సృజనాత్మక ప్రక్రియ ఇంకా సృజనాత్మకతను పెంపొందించే మార్గాలు
సద్గురు సృజనాత్మకతను నిర్వచిస్తూ, సృజనాత్మకత ఎక్కడ నుండి వచ్చిందో వివరిస్తున్నారు ఇంకా తన స్వీయ సృజనాత్మక ప్రక్రియపై అంతర్దృష్టిని అందిస్తున్నారు.
"సృజనాత్మకత" అనే పదానికి నిజమైన నిర్వచనం
సద్గురు: మానవుడు సృజనాత్మకంగా ఉండగలడంటే నేను నమ్మను. మన చుట్టూ ఉన్న సృష్టిని మనం ఒక నిర్దిష్టమైన తీక్షణతతో గ్రహిస్తే, అనేక రకాలైన మార్పులు, మిశ్రమాలు చేసి, అన్ని విధాలుగా మనం దాన్ని అనుకరిస్తూ, సమాజంలో సృజనాత్మకంగా కనిపించవచ్చు. కానీ, వాస్తవానికి, మనం సృజనాత్మకంగా లేము. సృష్టించగల ప్రతిదీ ఇప్పటికే సృష్టిలో సృష్టించబడింది. మహా అయతే మనం తెలివైన కళాకారులం. మీరు “సృజనాత్మకత” అనే పదాన్ని నిజంగా దేనినో సృష్టిస్తున్నట్లుగా నిర్వచిస్తే – అది మీరు తీసిన సినిమా ఐనా, చిత్రించిన చిత్రమైనా, నిర్మించిన భవనమైనా, మాట్లాడిందైనా లేదా మరేదైనా – అది నిజంగా సృజనాత్మకత కాదు – అది ఒక తెలివైన అనుకరణ మాత్రమే. మనం జీవితంలోని వివిధ అంశాలపై శ్రద్ధ పెట్టినందున, ఇతరులు ఊహించని విధంగా మనం సృష్టిని అనుకరించగలుగుతున్నాము. ఒకవేళ “అనుకరించడం” అనే పదం మీకు నచ్చకపోతే “ప్రతిరూపకల్పన” అని చెప్పవచ్చు.సృజనాత్మక ప్రక్రియ - ఒక మార్మికుని అంతర్దృష్టి
మీరు మనుషులను గమనిస్తే - ఎవరికీ కొమ్ములు, అదనంగా ఒక చెయ్యి, లేదా మూడు కళ్ళు లేవు - అందరూ ఒకే విధంగా ఉంటారు, కానీ అందరూ భిన్నంగా ఉంటారు. ఇదీ సృజనాత్మకత. మీరు మానవుల లక్షణాలను సరళంగా వివరించాలనుకుంటే - ప్రతి ఒక్కరికి రెండు కాళ్ళు, రెండు చేతులు, ఒక ముక్కు, రెండు కళ్ళు, ఇలా చెప్పొచ్చు. కానీ చూడండి, ప్రతి విషయంలోనూ ఎవరికి వారు ప్రత్యేకంగా ఉంటారు. ఇదే సృష్టి స్వభావం.
ఏ మనిషీ కూడా తాను ఏదో సృష్టిస్తున్నానని అనుకోకూడదు. మనకు తెలిసో తెలియకో, ఎలాగోలా మన స్మృతిలోకి తీసుకున్న విషయాల నుండి మనం కొన్నింటిని పునరుత్పాదనం చేస్తున్నాము. ఇక్కడ ఎవరూ నిజంగా కొత్తదాన్ని సృష్టించలేరు. మీరు సృష్టించేది ఏదైనా, అవి నగలు, దుస్తులు, భవనం లేదా మరేదైనా, ఏ రూపం, రంగులో ఉన్నా, అది అప్పటికే ప్రకృతిలో ఎక్కడో ఉనికిలో ఉంటుంది.
మీరు చాలా స్మృతులను మీలోకి తీసుకున్నారు, అన్నింటినీ స్పృహతో తీసుకోలేదు. మీ మనసులో ఉన్న ఈ రూపాలు, రంగులు ఇంకా ఆకారాలలో కొన్ని మీకు తెలియకుండానే అభివ్యక్తం అవుతాయి. ఈ సందర్భంలో చెప్పాలంటే, ఎవరైనా ఆశ్రమం అందంగా ఉందని అంటే కనుక – చూడండి నేను పర్వతాలను తయారు చేయలేదు, కానీ అవి ఆశ్రమంలోని అత్యంత అందమైన భాగం. చాలా మంది దీనిని గమనించకపోయినప్పటికీ, నిజానికి అవే అక్కడి నేపథ్యాన్ని సిద్ధం చేస్తున్నది.
ఒకసారి ఇలా జరిగింది, శంకరన్ పిళ్లై ఈశా యోగా కేంద్రానికి వచ్చాడు. అతను అందమైన దృశ్యాలను చూడగలిగేలా ఒక మంచి గదిని ఇవ్వమని కోరాడు. చిత్ర బ్లాక్లో తగిన గదిని ఇచ్చాము. అప్పుడతను మాకు ఫిర్యాదు చేశాడు, ‘నాకు అందమైన దృశ్యం కనిపించే గది కావాలి’ అని పునరుద్ఘాటించాడు.
"ఇదే అన్నింటిలోకి, మంచి దృశ్యాన్ని చూడగలిగే గది" అని మేము చెప్పాము.
అతను, "ఈ పర్వతాలు దానికి అడ్డంగా ఉన్నాయి" అన్నాడు.
చాలా మంది మనుషుల విషయంలో ఇదే జరుగుతోంది. వారు విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూడరు. బదులుగా వాళ్ళ సొంత ఆలోచనలతో చూస్తారు. మీరు ఏదైనా అందమైన దాన్ని సృష్టించాలనుకుంటే, మొదటి చేయవలసింది మీలో ఎటువంటి ఆలోచన లేకుండా ఉండడం. ఆలోచనకు వాస్తవికతతో సంబంధం ఉండవలసిన అవసరం లేదు. ఒక ఆలోచనకు బదులుగా, మీకున్న అవగాహనతో జీవితాన్ని ఎప్పుడూ ఆస్వాదించగలిగితే, అప్పుడు మీరు ఏదైనా సృష్టించాలనుకున్నా లేదా ఏదైనా జరగాలని కోరుకున్నా, అదంతా మీలోనే దొరుకుతుంది - ఆకారాలు, రూపాలు, రంగులు, శబ్దాల పరంగానో లేదా మరే విధంగానో. మీరు సంగీతాన్ని సృష్టించాలనుకున్నా, దుస్తులు లేదా భవనాన్ని సృష్టించాలనుకున్నా, మీరు తగినంత శ్రద్ధ వహిస్తే, అదంతా మీలోనే దొరుకుతుంది.
సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవచ్చా లేక అది సహజ లక్షణమా?
ప్రశ్న: సద్గురు, సృజనాత్మకత పుట్టుకతో వస్తుందా లేక దాన్ని మనం పెంపొందించుకోవచ్చా?
సద్గురు: మనం సృజనాత్మకత అని దేన్ని అంటున్నామో అది ప్రధానంగా మనం చూపే శ్రద్ధలోని తీక్షణత వల్ల వస్తుంది. కొంతమంది పదాలు, వాటి అర్థాల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు, కాబట్టి వారు వాటిని తిరిగి చెప్పగలుగుతారు. కొంతమంది రూపాలు, రంగుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. వారు దానిని ఒక విధంగా వ్యక్తీకరిస్తారు. కొంతమంది శబ్దాల పట్ల శ్రద్ధ వహిస్తారు. వారు ఎక్కువ శ్రమ పడకుండా సంగీతాన్ని కూర్చగలరు. మీ శ్రద్ధ ఎంత లోతుగా, తీక్షణంగా ఉంటుందో, ఏదో విధంగా అది మీలో ప్రతిబింబిస్తుంది.
ఎప్పటినుండో నేను చేసే పనిలోని సారం, ప్రయత్నం ఇదే - కోట్ల మంది ప్రజలను, వాళ్ళ ప్రోద్బలం లేకుండా శ్రద్ధ వహించేలా చేయడం. ప్రజలు ఈ ఒక్క పనిని చేయగలిగితే, బహుముఖ సృజనాత్మకత అనేది తప్పక సాధ్యమవుతుంది. వారు దాని కోసం సాధన చేయవలసిన అవసరం లేదు. మనుషుల్లో లోపించింది కేవలం శ్రద్ధ.
మానవుల శ్రద్ధను నిర్వీర్యం చేస్తున్నది కేవలం వారి మనసులోని ఆలోచనా ప్రక్రియలే. మనుషులకు వారి జ్ఞాపకశక్తిని ఇంకా వారి శ్రద్ధను విడివిడిగా ఎలా నిర్వహించుకోవాలో తెలియదు. వారి జ్ఞాపకశక్తి ఎప్పుడూ వారు శ్రద్ధ పెడుతున్న విషయాలలోకి జొరబడి వారి శ్రద్ధను కమ్మేస్తుంది. ఇలాంటి జ్ఞాపకాల మబ్బులనే ప్రజలు ఆలోచన లేదా భావోద్వేగం అంటారు. కానీ, ప్రధానంగా ఒకరి శ్రద్ధకు అంతరాయం కలిగించేది వారు పోగుచేసుకున్న జ్ఞాపకాలే. లేదంటే శ్రద్ధ వహించడం అనేది మీ సహజ లక్షణం. మీరు మేల్కొని ఉన్నప్పుడు, శ్రద్ధ వహిస్తూనే ఉంటారు, అలా కాకపోతే ఇంకెలా ఉండగలరు? జ్ఞాపకాలు ప్రతి అంశంలోకి జొరబడుతున్నాయి కాబట్టే మీరు శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
ప్రజలు తమ జ్ఞాపకాలను, శ్రద్ధను ఇంకా ఊహలను వేరు చేయగలిగేలా చేయడమే నేనెప్పుడూ చేస్తున్న మౌలికమైన ప్రయత్నం. ఊహ అనేది సమస్య కాదు, ఒకరి జ్ఞాపకశక్తి అనేక రకాలుగా బహిర్గతమవడాన్నే ఊహ అంటారు. అన్ని జంతువులకూ చాలా శ్రద్ధ ఉంటుంది, కానీ వాటికి మనలాగా స్పష్టమైన జ్ఞాపకశక్తి లేదు. ఈ జ్ఞాపకశక్తిని అసాధారణ సామర్థ్యంగా ఉపయోగించుకునే బదులు, చాలా మంది దీని వలన దుఃఖానికి గురవుతున్నారు. ఎన్నో సార్లు మనుషులు పదేళ్ల క్రితం జరిగిన దాని వలన ఇప్పుడు కూడా బాధ పడుతుంటారు, ఎల్లుండి జరుగబోయే దాని గురించి కూడా ఇప్పుడే బాధపడుతూ ఉండవచ్చు.
జంతువులకూ సంఘర్షణలు ఉంటాయి, కానీ తమ జ్ఞాపకశక్తి వల్ల అవి బాధపడవు. వాటి జీవన ప్రక్రియల వల్ల బాధ పడతాయి. మానవులు మాత్రం ఎక్కువగా జ్ఞాపకాల వల్లనే బాధపడుతున్నారు.
ఆందోళన సృజనాత్మకతకు ఆజ్యం పోస్తుందా?
ప్రశ్న: సృజనాత్మక ఆలోచన ఎక్కడ పుట్టింది? ఒకరిలోని కలవరపాటు లేదా ఆందోళన నుండి పుట్టిందా? లేదంటే నన్ను నేను ఎందుకు వ్యక్తపరచాలనుకుంటున్నాను? సృజనాత్మక ప్రక్రియలు, ఆలోచనలు, కవిత్వం, సంగీతం, ఇవి కలత లేదా ఆందోళన నుండి రావడం ముఖ్యమా?
సద్గురు: చాలా మందికి ఉన్న సమస్య ఏమిటంటే, వారిని సూదితో గుచ్చితే తప్ప మిగతా సమయంలో సగం మాత్రమే సజీవంగా ఉంటారు. ప్రజలు జడత్వాన్ని ఎంచుకున్నారు. జడత్వం కారణంగా, వారి జీవితంలో ఏమీ జరగకపోవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న వారికి తమ జీవితంలో యుద్ధం, మహమ్మారి లేదా ఏదైనా విషాదం లాంటి ముప్పు కలిగినప్పుడే జీవితం గురించి అప్రమత్తంగా ఉంటారు. ఇది దురదృష్టకరమైన స్థితి. జీవితంలోని ప్రతి క్షణం మీరు జాగరూకతతో ఉండాలి. ఈ జాగరూకత మీ ప్రమేయంతో కలగాలి కాని ఏదో పరిస్థితి ప్రేరేపించడం వల్ల కాదు.
మనం జీవితం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, మనకు జీవితం గురించి అంతే తెలుస్తుంది. మీ శ్రద్ధ ఎంత లోతైనదో ఆ మేరకే మీ జీవితానుభవం ఉంటుంది. మీ శ్రద్ధ చాలా లోతైనది అయితే, మీ జీవితానుభవం కూడా చాలా లోతైనదిగా ఉంటుంది. మీ జీవితానుభవం చాలా లోతైనది అయినప్పుడు, మీరు చేసే సాధారణమైన పని కూడా కవిత్వంలా, సంగీతంలా, లేదా మరోలా అభివ్యక్తమవుతుంది.
మీరు దాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తారు అనేది మీ శ్రద్ధ ఎటువంటిది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. మీ శ్రద్ధ ప్రతిదానిపైనా ఉందా? అదొక సాధారణ బల్బులా ఉందా - మీరు దాన్ని వెలిగిస్తే, దాని కాంతి అన్నిటి మీదా పడుతుంది - లేదా మీరు కొన్ని విధాలైన విషయాల మీదనే శ్రద్ధ పెడుతున్నారా? చాలా మంది తమకు ఆసక్తిగా ఉన్న కొన్ని విషయాలపైననే శ్రద్ధ చూపగలరు. మీరు శ్రద్ధ పెట్టవలసిన విషయం ఏది, కానిది ఏది - ఇలా జీవితాన్ని చూడడం తప్పు. సృష్టి కర్త మనిషిని సృష్టించడం కంటే చీమను సృష్టించడంపై తక్కువ శ్రద్ధ ఏమీ చూపలేదు. సృష్టి స్వభావం ఇలా ఉన్నప్పుడు, దీనిపై శ్రద్ధ వహించాలి, దానిపై కాదు అని నిర్ణయించడానికి మీరు ఎవరు?
సద్గురు సృజనాత్మకత వెనుక ఉన్న స్పూర్తి ఏమిటి?
ప్రశ్న: మీరు కవిత్వం లేదా చిత్రలేఖనం చేస్తున్నప్పుడు, మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది?
సద్గురు: ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ నేను కవిత్వం రాసేటప్పుడు నేను దాన్ని రెండోసారి కూడా చదవను. నేను ప్రత్యేకించి దేని గురించి ఆలోచించను. ఎలానో నా నుండి కవిత్వం స్రవిస్తుంది. అదే ఏదో ఒక రూపంలో చిత్రలేఖనంగా మారవచ్చు. నేను మాట్లాడినా, బండి నడిపినా, బోధిస్తున్నా, వ్రాసినా లేదా చిత్రలేఖనం చేసినా, అది ఏదైనా నాకు ఒకలానే అనిపిస్తుంది. వ్యక్తీకరించడం అనేది సరైన పదం కాదు, ఎందుకంటే మీరు దేన్నైనా వ్యక్తీకరించాలంటే కొంత తలంపు, ఆలోచన, తత్త్వం లేదా భావజాలం ఉండాలి. నా విషయంలో అది వ్యక్తీకరణ కాదు, ధారాస్రవం. నేనెప్పుడూ సుముఖంగానే ఉంటాను. పరిస్థితి అనుకూలిస్తే కనుక వరదలా పారతాను, లేదంటే ధారగా స్రవిస్తాను.
కళపై సద్గురు దృక్పథం
ప్రశ్న: సద్గురు, జనాదరణ పొందిన కళ ఇంకా లలిత కళల మధ్య తేడా ఉందంటారా? కళకు స్థాయీ భేదాలు ఉన్నాయని మీరు భావిస్తారా?
సద్గురు: లేదు, కానే కాదు. ఒకవేళ నేను కళను వర్గీకరించవలసి వస్తే, లోతైన నిరాశ నుండి వచ్చే కళ అని, ఆనందం నుండి వచ్చే కళ అని వేరు చేస్తాను. లోతైన బాధ, నిరాశల నుండి వచ్చిన కళ ఒకప్పుడు యూరోపియన్ వారి శైలిగా ఉండేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం దీనినే అనుకరించటానికి ప్రయత్నిస్తోంది. ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే అలాంటి చిత్రాలు ఎప్పుడూ మీ గోడలపై ఉంటే, నెమ్మదిగా అవి మీపై ప్రభావం చూపుతాయి. మీపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతే వాటిని కళలు అని అనలేము. అవి మిమ్మల్ని ప్రభావితం చేయగలవు– కేవలం దృశ్యరూపంగానే కాదు, మరెన్నో విధాలుగా.
దురదృష్టవశాత్తూ, ప్రపంచంలోని మతాలు బాధను స్తుతిస్తున్నాయి. యోగ సంస్కృతిలో, మనం ఎప్పుడూ ఆనందాన్ని, పారవశ్యాన్ని అన్నిటికంటే విలువైనవిగా పరిగణించాము. బాధకు మనం ఎప్పుడూ విలువనివ్వలేదు. ఎందుకంటే, బాధను మనం స్వయం సృష్టిగా చూసాము కాని ఆనందాన్ని కాదు. మీరు జీవితంతో మమేకమైనప్పుడు సహజంగానే ఆనందంగా ఉంటారు. జీవితంతో సంబంధం లేకుండా, మానసికంగా గందరగోళ స్థితిలో ఉంటే, మీకు బాధ, నిరాశలు కలుగుతాయి. కాబట్టి నేను కళను ఈ రెండు విధాలుగా వర్గీకరిస్తాను - లోతైన నిరాశ, బాధ నుండి వచ్చిన కళ, ఇంకా ఆనందమయ జీవితపు వ్యక్తీకరణ నుండి వచ్చిన కళ.