Table of Content
1. నాగ పంచమికి ఉన్న ప్రాముఖ్యత ఎందుకు తగ్గింది
2. యోగా పరంగా నాగ పంచమికి ఉన్న ప్రాముఖ్యత మరియు మానవ పరిణామ క్రమంలోని మూడు స్థాయిలు
2.1 స్వాన లేదా కుక్క - మనుగడలో నేర్పరి
2.2 కాక లేదా పక్షి - జ్ఞానం ఇంకా సున్నితత్వం
2.3 నాగ లేదా పాము - పంచేంద్రియాలకు అతీతమైన గ్రాహ్యత
3. ఆధ్యాత్మికతలో పాముకున్న విశిష్టత
4. ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులలో పాముకున్న ప్రతీకాత్మకత
5. నాగుపాముకు ఉన్న పన్నెండు పార్శ్వాలు
6. పురాణాలలో ఉన్న ఆదిశేషుడు అనే పాము
7. నాగపంచమి - సద్గురు రచించిన కవిత

నాగ పంచమికి ఉన్న ప్రాముఖ్యత ఎందుకు తగ్గింది

సద్గురు: నాగ పంచమి లేదా నాగుల పంచమిగా దక్షిణ భారతదేశంలో పిలువబడే ఈ పండుగ, ఒకప్పుడు భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా ఉండేది. ఈ పండుగకున్న ప్రాముఖ్యత తగ్గడానికి గల ఒక కారణం, మనం మరింత తార్కికంగా మారడం. జీవితంలోని కొన్ని అంశాలు మన తర్కానికి అంతుచిక్కవు, దాంతో మనం వాటిని వదిలేస్తాము. ప్రపంచవ్యాప్తంగా, ప్రతిచోటా యూరోపియన్ విద్యా విధానం ప్రామాణిక విద్యా విధానంగా మారినప్పటి నుండి ఇలా జరుగుతూ వచ్చింది. ఇది సౌకర్యాలు, సుఖాల విషయంలో ఒక విధమైన అభివృద్ధికి దారితీసింది. కానీ, ఇటువంటి జీవిత ధోరణలకున్నపర్యవసానాలను మీరు గమనిస్తే, మనం జీవించే ఈ భూగ్రహాన్నే మనం నాశనం చేస్తున్నామని మీకు అర్థమౌతుంది.

ఒకప్పటి సంస్కృతిలో - అది ఈశా యోగా కేంద్రంలో ఇప్పటికీ సజీవంగానే ఉంది - ఎలా ఉండేదంటే, ఒక రాయిపై చాలా సౌకర్యవంతంగా కూర్చోగలిగే విధంగా మన శరీరాలను, మనస్సులను ఇంకా శక్తులను మలచుకునేవాళ్ళమి. కుషన్ తో అవసరం ఉండేది కాదు. ఒకవేళ అక్కడ కుషన్ ఉంటే, దాన్ని ఆస్వాదిస్తాం; కానీ మనం ఎన్నడూ దానికోసం పరితపించం. ఎందుకంటే ఇక్కడ మనం సౌకర్యాలు, సౌలభ్యాలు అనే అంశాలను, ఎప్పుడూ తార్కిక విధంగా చూడలేదు. మనం వాటిని జీవితానుభూతి పరంగా చూసాము. మనం పూర్తి పారవశ్యంతో ఉండి అద్భుతమైన అనుభూతిని పొందుతున్నప్పుడు, ఒక రాయిపై కూర్చుని కూడా చాలా సౌకర్యంగా ఉండగలమని మనకు తెలుసు. మనం విచారంగా, నిరుత్సాహంగా ఉన్నప్పుడు, ప్రపంచంలోని అతి మెత్తటి పరుపు కూడా అసౌకర్యంగానే అనిపిస్తుంది. అది మీకు సౌకర్యాన్ని కలిగించదు. ఎందుకంటే, జీవితాన్ని విభజించి గ్రహించగలిగే ప్రక్రియగా మీరు దాన్ని అపార్థం చేసుకున్నారు. తర్కం అనే కత్తితో ప్రతిదానిని కోసి, దాని గురించి అంతా తెలుసుకోగలం అని మనం అనుకుంటాం. ఈ ధోరణి వల్ల మనం మూల్యం చెల్లించాం, ఇంకా చెల్లిస్తూనే ఉన్నాం. మనం కొన్ని విషయాలను సరి చేయకపోతే, రాబోయే తరాలు ఇందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది

కలహాలు, యుద్ధం, ఆకలి, అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణ క్షీణత రూపంలో ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు కారణం, జీవితం పట్ల మన అవగాహన తర్కపరమైనదిగా ఉండడం. జీవితాన్ని అది ఉన్న విధంగా చూడడానికి మనం సుముఖంగా లేము. మన మనస్సు అనే సన్నని సూది మొనలో ఈ విశ్వమంతా పట్టాలని మనం కోరుకుంటాం. జీవితాన్ని గురించిన మన అవగాహన మరింత సమగ్రంగా ఉన్న సమయంలో, ఈ సంస్కృతిలో నాగ పంచమి అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా ఉండేది.

యోగా పరంగా నాగ పంచమికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా మానవ పరిణామక్రమంలోని మూడు స్థాయిలు

 జీవ పరిణామ క్రమంలో, మూడు పరిణామ స్థాయిలను యోగ వ్యవస్థ చాలా ముఖ్యమైనవిగా గుర్తిస్తుంది. ఒక అమీబా నుండి మీరిప్పుడున్న స్థితి వరకు జరిగిన పరిణామ క్రమంలో ఉన్న మూడు జంతువులు, మీలో వివిధ మార్గాల్లో భిన్న అంశాలను సూచిస్తూ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. వీటిని స్వాన, కాక, నాగ అని అంటారు. పరిణామ క్రమంలోని ఈ మూడు దశలను మీలో ఉన్న ముఖ్యమైన మైలురాళ్ళుగా యోగ శాస్త్రం గుర్తిస్తుంది, నాగ పంచమి దీనిలోని ఒక నిర్దిష్ట అంశాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో తెలివిగా ఉండాలని కోరుకునే వారికి - స్వాన. జీవితం గురించి స్థూలదృష్టిని కలిగి, తాము తెలివైనవారమనే అనుభూతిని పొందాలనుకునే వారికి - కాక. జీవితంతో పూర్తిగా నిమగ్నమవ్వాలనుకునే వారికి - నాగ.  

#1 స్వాన లేదా కుక్క - మనుగడలో నేర్పరి 

స్వాన అంటే కుక్క. ఇది ఒక క్షీరదం, తన మనుగడ ప్రక్రియలో అది గొప్ప నేర్పరి. ఎంతో కాలంగా, కుక్క మనిషికి మంచి స్నేహితుడు అని అంటున్నారు. మనుషులు కుక్కను పెంపుడు జంతువుగా పెంచేవారు. ఎందుకంటే, కుక్క ఆరుబయట ఉన్నప్పుడు తన మనుగడ విషయంలో తెలివిగా ఉంటుంది. వాసన ఇంకా వినికిడి పరంగా కుక్క చాలా గ్రహణ శక్తిని కలిగి ఉంటుంది. యోగాకు సంబంధించినంత వరకు, కుక్క స్వభావం దాని శ్వాస ఇంకా మెదడుకు సంబంధించినది. మీలోని స్వాన స్వభావం మీ మెదడులోని కొన్ని అంశాలను ప్రేరేపించడం వల్ల మీ మనుగడ ప్రక్రియ బాగా మెరుగుపడి మీరు తెలివిగా అవుతారు. తెలివితేటలను మేధస్సుగా అపార్థం చేసుకోకండి. మేధస్సు అనేది అంతటినీ అక్కున చేర్చుకునే ప్రక్రియ. తెలివిగా ఉండటం అంటే మరొక దానితో పోటీపడటం లేదా మరొకరి కంటే మెరుగ్గా ఉండే ప్రయత్నం చేయడం

ఈ పార్శ్వం మీలో ఉంది కనుక మీ శ్వాసను నిర్దిష్ట మార్గంలో నిర్వహించడం ద్వారా స్వాన సచేతనమయ్యి, మీ మెదడులోని మనుగడ ప్రవృత్తులను మెరుగుపరుస్తుంది. ఎందుకంటే మీ శ్వాస ఇంకా మెదడు ఆ అంశంతో అనుసంధానమై ఉంటాయి

#2 కాక లేదా పక్షి - జ్ఞానం ఇంకా సున్నితత్వం

తరువాతి స్థాయి కాక. కాక అంటే కేవలం కాకి కాదు, ఒక పక్షి. స్వాన లేదా కుక్కలో వాసన ఇంకా వినికిడి స్వభావం ప్రబలంగా ఉంటుంది. కానీ పక్షిలో, దృష్టి ఇంకా స్పందనలు ప్రధానమైన అంశాలు.

పక్షికి ఒకదైన దృష్టి ఉంటుంది. పైకి ఎగురుతుండటం వల్ల దూరంలో ఉంటుంది కాబట్టి అది విషయాలను ఒక నిర్దిష్ట రీతిలో చూడాల్సి ఉంటుంది. ఇది ఒక విధమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక్కో సమాజంలో, ఒక్కో పక్షిని తెలివైనదిగా గుర్తించారు. భారతదేశంలో, కాకులు పూర్వీకుల జ్ఞానం కలిగి ఉన్న పక్షులుగా గుర్తించబడతాయి. కొన్ని ఇతర సంస్కృతులలో, గుడ్లగూబలు తెలివైనవిగా గుర్తించబడ్డాయి. భారతదేశంలో, గుడ్లగూబను తెలివితక్కువదని భావిస్తారు. ఇదంతా సంస్కృతికి సంబంధించినది. కానీ మీరు గనుక ఏ విషయాన్నైనా పక్షికి ఉండే దృష్టికోణంతో చూస్తే , సహజంగానే మీరు మేధావంతులు అవుతారు. ఎందుకంటే, భూమిపై నడుస్తున్న వారికి కనబడని పెద్ద చిత్రం మీకు కనిపిస్తుంది. కాబట్టి, మీరు ప్రపంచంలోని విషయాల గురించి అధిక జ్ఞానాన్ని కోరుకుంటే, మీలోని కాకాను సచేతనం చేయాలి.

మరో అంశం స్పందన. పక్షి శరీరం ఈకలతో కప్పబడి ఉంటుంది. కానీ ఈకలు నిజంగా జీవం కాదు. ఈకలు సజీవంగా ఉంటాయి, కానీ శరీరంలోని మిగిలిన భాగం ఉండే విధంగా కాదు. అవి మీ జుట్టు వంటివి. పక్షికి చాలా లోతైన స్పందనను కలిగించే విధంగా ఈకలు, వాటి శరీరంలో భాగమై ఉంటాయి. పక్షి రాత్రిపూట నిద్రిస్తుంన్నప్పుడు పాము చెట్టుపైకి పాకుతూ ఉంటే, కేవలం ఆ కదలికలకే పక్షిలో స్పందనలు కలుగుతాయి. నేను చెట్ల మీద చాలా రోజులు పడుకున్నాను, కాబట్టి నేను దీనిని చూశాను. కళ్ళు మూసుకునే, అవి చెట్టుపై నుండిదూకుతాయి. నిద్రలోనే కొమ్మ అంచుకు వెళ్లి దూకుతాయి. మీలో నిద్రలో నడిచేవారికి నేను ఏం మాట్లాడుతున్నానో అర్థమౌతుంది. వారు చుట్టూ జరిగే చిన్న విషయాలను కూడా గమనిస్తారు, ఎందుకంటే వారిలో చాలా లోతైన స్పందనలు కలుగుతాయి.

#3 నాగ లేదా పాము - పంచేంద్రియాలకు అతీతమైన గ్రాహ్యత 

మూడవ స్థాయి నాగ లేదా సర్పం. భౌతికంగా, మీరు ఎవరు అనే ఆంతరంగిక అంశాలతో ఇది అనుసంధానమై ఉంటుంది. శరీరంలోని కణజాల ప్రక్రియలు ఇంకా రక్తం కదలికలు నాగ అంశానికి సంబంధించినవి. వినికిడి, వాసన, దృష్టి ఇంకా స్పందనల పరంగా మీ ఇంద్రియాలను పదును పెట్టడానికి స్వాన ఇంకా కాక సహాయపడతాయి. కానీ నాగ, ఇంద్రియాలు గ్రహించలేని పార్శ్వాన్ని సూచిస్తుంది. అందుకే యోగ సంస్కృతిలో, అత్యధిక శ్రద్ధ నాగాకి ఇవ్వబడింది. పంచేంద్రియాలు ఎప్పుడైతే విఫలమవుతాయో, అప్పుడు నాగ పని మొదలవుతుంది.  

ఆధ్యాత్మికతలో పాముకున్న విశిష్టత 

మేధస్సు, గ్రహణ శీలత అనే రెండు అంశాలు ఉన్నాయి. మీరు మీ మేధస్సుని శక్తివంతం చేస్తే, చాలా తెలివైనవారు అవుతారు. కానీ అందుకు మీ చుట్టూ మూర్ఖులు ఉండాలి, లేకపోతే మీరు తెలివైనవారు ఎలా అవుతారు? జీవితంపై నాకున్న అవగాహన ప్రకారం, కోట్ల కొద్దీ డబ్బును కూడబెట్టుకోవడమనేది మీరు చేయగల అతి మూర్ఖపు పని. ఎందుకంటే ఈ ప్రపంచంలో తప్ప మరెక్కడా బ్యాంకింగ్ సేవలు లేవని నాకు తెలుసు. అలానే నా సమయం ఇక్కడ పరిమితం అని కూడా నాకు తెలుసు. కోట్ల డాలర్లను ఎందుకు సంపాదించాలి? దేని కోసం? కానీ ప్రజలు అది తెలివైన పని అనుకుంటారు. అందుకే అన్నాను, "మీరు తెలివైన వారు అనిపించుకోడానికి మీ చుట్టూ మూర్ఖులు ఉండాలి" అని. కానీ మీ జీవితం పూర్తి వైభవంతో జరిగేందుకు మీరు అనుమతిస్తే కనుక, మీరు సమాజంలో తెలివైనవారుగా పరిగణించబడరు. ఇక్కడ కళ్ళు మూసుకుని కూర్చుంటే, మీరు తెలివైనవారూ కాదు, అలాగే మూర్ఖులూ కాదు. మీరు కేవలం జీవం మాత్రమే, అదే ముఖ్యమైనది. మీరు ఎంత శక్తివంతమైన, ఉత్సాహ భరితమైన, ఆనందమయమైన, ఇంకా అద్భుతమైన జీవంగా ఉన్నారు అన్నదే ముఖ్యం. ఈ ప్రయత్నంలో, నాగ చాలా ముఖ్యమైనది.. 

ఎక్కడైతే ప్రజలు ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని గడిపారో ఇంకా పంచేంద్రియాలకు మించినదాన్ని గ్రహించారో అక్కడ నాగా కు ప్రాముఖ్యత ఇవ్వబడింది.

పాము ప్రాముఖ్యతను ఈ విధంగా చూడవచ్చు. మీరు తార్కికంగా ఉన్నప్పుడు, మీరు జీవితాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు చాలా సహజ జ్ఞానంతో గ్రహణశీలతతో ఉన్నప్పుడు, మీరు ఎవరు అనే దాని పరిమితులు మీకు తెలిసినందున, జీవితం మిమ్మల్ని గ్రహించడానికి సుముఖత చూపుతున్నారు. ఇప్పుడు కూడా, జీవితాన్ని మీరు నడుపుతున్నారు అనుకోకండి, జీవితం దానంతట అదే మీకు జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న అతి గొప్ప విషయం జీవితం, దాని గురించి సందేహమే లేదు. జీవితం మీ ప్రమేయం లేకుండా జరుగుతున్నప్పుడు, మీ శరీరాన్ని సజీవంగా ఉంచడానికి మీరు చేయవలసిందల్లా మీ కడుపులో ఏదోకటి పడేయడమే. దానికోసం ఎంత హంగామా

మనం పాము అంశంపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలా జరుగుతుంది, జీవితం మనల్ని పెనవేసుకోడానికి మనం అనుమతించడం లేదు. మనం దానిని "పొందడానికి" ప్రయత్నిస్తున్నాము. దీన్ని మీరు కొంచెం సడలిస్తే, జీవితం ఎప్పుడూ మిమ్మల్ని పెనవేసుకుని ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్కృతులలో పాముకున్న ప్రతీకాత్మకత 

ఎక్కడైతే ప్రజలు ఎక్కువ సమయం కళ్ళు మూసుకుని గడిపారో ఇంకా పంచేంద్రియాలకు మించినదాన్ని గ్రహించారో, అక్కడ నాగాకు ప్రాముఖ్యత ఇవ్వబడింది. జీవ పరిణామ ప్రక్రియకు ఆనవాళ్ళుగా మనలో మిగిలిపోయిన ఈ పార్శ్వం యొక్క ప్రాముఖ్యతను వారు గుర్తించారు. ఇంద్రియాలకున్న పరిధులకు అతీతంగా ఒక వ్యక్తి పరిణతి చెందడానికి ఈ పార్శ్వాన్ని సచేతనం చేయడం ఎలానో తెలుసుకున్నారు. అన్ని సంస్కృతులలో పాము గురించి పౌరాణిక వర్ణనలతో లెక్కలేనన్ని కథలు ఉన్నాయి, ఇందుకు ఏ సంస్కృతీ మినహాయింపు కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కళాఖండాల రూపాల్లో మీరు ఈ చిహ్నాలను చూడవచ్చు. ఇవి ఆయా జాతుల వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో పాములు ఎలా ముఖ్యమైన పాత్ర పోషించాయో చెప్తాయి. రష్యా, చైనా, ఆఫ్రికా, ఈజిప్ట్, గ్రీస్, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఇంకా భారతదేశం - ఇలా వివిధ ప్రాంతాలలో పామును గురించిన చిహ్నాలు ఉన్నాయి

నాగుపాముకు ఉన్న పన్నెండు పార్శ్వాలు 

భారతదేశంలో పూజింపబడే నాగకి పన్నెండు పార్శ్వాలు ఉంటాయి. వీటిని అనంత, వాసుకి, శేష, పద్మ, కంబళ, కర్కోటక, అశ్వత్ర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, ఇంకా పింగళ అని అంటారు. ఈ పన్నెండు అంశాలు క్యాలెండర్‌లోని పన్నెండు అంశాలకు కూడా సంబంధించినవి.

పురాణాలలో ఉన్న ఆదిశేషుడు అనే పాము 

శివుని కంఠం చుట్టూ ఉండే పాముని వాసుకి అంటారు. విష్ణువు వద్ద ఉండే పాముని శేష అంటారు. స్థానిక భారతీయ భాషలలో, "శేష" అనేది భారతీయ గణితంలో మిగులును సూచించే ఒక సాధారణ పదం. ఈ పదం ‘శేషం’ కోసం ఉపయోగించబడుతుంది. ఎందుకంటే, ఒక సృష్టి ముగిసినప్పుడు, దానికి సంబంధించిన ప్రధాన అంశం ఒకటి మిగిలి ఉంటుంది. అది మరొక సృష్టిగా రూపు చెందుతుంది. ఈ శేషువుపైనే విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. అంటే తనకు నిర్వహించడానికి సృష్టి లేనప్పుడు, అతను శేష లేదా శేషం మీద విశ్రాంతి తీసుకుంటాడు అని అర్థం.

దీని గురించి ఇంకా లోతుగా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడున్న సమస్య ఏమిటంటే నేను ఆంగ్ల భాషలో మాట్లాడాలి, అలానే అది మీకు తార్కికంగా అనిపించాలి. మనం బాగా జీవించడానికి తర్కం ఒక శక్తివంతమైన సాధనం, కానీ తర్కం జీవితంలోని ప్రతి అంశాన్ని గ్రహించ గలిగేంత శక్తివంతమైనది కాదు. మీ ప్రస్తుత ఉనికి స్వభావానికి అతీతంగా ఉన్న దానివైపు మిమ్మల్ని నడిపించేటంత శక్తివంతమైనది కాదు.

ఆదిశేషుడు తన చుట్లు విప్పితే, కాలం ముందుకు సాగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. అంటే మునుపటి సృష్టి నుండి మిగిలిపోయిన శేషం ఉండడం వల్ల, అది చుట్లు విప్పడం ప్రారంభిస్తుంది అందుకే దాన్ని ఆదిశేష అంటారు, అదే మొదటి శేషం కాబట్టి. అది చుట్లు విప్పడం అంటే, మరొక సృష్టి ఆరంభం అర్థం. జీవితంలోని అతి ముఖ్యమైన అంశాన్ని ఇలా ప్రతీకాత్మకంగా వ్యక్తపరిచేవారు.

నాగుల పంచమి లేదా నాగ పంచమి దీనిని సూచిస్తుంది. తమ భౌతికత్వానికి, పంచేంద్రియాలకు అతీతంగా జీవితాన్ని శోధించి, తెలుసుకోవాలనుకునే వారికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఇది కేవలం అనుభూతి చెందడం, గ్రహించడం లేదా ముక్తి పొందడం గురించి మాత్రమే కాదు - ఇది తెలుసుకోవడం గురించి. బహుశా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అనుకోకపోవచ్చు. కొంతమంది కేవలం స్వేచ్చను పొందాలని కోరుకుంటారు, తెలుసుకోవాలనుకోరు. అది పర్వాలేదు. కానీ తెలుసుకోవాలనుకునే వారికి, జీవ పరిణామ ప్రక్రియ యొక్క శేషంగా తమలో ఉన్న ఈ అంశం చాలా ముఖ్యమైనది. ఈ ప్రతీకవాదంతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా, మీరు ఆ అంశాన్ని చైతన్యపరచాలి. మీరు పంచేంద్రియాలకు అతీతమైన దానిని తెలుసుకోవాలంటే, మీలోని ఆదిశేషుడు చుట్లు విప్పి కదలడం ప్రారంభించాలి.

ఈ అంశానికి భారతీయ సంస్కృతిలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉండడం వల్లే, పామును ఎన్నడూ చంపేవారు కాదు. ఒకవేళ అనుకోకుండా పామును చంపితే, మనిషికి చేసినట్లుగానే పాముకు కూడా సరైన పద్దతిలో అంత్యక్రియలు చేసేవారు. ఎందుకంటే, వారు పాముకు ఉన్న కొన్ని అంశాల ప్రాముఖ్యతను గుర్తించారు.  

నాగ పంచమి

అసలు సర్పమే లేకపోతే,ఆదియోగికి
కదిలే ఆభరణం ఉండేది కాదు.
మొదటి మూర్ఖపు జంట, తమ ప్రాథమిక
భౌతిక అవసరాలు కూడా నిరాకరించబడినవారై
కాళ్ళూ వేళ్ళూ ఊరికే ఆడిస్తూ అలా ఉండిపోయేవారు.
నేను, ఈ సృష్టి ఇంకా సృష్టికర్త
మార్గాలను తెలుసుకో గలిగే వాడిని కాదు.
అలాగే ఆ శివుని ఇచ్ఛను త్వరితం చేయడానికి
ఇంకా అది సజావుగా జరిగేలా చేయడానికి
గేర్లు ఎప్పుడు మార్చాలో నాకు తెలిసేది కాదు

ఒకవేళ సర్పమే లేకపోతే