సద్గురు: కర్మ అనే పదం వేర్వేరు వ్యక్తుల మనసుల్లో, వేర్వేరు అర్థాలను కలిగిస్తుంది. కర్మ అంటే చర్య. ఈ చర్య అనేది అనేక స్థాయిల్లో- శారీరక, మానసిక, భావోద్వేగ మరియు శక్తి స్థాయిల్లో జరుగుతుంది. ఈ నాలుగు స్థాయిల్లో జరిగే చర్యను కర్మ అనొచ్చు. అయితే, చర్య అనేది ఈ నాలుగు స్థాయిల కంటే లోతుగా వెళితే, అప్పుడు దాన్ని క్రియ అంటాము. కాబట్టి కర్మ ఇంకా క్రియ రెండూ చర్యలే. అయితే కర్మ అనేది ఎటువంటి చర్య అంటే అది వ్యవస్థపై అవశేష ముద్రణలు లేదా ప్రభావాలు మిగులుస్తుంది. అంటే ఆ చర్య తాలూకు జ్ఞాపకాలు ఇంకా రసాయనికత అవశేషాలుగా నిలిచిపోతాయి. కానీ క్రియా అనేది పూర్తిగా వేరొక స్థాయిలో ముద్రణగా ఏర్పడి, శరీరంలో పోగు అయిన కర్మ అవశేషాలను కరిగించే చర్య.

కర్మ అనేది అనేక రకాలు, అనేక పొరలు మరియు అనేక పార్శ్వాలు కలిగి ఉంటుంది. మీ తండ్రి చేసిన పనులు మీ జీవితంలో అనేక విధాలుగా ప్రభావం చూపుతున్నాయి. అది కేవలం మీ పరిస్థితుల పైనే కాదు, మీ శరీరంలోని ప్రతి కణంపైనా ప్రభావం చూపుతున్నాయి. మీలో చాలామంది పద్దెనిమిది, ఇరవై సంవత్సరాల వయసులో తల్లిదండ్రులకి వ్యతిరేకంగా తిరగబడతారు. కానీ, నలభై, నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి అచ్చం వారిలాగే ప్రవర్తించడం మొదలుపెడతారు. వారిలాగే మాట్లాడతారు, వారిలాగే నడుచుకుంటారు. ఇది జీవితాన్ని నిస్సారంగా గడిపినట్లే. ఎందుకంటే, జీవితం ముందులాగే రిపీట్ అవుతోంది. ప్రతి తరం మునపటి తరంలానే ప్రవర్తిస్తూ, జీవిస్తూ, జీవితాన్ని అనుభూతి చెందుతున్నట్లయితే, ఆ తరం వృధా అయినట్లే.

ఈ తరం మునపటి తరం ఊహించని విధంగా జీవితాన్ని అనుభూతి చెందాలి - అది పిచ్చి పనులు చేయడం ద్వారా కాదు, జీవితాన్ని అనుభూతి చెందే విధానాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడం ద్వారా.

జీవం యొక్క మెమొరీ

కర్మ అనేది కేవలం మీది లేదా మీ పూర్వీకులది మాత్రమే కాదు. మొట్టమొదటి ఏకకణ జీవి అయిన, ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ కర్మ కూడా ఈరోజు మీలో పనిచేస్తూనే ఉంటుంది. ఒక సాధారణ మనిషి శరీరంలో సుమారు 10 ట్రిలియన్ మానవ కణాలు ఉంటాయి. కానీ, మీ శరీరంలో 100 ట్రిలియన్లకు పైగా బ్యాక్టీరియా ఉంటాయి- వాటి సంఖ్య మీ కణాల కంటే పది రెట్లు ఎక్కువ! కేవలం మీ ముఖంపై ఉన్న చర్మంపైనే 18 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటాయి! అవి కనిపించకపోవడం మంచిదే కదా?

మీలో గణనీయమైన శాతం నిజానికి బ్యాక్టీరియానే! మీ పూర్వీకుల్లో ఉన్న బ్యాక్టీరియా రకాన్ని బట్టి, మీలోని బ్యాక్టీరియా ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మీ శరీరంలో అలాగే వేరొకరి శరీరంలో ఈ బ్యాక్టీరియా ప్రవర్తన వేర్వేరుగా ఉంటుంది. ఇది ఈ మెమొరీపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, బ్యాక్టీరియాను కూడా ఒక నిర్దిష్ట గుణంతో వారసత్వంగా పొందుతారు. అవి కూడా కొంత కర్మను మోసుకొని వచ్చి, మీ జీవితపు నాణ్యతను ఏదోక విధంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, కర్మ అంటే మీరు చేసిన మంచి చెడులు కాదు. కర్మ అనేది జీవం యొక్క మెమొరీ. ఆ ఏకకణ జీవి నుండి ప్రతి జీవిలోనూ ఉన్న మెమొరీ వల్లే, మన శరీరం ఈ విధంగా నిర్మితమై ఉంది. మీ మెదడులో, మొసలి మెదడు అంత పరిమాణంలో, ఒక సరీసృప మెదడు ఉందని వైద్య శాస్త్రం నిరూపించింది. ఇప్పుడు అర్థమవుతోందా మీరు ఎందుకు అందరితో విసుక్కుంటారో?

మీరు మీ గురించి ఊహించుకున్న గొప్ప ఆలోచనలన్నీ నిజానికి అవాస్తవమే. అందుకే మేము "ఇదంతా మాయ" అని చెప్పాం. ఎందుకంటే, మీ లోపల జరిగే విషయాలు ఎలాంటివంటే, దాదాపు మీరు చేసే ప్రతి పనీ, గతం చేత నియంత్రించబడుతోంది."

“అంటే ఇక బయటపడే వీలే లేనంతగా చిక్కుకుపోయానా?" చిక్కుకుపోవడం నిజమే, కానీ బయటపడే వీలే లేనంతగా కాదు. పశుపత స్థితి నుండి - అంటే ఆ ఏకకణ జీవి నుండి అత్యున్నత జీవి వరకు ఉన్న జంతు స్వభావం నుండి - పశుపతిగా మారే అవకాశం ఉంది- అంటే, వీటన్నింటినీ విడిచిపెట్టి, వీటికి అతీతంగా వెళ్ళొచ్చు. మానవ వ్యవస్థలో, వ్యవస్థ యొక్క మూల నిర్మాణంలో - అస్థిపంజరం నిర్మాణం కాదు, శక్తి నిర్మాణంలో - లేదా శక్తి యొక్క మూల వ్యవస్థలో 112 చక్రాలు లేదా జంక్షన్ పాయింట్లు ఉంటాయి. వీటి ద్వారా అది పట్టి ఉంచబడి ఉంటుంది.

ఈ చక్రాలన్నీ వ్యవస్థలోని కర్మ అవశేషాల లేదా గత స్మృతుల ప్రభావం ప్రకారం పనిచేస్తాయి. ఇవే ఈ జీవన ప్రక్రియని నడిపిస్తాయి. కానీ, భౌతిక శరీర నిర్మాణానికి వెలుపల మరో రెండు చక్రాలు ఉంటాయి. అవి సాధారణంగా చాలామంది వ్యక్తుల్లో చాలా తక్కువ చురుగ్గా లేదా దాదాపు నిద్రాణ స్థితిలో ఉంటాయి. కానీ, తగినంత సాధన చేస్తే, అవి చురుగ్గా మారతాయి.

114వ చక్రం ఒక ప్రత్యేక విధంగా కంపిస్తూ ఉంటుంది. దీన్నిప్రాచీన కాలం నుండి ఔరోబోరస్‍గా వర్ణించారు - తన తోకని తానే మింగుతున్న పాము చిహ్నం. ఈ చిహ్నాన్ని దాదాపు ప్రతి ప్రాచీన సంస్కృతిలో చూడవచ్చు. భారతదేశంలోని దేవాలయాలన్నింటిలో, గ్రీస్, ఈజిప్ట్ మరియు మెసపొటేమియన్ దేవాలయాల్లో - దాదాపు ప్రతిచోటా దీన్ని చూడవచ్చు. ఇక్కడ ఉన్న దానికంటే అతీతమైన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టిన ప్రాచీన సంస్కృతులన్నింటిలోనూ ఔరోబోరస్ చిహ్నాన్ని చూడవచ్చు.

నేటి ఆధునిక గణితం ఔరోబోరస్‍ని ఇన్ఫినిటీకి చిహ్నంగా వాడుతోంది. 114వ చక్రం ఇన్ఫినిటీ రూపంలో కంపిస్తూ ఉంటుంది. ఒకరి శక్తులు మీలోని ఈ పార్శ్వాన్ని తాకితే, అప్పుడు మీరు చేసే ప్రతి చర్యా, మీరు చేసే ప్రతిదీ ముక్తి వైపు నడిపించే ప్రక్రియగా మారుతుంది. ఎందుకంటే, ఆ చర్య ఇక మీది కాదు, అది అనంత స్వభావం కలిగినది. ఒకరి శక్తులు 112 చక్రాల పరిధిలో ఉంటే, మీరు చేసే ప్రతి చర్య ఒక అవశేషాన్ని మిగులుస్తుంది. కాబట్టి, మీపై ఆహ్లాదకరమైన అవశేషాన్ని వదిలే సరైన చర్యలు చేయడం మంచిది.

ప్రాథమిక ఆక్రందన

చేసే పని మిమ్మల్ని బంధిస్తుందా లేక ముక్తి వైపు నడిపించే ప్రక్రియగా మారుతుందా అనేది ప్రధానంగా ఒకరి సాధనా స్థాయిని బట్టి, మరియు ఆ పనిని చేసే వైఖరి ఇంకా సంకల్పాన్ని బట్టి ఉంటుంది. జీవితంలో చేయాల్సిన చర్యలు చేయకుండా సాధన చేయడానికి ప్రయత్నిస్తే, సాధన చాలా కష్టతరమవుతుంది.

రోజుకి పన్నెండు గంటలు కూర్చొని, ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే, మొదట్లో అది గొప్ప అదృష్టంలా అనిపిస్తుంది. కానీ, నెల రోజుల్లోనే మీకు పిచ్చెక్కిపోతుంది. ఆ పిచ్చిని దాటగలిగితే, అన్నింటినీ దాటగలుగుతారు. కానీ, చాలామంది తమలో ఈ పిచ్చి మొదలైనప్పుడు ఆశలు వదులుకుంటారు. ఎందుకంటే అది అంత సులభం కాదు. ఇది మీ తండ్రి, తాత, పూర్వీకులు మరియు ఆ బ్యాక్టీరియాల తాలూకు ప్రాథమిక ఆక్రందన. అవన్నీ వ్యక్తమవ్వడానికి అరుస్తూ ఉంటాయి. అవి ఊరుకోవు. మీరు వాటన్నింటినీ తుడిచిపెట్టేయవచ్చు. కానీ, అది చాలా సాధన అవసరమయ్యే కఠినమైన మార్గం. లేదా మీరు వాటి నుండి దూరం ఏర్పరచుకోవచ్చు- వాటిని అరుస్తూ ఉండనివ్వండి, కానీ మీకవి పట్టవు - ఎందుకంటే మీరు వాటిని వినరు. ఉన్న రెండు వేర్వేరు మార్గాలు ఇవే. అంతే గానీ, మీరు వాటిని విస్మరించలేరు. ఎందుకంటే అవి మీ శరీరంలోని ప్రతి కణంలో స్పందిస్తూ ఉంటాయి.

వాటన్నింటి నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుకోవడానికి చాలా కృషి అవసరం, లేదా కేవలం భక్తి చాలు. స్వయంగా మీరే చేయాలనుకుంటే, అందుకు కృషి అవసరం. అనుగ్రహంతో ప్రయాణించాలనుకుంటే, కృషి అవసరం లేదు, అయితే మీరు డ్రైవర్ సీట్లో ఉండరు. కాబట్టి, మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి - ఇందులో చాలా రిస్కులు ఉంటాయి - లేదా నిపుణుడైన డ్రైవర్ నడపనివ్వండి, మీరు వెనుక సీట్లో కునుకు తీయవచ్చు. గమ్యం చేరుతున్నంత వరకూ, ఎలా వెళ్తే ఏముంది?

ఈ వ్యాసం సద్గురు రచించిన "ఆఫ్ మిస్టిక్స్ అండ్ మిస్టేక్స్" పుస్తకం నుండి గ్రహించబడింది.

karma-book-blog-banner