ప్రశ్న 1: సద్గురు, ఒక వైద్యుడు తన రోగిని చూసే సమయంలో ఎలాంటి మానసిక ధోరణి కలిగి ఉండాలి? 

సద్గురు: మీరు ఈ ప్రపంచానికి తల్లిలా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, వాళ్ళు చిన్న పిల్లల్లాగా అవుతారు. ఇతర చోట్ల అతను గొప్ప మనిషి అయి ఉండవచ్చు, కానీ అనారోగ్యానికి గురైనప్పుడు, అతను దాదాపు చిన్న పిల్లాడిలా అయిపోతాడు. వాళ్ళు అలా అయినప్పుడు, మీరు ఒక తల్లిలా చూసుకోవాలి. ఇందుకు వేరే మార్గమేమీ లేదు. 

ప్రశ్న 2: పేషెంట్లు ఏమి అనుభవిస్తున్నారో నేను ఎలా అర్థం చేసుకోవాలి?

సద్గురు: ఒక ప్రత్యేక వ్యాధి గురించి మీకున్న వైద్య పరిజ్ఞానం, ఆ వ్యక్తి యొక్క గుండె పనితీరు ఎలా ఉందో తెలియజేయవచ్చు. రిపోర్టులు కూడా గుండె, కాలేయం లేదా పిత్తాశయం స్థితిని చెప్పి ఉండవచ్చు. కానీ అందరూ అదే సమస్యను ఒకే విధంగా అనుభూతి చెందరు. ఒకరికి అదే సమస్య చాలా తక్కువ బాధను కలిగించవచ్చు, మరొకరికి అది చాలా ఎక్కువ బాధను కలిగించవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. మీరు చేసే పరీక్షలు, ఎంఆర్ఐలు లేదా ఇతర వాటి నుంచి సేకరించిన డేటా ద్వారా దీన్ని నిర్ణయించలేరు. కాబట్టి రోగిని ప్రత్యక్షంగా చూసి, వారి స్థితిని అర్థం చేసుకోవడం, కొంతమేర సహానుభూతితో వారి లోపల ఏం జరుగుతుందో గ్రహించే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం.

ఒక డాక్టర్ తనలో ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే — అంటే రోగి అనుభవించే దానితో కనెక్ట్ అయ్యి, ఆ శరీరాన్ని తన శరీరంగా భావించి, చికిత్స చేస్తే — అది నిజంగా అద్భుతంగా ఉంటుంది.

మానవ శరీరం అలాగే మానవ వ్యవస్థ పనిచేసే తీరు పూర్తిగా యంత్రం లాంటిది కాదు. యంత్రంలో ఒక భాగాన్ని మరొక దానితో అమర్చితే, అంతా సవ్యంగా పనిచేస్తుంది. కానీ మానవ శరీరం అలా కాదు. ఈ మానవ వ్యవస్థను ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. మనం భాగాల స్థాయిలో మాత్రమే జోక్యం చేసుకోగలుగుతున్నాం. వైద్య వృత్తి ఎన్నో అద్భుతమైన విషయాలు చేస్తున్నా, అవి పరిమితమైన అద్భుతాలే. నేను వైద్య విద్యను లేదా వైద్య వృత్తిని తక్కువ చేయాలనుకోవడం లేదు. వారు అద్భుతమైన పని చేస్తున్నారు, కానీ వారు మనలోని జీవాన్ని సృష్టించలేరు. వారు తాము చేయగలిగినదాన్ని అత్యుత్తమంగా చేస్తున్నారు. అయినప్పటికీ, 'ఇక్కడ నిజంగా ఏం జరుగుతోంది' అన్నదాన్ని పూర్తిగా తెలుసుకోవడం సాధ్యపడదు. ఎందుకంటే ఒకే రిపోర్టులు, ఒకే పరిస్థితులున్న ఇద్దరి రోగుల అనుభవం చాలా చాలా వేర్వేరుగా ఉంటుంది.

ఒక డాక్టర్ తనలో ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే — అంటే రోగి అనుభవించే దానితో కనెక్ట్ అయ్యి, ఆ శరీరాన్ని తన శరీరంగా భావించి, చికిత్స చేస్తే — అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇది భావోద్వేగానికి లోను కావడం గురించో లేదా సానుభూతి చూపించడం గురించో కాదు. రోగుల పట్ల మీరు భావోద్వేగానికి లోనైతే, ఏం చేయాలన్నదానిపై మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. మీ భావోద్వేగం వల్ల రోగి కొంత ఓదార్పును పొందవచ్చు, కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. కేవలం వారికి బాగుందని అనిపించేలా చేయడం వల్ల ప్రయోజనం లేదు, వారి సమస్యకు పరిష్కారం కావాలి. కానీ మీరు వారి పట్ల కొంత ‘యోగా’ తో ఉంటే – యోగా అంటే మీరు స్పృశించే ప్రతివ్యక్తితో ఎంతోకొంత ఐక్యమవడం – అప్పుడు లోతైన అనుసంధానం ఏర్పడుతుంది. అప్పుడు పరిష్కారం కూడా సులభమవుతుంది, అలాగే రోగికి ఓదార్పు కూడా లభిస్తుంది

ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రధానంగా రోగి సౌకర్యవంతంగా ఉండడం అవసరం. వాళ్ళు డాక్టర్‍తో రిలాక్స్డ్‌గా ఉండగలగాలి, అప్పుడే డాక్టర్ అందించే దాన్ని సరిగ్గా స్వీకరించగలగతాడు. నేడు మనం చికిత్సను కేవలం కెమికల్స్‌ లేదా శస్త్రచికిత్సలతో కూడుకున్నదిగా మాత్రమే చూస్తున్నాం. కానీ ఔషదాలు లేదా ఆపరేషన్‌తో నిమిత్తం లేని లోతైన మానవ సంబంధపూరితమైన పార్శ్వాలు ఉన్నాయి. మనం నడిచే నేలతో, మనం పీల్చే గాలితో, తాగే నీటితో మనకు సంబంధం ఉన్నట్టే, మన ముందు ఉన్న మరొక శరీరంతో కూడా ఓ ప్రత్యేక అనుసంధానం ఉంటుంది. డాక్టర్‌కున్న పరిజ్ఞానం మరింత సమర్థవంతంగా ఉపయోగపడటానికి, రోగితో లోతైన అనుసంధానం ఉంటే అది ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ అనుసంధానం అనేది ఎలాంటి భావోద్వేగ నాటకీయత లేకుండా వస్తే, అది డాక్టర్‌కైనా, రోగికైనా ఎంతో సంతృప్తికరంగా, గౌరవప్రదంగా ఉంటుంది. 

ప్రశ్న 3: డాక్టర్‌‍కీ, హీలర్‌‍కీ మధ్య ఉన్న తేడా ఏమిటి? నేను నా రోగితో ఉన్నప్పుడు, ఎలా ఒక హీలింగ్ ప్రెజెన్స్‌గా మారగలను?

సద్గురు: ఇప్పుడు ఇండియాలో ఒక జోక్ బాగా ప్రచారంలో ఉంది. తమకు తాము హీలర్స్‌ అని చెప్పుకునే కొంతమంది, లాక్‌డౌన్‌ వల్ల చాలా నిరాశతో ఉన్నారు. వారు ఎదురు చూస్తున్నారు, "ఈ లాక్‌డౌన్ తొలగించండి! ఈ మహమ్మారి పోయాక, మేం అందరినీ నయం చేస్తాం!" అని. నిజంగా నువ్వు హీలర్ అయితే, ఇదే సరైన సమయం కదా చేయడానికి! ఎంతోమంది అనారోగ్యం పాలై ఉన్నారు, కానీ వారు మహమ్మారి వెళ్ళిపోయేందుకు ఎదురు చూస్తున్నారు.

మీరు డాక్టర్‌ అయ్యారు అంటే అది గొప్ప విషయం. కానీ మీరు హీలర్‌ కాకపోయినందుకు నాకు సంతోషంగా ఉంది. “హీల్‌” అనే పదం చెడ్డ పదేమేమీ కాదు, కానీ కొందరి చేత అది తప్పుగా వాడబడింది. చాలామంది “మిరాకిల్‌ హీలర్స్‌” అన్ని రకాల వింత పనుల్ని చేస్తున్నారు.

మీరు ఆసుపత్రిలో డాక్టర్‌గా మాత్రమే ఉన్నందుకు సంతోషం. మీరెప్పుడూ మీకు మీరే హీలర్‌ అని చెప్పుకోవద్దు. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, మీ ప్రావీణ్యం మరియు నైపుణ్యాలు, అంతేకానీ మీ దయ కాదు. అయితే రెండు ప్రాణుల మధ్య అనుసంధానం అనేది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని ఎవరూ నిరాకరించలేరు. ఆ అనుసంధానంలో, మీ నైపుణ్యాలు, మీ ప్రావీణ్యం, అలాగే మీరు ఇచ్చే వైద్యాన్ని రోగి స్వీకరించగల సామర్థ్యం — ఇవన్నీ మరింత మెరుగవుతాయి. దాంతో అందరికీ మెరుగైన ఫలితాలు వస్తాయి. 

ప్రశ్న 4: మహమ్మారి తర్వాత తదుపరి దశ కోసం మన శక్తుల్ని మళ్లించుకొని, మళ్ళీ అందరినీ ఆరోగ్యవంతుల్ని చేసే ప్రక్రియను ఎలా ప్రారంభించాలి?

సద్గురు:  ఇది నిజంగా అద్భుతమైన విషయం. వైద్యులు కేవలం వైద్య కోణంలో కాకుండా, మానవీయ కోణంలో కూడా దీనిని చూస్తున్నారు. ఆసుపత్రిలో తమ ఆత్మీయులు బందీలై పోయి, వారిని కలుసుకునే అవకాశం కూడా లేకపోవడమనేది కుటుంబ సభ్యులను భయంకరమైన ఆందోళనకు గురిచేస్తుంది, వారు బతుకుతారా చనిపోతారా అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు.

డాక్టర్లు ఈ అవసరాన్ని గుర్తించి స్పందించారంటే అది నిజంగా గొప్ప విషయం. అయితే మనం దీని నుండి ఒక అర్థాన్ని పొందగలమా? అంతా ఓకే అని మనల్ని మనం సరిపుచ్చుకోగలమా? జీవితం అలా పని చేయదు. ఈ వైరస్ ఇంకా దాని చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న చర్చలు, మరణాన్ని మన కళ్ళెదుటకు తెచ్చిపెట్టింది. ఎవ్వరూ దాన్ని తప్పించుకోలేరు. మన జీవితాలను ఎలా గడపాలి అన్న విషయాన్ని ఆలోచించడానికి దీన్ని ఒక కనువిప్పుగా ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది. మనం ఈ ప్రపంచంలో భిన్నంగా ఏం చేయాలి? మనలో అలాగే మన చుట్టూ ఎలాంటి మార్పులను తేవాలి? మన మానవత్వం విలువ ఇప్పుడు అత్యంత ప్రధానమైనది కావాలి.

మనషులు మాత్రమే — ఎందుకంటే మన బుద్ధి వికసించింది, మన చైతన్యం ఓ స్థాయికి చేరుకుంది — అడ్డంకుల్ని తొలగించుకొని, విస్తరించాలనుకుంటూ ఉంటారు.

ఈ భూమ్మీదున్న మిగతా ప్రాణులన్నీ, వాటి సహజ స్వభావానికి అనుగుణంగా, తమ చుట్టూ సరిహద్దుల్ని నిర్మించుకుంటూ ఉంటాయి. అవి ఒక సురక్షిత పరిధిలోనే జీవించాలని పరితపిస్తూ ఉంటాయి. మనషులు మాత్రమే — ఎందుకంటే మన బుద్ధి వికసించింది, మన చైతన్యం ఓ స్థాయికి చేరుకుంది — అడ్డంకుల్ని తొలగించుకొని, విస్తరించాలనుకుంటూ ఉంటారు. ఇది ఈ భూమ్మీద కేవలం మనుషులకు మాత్రమే ప్రత్యేకం.

మన సరిహద్దులను విస్తరించుకోవడం అంటే అక్కున చేర్చుకోవడం. అక్కున చేర్చుకోవడం అనేది ఎవరో మన నేర్పినది కాదు. ఇది ప్రతి మనిషిలో సహజంగా ఉంటుంది. ప్రతి మనిషి — అతని జీవితం ఏ స్థితిలో ఉన్నా — మరింత గొప్ప అనుభూతిని కోరుకుంటూ ఉంటాడు. అది గ్రేడ్‌లు కావొచ్చు, ధనం కావొచ్చు, జ్ఞానం కావొచ్చు, అధికారమో ప్రేమో, కీర్తినో కావొచ్చు — కానీ నిజానికి వీటన్నిటి వెనక ఉన్న తపన, "ప్రస్తుతం ఉన్నదాని కంటే జీవితాన్ని మరింత గొప్పగా అనుభూతి చెందాలి" అన్నదే. ఇవన్నీ చిన్నచిన్న విస్తరణ చర్యలు మాత్రమే. ఇప్పుడు మరణం మన కళ్ల ఎదుటే నిలబడిన ఈ సమయంలో, మనం నిజంగా విస్తరించాలనుకుంటే, మన గోడలను చెరిపేయాలనుకుంటే — ఇదే సరైన సమయం. ఇది ఓదార్పు కోసం కాదు, జ్ఞానోదయాన్ని పొందడానికి సరైన సమయం. మన ఆత్మీయులు చనిపోయారు, ఆర్ధిక వ్యవస్థలు కూలిపోయాయి, మన జీవనశైలులు దెబ్బతిన్నాయి. కానీ ఈ మహమ్మారి నుంచి బతికి బయటపడ్డ వాళ్ళంతా గుర్తుంచుకోవలసింది ఒక్కటే — "మనమందరం మానవులం" అన్న నిజం. అంటే మనం ఎలాంటి విభజనలు లేకుండా, ఐక్యతతో జీవించగల సామర్థ్యం ఉన్నవాళ్ళం అని. 

ప్రశ్న 5: కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం, అలాగే వాటి వల్ల అవాంఛనీయమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, డాక్టర్లు ఆ మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?

సద్గురు: దురదృష్టవశాత్తు ఇలాంటి సమయాల్లో మనలో చాలామంది, అనుకోని నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ నిర్ణయాలు ఆర్థిక లేదా వ్యాపార ప్రయోజనాల ఆధారంగా కాకుండా, మానవత్వాన్ని ఆధారంగా చేసుకొని తీసుకోవడం చాలా ముఖ్యం. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా, వాటిని సున్నితమైన హృదయంతో తీసుకోవాలి - అవసరమైనంత మేరకు మాత్రమే, ఎక్కువ కాదు, తక్కువ కాదు.

మనకున్న మేధస్సు ఇంకా శక్తి సామర్థ్యాలను బట్టే మనం నిర్ణయాలు తీసుకోగలం, కానీ అవి మన మానవత్వంలోంచి వచ్చేలా చూసుకోవడం ఉత్తమం..

"సరైన నిర్ణయం" అంటూ ఏమీ ఉండదు. మన వల్ల కొంతమంది వైరస్ బారిన పడవచ్చు, కొంతమంది చనిపోవచ్చు, బతకాల్సిన వాళ్ళు చనిపోవచ్చు, చనిపోతారు అనుకున్న వాళ్ళు బతకవచ్చు— ఇవన్నీ సాధ్యమే.

ఏ పరిస్థితిలోనైనా పూర్తిగా సరైన నిర్ణయం ఎవరూ తీసుకోలేరు. మనకున్న మేధస్సు ఇంకా శక్తి సామర్థ్యాలను బట్టే మనం నిర్ణయాలు తీసుకోగలం, కానీ అవి మన మానవత్వంలోంచి వచ్చేలా చూసుకోవడం ఉత్తమం. ముందుకు వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం. ఏది సరైన నిర్ణయమో మనకు తెలీదు, కానీ మనం ఎప్పుడూ ఉత్తమమైనదే చేయాలి, దానికంటే తక్కువది చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకొని ఉండాలి.