సద్గురు: ఇటీవల, ఎవరో నాతో కొన్ని శక్తుల పట్ల ఆమెకున్న ఎరుక గురించి ఇంకా వివిధ రకాల మనుషులు, వివధ రకాల రూపాలు ఇంకా వివిధ రకాల ప్రాంతాలు ఎలా ప్రభావం చూపుతాయో మాట్లాడారు. ప్రాణ ప్రతిష్ఠ వెనుకున్న విజ్ఞానం ఇదే. ప్రతిష్టించడానికి ఉత్తమమైన పదార్థం మనిషి, ఈ భూమ్మీదున్న అన్ని భౌతిక రూపాల్లోకీ, ఇదే అత్యంత పరిణితి చెందినది. మానవుడిని ప్రతిష్ఠ చేయడం అత్యంత సులభమైన విషయం, కానీ మానవులతో సమస్య ఏమిటంటే, ప్రతి కొన్ని నిమిషాలకు వారి మనసు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే వారిని ప్రతిష్ఠించవచ్చు, కానీ రేపు ఉదయానికి, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. ముందసలు, వారికి ఇచ్చిన దానికి కట్టుబడి ఉండటం అనేది చాలా పెద్ద సమస్యగా అయిపొయింది, ముఖ్యంగా నేటి ప్రపంచంలో! దాని కారణంగా, మేము ఇతర రూపాలను ప్రతిష్ఠ చేస్తున్నాం.

కొలవ లేనిది, కానీ మనం తెలుసుకోగలిగినది

నేటి ఆధునిక శాస్త్రం భౌతిక విషయాలను అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉంది. మీ గురించి భౌతికమైన ప్రతిదీ బయట నుండి సేకరించబడింది. మీరు నా శరీరం అని పిలుస్తున్నది ఈ గ్రహంలో ఒక భాగం మాత్రమే. మీరు తినే ఆహారం ద్వారా మీరు దానిని నెమ్మదిగా కూడగట్టారు. మీ గురించి భౌతికమైన ప్రతిదీ మీరు సేకరించినది మాత్రమే, అయితే అదే మీరు కాకూడదు. మీరెవరు? మీకు ఖచ్చితంగా భౌతికతకు మించిన కోణం ఉంది. మీరు దానిని వదిలేస్తే, ఇక జీవమే ఉండదు. కానీ ప్రస్తుతం, తాను శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాను అని భావించే మానవ తర్కం ఇప్పటికీ, "నేను పరికరంపై నేను కొలవగలిగినది తప్ప ఇంకేదీ లేదు" అని నిర్ధారించే స్థాయిలో ఉంది. ఆ లెక్కన, మీరందరూ ఉనికిలో లేనట్టే. ఎందుకంటే మిమ్మల్ని కొలవడం సాధ్యపడదు.

నా విషయంలో ఒకసారి ఇలా జరిగింది. ఇప్పుడు నేను అటువంటివి చేయనీయడం లేదు, కానీ ఎంతో కాలం క్రితం, కొన్ని విషయాలకు బద్దుడనై ఉండడం వల్ల, అలా చేయనివ్వాల్సి వచ్చింది. నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నాను. వారు, “మేము, మీ గామా తరంగాలను కొలవాలనుకుంటున్నాము” అన్నారు. మనలో గామా తరంగాలు ఉంటాయని నాకు తెలియదు. వారు, "లేదు, మీ మెదడులో గామా తరంగాలు ఉన్నాయి, మేము వాటిని కొలుస్తాము" అన్నారు. కాబట్టి వారు నా శరీరంపై పద్నాలుగు ఎలక్ట్రోడ్‌లను పెట్టి "ధ్యానం చేయండి" అన్నారు. నేను, “నాకు ధ్యానం ఎలా చేయాలో తెలియదు” అన్నాను. "అయితే మరి అందరికీ ధ్యానం ఎలా నేర్పిస్తున్నారు?" అనడిగారు. నేను, “అవును, నేర్పిస్తున్నాను, ఎందుకంటే వారికి కుదురుగా ఎలా కూర్చోవాలో తెలియదు. కావాలంటే నేను నిశ్చలంగా కూర్చుంటాను” అన్నాను. వారి సమస్య ఏమిటంటే, వారికి - అది ఎటువంటి ధ్యానమో, దాని పేరు ఏంటో, దాన్ని చేసే ప్రక్రియ ఏంటో, దాని వల్ల కలిగే ఫలితాలు ఏంటో, ఇవన్నీ కావాలి.

నేను వారికి ఆ ఆనందాన్ని ఇవ్వ లేదు. కాబట్టి నేను ఉరికే అలా నిశ్చలంగా కూర్చున్నాను. దాదాపు ఇరవై నిమిషాల తర్వాత ఏదో లోహపు వస్తువుతో, నా మోచేతి మీద ఎక్కడైతే అది ఎక్కువగా బాధిస్తుందో ఆ ప్రదేశంలో కొట్టారు. నేను అది ప్రయోగంలో భాగమనుకున్నాను. తరువాత వారు నా చీలమండ ఇంకా మోకాళ్ళపై కొట్టడం మొదలు పెట్టారు. అలా చాలాసేపు చేయడంతో బాగా నొప్పి కలిగింది. అప్పుడు నేను కళ్ళు తెరిచి, “నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? నన్ను ఎందుకు కొడుతున్నారు?” అన్నాను. వారు, "మా పరికరాల ప్రకారం, మీరు చనిపోయారు" అన్నారు. నేను, "మహా గొప్పగా నిర్ధారణ చేసారు” అన్నాను. దాంతో వాళ్ళు ఆలోచించి, “లేదు, మీ బ్రెయిన్ డెడ్ అయినట్టు ఉంది” అన్నారు. నేను, “నేను మొదటి అభిప్రాయంతోనే ఏకీభవిస్తాను. ‘నేను చనిపోయాను’ అని అన్నా నాకు పరవాలేదు. కానీ మీరు నాకు ‘బ్రెయిన్ డెడ్’ అని సర్టిఫికేట్ ఇస్తే, అది నాకు మంచి విషయం కాదు” అన్నాను.

నేను దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరై ఉన్న ప్రాధమిక జీవం ఏదైతే ఉందో, దాన్ని ఏదైనా పరికరంతో కొలవగలరని మీరు అనుకుంటున్నారా? భౌతిక ప్రక్రియలను మాత్రమే మనం కొలవగలం, కదా? మీకు తెలుసా, మీ గురించి భౌతికమైన ప్రతిదీ బయట నుండి వచ్చినదే. మీరు ఈ భూమ్మీద ఓ భాగం మాత్రమే. అది మీ సొత్తు కాదు. మిమ్మల్ని కొలవడం సాధ్యపడదు కాబట్టి, మీరు ఉనికిలో లేరని మీరు అనుకుంటే - మీరు ఒక సరికాని నిర్ధారణ చేసినట్టే!

కాబట్టి ప్రతిష్ఠ అనేది ఒక శక్తి పార్శ్వం, ఇది భౌతిక స్వభావం కలిగినది కాదు, కానీ అది గాఢతతో కూడిన జీవం. ప్రతిష్ఠ అనేది చాలా గాఢతతో కూడిన జీవ ప్రక్రియను సృష్టించే మార్గం. కొన్ని సంస్కృతుల్లో, ముఖ్యంగా భారతదేశంలో, ఒకానొక సమయంలో ప్రతి వీధీ ప్రతిష్ఠ చేయబడి ఉండేది. ఇప్పటికీ, అక్కడ ప్రతిష్ఠ చేయబడిన అద్భుతమైన స్థలాలు ఉన్నాయి. మీరు వచ్చి, దాన్ని అనుభూతి చెందాలి. ఒక ప్రదేశానికి వెళితే, ఆ స్థలం ఎంత సజీవంగా ఉందో; లేదా ఎంత నిర్జీవంగా ఉందో తెలుసుకోవచ్చు. అయితే దాన్ని ఏదైనా పరికరంతో కొలవగలమా? అంటే, లేదు. ఒక జీవానికే జీవం గురించి తెలుస్తుంది. జీవానికి జీవం తారసపడితే, దానికి తెలుస్తుంది, జీవానికి మరణం తారసపడినా, దానికి తెలుస్తుంది. దీన్ని కొలవడానికి ఏదైనా పరికరం ఉందా? అంటే, లేదు. ఎందుకంటే మీ పరికరాలు అన్నీ కేవలం భౌతిక ప్రక్రియలను మాత్రమే కొలవగలవు.

ప్రతిష్టించిన ప్రదేశాలలో నివసించడం

ప్రాణ ప్రతిష్ఠ అనేది గాఢమైన జీవ ప్రక్రియ. ఏ మానవుడూ, ప్రతిష్టించని ప్రదేశాలలో నివసించకూడదు. మీరు మానవాళి పట్ల శ్రద్ధ వహిస్తే, ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల విషయంలో, నన్ను నమ్మండి, వారు ప్రతిష్ఠ చేసిన ప్రదేశాల్లో తగినంత సమయం గడిపేలా చేయగలిగితే, ఇక వారికి కౌమారదశలో కలుగుతున్న ఈ సమస్యలు ఏవీ కలగవు. పసిబిడ్డగా వున్నప్పుడు డైపర్ సమస్యలు; చంటిబిడ్డగా ఉన్నప్పుడు స్వేచ్చగా నడవ లేకపోతున్నామనే సమస్య; కౌమారదశలో వేరే సమస్య; మధ్య వయసులో సంక్షోభ సమస్య; ఆపై వృద్ధాప్యం ఘోరంగా ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు జీవిస్తారు? మీరు జీవితాన్ని ఒక సమస్యగా చూస్తున్నారు. ఈ జీవాన్ని మీ తర్కంలో ఇమడ్చాలని అనుకోవడం వల్లనే, జీవితం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. లేదు, ఈ జీవంలో మీ తర్కం చక్కగా ఇమడ గలదు. కానీ ఈ జీవాన్నే మీ తర్కంలో ఇమడ్చాలని చుస్తే, అది అలా పనిచేయదు.

ప్రాణ ప్రతిష్ఠ అనేది, జీవాన్ని ఘాడంగా కేంద్రీకృతం చేసే ఒక పార్శ్వం, ఒక శాస్త్రవిజ్ఞానం. ఎంతగా అంటే, తద్వారా మీ శక్తి వ్యవస్థ మొత్తం ఉప్పొంగేంత ఘాడంగా! మేము ఇలాంటి ప్రదేశాలను సృష్టించాము. ప్రజలు లోపలికి వెళితే చాలు, కేవలం అక్కడి తీవ్రత కారణంగా, కళ్ళ నుండి నీళ్ళు జాలువారతాయి. ఎందుకో వారికి తెలియదు. ప్రతి రోజు మీ కళ్ళు - ప్రేమ, ఆనందం ఇంకా పారవశ్యంతో చెమ్మగిల్లాలి. ఇది జరగకపోతే మీరు ఇంకా జీవించడం మొదలు పెట్టలేదని అర్ధం.