జీవితాన్ని మరింత గాఢంగా అనుభూతి చెందడం
కృష్ణుని జీవితంలోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ, ఆధ్యాత్మిక మార్గంలో అనుగ్రహం, కర్మ ఇంకా ఒకరి జీవితపు స్వభావం గురించి సద్గురు వివరిస్తారు.
కృష్ణుని జీవితంలోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ, ఆధ్యాత్మిక మార్గంలో అనుగ్రహం, కర్మ ఇంకా ఒకరి జీవితపు స్వభావం గురించి సద్గురు వివరిస్తారు.
ప్రశ్న: సద్గురు, కృష్ణుడు స్వయంగా దేవుడే అయితే, ఆయన భక్తులు అన్ని కష్టాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది? నా విషయానికొస్తే, మిమ్మల్ని చూసే వరకు నా జీవితం అందరూ ఈర్ష్య పడేలా బాగుండేది. ఇప్పుడు కూడా ప్రజలు నా జీవితాన్ని చూసి ఈర్ష్య పడుతున్నారు, కానీ వేరే కారణం వల్ల. నిజానికి, నా జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్‍లాగా అయిపోయింది. జీవితాన్ని సులువుగా చేయడం గురించి కాకపోతే, అనుగ్రహం దేని గురించి?
సద్గురు: తెలుసా, బలరాముడు కూడా కృష్ణున్ని ఇలాంటి ప్రశ్నే అడిగాడు. వాళ్ళు మథురను వదిలి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సరిగ్గా తినడానికి, విశ్రాంతి తీసుకోవడానికి కూడా తీరిక లేకుండా అడవుల్లో నడుస్తున్నప్పుడు, "నువ్వు మాతో ఉన్నప్పటికీ, మనకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి?" అని. దానికి కృష్ణుడి ఏం చెప్పాడంటే, "జీవితం గొప్ప స్థాయిలో జరుగుతున్నప్పుడు, ఫిర్యాదులు చేయకు" అన్నాడు. కొన్ని సందర్భాలను మంచివిగా, మరికొన్నిటిని చెడుగా, లేదా కొన్నిటిని అనుకూలమైనవిగా, మరికొన్నిటిని ప్రతికూలమైనవిగా చూస్తున్నారు కాబట్టి, జీవితాన్ని జీవితంగా చూడకుండా, ఇవన్నీ మనకెందుకు జరుగుతున్నాయని ప్రశ్నించుకుంటున్నారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టగానే, జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉన్నట్లుగా, చాలా గొప్ప స్థాయిలో జరుగుతుంది. ఒకదాన్ని మంచిదిగా, ఇంకోదాన్ని చెడుగా చూడకుండా ఉంటే, మీకే అర్థమవుతుంది- జీవితం ఎంతో తీక్షణతతో జరుగుతోంది అని. మంచి-చెడు అనేవి లేవు. జీవితం జరుగుతోంది అంతే. కొంతమంది దాన్ని ఆనందిస్తారు, కొంతమంది బాధపడతారు.
మనం చేయగలిగిందల్లా, ప్రతి ఒక్కరూ దాన్ని ఆనందించేలా చూడటమే. మౌలికంగా చూస్తే, ఈ భూమ్మీద జరిగే సంఘటనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదు. ఒకవేళ మన మీద పిడుగు పడి మనందరం కాలి బూడిద అయిపోయినా, నేను దాన్ని విషాదంగా భావించను, అది కేవలం ఒక సంఘటన అంతే. "మరి ఈశా ఫౌండేషన్ సంగతి ఏమిటి? నా కుటుంబం, నా పిల్లల సంగతి ఏమిటి?" అంటారా, వాళ్ళందరికీ కూడా జీవితం గొప్ప స్థాయిలో జరుగుతుంది, ఎందుకంటే మనం ఒక్కసారిగా మాయమైపోయాం కాబట్టి. మంచి చెడుల గుర్తింపుకు అతీతంగా దీన్ని చూడండి. జీవితం ఎంతో తీక్షణంగా జరుగుతోంది - అంతే.
మీరు ఆధ్యాత్మికత వైపు వెళ్లాలనుకున్నప్పుడు, సహజంగానే జీవితాన్ని మరింత గాఢంగా అనుభూతి చెందాలనుకుంటున్నారని. నిజానికి, జీవితంలో మీరు ఏం చేస్తున్నా సరే, అది జీవితాన్ని మరింత గాఢంగా అనుభూతి చెందాలని చేసే ప్రయత్నమే. మీరు కేవలం పైపైన జీవిస్తున్నట్లయితే, అప్పుడు అది బహుశా ఎంతో మధురంగా ఉండొచ్చు, అయితే అది కేవలం జీవితపు పైపొర మాత్రమే. మీరు కేక్ తీసుకుని, దాని మీద ఉండే ఐసింగ్ మాత్రమే తింటూ బతికితే, కొంతకాలానికి ఆ తీపే, విషం అయిపోతుంది. మీరు "నా జీవితం చాలామంది ఈర్ష్య పడేలా ఉండేది" అని అన్నారు, కానీ అది ఎంత వెలితిగా ఉండేదో మీకు తెలుసు. కారు లేనివాళ్ళు, కారు ఉన్నవాళ్ళని చూసి వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకుంటారు. అది ఖచ్చితంగా సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా ఉంటుంది, కానీ అదేమీ గొప్ప భాగ్యం కాదు. అసలు కార్లే లేకపోతే, ఎవరూ వాటిని కోరుకునేవారు కాదు. "వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర లేదు" అని ఇతరులతో పోల్చుకోవడంలోనే సమస్య ఉంది. కారు లేనివాళ్ళు, కారు ఉన్నవాళ్ళతో తమని తాము పోల్చుకోకపోతే, నడవడం లేదా సైకిల్ తొక్కడం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీరు "నా జీవితం అందరూ ఈర్ష్య పడేలా ఉండేది " అని అన్నప్పుడు, అది మీ జీవం తాలూకు ప్రాథమిక స్థాయిని గురించిన వాక్యం కాదు, అది సమాజంలో మీ స్థితి గురించి చెప్పిన మాట.
నేను జీవితం గురించి మాట్లాడేటప్పుడు, ఉనికి, అస్తిత్వం అనే అర్థంలో మాట్లాడుతున్నాను. ఇప్పుడు, నిజమైన అర్థంలో జీవితానికి ఏమాత్రం సంబంధం లేని చాలా విషయాలను మీరు జీవితంగా భావిస్తున్నారు. దీనికి వాస్తవికతతో ఏ సంబంధం లేదు, ఇది మనసులో ఉండే ఒక భావన మాత్రమే. అన్ని బాధలూ ఈ పిచ్చి నుండే వస్తాయి.
మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, మీ ఆంతరంగిక స్థితి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన కారణం మీ ప్రారబ్ధం, అంటే ఈ జన్మకు కేటాయించబడిన కర్మ. సృష్టి చాలా కరుణతో కూడుకున్నది. మీ సంచిత కర్మ అంతా ఈ జన్మలోనే అనుభవంలోకి తీసుకొస్తే, మీరు చనిపోతారు. మీలో చాలామంది ఈ జన్మ జ్ఞాపకాలనే పక్కన పెట్టలేకున్నారు. అలాంటిది నేను మీకు వంద జన్మల జ్ఞాపకాలను గుర్తు చేస్తే, మీలో చాలామంది ఆ జ్ఞాపకాల భారాన్ని తాళలేక, ఇక్కడికిక్కడే కుప్పకూలిపోతారు. అందుకే, ప్రకృతి మీరు తట్టుకోగలిగినంత ప్రారబ్ధాన్ని మాత్రమే కేటాయిస్తూ ఉంటుంది. మీరు ప్రకృతి కేటాయించిన దాని ప్రకారం వెళ్తే, అలాగే మీరు కొత్త కర్మ ఏమీ సృష్టించడం లేదని అనుకుంటే- అది నిజం కాదనుకోండి- సరే, వంద జన్మల కర్మ తొలగిపోవాలంటే, కనీసం వంద జన్మలైనా పడుతుంది. కానీ ఈ వంద జన్మల్లో, మీరు మరో వెయ్యి జన్మలకు సరిపడా కర్మను పోగు చేసుకోగలరు.
మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, మీ గమ్యాన్ని త్వరగా చేరుకోవాలనే తొందరలో ఉంటారు. అందుకు వంద లేదా వెయ్యి జన్మలు పట్టడం మీకు ఇష్టం ఉండదు- మీరు త్వరగా చేరుకోవాలనుకుంటారు. ఆధ్యాత్మిక ప్రక్రియలోకి అడుగుపెట్టడం అంటే, జీవితాన్ని గొప్ప స్థాయిలో అనుభూతి చెందడానికి సుముఖత చూపించటం. ఒకసారి మీరు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నా ఆశీర్వాదం కూడా ఇదే - జీవితంగా పిలువబడే ప్రతిదీ మీకు జరగనివ్వండి. "ఒకవేళ చావు వస్తే?" అది కూడా చాలా మంచిదే. 75 ఏళ్ళు బ్రతికితే వచ్చేది, 35 ఏళ్ళలోనే వస్తే, అది మంచిదే కదా? ఇది కేవలం తర్కం కాదు- ఇది జీవిత సత్యం. గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఇదే: మీరు సరైన పరిస్థితులు కల్పించగలిగితే, వాళ్ళు త్వరగా గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఒక బాలయోగి, అంటే చిన్న వయసులోనే యోగి అయిన వ్యక్తి, మరియు గొప్ప భక్తి గల ఒక అమ్మాయి వివాహం గురించి ఒక అద్భుతమైన తమిళ పద్యం ఉంది. 3000 మంది ఆహ్వానితులతో, ఆ వివాహం జరుగుతోంది. వివాహం అయిన తర్వాత, ఆ బాలయోగి, అతను చాలా గొప్ప కవి కూడా, చాలా మధురమైన భక్తి పద్యాలను పాడటం మొదలుపెట్టాడు. అందరూ అతన్నే చూస్తున్నారు, అతను కోరుకున్నది కూడా అదే. అందరూ తన మీదే దృష్టి పెట్టిన ఆ క్షణాలను, అతను వాళ్ళందరినీ లయం చేయడానికి ఉపయోగించాడు- అంటే వాళ్ళంతా వివాహ మండపంలోనే శరీరాలను వదిలేశారు. కొన్ని వందల ఏళ్ళ తర్వాత, ఒక కవి ఒక పద్యంలో బాధగా ఇలా అంటాడు: "ఆ వివాహానికి వాళ్ళు నన్ను కూడా పిలిచి ఉండింటే ఎంతో బాగుండేది, నేను ఇలా కష్టపడాల్సి వచ్చేది కాదు. నేను కూడా ముక్తి పొందేవాడిని. నేను కొన్ని వందల ఏళ్ళు ఆలస్యంగా వచ్చాను. అయ్యో, నా కోసం అలాంటి వివాహం మరొకటి జరుగుతుందా?" అంటాడు.
వివాహ మండపంలో 3002 మంది చనిపోవడాన్ని అతను విషాదంగా భావించలేదు. ఆ బాలయోగి సాన్నిధ్యం వల్ల వాళ్ళంతా ఒకేసారి ముక్తి పొందడాన్ని, అతను చాలా గొప్ప అదృష్టంగా భావించాడు. ఆధ్యాత్మిక సాధకుడు ఏ సంఘటననీ, మంచి చెడులుగా చూడడు- మీకు జీవితం ఎంత తీక్షణంగా జరుగుతోందనేది మాత్రమే ముఖ్యం. మంచి చెడులు అనేవి సామాజిక అంశాలు మాత్రమే- వాటికీ జీవితానికీ ఎలాంటి సంబంధం లేదు. మీరు ఒకసారి ఒక నిర్దిష్ట పద్ధతిలో దీక్ష తీసుకున్న తర్వాత, మీరు మీ ప్రారబ్ధానికి మాత్రమే పరిమితం కారు. వంద జన్మల కర్మను ఇప్పుడే నిర్వహించాలనుకుంటే, సహజంగానే మీ జీవితం చాలా తీక్షణంగా జరుగుతుంది. మీరు సమచిత్తులై ఉంటే, మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనా, మీకు ఒక సోపానంగా మారుతుంది. మీరు ఈ విషయం గమనించకుండా, సమాజంలో జరిగే విషయాలకు ప్రభావితమైతే, జీవితం జరిగే వేగం చూసి, మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు.
పాజిటివ్ పదాలు వాడితే, వాటిని లక్షల విధాలుగా తప్పుగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మీ మనసు వాటి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందువల్లే, నేను ఉద్దేశపూర్వకంగానే నెగిటివ్ పదాలు వాడతాను, ఎందుకంటే వాటిని తప్పుగా అపార్దం చేసుకోలేరు. మీరు ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటే, దానర్ధం మిమ్మల్ని మీరు అంతం చేసుకోవాలనుకుంటున్నారు అని- ప్రస్తుతం మీరు ఉన్న విధంగా! దీన్ని పాజిటివ్‍గా చెప్పాలంటే, మీరు ముక్తిని కోరుకుంటున్నారు; మీ అసలు స్వభావాన్ని అన్వేషిస్తున్నారు; దేవుణ్ణి అన్వేషిస్తున్నారు; అపరిమితుమైన జీవిగా ఉండాలనుకుంటున్నారు. మీరు అపరిమితుమైన జీవిగా ఉండాలనుకుంటున్నప్పుడు, ప్రస్తుతం ఉన్నట్లుగా ఉండాలనుకోరు. ఒకసారి మీరు ఈ కోరికను వ్యక్తపరిచి, దానికి అవసరమైన శక్తి మీపై వెచ్చించబడిన తర్వాత, ప్రస్తుతం మీరు ఉన్న విధంగా మిమ్మల్ని అంతం చేసేలా విషయాలు జరుగుతాయి. దీనర్థం మీకు చెడు జరుగుతుందని కాదు. జీవితం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో, ఊహించనంత వేగంగా జరుగుతుంది.
మరి అనుగ్రహం అంటే ఏమిటి? ఈ సృష్టిలో, శక్తి అనేక రూపాల్లో అభివ్యక్తమవుతూ ఉంటుంది. అది సూర్యరశ్మిగా, గాలిగా, గురుత్వాకర్షణ శక్తిగా అభివ్యక్తమవుతూ ఉంటుంది- అదేవిధంగా అది అనుగ్రహంగా కూడా అభివ్యక్తమవుతూ ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తుంటుంది; గాలి మిమ్మల్ని ఎగరేసుకుని పోవాలని చూస్తూ ఉంటుంది; సూర్యుడు మిమ్మల్ని మాడ్చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు- కానీ అనుగ్రహం మిమ్మల్ని ఈ భూమి నుంచి పీకి పడేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది నెగిటివ్ పద్ధతిలో చెప్పడం. ఇదే విషయాన్ని పాజిటివ్ పరిభాషలో చెప్పాలంటే, భూమి మిమ్మల్ని కౌగిలించుకోవాలని చూస్తోంది; గాలి మిమ్మల్ని చల్లబరచాలని చూస్తోంది; సూర్యుడు మీకు వెచ్చదనాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు- అనుగ్రహం మీరు ఎదిగేలా చేయాలని ప్రయత్నిస్తోంది. మనం నెగిటివ్ పదాలతోనే వెళ్దాం, ఎందుకంటే అలాంటి పదాలతో మీరు గుర్తింపు ఏర్పరచుకోరు. అనుగ్రహం, ప్రస్తుతం మీరు చిక్కుకున్న పరిమితుల నుండి మిమ్మల్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిమితుల్లో భూమి, ప్రజలు, శరీరం, మనసు, భావోద్వేగాలు, అన్నీ ఉన్నాయి. మీరు అనుగ్రహాన్ని ఆహ్వానించి, అది తన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అది మిమ్మల్ని పైకి లాగుతున్నప్పుడు, మీరు లంగరుని వదిలేస్తే, మీకు మీరే అనవసరమైన ఇబ్బందుల్ని కొనితెచ్చి పెట్టుకుంటారు. ఆధ్యాత్మిక ప్రక్రియ వల్ల జీవితం జరుగుతోంటే, నాకు అది పరవాలేదు. అలా కాకుండా మీరు ఇబ్బంది పడుతుంటే, అందుకు ఒకే ఒక కారణం, మిమ్మల్ని పైకి లాగడానికి అనుగ్రహాన్ని ఆహ్వానించారు, కానీ లంగరుని వదిలేస్తున్నారు. అలా చేస్తే, సహజంగానే ఇబ్బంది పడతారు.
సంపాదకుని గమనిక: సద్గురు, కృష్ణుని జీవితం మరియు ఆయన మార్గాన్ని శోధిస్తారు. లీల సిరీస్‍ను వీక్షించండి, ప్రతి వారం ఒక భాగం ఉచితంగా వెబ్‌సైట్‍లో అందుబాటులో ఉంటుంది.
This article is based on an excerpt from the May 2014 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.