సాంప్రదాయికంగా భారతీయులు ఉత్తరదిశగా తలపెట్టి ఎందుకు నిద్రించరో తెల్పుతూ, మనం చక్కగా నిద్రించడానికి, విశ్రాంతి పొందడానికి అవసరమైన మరికొన్ని విషయాలను సద్గురు వివరిస్తున్నారు.

సద్గురు: మన దేశంలో ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవద్దని చెప్తారు. ఎందుకో తెలుసా?

మీ శరీరాన్ని ఎలా నిర్మించారు?

మీ గుండె, మీ శరీరం మధ్యలో ఉండదు. కిందినుండి శరీరానికి మూడు వంతులపైన అది ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, గురుత్వాకర్షణకు వ్యతిరేకదిశలో రక్తాన్ని పంపడం కష్టం, కిందికి పంపడం తేలిక. పైకి వెళ్లే రక్తనాళాలు కిందికి వెళ్లే రక్తనాళాల కంటే సన్నగా ఉంటాయి. అవి మెదడులోకి చేరుకునే సరికి , వెంట్రుక అంత సన్నగా అయిపోయి ఒక్క చుక్క రక్తాన్ని కూడా అధికంగా తీసికొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉండవు. ఒక చుక్క అధికంగా పంపు చేసినా ఏదో ఒకటి పగిలిపోయి మీకు రక్తస్రావం జరుగుతుంది.

చాలామందికి వారి మెదళ్లలో రక్తస్రావం కలుగుతుంది. మిమ్మల్నిది పెద్దగా దెబ్బతీయక పోయినా చిన్న నష్టాలు మాత్రం కలిగిస్తుంది. మీరు కొంత మందబుద్దులుగా అవుతారు, చాలామంది అలానే అవుతున్నారు కదా. 35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది. మీ వ్యవహారాలు మీరు నడుపుకోగలగడానికి కారణం మీ జ్ఞాపకశక్తే తప్ప, మీ మేధస్సు కాదు.

మీరు ఉత్తరదిశగా తలపెడితే ఏం జరుగుతుంది?

మీకేదయినా రక్తసంబంధమైన సమస్య, ఉదాహరణకు రక్తహీనత ఉంటే మీ డాక్టరు, మీకు ఏమిస్తాడు? ఇనుము. మీ రక్తంలో అదొక ముఖ్యమైన పదార్థం. భూగోళం మీద అయస్కాంత క్షేత్రాల  గురించి మీరు వినే ఉంటారు. అనేక విధాలుగా భూమి నిర్మాణం దాని అయస్కాంత కారణంగానే జరిగింది. ఈ భూగోళం మీద అయస్కాంత శక్తుల శక్తి అది.

35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది. 

మీ శరీరం బల్లపరుపుగా ఉన్నప్పుడు మీ నాడి వేగం తగ్గిపోవడం మీరు గమనించవచ్చు. మీ శరీరం వెంటనే సర్దుబాటు చేసుకుంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది. లేకపోతే అదే స్థాయిలో రక్తప్రసరణ జరిగినట్లయితే రక్తం మీ మెదడులోకి అధికంగా వెళ్లి హాని చేస్తుంది. మీరు ఉత్తరానికి తలపెట్టి, 5, 6 గంటలు పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు కొంత వయస్సు మళ్ళితే మీ రక్తనాళాలు బలహీనమై రక్తస్రావాలు కలుగుతాయి, పక్షవాతం వస్తుంది. మీ వ్యవస్థ దృఢంగా ఉండి ఇటువంటి సంఘటనలు మీకు జరగకపోవచ్చు కాని మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడులో ఉండవలసిన దానికంటే ఎక్కువ రక్తప్రసరణ జరిగితే మీరు ఆందోళనతో మేల్కోవలసి వస్తుంది. ఇలా జరిగితే ఒక్కరోజులో మీరు చచ్చిపోతారని కాదు. కాని మీరు రోజూ ఇదేవిధంగా చేస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మీ వ్యవస్థ ఎంత దృఢంగా ఉందన్నదాన్ని బట్టి మీకు వచ్చే సమస్యల స్వభావం ఉంటుంది.

అందువల్ల మీరు ఏవైపు తలపెట్టి నిద్రించడం అన్నిటికంటే మంచిది? తూర్పు అన్నిటికంటే మంచిది. ఈశాన్యం పరవాలేదు, పడమర కూడా మంచిదే. తప్పనిసరి అయితే దక్షిణం. ఉత్తరం మాత్రం కూడదు. మనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్నప్పుడు మీరు ఉత్తరానికి తప్ప మరేవైపైనా తలపెట్టుకొని నిద్రపోవచ్చు. దక్షిణార్ధ గోళంలో ఉన్నప్పుడు దక్షిణానికి మాత్రం తలపెట్టకూడదు.

మీరు లేచినప్పుడు ఒక్కసారిగా క్రియాకలాపం పెరుగుతుంది. అందువల్ల మీరు కుడివైపుకు దొర్లి లేవాలి. 

పడకకు కుడి ఎడమలు

మీ శరీరతత్త్వంలో మీ గుండె ఒక ప్రధాన అవయవం. ఇదే మీ శరీరంలోని అన్ని ప్రదేశాలకూ రక్తాన్ని ప్రసారం చేస్తుంది – ఇదే జరక్కపోతే ఏమీ జరగదు – ఈ రక్తం పంపింగు చేసే స్థానం మీలో ఎడమ పక్కన ఉంటుంది. మనదేశంలో మన సంస్కృతి ఏం చెప్తుందంటే పడకమీది నుండి లేచేటప్పుడు కుడి వైపుకు దొర్లి లేవాలని. మీ శరీరం ఒక విధమైన విశ్రాంత భంగిమలో, స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియకు అవసరమైన క్రియాకలాపం తక్కువగా ఉంటుంది. మీరు లేచినప్పుడు ఒక్కసారిగా క్రియాకలాపం పెరుగుతుంది. అందువల్ల మీరు కుడివైపుకు దొర్లి లేవాలి. ఎందుకంటే జీవక్రియాకలాపం తక్కువగా ఉన్నప్పుడు మీరు అకస్మాత్తుగా ఎడమకు మర్లితే మీ హృదయవ్యవస్థ మీద ఒత్తిడి పడుతుంది.

మీ శరీరాన్ని, మెదడును క్రియాశీలం చేయండి

సంప్రదాయంలో మనం ఉదయం మేల్కొన్నప్పుడు చేతుల్ని రుద్దుకుని, మన అరచేతుల్ని కన్నులమీద ఆన్చుకొవాలని కూడా చెప్తారు. మీరలా చేస్తే దేవుణ్ణి చుస్తారని వాళ్లు చెప్తారు. అది దేవుణ్ణి చూడడం గురించి కాదు.

మీ చేతుల్లో నరాల కొనలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి. మీరు మీ అరచేతుల్ని ఒకదానితో ఒకటి రుద్దినట్లయితే నరాల కొనలు క్రియాశీలమై మీ వ్యవస్థ తక్షణమే మేల్కొంటుంది. మీరు ఉదయం లేచి ఇంకా మత్తుగా, నిద్ర వదలని స్థితిలో ఉంటే ఇలా ప్రయత్నించి చూడండి, వెంటనే మీ శరీరం మొత్తం మేలుకొంటుంది. తక్షణమే మీ కన్నులకు తక్కిన ఇంద్రియాలకు అనుసంధింపబడిన నరాలన్నీ మేల్కొంటాయి.  మీరు మీ శరీరాన్ని కదిలించడానికి ముందే మీ శరీరమూ, మెదడూ కూడా క్రియాశీలం కావాలి. మీరు మొద్దులాగా మేలుకోకూడదన్నది ఆలోచన.

ప్రేమాశిస్సులతో.
సద్గురు