"స్త్రీత్వం" అన్నప్పుడు,  అది "స్త్రీ" లింగం గురించి కాదు. స్త్రీగా ఉండటం కేవలం శారీరక విషయం. స్త్రీత్వం అనేది శరీరానికి సంబంధించినది కాదు, అది శరీరానికి అతీతమైన విషయం. స్త్రీత్వాన్ని గొప్ప వేడుకగా జరుపుకునే సంస్కృతి ఇది. కానీ అదే సమయంలో, స్వలాభాల కోసం స్త్రీత్వాన్ని ఎంతో దుర్వినియోగం చేయడం కూడా ఇదే సంస్కృతిలో జరిగింది. స్త్రీత్వాన్ని వేడుకలా జరుపుకోడమే ఈ సంస్కృతికి ఆధార భూతం. కానీ కాల క్రమేణా అది  స్త్రీత్వాన్ని దుర్వినియోగం చేసేదిగా మారింది. 

స్త్రీత్వాన్ని అభివర్ణించడానికి వాడే అసలు పదం "రీ." "రీ" అనే పదం సృష్టికి ఆధారమైన మాతృ దేవతని సూచిస్తుంది. ఇంకా ఇది "స్త్రీ" అనే పదానికి మూలపదం. స్త్రీ అంటే ఆడది అని అర్థం. "రీ" అంటే చలనం, సంభావ్యత లేదా శక్తి అని.

సృష్టి పరంగా, మొట్ట మొదట స్త్రీత్వం అనేది ఎలా మొదలైంది, అనే కథ ఇలా సాగుతుంది. ఈ సృష్టి ఇంకా బాల్య దశలోనే ఉన్నప్పుడు, సృష్టికి  హాని కలిగించే శక్తులు విజృంభించి, దాని ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితిని  తీసుకువచ్చాయి. దాంతో, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలుసుకున్నారు. ఈ ముగ్గురూ మూడు విభిన్న గుణాలకు ప్రతీక. ఈ రోజున, ఆధునిక భౌతిక శాస్త్రాల ప్రకారం, ప్రోటాన్, న్యూట్రాన్ ఇంకా ఎలక్ట్రాన్ అనే ప్రాథమిక మూలకాలతో ఈ సృష్టి నిర్మాణం జరిగిందని  స్పష్టంగా తెలుస్తుంది. అవి తమ స్థానాల్లో ఆ విధంగా ఉంటూ, చలనం కలిగి ఉండడానికి కారణం -  ఈ మూడింటి చుట్టూ ఉన్న ఒక విధమైన విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తి లేదా విద్యుదయస్కాంత శక్తి లేకుంటే, ఈ మూడింటికి చలనం అనేది ఉండదు. ఈ మూడూ చలనంలో లేకుంటే, అసలు ఈ సృష్టి అనేదే ఉండదు.

భౌతిక శాస్త్రంలోని ఈ అంశాన్నే, ఈ కథ ద్వారా ధాతు రూపంలో చెప్తారు. ఈ కధ ప్రకారం, విధ్వంసక శక్తులు విజృంభించడం వల్ల, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక, ఈ ముగ్గురు దేవుళ్లు ఒకచోట కలుసుకుంటారు. వారిలో మూడు అద్భుతమైన గుణాలైతే  ఉన్నాయి, కానీ ఆ విధ్వంసక శక్తులను ఎదుర్కోవడానికి ఈ