ఇతరుల కర్మలో జోక్యం చేసుకోకండి
భారతీయ సంస్కృతి ప్రకారం, కూర్చున్న లేదా పడుకున్న వ్యక్తిని దాటి వెళ్లకూడదు. ఇది కేవలం ఒక సంప్రదాయమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అనేది సద్గురు వివరిస్తారు.
సద్గురు: నిజానికి ఇది మనుషులకే కాదు, అన్ని జీవులకూ వర్తిస్తుంది. భారతదేశంలో, ప్రజలు నిద్రపోతున్న కుక్కను కూడా దాటి వెళ్లరు.
మీరు జీవితాన్ని కేవలం భౌతిక దృష్టితో మాత్రమే చూస్తున్నప్పుడు, మనిషి ఉనికి చర్మంతోనే ముగుస్తుందని భావిస్తారు. కానీ మీరు జీవితాన్ని ఇంకొంచెం లోతుగా అనుభూతి చెందితే, మనిషి ఉనికి చర్మానికి అవతల కూడా విస్తరించి ఉంటుందని అర్థమవుతుంది. ఆ విస్తరణ ఎంత దూరం అన్నది ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది. మీరు కళ్ళను మూసి ఉంచి కూర్చున్న కొద్దీ, ; మీరు లావుగా అవుతారు అని చెప్పొచ్చు- శారీరకంగా కాదు, మీ ఉనికి పెరుగుతుంది అని అర్థం. మీరు ఆలోచనలను తగ్గించుకున్న కొద్దీ మీ ఉనికి విస్తృతమవుతుంది. becomes.
చాలామంది నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే కొంత శాంతిని, సమతుల్యతను అనుభూతి చెందుతారు. . నిద్ర అనేది జీవితంలో వాళ్లకు తెలిసిన అత్యంత లోతైన స్థితి. ఇలా జీవించడం చాలా దురదృష్టకరమైన విషయం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు, వారు కొంతవరకు ప్రశాంతంగా, సమతుల్యతతో ఉంటారు. కానీ మెలకువగా ఉన్నప్పుడు, వారి మనసు అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉంటుంది.
అందుకే పడుకున్నప్పుడు వారి ఉనికి కొంత పెరుగుతుంది. ముఖ్యంగా గట్టి నేలపై పడుకున్నప్పుడు, ఆ శక్తులు క్రిందివైపు వ్యాపించే అవకాశం లేనందున, అవి సహజంగానే ఖాళీ స్థలం ఉన్న పైవైపుకు వ్యాపిస్తాయి. అంటే మీ శక్తులు మీ చుట్టూ వ్యాపించడానికి బదులు, అవి సుమారు 50% నుండి 100% వరకు పైకి వ్యాపిస్తాయి.
కొనసాగింపబడి ఉండే శక్తి శరీరం
ఇప్పుడు శక్తి శరీరం గురించి మాట్లాడుకుందాం. ఉదాహరణకి, మీ శక్తి శరీరం మీ చర్మం నుండి ఒక అడుగు దూరం వరకు విస్తరించి ఉందనుకుందాం. మీరు పడుకున్నప్పుడు, అది సుమారు ఒకటిన్నర నుండి రెండు అడుగుల వరకు పెరుగుతుంది. మీకు తెలియకుండానే, శక్తి శరీరం సహజంగానే శుద్ధి అవ్వడం లేదా విస్తరించడం జరుగుతుంది. అటువంటి సమయాల్లో ప్రజలు మీతో ఎక్కువ దూరం పాటిస్తారు. అది గౌరవం వల్ల కాదు, ఆ క్షణంలో మీ శక్తి శరీరం విస్తరించి ఉన్నందువల్ల. అది అలానే ఉండాలి, ఎందుకంటే ఆ క్షణానికి అది అవసరం. మీకు కొంత సున్నితత్వం ఉంటే, ఈ విషయాలు సహజంగానే మీకు తెలుస్తాయి. మీరు దీన్ని ఏదో ప్రత్యేక వరంగా భావించవచ్చు, దాన్ని నేను పూర్తిగా కాదనను. అయితే, చాలామందికి ఈ సున్నితత్వం లేకపోవడానికి కారణం, వారు దేనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడమే. వారు చుట్టూ ఉన్న జీవాన్ని తేలికగా తీసుకుంటారు, కాబట్టి వారు దేనిపైనా శ్రద్ధ పెట్టలేరు.
నేను చిన్నప్పుడు, ఐదు, ఆరేళ్ల బాలుడిగా ఉన్నప్పుడు, ఇంట్లో కూర్చొని, ఏదో ఒక దానిని లేదా కొన్నిసార్లు శూన్యాన్ని చూస్తూ ఉండేవాడిని. చాలా కాలం తర్వాత నాకు అర్థమైంది, యోగాలో ఒక ముద్ర ఉంది, అందులో మీరు కేవలం శూన్యాన్ని చూస్తూ ఉండాలి. అంటే ఏదీ గొప్ప కాదు, ఏదీ తక్కువ కాదు. ఏదోకటి ఇంకా శూన్యం - మీకు రెండూ ఒకటే - ఊరికే అలా చూస్తూ ఉంటారు. అలా చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి, మా అమ్మ పక్క నుంచి వెళ్లేది. మొదట్లో, నేను ఆమెను స్పష్టంగా చూసేవాడిని, కానీ తర్వాతి సారి ఆమె వెళ్తున్నప్పుడు, ఆమె రూపం అస్పష్టంగా, కొంత పెద్దగా కనిపించేది. ఆమె మళ్లీ వెళ్తున్నప్పుడు, దాదాపు పారదర్శకంగా, మరింత పెద్దగా కనిపించేది.
తర్వాత మా నాన్న వచ్చేవారు. నేను ఖాళీ చూపులతో ఆయనను చూస్తుండేవాడిని. ఆయన నా కళ్ల ముందు సైగలు చేసేవారు. యథావిధిగా, 'ఎందుకు చదవడం లేదు?' లాంటివి అడుగుతున్నట్టు నాకు అర్థమయ్యేది. నేను ఆయన మాటలు వినేవాడిని కాదు, కేవలం చూస్తూ ఉండేవాడిని. అలా చూస్తున్నప్పుడు నాకు వివిధ రకాల విషయాలు కనిపించేవి. నాకు కనిపించే రూపాల ఆధారంగా, ఆయన ఏం చెబుతున్నారో నాకు తెలిసేది. ఈ అబ్బాయి మతిస్థిమితం కోల్పోతున్నాడేమో అని ఆందోళన చెందేవారు, ఆయన అలా చూసేదాన్ని బట్టి అర్థమయ్యేది. మీరు కూడా తగినంత శ్రద్ధ పెడితే, దీన్ని మీరే స్వయంగా అనుభూతి చెందుతారు.
మీ చుట్టూ ఏం ఉంటుంది?
యోగ శాస్త్రం ప్రకారం,మన ఉనికికి మూడు భౌతిక పార్శ్వాలు ఉన్నాయి. అవి భౌతిక శరీరం, మానసిక శరీరం, మరియు శక్తి శరీరం. వీటినే అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం అంటారు. భౌతిక శరీరం ఆహార రూపంలో భూమి నుండి తీసుకున్న పదార్థాలతో తయారవుతుంది. మానసిక శరీరం కూడా మన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి తీసుకున్న పదార్థాలతోనే తయారవుతుంది, అయితే ఇది మరింత సూక్ష్మమైన పదార్థం. సమాచారం, ప్రకంపనలు, శబ్దాలు, మరియు ముద్రణలతో మనం మానసిక శరీరాన్ని నిర్మించుకుంటాం.
భౌతిక శరీరం భౌతిక పదార్థంతో తయారైనందున, అది ఒక నిర్దిష్ట రూపాన్ని పొందుతుంది. కానీ చాలామంది మానసిక శరీరానికి స్పష్టమైన రూపం ఉండదు. వారు ఏం సేకరించారో వారికే తెలియదు. చాలామంది మనుషులకు, 1% కంటే తక్కువ కంటెంట్ మాత్రమే చేతనావస్థలో జరిగి ఉంటుంది. 99% అచేతనావస్థలో సేకరించబడినందున, మానసిక నిర్మాణం చెల్లాచెదురుగా ఉంటుంది. అది పెద్ద గందరగోళంలా ఉంటుంది. కానీ మీరు మీ మానసిక రూపానికి ఎరుకతో ఒక నిర్మాణాన్ని సృష్టించగలిగితే, మరియు పరిస్థితిని బట్టి ఆ నిర్మాణాన్ని మార్చగలిగితే, మీ మనసు ఒక అద్భుతమైన సాధనంగా మారుతుంది.
అదేవిధంగా మీ శక్తి శరీరం కూడా సమాచారాన్ని కలిగి ఉంటుంది. అది ఏ రూపం తీసుకుంటుందనేది మీలో ఎలాంటి సమాచారం ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. భౌతిక శరీరం స్థాయిలో ఉన్న సమాచారాన్ని జెనెటిక్స్ అంటారు. అదేవిధంగా, మానసిక నిర్మాణంలో సమాచారం ఉంది, ఇంకా శక్తి నిర్మాణంలో సమాచారం ఉంది.
ఎరుక గలవారు, మీ మానసిక శరీరంపై లేదా శక్తి శరీరంపై దాటి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరి కర్మ ఎలాంటిదో మనకు తెలియదు. వారు నిద్రపోతున్నప్పుడు లేదా నిద్రలోకి జారుకుంటున్నప్పుడు, అచేతనంగా ప్రవర్తించే కర్మ నిర్మాణం అత్యధికంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చేతనావస్థలో కార్యకలాపాలు చేయనప్పుడు, అచేతనావస్థ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతాయి. ఎరుక గలవారు ఇతరుల కర్మలో తొట్రుపడటానికి లేదా ప్రవేశించడానికి ఇష్టపడరు. ఎవరినైనా దాటి వెళ్లడం ద్వారా, మీరు వారి కర్మలో ప్రవేశిస్తున్నట్లే అవుతుంది.
మీ విషయాలను నిర్వహించుకోవడం
మీ స్వంత విషయాలనే సరిగ్గా నిర్వహించడం కష్టమైనప్పుడు, ఇతరుల విషయాల్లో కలుగజేసుకోవడం తెలివైన పని కాదు. అందుకే ఆధ్యాత్మిక సాధనలో ఉన్నప్పుడు, బ్రహ్మచారులు, ఎవరినీ కౌగలించుకోరు - “నమస్కారం”చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మేం మీ కర్మలో తొట్రుపడదలచుకోలేదు. అది మంచిదైనా, చెడ్డదైనా, దాన్ని మీ నుండి తీసుకోదలచుకోలేదు. మీ గురువు మీకు సంబంధించిన ఏదైనా కర్మ కోసం ఒక వ్యూహాన్ని రూపొందించినప్పుడు, మీరు ఎవరితో పడితే వాళ్లతో దాన్ని కలపకూడదు. అలా చేస్తే, అది అనవసరంగా సంక్లిష్టమవుతుంది.
మీరు అన్ని వైపుల నుండి చాలా ఎక్కువ సమాచారాన్ని స్వీకరిస్తే, కర్మ ప్రక్రియ చాలా సంక్లిష్టమవుతుంది. అప్పుడిక మీ కర్మ కోసం రూపొందించిన పద్ధతి పనిచేయదు, ఎందుకంటే మీరు నిత్యం దాన్ని ఇతరుల కర్మతో కలగలుపు చేస్తూ ఉన్నారు కాబట్టి. తీవ్రమైన సాధనలో ఉన్నవాళ్ళు, నిర్జనంగా ఉన్న గుహలు లాంటి వాటిల్లోకి ఎందుకు వెళతారంటే, వాళ్ళు విషయాలను మరింత సంక్లిష్టం చేసుకోదలచుకోరు. వాళ్ళు తమ సొంత కర్మ యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకున్నారు కాబట్టి, దాన్ని మరింత సంక్లిష్టం చేసుకోవాలనుకోరు.
అందుకే ఎవరినీ దాటి వెళ్లకండి. వారి పక్కన నుంచి వెళ్లండి. ఇది గౌరవానికి సంకేతం కూడా. అంతేకాకుండా, మీరు వారిని దాటి వెళితే అది వారిని అంతర్గతంగా డిస్టర్బ్ చేస్తుంది. మీరు వారి శక్తి శరీరాన్ని డిస్టర్బ్ చేస్తే, వారు వెంటనే మేల్కొనకపోవచ్చు, కానీ లోపల, అది వారిని డిస్టర్బ్ చేస్తుంది.
ఇదంతా జీవితం గురించిన ఒక మౌలికమైన అవగాహన నుండి వస్తుంది. మీరు ఏం చేస్తున్నా సరే- వ్యాపారం నడుపుతున్నా, వివాహం చేసుకొని, పిల్లలను కని పెంచుతున్నా, యుద్ధం చేస్తున్నా - ఈ దేశంలో పుట్టినప్రతిఒక్కరికీ ఒకే ఒక లక్ష్యం ఉండేది - ముక్తి పొందటం. ముక్తి మాత్రమే ఏకైక లక్ష్యం. మొత్తం సంస్కృతి దీని చుట్టూనే నిర్మించబడింది. ఇతరుల కర్మలో తొట్రుపడకుండా ఉండటానికి చాలా పద్ధతులు రూపొందించబడ్డాయి. మీకు ఇప్పటికే ఉన్న దాని సంక్లిష్టత తెలిసినప్పుడు, మీరు కొత్తవి పొందాలనుకోరు. మీకున్న గందరగోళం నుంచి బయటపడితే, అదే చాలు. దాన్ని మరింత సంక్లిష్టం చేసుకోవాలనుకోరు.
సంపాదకుని గమనిక: సద్గురు ఈ దేశం యొక్క గతం, వర్తమానం మరియు భవిష్యత్తును పరిశీలిస్తూ, ఈ సంస్కృతి ప్రపంచంలోని ప్రతి మానవునికి ఎందుకు ముఖ్యమో వివరిస్తారు. చిత్రాలు, గ్రాఫిక్స్ మరియు సద్గురు స్ఫూర్తిదాయక మాటలతో, మీరు ఎప్పుడూ తెలుసుకోని విధంగా భారత్ ను తెలుసుకోండి!
ఈ వ్యాసం మొదట ఈశా ఫారెస్ట్ ఫ్లవర్ ఏప్రిల్ 2015లో ప్రచురించబడింది. 'మీరు చెల్లించాలనుకుంటున్న ధర, కనీస ధర అంటూ ఏమీ లేదు’ అనే ఆఫ్షన్‍ని ఎంచుకొని ఈ పీడీఎఫ్‍ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింటెడ్ వర్షన్ కోసం సబ్‍స్క్రైబ్ చేసుకోవచ్చు.