సూర్యోదయానికి ముందు రాత్రి చివరి భాగం, లేదా బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత ఏమిటి? "బ్రహ్మణ్" లేదా సృష్టికర్తగా మారడానికి, ఇంకా మీరు కావాలనుకునే విధంగా మిమల్ని మీరు సృజించుకోవడానికి బ్రహ్మ ముహూర్త సమయం అవకాశాన్ని అందిస్తుందని సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: బ్రహ్మముహూర్త నిర్దిష్ట సమయం సరిగ్గా ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి, ఇంకా మేము ఆ సమయంలో మరింతగా శక్తిని ఎలా గ్రహించవచ్చు అన్న విషయం తెలియజేస్తారా?

బ్రహ్మ ముహూర్త  కాలం

మనం సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు రాత్రిగా పరిగణించినట్లయితే, రాత్రి చివరి పాదంలో బ్రహ్మ ముహూర్త సమయం - 3:30 నుండి 5:30 వరకు లేదా 6:00 గంటలకు మధ్య లేదా సూర్యోదయం వరకు.

బ్రహ్మ ముహూర్త సమయంలో ఏం జరుగుతుంది?

ఈ సమయంలో సూర్యునితో, చంద్రునితో గ్రహాలకు ఉన్న సంబంధ స్వభావం వల్ల మానవ వ్యవస్థలో కొన్ని భౌతికపరమైన మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకి మీ శరీరంలోని మూత్రం వంటి వ్యర్ధ పదార్ధాలలో కూడా, రోజులోని ఇతర సమయాల్లో లేని నిర్దిష్ట లక్షణాలు ఈ సమయంలో కలిగి ఉన్నాయని వైద్య శాస్త్రం కనుగొంది.

దీనికి గణనీయమైన పరిశోధన ఉంది. మొత్తం శరీరం ఒక నిర్దిష్ట వాతావరణంలో ఉంటుంది. ఈ సమయంలో మెలటోనిన్ అని పిలవబడే సహజమైన పీనియల్ గ్రంథి స్రావం జరుగుతుంది. మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పీనియల్ గ్రంధి బ్రహ్మ ముహూర్త కాలంలో మెలటోనిన్ ని గరిష్టంగా స్రవిస్తుంది. మీరు సమతుల్యంలోకి వచ్చేందుకు ఇది అనుకూలతను కలిగిస్తుంది.

మీ అంతరంగంలో హాయిగా ఉండడమంటే మీలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉండడమే.

ఆధునిక వైద్యంలో, మెలటోనిన్ ఒక స్థిరమైన మానసిక స్థితిని కలిగించేదిగా గుర్తించబడుతుంది. నేను ఎప్పుడూ మీ అంతరంగంలో హాయిగా ఉండాలని మీ గురించి మాట్లాడుతుంటాను! మీ అంతరంగంలో హాయిగా ఉండడమంటే మీలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉండడమే. బ్రహ్మముహూర్త  సమయంలో ఇటువంటి స్థితి సహజంగానే సంభవిస్తుంది.

ఈ సమయంలో ఎక్కువ శాతం ప్రజలు, వారి ఆధ్యాత్మిక ప్రక్రియలు చేయాలని కోరుకుంటున్నారు. దీనివల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుందని వారికి తెలుసు. బ్రహ్మ ముహూర్త కాలం అంటే సృష్టికర్త సమయం. మీరు దీన్ని ఈ విధంగా చూడవచ్చు: మీరే సృష్టి కర్తగా ఉండే సమయం ఇది. కాబట్టి మిమల్ని మీరు కోరుకున్న విధంగా సృజించుకోగలరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు