ప్రశ్న: సద్గురు, అమావాస్య ప్రాముఖ్యత ఏమిటి?

అమావాస్య అర్థం 

సద్గురు : అమావాస్య అంటే చందమామ కనపడని రోజు. ఎవరైనా లేదా ఏదైనా లేనప్పుడు, అలా లేకపోవడం వల్ల, వారి ఉనికి శక్తివంతమవుతుంది. మీ స్నేహితుడో లేక ప్రియమైనవారు ఎవరైనా మీతో ఉన్నప్పుడు, వారున్నట్లు అంతగా అనుభూతి చెందరు. కానీ వారు లేని మరుక్షణం, వారి ఉనికి బలంగా అనుభూతి చెందుతారు. కాదంటారా? భావపరంగా కూడా ఇది నిజమే. నిజంగా, వారు ఉన్నప్పుడు వారి ఉనికిని మీరు అనుభూతి చెందరు. వారు లేనప్పుడే, వారు ఏర్పర్చిన ఖాళీ, వారి ఉనికి కంటే గాఢంగా ఉంటుంది. అలాగే చందమామ - తన గైర్హాజరు, తన ఉనికిని మునుపెన్నడూ లేనంతగా కలుగజేస్తుంది. వేరే రోజుల్లో, పౌర్ణమి రోజు కూడా, తాను ఉంటుంది; కానీ అమావాస్య రోజు మాత్రం తన ఉనికి, ఆ గుణం మరింతగా తెలుస్తుంది. 

భూమి, అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది; భూమిపై జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే జీవం ఏకీకరణం ఈ రోజున బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కొంత వేగం తగ్గుతుందో, అప్పుడే మీరు మీ శరీరాన్ని గమనిస్తారు. అంతా సవ్యంగా జరుగుతున్నప్పుడు, మీరు తీరిక లేకుండా ఉన్నప్పుడు, మీ శరీరానికి ఏమి జరుగుతుందో మీకు తెలీదు. కానీ, చిన్న వ్యాధి ఏదైనా వచ్చిందంటే, అకస్మాత్తుగా శరీరం ఒక సమస్యగా మారి, మీరు దాని పట్ల శ్రద్ధ వహించాల్సి వస్తుంది. అది సరిగ్గా లేనప్పుడే– “ఇది నేను కాదు. నాకు సమస్యలు ఇస్తున్న ఇది నా శరీరం మాత్రమే”. అని చాలా స్పష్టంగా ఒక దూరం కనిపిస్తుంది.

ఇదే అమావాస్య ప్రాముఖ్యత. ఆ రోజున, ఒక రకమైన పంచభూతాల ఏకీకరణం జరుగుతుంది. కావున అన్నీ కాస్త నెమ్మదిస్తాయి. మీరు శ్రేయస్సు కావాలనుకుంటే, పౌర్ణమి పవిత్రమైనది. మీరు మోక్షం కావాలనుకుంటే, అమావాస్య పవిత్రమైనది. అందుకు తగినట్లుగానే, ఈ రెండు పార్శ్వాలకు, వివిధ రకాల అభ్యాసాలు, సాధనలు, ఉన్నాయి. “ఏది నేను? ఏది నేను కాదు?” అనేది సులభంగా తెలుసుకోగలిగే రోజు ఇది. ఇక అక్కడ నుంచి, అసత్యం నుండి సత్యం వైపుకి ప్రయాణం మొదలవుతుంది. అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రతి నెల సహజంగానే ఒక అవకాశం కల్పించబడింది. పూర్తిగా ఎరుకలో లేని వారికి కూడా, ప్రతి అమావాస్య మొదలుకొని, సహజంగానే ఒక అవకాశం ఉంటుంది. 

పౌర్ణమి గుణం ఈడ నాడి లేదా స్త్రీత్వానికి సంబంధిచింది. అమావాస్య చాలా మోటుగా ఉంటుంది. అమావాస్య ముందు రోజుని శివరాత్రి అంటాము – ఎందుకంటే అది శివుని రాత్రి. అది ఆదిమమైనది. ఎప్పుడైతే మొత్తం చిమ్మ చీకటిగా ఉంటుందో, అప్పుడు సృష్టి మొత్తం నిర్వీర్యం అయిపోయినట్టు ఉంటుంది. అమావాస్యలో కొంత లయకారుడి ఛాయ ఉంటుంది. మామూలుగా, అమావాస్య రోజున స్త్రీ శక్తి, ఒక రకమైన భయం వల్ల గందరగోళం చెందడమో లేక పురుషుడి లాగా కఠోరంగా మార్పు చెందడమో జరుగుతుంది. 

స్త్రీ శక్తికి పౌర్ణమి అనుకూలమైనది. కావున, మహిళలు పౌర్ణమిని ఉపయోగించుకుంటారు. కానీ, మోక్షం కోరుకునే ఒక పురుషుడికి, పౌర్ణమి అంత మంచిది కాదు. అతడు ఒకవేళ శ్రేయస్సు కోరుకుంటే, పౌర్ణమిని ఉపయోగించుకోవచ్చు. కానీ, మోక్షం కోరుకుంటే మాత్రం అమావాస్య మంచిది. పూర్తిగా విముక్తి కోరుకునే వారందరికీ అమావాస్య అద్భుతమైంది. 

మానసికంగా నిలకడలేని వారు, అమావాస్య లేదా పౌర్ణమి రోజున మరింతగా సమతుల్యం కోల్పోతారన్న సంగతి మీరు వినే ఉంటారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఇలా జరుగుతుంది. కావున, ఈ శక్తి అన్నింటినీ పైకి లాగుతుంది. సముద్రాలన్నీ ఎగిసే ప్రయత్నం చేస్తున్నాయి. అదే విధంగా, మీలో ఉన్న రక్తం కూడా చంద్రుని ఆకర్షణకి ఎగిసేందుకు ప్రయత్నిస్తుంది. దీనివల్ల, మానసికంగా మీరు కొంచెం నిలకడగా లేకపోతే, ఆ రోజున మీ మెదడులో అతిగా ప్రవహిస్తున్న రక్తం కారణంగా, మీరు మరింతగా సమతుల్యాన్ని కోల్పోతారు. మీరు సంతోషంగా ఉంటే, మరింత సంతోషంగా మారతారు; బాధగా ఉంటే, మరింత బాధపడతారు. ఆ రోజుల్లో, రక్తం పైకి ప్రవహించడం వల్ల, మీ గుణం ఏదైతే అది మరింత మెరుగుపడుతుంది. అంటే, ఎదో రకంగా పూర్తి శక్తి పైకి లాగబడుతుంది. తన శక్తుల్ని పైకి కదిలించాలి అని ఎప్పుడూ అనుకునే ఆధ్యాత్మిక సాధకుడికి, ఈ రెండు రోజులు ప్రకృతి ప్రసాదించిన వరం లాంటివి.