ఆధ్యాత్మిక మార్గంలో కర్మ యోగ ప్రాముఖ్యతను, దాని పాత్రను మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు కర్మను ఎలా ఉపయోగించుకోవాలో సద్గురు వివరిస్తారు.

ప్రశ్న:సాధనలో కర్మ యోగ పాత్ర ఏమిటి?  

సద్గురు: నిజానికి అది అవసరం లేదు. యోగాకు కర్మ అవసరం లేదు. యోగా అంటే కర్మకు అతీతంగా వెళ్ళడం. మరి కర్మ యోగాను ఎందుకు తీసుకొచ్చారంటే, మనిషిలో సమతుల్యత తీసుకురావడానికి. మన ఎరుక, మన ప్రేమ, మన అనుభూతి లేదా వాస్తవికతను గురించిన మన అవగాహన - వీటిని నిలబెట్టుకోవాలంటే, ఏమీ చేయకపోవడం అనే మార్గం చాలా అద్భుతమైనది, కానీ అది చాలా జారుడుగా ఉంటుంది. చాలా జారుడు. అది అత్యంత సరళమైనది మరియు అత్యంత కష్టమైనది కూడా. అది కష్టమైనది కాదు, అలానే ఏమాత్రం సులభమైనది కాదు; ఎందుకంటే అది చాలా సరళమైనది - ఇప్పుడు, ఈ క్షణంలో దాన్ని చేయొచ్చు. కానీ ఆ ఇప్పుడు, ఈ క్షణంలో ఉండటం ఎలా? మీరు ఏం చేసినా, అది మీ చేతికి చిక్కదు.అది ఎప్పటికీ మీ చేతికి చిక్కదు. కానీ మీ చేతులకి ఇప్పుడు ఏదో కావాలి, మీరు ఏదోక దాన్ని పట్టుకోవాలనుకుంటారు. అందుకే కర్మ యోగ అనే ఊతకర్ర.

ఈ ఊతకర్ర లేకుండా, చాలామంది నడవలేరు. మొదటి నుంచే ఊతకర్ర లేకుండా నడవగలిగే వారు అతి కొద్దిమంది ఉంటారు. వారు చాలా అరుదైన వ్యక్తులు. మిగతా అందరికీ తమ ఎరుకను నిలబెట్టుకోవడానికి ఊతకర్ర అవసరం. ఇది లేకుండా, చాలామంది ఎరుకతో ఉండలేరు. అందుకే సరైన కర్మతో సాధనను సమతుల్యం చేసుకోవడానికి కర్మ యోగాన్ని మీ జీవితంలోకి తీసుకొచ్చాం.

చర్య - ముక్తికి సోపానమా లేదా బంధనాలు ఏర్పరుస్తుందా

కర్మ యోగాన్ని దురదృష్టవశాత్తు సేవగా వర్ణించారు, కానీ అది సేవ కాదు.

కర్మ యోగాన్ని దురదృష్టవశాత్తు సేవగా వర్ణించారు, కానీ అది సేవ కాదు. అది మీరు పోగుచేసుకున్న ముద్రణలను తొలగించుకునే మార్గం. మీరు ఏ పనిలోనైనా ఆనందంగా పాల్గొనగలిగితే, అదే కర్మ యోగ. మీరు ఎంతో ప్రయాసతో చేస్తే, కర్మ మాత్రమే వస్తుంది, యోగా జరగదు!

సాధారణంగా మీరు చేసే వివిధ కార్యకలాపాల ద్వారానే జీవితంలో చిక్కుకుని ఇరుక్కుపోతారు. కానీ ఆ కార్యకలాపం బంధనంగా కాకుండా ముక్తికి మార్గమైతే, అదే కర్మ యోగ. అది పని కావచ్చు, వీధిలో నడవడం కావచ్చు లేదా ఎవరితోనైనా మాట్లాడటం కావచ్చు, ఆ పని ఎలాంటిది అన్నది ముఖ్యం కాదు. అది మీకు ఏమాత్రం ముఖ్యం కాకపోయినా, కేవలం అవసరం కాబట్టి చేస్తూ, అదే మీ జీవితమన్నట్లు పూర్తిగా నిమగ్నం అయి ఆ పని చేయగలిగినప్పుడు, అది మీలో పరివర్తన తెచ్చి, మిమ్మల్ని ముక్తి వైపుకి నడిపిస్తుంది.

మేము ధ్యానలింగాన్ని నిర్మిస్తున్నప్పుడు, ప్రజలు, "దీన్నే, ఆయన సాకారం చేయాలనుకుంటున్నది. మనం దీన్ని చేద్దాం! ఇది అయిపోయాక, మనం విశ్రాంతి తీసుకోవచ్చు” అనుకున్నారు. వాళ్ల జీవితం దానిపై ఆధారపడి ఉన్నట్లుగా పనిచేశారు. ఇంటింటికీ తిరిగి, నిధులు సేకరించి, అవసరమైన మద్దతు సంపాదించి, దాన్ని సాకారం చేశారు. అది పూర్తయ్యాక, వాళ్ళు "ఊఫ్..." అనేలోపే, నేను పది కొత్త ప్రాజెక్టులను ప్రకటించాను. నేను ఎప్పుడూ ఇలాగే ఉంచుతాను ఎందుకంటే వారికి అలాంటి చర్య అవసరం. వాళ్ళ తృప్తి గురించి, వాళ్ళ ఇష్టాయిష్టాల గురించి ఆలోచించకుండా చేయాల్సినది చేయాలి. ఎలాగూ మనం మన ఎదుగుదల కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి, అందరికీ ఉపయోగపడేది చేద్దాం. వివేకవంతమైన పని చేద్దాం.

పూర్తి నిమగ్నత

మీకు ఏమీ ముఖ్యం కాని పనిని పూర్తి నిమగ్నతతో చేయడమే కర్మ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది.

చాలామంది గురువులు ఇలాంటి పనుల్ని సృష్టించారు. గుర్జీఫ్, యూరప్‌లో తన కేంద్రాలను ప్రారంభించినప్పుడు, యూరప్‌లోని ఉన్నత వర్గం వారు అతని వద్దకు వెళ్ళారు. ఉదయం వాళ్లకి పార ఇంకా గడ్డపారను ఇచ్చి, "గుంతలు తవ్వండి" అని చెప్పేవాడు. మండుటెండలో నిలబడి వాళ్లు కష్టపడి తవ్వేవారు. వీళ్లెవరూ ఏ రకమైన శారీరక శ్రమ అలవాటు ఉన్న వాళ్లు కాదు. కొన్ని గంటలు పనిచేసేసరికి, వాళ్ల చేతులన్నీ బొబ్బలు కట్టేవి. అతను అక్కడే నిలబడి, వాళ్ళ చేత పని చేయించేవాడు. పొద్దుపోయే సమయానికి వాళ్లు ఆకలితో ఉన్నా, పనిచేస్తూనే ఉండేవారు, గుంతలు తవ్వుతూనే ఉండేవారు. అప్పుడతను గడియారం చూసి, "సరే, ఏడు గంటలైంది. భోజన సమయం అయినట్లుంది. మీరంతా ఈ గుంతలను మూసేయండి, ఆపై భోజనానికి వెళ్లొచ్చు" అనేవాడు. రోజంతా చేసిన పని!

మీకు ఏమీ ముఖ్యం కాని పనిని పూర్తి నిమగ్నతతో చేయడమే, కర్మ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కర్మ అంటే చర్య. చర్య అనేది యోగా అవ్వాలంటే, అది ముక్తి వైపు నడిపించేదిగా ఉండాలి. మీ కార్యకలాపం మిమ్మల్ని బంధించే ప్రక్రియగా మారితే, అది కర్మ. కాబట్టి ప్రశ్న మీరు ఎంత పని చేస్తున్నారు అనేది కాదు. మీరు ఆ పనిని ఎలా చేస్తున్నారు అనేదే మార్పును తెస్తుంది. మీరు మీ పనిని ప్రయాస పడుతూ చేస్తే, అది కర్మ. మీరు మీ పనిని డాన్స్ చేస్తున్నట్లు చేస్తే, అది కర్మ యోగ.

సంపాదకుని గమనిక: ఈశా బ్లాగ్ నుండి తాజా అప్‌డేట్లను పొందండి.ట్విట్టర్, ఫేస్‌బుక్, ఆర్‌ఎస్‌ఎస్ లేదా బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు, మీకు నచ్చిన దాన్ని ఎంచుకోండి.