నేటి ప్రపంచంలో ఆయుర్వేదం, సిద్ధ వంటి వైద్య విధానాలు ప్రత్యామ్నాయ చికిత్సలుగా పరిగణించబడుతున్నాయి. కొందరు వీటిని కొట్టిపారేయడానికి సిద్ధంగా ఉంటే మరికొందరు వీటిపైనే ఆధారపడతారు. ఆయుర్వేదం, సిద్ధ, లేదా అల్లోపతిలలో సరైనదాన్ని ఎంచుకోవడం కష్టమైన పనే. ఈ వ్యాసంలో, ప్రతి విధానంలోని ప్రత్యేకతలను వివరిస్తూ, ఏ చికిత్సనూ కేవలం అదొక్కటే ఉత్తమమైనదిగా పరిగణించకుండా, ఒక సమగ్ర విధానాన్ని అవలంబించాల్సిన ఆవస్యకతను సద్గురు నొక్కి చెప్పారు.

అల్లోపతి వైద్యం

సద్గురు : మనం అనారోగ్యం, రుగ్మత, లేదా వ్యాధి అన్నప్పుడు, ఇవి ప్రాథమికంగా రెండు రకాలు. మొదటి రకం అనారోగ్యం, బయటి నుండి బాహ్య జీవులు దాడి చేయడం వల్ల కలిగేది. దీనిని ఒక విధంగా ఎదుర్కోవాలి. అంటువ్యాధులను నిర్వహించడానికి అల్లోపతి వైద్య విధానం ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన మార్గంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం, ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే, మనకు కలిగే అనారోగ్యాలలో  చాలా వరకు మనకి మనం సృష్టించుకునేవే. అవి వ్యవస్థ లోపల తయారవుతాయి. అటువంటి దీర్ఘకాలిక వ్యాధుల పరిష్కారానికి, అల్లోపతి వైద్య విధానం ఉత్తమంగా పనిచేసిన దాఖ‌లాలు లేవు. అల్లోపతి వైద్యం కేవలం వ్యాధిని నిర్వహించడంలో సాయపడుతుంది. ఇది ఎన్నటికీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించలేదు. ఎందుకంటే, ఇది ప్రధానంగా వ్యాధి లక్షణాలను నయం చేసే చికిత్స మాత్రమే.

దాదాపు అన్ని దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో, ఆ వ్యాధుల లక్షణాలు కేవలం ఐస్ బర్గ్ యొక్క కనిపించే కోన వంటివి మాత్రమే. మనం ఎప్పుడూ ఈ 'కొన' కు మాత్రమే చికిత్స చేస్తూ వస్తున్నాము. నిజానికి, ఈ రోజుల్లో ఇలాంటి చికిత్సా విధానం సాధారణం అయిపోయింది - మీకు గనుక మధుమేహం, రక్తపోటు లేదా ఉబ్బసం వస్తే, వైద్యులు ఆ వ్యాధిని ఎలా నిర్వహించాలనేది మాత్రమే మాట్లాడతారు. వాళ్ళు దాన్ని నిర్మూలించడం గురించి మాట్లాడరు. అయితే బయటకు వ్యక్తం అవుతున్న వ్యాధి తాలూకు లక్షణం ఏదైతే ఉందో, అది చాలా చిన్న విషయం. అసలైన అనారోగ్యం మరింత లోతైన స్థాయిలో జరుగుతూ ఉంటుంది, దాన్ని బయట నుండి వాడే ఔషధాలతో నయం చేయలేము.

మీరు నిజంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లయితే, ఆయుర్వేద వైద్యుని వద్దకు వెళ్లడం ఉత్తమం కాదు. కోలుకోవడానికి తగినంత సమయం ఉన్నప్పుడు మాత్రమే మీరు అతని వద్దకు వెళ్లాలి. అత్యవసర పరిస్థితుల్లో, మిగతా వాటి కంటే అల్లోపతి వైద్యంలోనే మెరుగైన విధానాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం మీ సమస్యలు స్వల్పంగా ఉండి, అవి పెరుగుతూ ఉండడాన్ని మీరు గమనిస్తే, ఇలాంటప్పుడు ఆయుర్వేదం మరియు ఇతర చికిత్సా విధానాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

ఆయుర్వేదం

ఆయుర్వేదంగా ముద్ర వేయబడిన దేశవాళీ ఔషధాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆయుర్వేదం అనేది ఓ పూర్తిగా భిన్నమైన కోణం నుండి, జీవం పట్ల గల ఒక లోతైన అవగాహన నుండి పుట్టింది. ఆయుర్వేద వ్యవస్థ యొక్క ప్రాథమిక తత్త్వం ఏమిటంటే, ఇందులో, 'మన శరీరం అనేది, మనం ఈ గ్రహం నుండి పోగుచేసుకున్న వాటి సమీకరణ’ అనే అవగాహన ఉంటుంది. భూగ్రహపు స్వభావం, అలాగే ఈ భూగ్రహం దేనితో అయతే తయారయ్యిందో, ఆ ఐదు మూలకాల స్వభావం ఈ భౌతిక శరీరంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. మీరు ఈ శరీరాన్ని అత్యంత ప్రభావవంతంగా ఇంకా సమర్ధవంతంగా నిర్వహించాలనుకుంటే, ఈ శరీరం గురించి మీరు చేసే ప్రతిదీ భూగ్రహంతో ఉన్న సంబంధాన్ని పరిగణలోకి తీసుకున్నదై ఉండాలి.

ఆయుర్వేదం ఎక్కువగా వ్యాధిని నయం చేయడంపై ద్రుష్టి పెడుతుంది, అయితే సిద్ధ వైద్యం ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా ఉంటుంది.

ఈ గ్రహం మీద కనిపించే ప్రతి వేరు, ప్రతి ఆకు, ప్రతి చెట్టు బెరడు ఔషధ విలువలను కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. మనం కొన్నింటిని మాత్రమే ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. మిగిలిన వాటిని ఎలా ఉపయోగించాలో ఇంకా నేర్చుకోవలసి ఉంది. దీనర్థం ఏంటంటే, ఆరోగ్యం అనేది ఏదో ఆకాశం నుండి మీపై ఊడి పడేది కాదు,అది మీ లోపల నుండి పెంపొందవలసినది అని. ఎందుకంటే ఈ శరీరం లోపల నుండే పెరుగుతుంది. ముడిపదార్దాలు భూమి నుండి వస్తాయి, కానీ అది పెరిగేది మాత్రం మీ లోపల నుండే. కాబట్టి, మీకు మరమ్మత్తు చేయవలసిన పని ఉంటే, మీరు వెళ్ళవలసింది తయారీదారుడు వద్దకు; లోకల్ మెకానిక్‌ వద్దకు కాదు. ఇదే ఆయుర్వేద సారాంశం.

ఆయుర్వేదం ప్రకారం, మన శరీర నిర్మాణం గురించి తగినంత లోతుగా వెళితే, ఈ శరీరం మిగతా వాటితో సంబంధం లేని ఒక ప్రత్యేక విషయం కాదని, అది మనం నడిచే భూమితో ముడిపడిన ఒక నిరంతరమైన ప్రక్రియ అని మనకి అర్థం అవుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే, శరీర వ్యవస్థ లోపల నుండి పనిచేసే, ఈ సూక్ష్మ చికిత్సా విధానాలు ప్రభావవంతంగా పనిచేయవు. పూర్తి వ్యవస్థపై శ్రద్ధ పెట్టకుండా, దానిలోని ఒక అంశాన్ని మాత్రమే సరి చేయడానికి ప్రయత్నించడం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. 

సమగ్రమైన వైద్య విధానం అంటే శరీరం మొత్తానికి చికిత్స చేయడం కాదు. సమగ్రమైన వైద్య విధానం అంటే, ఈ జీవాన్ని తయారు చేసే భూగ్రహాన్ని, ఆహారాన్ని, గాలిని, నీటిని వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం. ఆ విషయాలన్నింటి పైనా శ్రద్ధ పెట్టకపోతే, ఆయుర్వేదానికున్న అసలైన ప్రయోజనం కనిపించదు. ఆయుర్వేదం మన జీవితాలలో ఇంకా మన సమాజాలలో ఒక సమగ్ర భాగం అయితే, అప్పుడు ప్రజలు దేవుళ్లలా జీవించగలరు.

సిద్ధ

సిద్ధ లేదా సిద్ధవైద్యంకు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ప్రత్యేకమైన వైద్య విధానాన్ని అగస్త్య ముని ఆవిష్కరించారు. ఈ విధానాన్ని సాక్ష్యాత్తు ఆ ఆదియోగే ఆచరించారు అంటారు. అగస్త్య ముని దీన్ని దక్షిణాదికి తీసుకువచ్చారని చెబుతారు. పదార్థాలను ఒక అద్భుత రీతిలో ఉపయోగించడం ద్వారా ఆయన చాలా శక్తివంతమైన మేళవింపును సృష్టించాడు. సిద్ధ పనిచేసే తీరు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సిద్ధ వైద్య విధానంలో ఋషులు, ఆత్మజ్ఞానం పొందినవారు, సిద్ధవైద్యులు వేర్వేరు కాదు. ఎప్పుడూ, ఋషులు కొంతమేర సిధ్ధ వైద్యాన్ని అభ్యసించేవారు. ఎందుకంటే ముందుకు సాగాలి అంటే అందుకు ఆరోగ్యంగా ఉండడం ఎంతో ఆవశ్యకం.

సాధన లేకుండా సిద్ధ వైద్యం జరగదు.

సిద్ధ వైద్యం ఆయుర్వేదానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. శరీర శక్తి వ్యవస్థకు, ఆయుర్వేదం కన్నా కూడా, సిద్ధ మరింత సామీప్యంగా ఉంటుందని నేనంటాను. ఆయుర్వేదం ఎక్కువగా  వ్యాధిని నయం చేయడంపై ద్రుష్టి పెడుతుంది, అయితే సిద్ధ వైద్యం ఆరోగ్యాన్ని చేకూర్చేదిగా, వ్యవస్థను పునరుజ్జీవింపజేసేదిగా ఉంటుంది. కనుక సిద్ధ వైద్యంలో ఉండే విధానాలు ఆయుర్వేదంలో ఉన్నంత విస్తృతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయుర్వేదం ప్రతి వ్యాధికి చికిత్స చేస్తుంది. సిద్ధ ప్రతి వ్యాధికి చికిత్స చేయదు. ఇది ప్రధానంగా శరీరంలోని అంతర్గత మూలాలను బలోపేతం చేయడంతో పాటు, శరీరాన్ని ఒక విధంగా యాక్టివేట్ చేస్తుంది. 

సిద్ధ భిన్నమైనది అంటే అర్థం, ఈ విధానంలో మూలికలు వాడినప్పటికీ, ఇది ముఖ్యంగా ఐదు మూలకాలకు సంబంధించినదై ఉంటుంది. సిద్దను ఎక్కువ శాతం యోగ శాస్త్రం నుండి రూపొందించారు. యోగ శాస్త్రం యొక్క ప్రాథమిక తత్త్వం - భూత శుద్ధి లేదా ఒకరిలో ఉండే మూలకాలను శుద్ధి చేయడం. ఇది యోగ శాస్త్రం నుండి వెలువడిన ఒక పరిణామం. ఇది మూలకాలకు సంబంధించినది కాబట్టి, ఇందులో మీ శరీరాన్ని తయారు చేసిన ప్రాథమిక పదార్థాలను మీరు నిర్వహిస్తున్నారు. మీరు అందులోకి వేరే ఇతర ఔషధాలను చొప్పించే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఇది ఔషధం లాంటిది కాదు.

అందువలన, దీనిని అభ్యసించే వ్యక్తికి తక్కువ అధ్యయనం సరిపోతుంది, కానీ అంతర్గత నైపుణ్యత ఎక్కువ అవసరం. కానీ ఈ రోజుల్లో ఇది సమస్యగా మారింది. సాధన లేకుండా సిద్ధ వైద్యం జరగదు. నేడు సిద్ధవైద్యం కోసం కళాశాలలు ఏర్పాటు చేశారు, కానీ అది అలా పనిచేయదు. "సిద్ధ" అంటే సిద్ధి పొందినవాడు లేదా తనలో తాను బలంగా స్థిరపడినవాడు అని. సిద్ధ వైద్యం చేసే ఇతర వైద్యుల వద్ద సాధారణంగా అందుబాటులో ఉండని కొన్ని సిద్ధ విధానాలు ఈశా యోగ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి.

ఈశా యోగా సెంటర్‍లో ఉన్న ఈశా రెజువనేషన్, అలానే దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల్లో ఉన్న ఈశా ఆరోగ్య క్లినిక్‌లు సద్గురు స్థాపించిన సంపూర్ణ ఆరోగ్య కేంద్రాలు. ఈ కేంద్రాల గురించి సద్గురు మాటల్లో మరింత తెలుసుకోండి…

ఈశా రెజువనేషన్

సద్గురు: ఈశా రెజువనేషన్‍కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సిద్ధ ఇంకా యోగాని ఆధారంగా చేసుకుని చికిత్స చేస్తారు. అయితే యోగా కార్యక్రమాలు మాత్రమే సరిపోవా? అంటే - ఎవరైనా చాలా కాలంగా అనారోగ్యంతో ఉంటే, కేవలం కార్యక్రమం చేయడం సరిపోక పోవచ్చు. వారికి మరికొంత వైద్య సహాయం అవసరం కావచ్చు. కనుక మేము ఇక్కడ సంప్రదాయ సిద్ధ వైద్యాన్ని అందిస్తున్నాము.

అయితే ఇది అన్ని రకాల జబ్బులకు చికిత్స చేసే ఆసుపత్రి కాదు. ఇది ఎక్కువగా పునరుజ్జీవనం గురించి ఉంటుంది. ఈ పునరుజ్జీవింపజేసే విధానం, శరీరం తనకి తానుగా సమస్యలను సరిచేసుకునే స్థాయికి, శక్తి వ్యవస్థను చైతన్య పరచడం గురించి. ఈశా రెజువనేషన్ పని తీరు, ఆలోచన, ఉద్దేశం ఇంకా పరిసరాలు ఒక స్పా వంటి వాటికి ఉండేలాంటివి కాదు. ఇది ఎంతో అంకితభావంతో కూడిన వాతావరణం. స్పాలకు ప్రజలు కేవలం ఆనందం కోసం వెళ్లవచ్చు. ఇక్కడ మీరు దీన్ని ఆస్వాదించలేరని కాదు, ఇక్కడ మంచి వాతావరణం ఉంటుంది, కానీ ఇది కేవలం ఆనందం గురించి మాత్రమే కాదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సంభావ్యతను అంది పుచ్చుకునే స్థితికి వచ్చేలా అతన్ని సంసిద్ధం చేయడం కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తాము.

ఈశా ఆరోగ్య

ఈశా ఆరోగ్య కేంద్రంలో, సిద్ధవైద్య, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యోగ విధానాలు, హోమియోపతి ఇంకా అల్లోపతి - ఈ ఆరింటినీ ఇక్కడ ఉపయోగిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాన్ని సాధారణంగా అల్లోపతి వైద్యులు నిర్వహిస్తారు. ఎందుకంటే, నేటి ప్రపంచంలో రోగనిర్ధారణకు మెరుగైన శిక్షణ పొందిన వారు వీరే.

“సద్గురు, ఈ వైద్య విధానాలన్నింటినీ ఒకే చోట ఎలా ఉపయోగిస్తారు?” అని ప్రజలు నన్ను అడుగుతుంటారు. నేను ఏ వ్యవస్థకూ కట్టుబడి లేను. నా నిబద్ధతల్లా మానవ ఆరోగ్యం పట్ల. మీరు సిద్ధకి కట్టుబడి ఉండవచ్చు, లేదా అల్లోపతికి, లేదా ఆయుర్వేదానికి కట్టుబడి ఉండవచ్చు. కానీ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు, అతను కోరుకునేది ఆరోగ్యం ఒక్కటే, ఎలా అనేది పట్టించుకోడు. మీరు, ఆరోగ్యం ఫలనా విధానం ద్వారానే కలగాలి అనుకుంటారా ? మీరు ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకునేది ఆరోగ్యం, అది ఏ విధానం ద్వారా కలుగుతుందనేది మీరు పట్టించుకోరు. ఈ అన్నిటి కలయిక అద్భుతంగా పనిచేస్తోంది.

సంపాదకుని సూచన: మరింత సమాచారం కోసం, ఈశా రెజువనేషన్ మరియు ఈశా ఆరోగ్య క్లినిక్ లను సందర్శించండి.