ఈరోజు మనం ఎటువంటి సంస్కృతిలో జీవిస్తున్నామంటే, మీరు జీవితాంతం  కేవలం ఒకే భాగస్వామితో ఉండాల్సిన అవసరం లేదు. చాలా మార్పులు వచ్చాయి. అంటే, ఒక భాగస్వామితో కొంత కాలమే ఉంటున్నారు.  మీరు సంబంధాలు ఏర్పరచుకున్నప్పుడు అవి శాశ్వతమని అనుకొని ఉంటారు, కానీ మూడు నెలలకే, “అయ్యో, ఇతనితో ఎందుకు ఉన్నాను రా  భగవంతుడా ?” అనుకుంటారు. ఎందుకంటే అవి మీ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా మారుతుంటాయి, అందువల్లే అవి నిత్యం తారుమారు అవుతుంటాయి. అవి దెబ్బతిని అస్థిరంగా మారినప్పుడు, అనవసరంగా మీరు ఎంతో బాధని, క్షోభని అనుభవించాల్సి ఉంటుంది. మీరు ప్రేమలో పడడం మళ్ళీ దాని నుండి బయటకు రావడం అనేది చాలా మందితో  తరచుగా చేస్తుంటే, కొన్ని రోజులకి మీరు పూర్తిగా ముభావంగా(numb) తయారవుతారు. "రుణానుబంధం" అనే కర్మ ఏర్పడుతుంది. దాని కారణంగా మీరు ఎవ్వరిని ఇష్టపడరు.

కర్మలోని ఒక అంశమే రుణానుబంధం. ఇది ఒక నిర్దిష్టమైన కర్మ సంబంధిత నిర్మాణం. ఎప్పుడైనా మనుషుల మధ్య కలయిక జరిగినప్పుడు కానీ, ఒక వ్యక్తితో మనం మసిలినప్పుడు కానీ రుణానుబంధం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా రెండు శరీరాలు దగ్గరైనప్పుడు గాఢమైన రుణానుబంధం ఏర్పడుతుంది. శరీరంలో అది ఒక రకమైన రికార్డింగ్ వంటిది. జరిగినవన్నీ శరీరం రికార్డ్ చేస్తుంది. ఒకవేళ వేరే శరీరంతో దగ్గరవ్వడం జరిగితే, అక్కడ ఉండే ఆ శక్తిని గుర్తుపెట్టుకుంటుంది.

శరీరం గుర్తుపెట్టుకుంటుంది కనుక, ఒకవేళ చాలా మంది భాగస్వాములు ఉంటే అది మెల్లిగా కొంత కాలానికి గందరగోళానికి గురవుతుంది. ఈ గందరగోళం మీ జీవితంలో కొన్ని లక్షల మార్గాల్లో బయటపడవచ్చు. మీ మనసు గందరగోళానికి గురైతే మీరు ఏదో విధంగా దానితో జీవించేస్తున్నారు, కానీ మీ శరీరం గందరగోళానికి గురైతే మీరు పెద్ద సమస్యలో చిక్కుకుపోయినట్టే.

చాలా రకాలుగా, ఇప్పుడున్న ఆందోళన,అభద్రతా భావం ఇంకా దుఃఖానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మన శరీరాలు గందరగోళానికి గురవుతుండడం. కొంత కాలానికి, ఏ కారణం లేకుండానే మీరు వెర్రితనంలోకి వెళ్ళిపోగలరు. శరీరమే గందరగోళంలో ఉన్నందున మనుషులు ఎటువంటి కారణం లేకుండానే వెర్రితనంలోకి వెళ్ళిపోతారు.

మొదటి విషయం, చాలా మందితో శారీరక సంబంధాల వల్ల శరీరం గందరగోళానికి గురవుతుంది. మీరు తీసుకునే ఆహరం మరొక విషయం. ప్రజలు కొంచెం ఎక్కువ ధనం సంపాదిస్తే చాలు, ఒక భోజనంలోనే అన్నింటినీ తినేయాలనే భావనలో ఉంటారు. భారతదేశంలో సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు ఎప్పుడూ తమ భోజనంలో రెండు మూడు రకాల కన్నా ఎక్కువ  తీసుకునే వారు కాదు, ఆ మూడూ ఒకదానితో మరొకటి సరిపోయేవి, సరిపోని పదార్థాలు తీసుకునే వారు కాదు. మా ఇళ్ళల్లో తమ శరీరాలను మనుషులు ఎంత చక్కగా అర్థం చేసుకునేవారంటే , కూరగాయని బట్టి దానిని వండే పద్ధతిని నిర్ణయించే విధంగా అలవరుచుకున్నారు. ఒకవేళ ఏదైనా కూరగాయని వండారంటే దానికి సరిపోని మరొక కూరగాయని ఆ రోజు వండరు. అలా వండితే శరీరం గందరగోళానికి గురవుతుందనే విషయాన్ని వారు గ్రహించారు.

మా చిన్నప్పుడైతే బజారులో కూరగాయలను ఎలా ఎంచుకోవాలి అనే విషయాన్ని మాకు నేర్పారు. ఈ కాలంలో అలా నేర్పడం లేదు. "ఈ కాయగూరని కొంటే, అది కొనకూడదు, ఎందుకంటే రెండు రోజుల వ్యవధిలో  ఈ రెండిటిని తినకూడదు. ఇది తింటే, అది తినకూడదు,” అని చెప్పేవారు. శరీరం గందరగోళానికి గురవుతుందనే విషయం వాళ్లకు తెలుసు. ఒక్కసారి శరీరం గందరగోళానికి గురైతే, మీరు  చాలా విధాలుగా అదుపు తప్పినట్టే. ఈ అవగాహన ఎప్పుడూ ఉండేది.

ఈ రోజుల్లో ఏదైనా పెద్ద విందుకి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే వాటిని చాలా మూర్ఖంగా నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక విందులో, వారు 270 రకాల ఆహార పదార్థాలను పెట్టామని ఎవరో చాలా గర్వంగా చెప్పుకొచ్చారు. అందరూ అన్నీ కొంచెం కొంచెం తింటున్నారు. ఇలాంటి రకమైన ఆహరం వల్ల శరీరం గందరగోళానికి గురవుతుంది.

కనుక ముఖ్యంగా ఈ రెండు విషయాలను మనం గ్రహించాలి - సరైన విధంగా ఆహారాన్ని తీసుకోకపోవడం ఇంకా చాలా శరీరాలతో కలయికల కారణంగానే శరీరంలో గందరగోళం ఏర్పడుతుంది. అది కొంత కాలానికి ఇబ్బందిగా మారుతుంది. "నేను ఏదైనా పాపం చేశానా? ఇది నాకు ఏదైనా శిక్షా?" అంటే ఇది ఆ స్థాయిలోనిది కాదు. ప్రతీ చర్యకి ఒక పర్యవసానం ఉంటుంది. ఇది నైతికతకి సంబంధించినది కాదు. ఇది ఒక జీవిత ప్రక్రియ. మీ మనసుతో కొన్ని పనులను చేస్తే కొన్ని పర్యవసానాలు కలుగుతాయి. అలాగే మీ శరీరంతో కొన్ని పనులను చేస్తే కొన్ని పర్యవసానాలు కలుగుతాయి.

ఇలాంటి విషయాలను లోతుగా అర్థం చేసుకొని జీవితాన్ని వాటికి అనుగుణంగా ఓ నిర్దిష్ట పద్ధతిలో తీర్చిదిద్దారు. ఇప్పుడు స్వేచ్ఛ పేరుతో ప్రతి దాన్ని కూలగొట్టి, క్షోభ కొనితెచ్చి పెట్టుకుంటున్నాం. బహుశా మరో కొన్ని వందల సంవత్సరాల తర్వాత మాత్రమే, మనం ఈ జీవనశైలి సరైంది కాదని గ్రహిస్తామేమో.