ప్రశ్న: సమ్యమ కార్యక్రమం వ్యక్తి కర్మను తొలగిస్తుందని విన్నాను, అది ఎలా సాధ్యం? జనన మరణ వలయాల నుంచి బయటపడడానికి అది ఎలా ఉపకరిస్తుందో తెలుసుకోవాలని నాకు ఉంది.

సద్గురు: యదార్ధంగా అన్ని ఆధ్యాత్మిక సాధనలూ వ్యక్తి జీవితాన్ని త్వరితగతిలో నిర్వహించుకోవడానికే. మీరు సాధారణ వేగంలో ప్రయాణిస్తుంటే గమ్యానికి ఎంతో సమయం పట్టవచ్చు. అందుకే ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది తొందరలో ఉన్న వారికోసం. వారికి తమ గమ్యం వీలైనంత త్వరగా చేరుకోవాలని ఉంది. మీరెంత త్వరగా గమ్యాన్ని చేరాలో తెలిపితే మేము అంత మేరకు మీ సాధనను వేగవంతం చేస్తాము. మరి జరగవలసినవి వేగంగా జరుగుతున్నప్పుడు మీరు కొంత క్రమ శిక్షణ పాటించవలసి వస్తుంది. మీరు వీధిలో నడుస్తున్నా లేక అరణ్య మార్గంలో నడుస్తున్నా, మీకో చింత చెట్టు కనపడినప్పుడు మీ నోట్లో నీళ్ళు ఊరతాయి. మీరు వాటిని కోసుకోవచ్చు, వాటి పూలు కూడా రుచికరంగా ఉంటాయి, మీరు వాటిని కూడా కాస్త రుచి చూడవచ్చు.

నడకలో ఉంటే అదే సౌలభ్యం, చెట్టెక్కి చింతకాయలు అన్నీ కోసుకుని వెళ్ళాలని మీకు అనిపిస్తుంది. కాని మీరు ఏదో బండి మీద వెళుతుంటే దొరికిందేదో అంది పుచ్చుకుని వెళ్ళిపోవాలి. మీకు ఎంచుకునే సమయం ఉండదు. అదే మీరు కారులో వెళుతుంటే మీరు చెయ్యి బయటకు పెట్టి ప్రయత్నిద్దామంటే అపాయకరం కావచ్చు. దానివల్ల మీ చెయ్యి గీరుకుపోవచ్చు. మీరు మరో విధంగా ప్రయాణిస్తున్నప్పుడు, విమానంలో ప్రయాణిస్తుంటే, అలాంటిది సంభవమే కాదు. అసలు మీరు చేతిని బయట పెట్టలేరు.

అందువల్లే ప్రజలు తమ ఇష్టాయిష్టాలను బట్టి ప్రయాణం ఎంచుకుంటారు. ప్రజలు తాము లక్ష్యానికి ఎంత త్వరగా చేరుకోవాలనుకుంటున్నారో, తమ ప్రయాణాన్ని ఎంత బాగా ఆస్వాదించాలని అనుకుంటున్నారో, దానిని బట్టి తాము ప్రయాణించే వాహనాన్ని ఎంచుకుంటారు. వారు ఏదీ పట్టించుకోరని కాదు, ఆ మాట ఎవరూ అనలేరు. వారు ఇక్కడ కూర్చున్నప్పుడు, అది సౌకర్యవంతంగా ఉంది కాబట్టి పట్టించుకోరు. కాని కాలం గడచిన కొద్దీ వారు పట్టించుకుంటారు. అందరికీ తమ గమ్యం చేరాలని ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే వారు ఎంతకాలం వేచి ఉందామనుకుంటున్నారు అన్నదే.

సమ్యమ అనేది ఈ ప్రక్రియను వేగవంతం చేసేది. అదే సమయంలో అది ఏంతో సురక్షితమైన వాతావరణంలో జరిగేది. భద్రమైన వాతావరణం లేకుండా, మీ అంతట మీరు అది చేయదలచుకుంటే, అది చాలా ప్రమాదకరం. భద్రమైన వాతావరణం లేకుండా, అదిచేసే ప్రయత్నం చేస్తే, వారు తమ బుర్రలను పాడు చేసుకోవచ్చు. మేము అంత నిక్కచ్చిగా వాతావరణం అలా ఎందుకు పెడతామంటే, అక్కడ జరిగే దానిపై వారు తమ దృష్టి మొత్తం పెట్టాలి. అలా కాకుండా, బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా చింత చెట్టు కొమ్మ పట్టుకుని కాయలు కోద్దామనుకుంటే, బస్సన్నా ఆగాలి, లేక మీరు మీ చేతిని అక్కడే వదిలేసి పోవాలి. అలా ఏదో ఒకటి జరగాలి. అలా వద్దనుకుంటే మీరు మీ చేతిని బయటకు పెట్టకుండా, మీరు బయట ప్రపంచంలో జరిగే దానిని గమనిస్తూ ఉండిపోవాలి. కాని మీరు నడచి వెళుతుంటే అలా ఉండనక్కరలేదు, కాని అలా పోతుంటే, అది ఎంతో సమయం తీసుకుంటుంది. మీరు మీ ప్రక్క ఊరు వెళ్ళాలన్నా ఎంతో కాలం పడుతుంది.

అందుకే సమ్యమ తనంతట అది ప్రమాదకరమైనది కాదు, ఒక వ్యక్తి దానికి అర్హుడా, కాదా అని కాదు. అందరూ దానికి అర్హులే, కాని కావలసిన ముందస్తు తయారీ లేకుండా అది కష్టం అనిపించవచ్చు, కావలసినంత వాంఛ లేకపోతే వారికి అది కష్టం అనిపించవచ్చు. మీరు మంచి జీవితం కోరుకుంటున్నట్లయితే – మంచి జీవితం అంటే ప్రశాంతమైన, ఆనందకరమైన, ప్రేమ పూరితమైన జీవితం – కావాలనుకుంటే ఇన్నర్ ఇంజనీరింగ్, భావస్పందన కార్యక్రమాలు చాలు. కాని మీకు ఈ జీవం మూలాలు తెలుసుకోవాలనుకుంటే, అటువంటి కోరిక తీవ్రంగా కలిగితే, మీరు మరికాస్త గట్టి ప్రయత్నం చేయాలి, దానికే సమ్యమ. అంటే, మీరు మెల్లగా మిమ్మల్ని మీరు ఎలా ప్రక్కన బెట్టుకోవాలో తెలుసుకుంటారు. ఈ సృష్టిలో ‘మీరే’ అసలు ఆటంకం అని తెలుసుకున్నప్పుడే మీరు అది చేయడానికి సుముఖంగా ఉంటారు. అదే సమయంలో కావాలనుకుంటే మీరే ద్వారం కాగలరు. అది ద్వారం లాంటిది. మూసేస్తే అది అడ్డంకి, తెరచి ఉంటే అది మహద్వారం, అవునా? మీరలానే అవుతారు. మీరు దళసరిగా పారదర్శకత లేకుండా తయారయితే, మీరే అడ్డంకి కావచ్చు. తలుపు మూసుకు పోయింది అంటే, నేను అలా సూచన ప్రాయంగా పోల్చి చెప్పినా దాని అర్థం, మీరు ఆ ద్వారం గుండా వెళ్ళలేరని. అక్కడ ఒక ద్వార బంధం(తలుపు) ఉంటే, దానిని తెరచే విధానం ఉండాలి, అవునా? ప్రస్తుతం అది మూసి ఉండవచ్చు, కాని తలుపు అంటూ ఒకటి ఉందంటే అక్కడ ఒక అవకాశం ఉందని. అలాకాక అక్కడ పెద్ద రాతి ఫలకాలు ఉంటే, లాభం లేదు. కాని ప్రస్తుతం అక్కడ ద్వారం ఉన్నది. దానిని ఎవరో మూసి ఉంచారు, కాని కావాలనుకుంటే మీరు దానిని తెరవచ్చు.

మరి సమ్యమ అటువంటి పార్శ్వం - పారదర్శకంగా లేని దానిని మనం పారదర్శకం చేయాలనుకుంటున్నాం. అది సాధ్యం కాదనుకుంటే కనీసం పలుచగా చేయాలనుకుంటున్నాం, దానివల్ల మీరు దానిలోంచి వెళ్ళలేకపోయినా, కనీసం జీవితానికి మరో కోణం ఉందని గ్రహించగలుగుతారు, ఒకసారి మీరు అది చూస్తే, ఇక మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోలేరు. అక్కడకు ఎలానైనా చేరాలనుకుంటారు.

Editor's Note: Learn more about the Samyama program.