महाकुम्भ मेला: क्या है इसका विज्ञान?
கும்பமேளா – ஏன் இவ்வளவு சிறப்பு?

… సూర్యుడు కూడా ముచ్చటపడేంతగా, భారతదేశాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దడంలో మనిషి గాని, ప్రకృతి గాని చేయగలిగినదంతా ఇక్కడ చేసేశారు.  - మార్క్ ట్వైన్

సద్గురు: సమస్త భూమండలంలోనే భారతదేశపు సంస్కృతి అతి సంక్లిష్టమైన ఇంకా శోభాయమానమైన సంస్కృతి. ఇక్కడి ప్రజల తీరుతెన్నులు, భాష ఇంకా ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు, ఆట పాట ఇలా ప్రతీది కూడా ప్రతి 50 నుండి 100 కిలోమీటర్లకి మారుతూండడం మీరు చూస్తారు. ఇలాంటి సంక్లిష్టమైన సంస్కృతిని ఒకే చోట మీరు చూడగల ప్రదేశం కుంభమేళా.

2001లో ప్రయా‍గ్‍లో జరిగిన మహా కుంభమేళాలో 6 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. అటువంటి ప్రదేశాలను సందర్శించాలనే తపన నాలో ఎన్నడూ ఉండేది కాదు. కానీ దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటే, సరే అని చెప్పి, ఊహకందనంత భారీ స్థాయిలో జరిగే ఆ గొప్ప విశేషాన్ని చూద్దామని కోయంబత్తూరు నుండి డ్రైవ్ చేస్తూ వెళ్దామనుకున్నాను.

ప్రపంచంలోనే అత్యద్భుతమైన వేడుకల్లో అదొకటి. నేను తెల్లవారుజామున 2 గంటలకి అక్కడికి చేరుకున్నాను, దేశ నలుమూలల నుండి వచ్చిన అన్ని రకాల ప్రజలు అక్కడే ఉన్నారు. వాళ్ళకి నిద్రపోడానికి స్థలం కూడా లేదు. అందుచేత చిన్నపాటి చలిమంట చుట్టూ వారికి తెలిసిన ఆటాపాటలతో, వారి సంస్కృతికి తగ్గట్టు వారి భాషలో కాలక్షేపం చేస్తున్నారు. మానవ సమాజంలోని నీచమైనవారు ఇంకా గొప్పవారు, అంటే చేతివాటం చూపేవారు ఇంకా జ్ఞానోదయం పొందిన ఎందరో గొప్ప యోగులు, అందరూ అక్కడికి వచ్చారు. ప్రజలు ఎన్నో వేల సంవత్సరాలుగా ఇలా సమ్మిళితమవుతూ ఉన్నారు. ఇది ఎవరూ నశింప చేయలేని ఒక సంస్కృతి, సంప్రదాయం. దీనికొక సామాజిక పరమైన అనుబంధముంది అలానే ఆధ్యాత్మిక పరమైన శక్తి కూడా ఉంది.

భూమి ఇంకా చంద్రుడు ఆవృత్తాల్లో పరిభ్రమిస్తాయి. ప్రతిఒక్కరూ ఈ ఆవృత్తికి అనుగుణంగా జీవిస్తారు, ఐతే ఈ ఆవృత్తాలు బంధనాలుగానే మిగిలిపోవచ్చు లేదా ఒక పార్శ్వం నుండి మరో పార్శ్వానికి మారే సాధనాలుగా కూడా మలచుకోవచ్చు. ఎవరైతే ముక్తి కోసం తపించిపోతారో, వారు తాము సృష్టించుకున్న ఆవృత్తాల నుండి విముక్తి పొందడానికి నిరంతరం కృషి చేస్తారు. ఈ ఆవృత్తాలు ఎన్నో రకాలు, ఇందులో అతి పెద్దది 144 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రతి 144 సంవత్సరాలకి సూర్య మండలంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు జరుగుతాయి, ఇందులో ఒకటే కుంభమేళా, 2001లో ఇది జరిగింది.

కుంభమేళాలు దేశంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలలోనే జరుగుతాయి, వీటి చుట్టూ ఒక ప్రత్యేక శక్తి వ్యవస్థే సృష్టించబడి ఉంటుంది. భూగ్రహం గుండ్రంగా పరిభ్రమిస్తూ ఉండడం వలన అభికేంద్ర బలాన్ని ఉత్పత్తి చేస్తుంది. అక్షాంశ రేఖపై 0 నుండి 30 డిగ్రీల వద్ద ఈ శక్తి మానవ వ్యవస్థపై నిలువుగా పని చేస్తుంది. ప్రత్యేకించి 11 డిగ్రీల వద్ద ఈ శక్తి నిట్టనిలువుగా పని చేస్తుంది. దీన్ని అనుసరించి, మన పూర్వీకులు భూమ్మీద ప్రజలపై అనుకూల ప్రభావం చూపించే ప్రాంతాలను గుర్తించారు. ఇందులో చాలా ప్రాంతాలు నదుల సంగమాలు, ఇక్కడ స్నానం చేయడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాలకు ప్రత్యేకమైన రోజుల్లో వెళ్ళడం వల్ల అరుదైన సంభావ్యతలు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోడానికి అక్కడికి వెళ్ళేవారు. వీరిలో చాలామంది కర్షకులు ఇంకా నిరక్షరాస్యులు. వీరు ముక్తి కోసం ఇంకా అక్కడ సమయం గడపాలనే ఆకాంక్షతో సుదూరాల నుండి అతి కొద్దిపాటి వనరులతో ప్రయాణిస్తారు. ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద సంఖ్యలో ముక్తి కోసం ఇంతగా తపించరు.

భారతదేశంలో అనాదిగా మెదలై ఇప్పటికీ కొనసాగుతున్న ఆధ్యాత్మిక ప్రక్రియల గురించి, మార్మిక రహస్యాల గురించి ఇక్కడ చాలామందికి తెలియదు. ప్రపంచంలోనే భారతదేశం ఎప్పుడూ ఆధ్యాత్మికతకు రాజధానిగా నిలిచింది. ఎందుకంటే, ఆంతరంగిక విజ్ఞానం పట్ల ఈ సంస్కృతిలో ఉన్నంత లోతైన అవగాహన మరెక్కడా లేదు. ఇక్కడ ముక్తి లేదా విమోచనమే అత్యున్నత లక్ష్యం, ఆఖరికి దేవుడ్ని కూడా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒక సోపానంగా భావిస్తారు.

దురదృష్టవశాత్తూ, గతంలో జరిగిన దురాక్రమణల వల్ల ఎన్నో విధాలుగా చిన్నాభిన్నమై, సుదీర్ఘ పేదరికం వల్ల పెడదారి పట్టిన ఆధ్యాత్మికతను మనం ఇప్పుడు చూస్తున్నాం. అయినప్పటికీ, ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క మూలాలు నాశనం అవ్వలేదు, చేయబడలేవు కూడా. ఈ సంప్రదాయాన్ని మనం పూర్తిగా సద్వినియోగపరచుకునే సమయమం ఇది.

హరిద్వార్‌లో కుంభమేళా

హరిద్వార్‌లో జరిగే కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద సంగమం కావొచ్చు. భారతదేశం నలుమూలల నుండి మరియు ప్రతి రకమైన ఆధ్యాత్మిక మార్గానికి చెందిన ఆధ్యాత్మిక సాధకులు ఈ పవిత్ర రోజున గంగా నదిలో స్నానం చేయడానికి ఒకచోటుకు చేరుకుంటారు. ఈరోజుని గ్రహ నక్షత్రాల కదలికల ఆధారంగా లెక్కిస్తారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, ఇది ఒక సౌర చక్రం మరియు ఆధ్యాత్మిక మార్గంలో ముఖ్యమైన సంఖ్య. కుంభమేళా భారతదేశం యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.