. ప్రతిచోటా, పురోగతిని ఫలితాల ద్వారా కొలుస్తారు కదా, ఇక్కడ కూడా అంతే.

ఒకసారి ఇలా జరిగింది - స్వర్గ ద్వారం దగ్గర మనషులంతా లైన్లో నిల్చొని ఉన్నారు. వారిని లోనికి పంపించే ముందు, సెయింట్ పీటర్, ప్రతి ఒక్కరి ఖాతాలను తనిఖీ చేస్తున్నాడు. వారిలో మెరిసే పోల్కా డాట్ షర్ట్ ఇంకా ఏవియేటర్ గ్లాసెస్‍తో, సిగరెట్ కాలుస్తూ వేగాస్ నుండి వచ్చిన, ఒక ఇటాలియన్ టాక్సీ డ్రైవర్ ఉన్నాడు. ఆయన వెనకే ఒక క్రైస్తవ మతగురువు కూడా ఉన్నారు. ఆయన అతని వైపు చిరాకుగా చూస్తూ, “అసలు ముందు ఇతను స్వర్గానికి వెళ్ళే లైన్లో ఎందుకున్నాడు?” కానీ తెలుసా, దేవుడి నిర్ణయాలు విచిత్రంగా ఉంటాయి. టాక్సీ డ్రైవర్ వంతు వచ్చినప్పుడు, తన విధిరాతకి తలవంచి,  “సరే, మీరు నన్ను ఎక్కడికి పంపినా… సమస్య ఏముంది.” ఆని అన్నాడు. ఒక టాక్సీ డ్రైవర్‍గా, ఆయన అలానే చేసేవాడు. కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకెళ్ళేవాడు; గమ్యాన్ని అతను నిర్ణయించేవాడు కాదు. అతని ఖాతాలన్నీ తనిఖీ చేశారు. తరువాత పీటర్ అతన్ని నవ్వుతూ స్వాగతం పలికి మంచి, పట్టు వస్త్రాన్ని ఇచ్చాడు. ఇద్దరు అందమైన దేవకన్యలు వచ్చి అతన్ని స్వర్గానికి తీసుకెళ్లారు.

మీరు అదే వ్యక్తులతో ఉంటూ, ఇంకొంచెం ఆనందంగా నిద్రలేచి, ఇంకొంచెం హాయిగా ఉంటూ, వారితో మీకు మునుపటిలా విసుగు రాకుండా ఉంటే- దానర్ధం మీరు అభివృద్ధి చెందుతున్నారని.

ఆ మతగురువు ఇదంతా ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అతని వంతు వచ్చినప్పుడు, వారు అతని పుస్తకాల్ని చూసి, స్వాగతించి, పనివారి దుస్తులు ఇంకా మాపింగ్ స్టిక్ ఇచ్చి,”మీరు వెళ్లి కారిడార్ నంబర్ 127ని శుభ్రం చేయండి” అన్నారు. మతగురువు విసుక్కుంటూ, “ఇది ఏమిటి? సిన్ సిటీ నుండి వచ్చిన- దాని పేరు కూడా నాకు పలకాలని లేదు- ఆ ఇటాలియన్ టాక్సీ డ్రైవర్‍, అన్ని రకాల వారినీ ఎక్కించుని ఆ నగరంలో నడిపాడు, కానీ మీరేమో  అతనికి పట్టు వస్త్రాలు ఇచ్చి, దేవకన్యలతో అతన్ని స్వర్గానికి పంపారు. నేను, నేను మతగురువుని - నేను దేవుని సేవలో ఉంటున్నాను. మరి నాకేమో పనివారి దుస్తులు, మాపింగ్ స్టిక్ ఇంకా కారిడార్ 127 - అది ఎంత పెద్దదో నాకు తెలుసు. నాకే ఎందుకు?” పీటర్ అతని వైపు చూసి, “దయచేసి వినండి. ఇక్కడ చర్చిలా ఉండదు- ఇది స్వర్గం. ఇక్కడ, మేము ఫలితాలను అనుసరిస్తాము. మీరు మీ ఉపన్యాసం ఇచ్చినప్పుడు,ప్రజలు నిద్రపోయేవారు. కానీ అతను టాక్సీ నడిపినప్పుడు అందరూ, ‘ఓ మై గాడ్!ఓ మై గాడ్!ఓ మై గాడ్!” అనేవారు.

మీరు ఫలితాలను బట్టే వెళ్ళాలి. మీ ఆధ్యాత్మిక ప్రక్రియ పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి, బయటి పరిస్థితి పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మీలో మీరు సంఘర్షణ పడుతున్నారా లేదా? అని చూసుకోండి. మీలో సంఘర్షణ ఉంటే, మీరు ఇంకా కృషి చేయాలి. మిమ్మల్ని ఎవరు కొట్టడం లేదు. వారు చేసేదల్లా ఎగతాళి చేయడమే. వాళ్లకి బాగా తెలిసిన పనినే, వారు చేస్తున్నారు. మీకు బాగా తెలిసినది, మీరు చెయ్యాలి. మీకు ఏది ఉత్తమైనదో తెలిస్తే, మిమ్మల్ని మీరు సరైన స్థితిలో ఉంచుకుంటారు.  మిమ్మల్ని మీరు బాగా ఉంచుకుంటే, వారిని కూడా మార్చచ్చు, కానీ నేను ప్రస్తుతం అంత దూరం వెళ్ళాలనుకోవట్లేదు. ఎవరైనా మిమ్మల్ని అరుస్తున్నా, తిడుతున్నా, పట్టించుకోనక్కరలేదు. కావాలనుకుంటే, వాటి నుంచి ఒక నిఘంటువు తయారుచేయచ్చు.  తిట్లన్నిటినీ మంచి మాటలుగా అనువదించుకోవచ్చు. ఏది ఏమైనా, వాళ్లకి బాగా తెలిసింది వాళ్ళు చేస్తున్నారని మీరర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు, వారికి బాగా తెలిసింది చెత్తే కావచ్చు- ఏం చేస్తాం. మీకు అలాంటి వారి పట్ల కేవలం సానుభూతి మాత్రమే ఉండాలి.

మురికిని సువాసనగా మార్చడం

ప్రస్తుతం మీరు అక్కడే ఉండాలి. ఎన్నోసార్లు, కేవలం మీరు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరూ- మనకి నచ్చని వారితో ఇంకా నచ్చని సందర్భాలలో చిక్కుకుని ఉంటాం. మనం ఎక్కడ ఉండాలనేది  మన చేతుల్లో ఉండదు. కానీ దాన్ని మనం ఎలా మలుచుకుంటామనేది, పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. చేసి చూడండి. మీరు అది చేస్తే గనక, నిదానంగా బైట జరిగేది కూడా మీ ఎంపికగా మారుతుంది. కొంత కాలానికి మీ చుట్టూ ఉన్న పరిస్థితులు, సహజంగానే మీకు అనుకూలంగా, అద్భుతంగా మారుతాయి.

ముఖ్యమైన విషయమేమిటంటే, మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన మనిషిగా మలుచుకోండి. ఇతరులు దాన్ని ఎలా చూస్తారనేది వాళ్ళ సమస్య.

ప్రపంచంతో నా అనుభవం చాలా అద్భుతంగా ఉంటోంది. నేను ఎక్కడికి వెళ్ళినా, ప్రజల కళ్ళల్లో ప్రేమతో కూడిన ఆనందభాష్పాలు చూస్తాను. నాకు అంత కంటే ఏం కావాలి? ప్రపంచంలో అందరూ ఇలా ఉండరని నాకు తెలుసు, కానీ నా చుట్టూ ఉన్న ప్రపంచం మాత్రం అలా మారిపోతుంది. ఎందుకంటే, నేను ఎక్కడ ఉన్నా సరే, ఇలానే ఉండేలా,  నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి, చాలా  సమయాన్ని వెచ్చించాను.  మెల్లమెల్లగా ప్రపంచం నన్ను అనుకరిస్తోంది. మీరు కూడా ఇలా చేయండి. ప్రపంచం ఒక నిర్దిష్ట రీతిలోకి మారుతుందో లేదో అని చింతించకండి - కొంతకాలానికి కచ్చితంగా మారుతుంది. ముఖ్యమైన విషయమేమిటంటే, మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన మనిషిగా మలుచుకోండి. ఇతరులు దాన్ని ఎలా చూస్తారనేది వాళ్ళ సమస్య.

ప్రస్తుతానికి, వారు మురికి నీళ్ళలో నడవాలనుకుంటే - అలసిపోయే వరకు, కొంతకాలం నడవనివ్వండి. మీరు ఎలా జీవించాలంటే, మురికిలో ఉన్న వారికి కూడా, ఏదో ఒక సమయంలో, మీరు మీలా ఉండడం చాలా విలువైనది అని తెలుసుకోవాలి. వారు దానిని ఒప్పుకోకుండా ఉండలేరు. వారు అలా ఉండడానికి కారణం వారికున్న జీవిత అనుభవాలు చేదుగా ఇంకా అసంతృప్తిగా ఉండడం. అవి గొడవల రూపంలో బయటకు వస్తాయి. మరోలా కూడా జీవించొచ్చని వాళ్ళకి మీరే ఓ నిదర్శనంగా మారండి. యోగాలో, తామర పువ్వుని, ఎల్లప్పుడూ  ఒక ప్రత్యేకమైన చిహ్నంగా భావిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ బురద ఉన్న చోట తామర బాగా పెరుగుతుంది. ఎంత ఎక్కువ బురద ఉంటే అంత బాగా పెరుగుతుంది. అలాంటి బురద, అత్యంత మధురమైన పరిమళంలా మారుతుంది. ఇదే ఆధ్యాత్మిక ప్రక్రియ. మురికి పట్ల ఏహ్యభావం పెంచుకోవడం ఆధ్యాత్మిక ప్రక్రియ కాదు. మురికిని సువాసనగా మార్చడమే ఆధ్యాత్మిక ప్రక్రియ.