సద్గురు: "మహాలయ అమావాస్య" అని పిలువబడే అమావాస్య రోజు నుండి దసరా పండుగ ప్రారంభమౌతుంది. మన జీవితాలకు దోహద పడిన ముందటి  తరాలకు చెందిన పూర్వీకులకు మన కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పణలు అర్పించడం కోసం అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు ఇది.

ఈ గ్రహం మీద మానవులు ఇంకా వారి పూర్వీకుల ఉనికి రెండు కోట్ల ఏళ్ల క్రితం నుండి ఉన్నదని శాస్త్రజ్ఞులు చెబుతారు. ఇది చాలా సుదీర్ఘ కాలం. మనకి ముందు నివసించిన ఈ లక్షల తరాల వారు మనకు ఏదో ఒకటి ఇచ్చే వెళ్ళారు. మనం మాట్లాడే భాష, మనం కూర్చునే విధానం, మన వేష ధారణ, మన భవన నిర్మాణాలు - ఇలా  దాదాపు ఇవాళ మనకు తెలిసినవన్నీ కూడా మన ముందటి తరాల వారి నుండి సంక్రమించినవే.

పితృ పక్షము: గత తరాల వారి వారసత్వం

ఈ భూమి మీద జంతువులు మాత్రమే ఉన్నప్పుడు, జీవితమంతా కేవలం మనుగడ సాగించడం, తినడం, నిద్రపోవడం, పునరుత్పత్తి చేయడం, ఆపై ఒకరోజు మరణించడం గురించే. తరువాత కాలంలో, కేవలం మనుగడ మాత్రమే తెలిసిన ఈ జంతువు, మెల్లగా పరిణితి చెందడం మొదలు పెట్టింది. వెన్నును అడ్డంగా ఉంచుతూ వచ్చిన ఈ  జంతువు, నుంచోవడం మొదలు పెట్టింది; దాంతో మెదడు పెరగడం ప్రారంభమై, అకస్మాత్తుగా ఈ జంతువు యొక్క సామర్ధ్యాలు పెద్ద ఎత్తున పెరగటం మొదలయ్యింది. మానవునిగా ఉండడంలోని ప్రాముఖ్యత ఏమిటంటే, మనం ఉపకరణాలను ఉపయోగించగలం. ఉపకరణాలను ఉపయోగించగలగడం అనే ఈ చిన్న సామర్ధ్యాన్ని మనం ఎంతగానో మెరుగుపరిచాము, లేదా దానిలోంచి సాంకేతికతలను రూపొందించాము. ఏ రోజైతే ఒక కోతి కేవలం తన చేతులతో పోరాడడమే కాక, పోరాడడానికి ఓ జంతువు యొక్క తొడ ఎముకను వాడడం మొదలు పెట్టిందో, ఎప్పుడైతే తన జీవనం కోసం తన శరీరాన్ని వాడడంతో పాటు, ఉపకరణాలను కూడా వాడే  మేధస్సు దానికి వచ్చిందో, ఓ విధంగా అదే - ఈ పృథ్విపై మానవుని ఉనికికి ప్రారంభం. 

మహాలయ అమావాస్య అనేది మన జీవితాలకు దోహద పడిన ముందటి తరాలకు చెందిన పూర్వీకులకు మన కృతజ్ఞతలు తెలుపుతూ సమర్పణలు అర్పించడం కోసం అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు.

దాంతో, మానవులు, ఇతర జంతువుల కంటే కొంచెం మెరుగైన జీవితాన్ని గడపగలిగేలా తమ జీవితాలను నిర్మించుకోవడం మొదలుపెట్టారు. నివాసాలు వచ్చాయి, భవన నిర్మాణం మొదలయ్యింది, వస్త్రాలు వచ్చాయి - మానవుల వల్ల ఈ గ్రహం మీద ఎన్నో విషయాలు జరిగాయి. నిప్పు రాజేయడం వంటి సామాన్య విషయం నుండి చక్రాన్ని కనుగొనడం వరకూ, ఇంకా అనేక ఇతర ఆవిష్కరణల వరకూ సాగిన ఈ అభివృద్ధి ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వ సంపదగా అందించబడుతూ వచ్చింది. వారు మనకి అందించిన ఈ అభివృద్ధి వల్లే ఈ రోజున మనం ఈ విధంగా ఉన్నాం. ఉదాహరణకు మానవుడు క్రితమెన్నడూ వస్త్రాలే ధరించలేదనుకుందాం, మీరే మొట్టమొదటి సారిగా ఒక చొక్కా కుట్టాలంటే, అది అంత తేలికైన పని కాదు. ఒక చొక్కాని కుట్టడం ఎలానో కనిపెట్టటానికి కొన్ని సంవత్సారాలు పట్టగలదు.

పితృ పక్షము : కృతజ్ఞత వ్యక్త పరచడం

ఈ రోజున మనకి  ఉన్న అన్నింటినీ, మనం ఊరికే వచ్చేసాయి అన్నట్టు భావిస్తున్నాము. కానీ మన ముందటి తరం వారు లేకుంటే, మొదటి విషయం, మనం అసలు ఇక్కడ ఉండే వాళ్లమే కాదు. రెండోది, వారి తోడ్పాటు లేకుంటే, ఈ రోజు మనకి ఉన్నవన్నీ ఉండేవి కాదు. కాబట్టి అవన్నీ ఊరికే వచ్చేసాయని అనుకోకుండా, వారందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది. దీనిని మనం మన మృతులైన తల్లి దండ్రులకు ఆతిధ్యాన్ని అందించే కార్యక్రమంగా జరుపుకుంటాం. కానీ నిజానికి ఇది మన కంటే ముందు నివసించిన మన ప్రాచీనులందరికీ మన కృతజ్ఞతా భావనను తెలుపడం. 

ఈ సమయంలో, భారత భూభాగంలో, కొత్త పంటలు కాపుకొస్తాయి. కాబట్టి, ప్రజలందరూ దసరా నవరాత్రులు, విజయదశమి ఇంకా దీపావళి లాంటి పండుగలు జరుపుకోవడం ప్రారంభించడానికి ముందే, మొట్ట మొదటి పంటను, పితరులపై తమకున్న గౌరవానికీ, ఇంకా కృతజ్ఞతా భావనకూ ప్రతీకగా, పిండం రూపంలో వారికి సమర్పిస్తారు.

సంపాదకుని గమనిక: కాల భైరవ శాంతి అనేది లింగ భైరవి ఆలయములో మహాలయ అమావాస్య నాడు జరుపబడే ఒక వార్షిక ప్రక్రియ. ఇది చనిపోయిన పితరుల లేదా బంధువుల శ్రేయస్సు కోసం చేయబడుతుంది. ఈ సంవత్సరం మహాలయ అమావాస్య సెప్టెంబరు 25, 2022 న వస్తుంది. ఈ ప్రక్రియకు, చనిపోయిన బంధువు(ల) ఫోటో, పేరు, పుట్టిన తేదీ, ఇంకా చనిపోయిన తేదీ అవసరమౌతాయి. ఒకవేళ పుట్టిన తేదీ కచ్చితంగా తెలియకపోతే, పుట్టిన సంవత్సరము తెలుపండి. అదీ తెలియకపోతే, తల్లిదండ్రులు ఇద్దరి పేర్లూ అవసరం. శాంతి ప్రక్రియ కోసం రాబోయే పది సంత్సరాలకు ఒకేసారి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పత్రాన్ని, ఇక్కడ సబ్మిట్ చేయండి. తమిళనాడులోని అన్ని ప్రాంతీయ కేంద్రాలలో రిజిస్టర్ చేసుకోవచ్చు. 

కాలం చేసిన మీ బంధువుల కోసం కాలభైరవి శాంతి ప్రక్రియను నిర్వహించడానికి, దయచేసి  info@lingabhairavi.org కు ఇమెయిల్ చేయండి, +91 83000 83111ని సంప్రదించండి, లేదా వివరాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మహాలయ అమావాస్య నాడు, మీ పూర్వీకుల గౌరవార్థం, ఆశ్రమంలోని ఆధ్యాత్మిక అన్వేషకులకు ఆహారాన్ని అందించే అన్నదానం అనే పవిత్రమైన సమర్పణ చేయండి. మరిన్ని వివరాల కోసం, దయచేసి సంప్రదించండి: 844 844 7707.