సద్గురు: పదిహేను వందల సంవత్సరాల క్రితం చైనాలో ‘వూ’ అనే చక్రవర్తి ఉండేవాడు. అతను బౌద్ధమతానికి గొప్ప పోషకుడు. అంతేకాదు భారతదేశం నుండి ఒక గొప్ప బౌద్ధ గురువు వచ్చి బౌద్ధమత సందేశాన్ని చైనాలో వ్యాప్తి చేయాలని అతను కోరుకున్నాడు. బౌద్ధమతం తన దేశంలోని ప్రజలకు వ్యాప్తి చెందేలా చూడడానికి అతను విస్తృతమైన కృషి ప్రారంభించాడు. ఈ సన్నాహాలు చాలా సంవత్సరాలు సాగాయి, చక్రవర్తి వేచి ఉన్నారు, కానీ గురువు రాలేదు.

చక్రవర్తికి అరవై ఏళ్లు పైబడినప్పుడు ఒక రోజు ఇద్దరు గొప్ప సంపూర్ణ ఆత్మజ్ఞానం కలిగిన గురువులు హిమాలయాలను దాటి వచ్చి చైనాలో సందేశాన్ని వ్యాప్తి చేస్తారన్న సందేశం పంపబడింది. అక్కడ గొప్ప ఉత్కంఠ నెలకొంది. చక్రవర్తి వారి రాకను ఊహించి పెద్ద వేడుకను సిద్ధం చేశాడు. కొన్ని నెలల నిరీక్షణ తర్వాత చైనా రాజ్య సరిహద్దులో ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు బోధిధర్మ ఇంకా అతని శిష్యులలో ఒకరు.

బోధిధర్మ ఏమి చేసాడు?

బోధిధర్మ దక్షిణ భారతదేశంలోని పల్లవ రాజ్యంలో యువరాజుగా జన్మించాడు. అతను కాంచీపురం రాజ కుమారుడు. కానీ చిన్న వయస్సులోనే తన రాజ్యాన్ని ఇంకా యువరాజ భోగాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. ఇరవై రెండు సంవత్సరాల వయసులో అతను పూర్తిగా జ్ఞానోదయం పొందాడు. అప్పుడు అతను చైనాకు దూతగా పంపబడ్డాడు. ఆయన రాక గురించిన వార్త తెలియగానే వూ చక్రవర్తి స్వయంగా తన సామ్రాజ్య సరిహద్దుల వద్దకు వచ్చి భారీ స్వాగతాన్ని ఏర్పాటు చేసి వేచి ఉన్నాడు.

సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన ఈ సన్యాసులు వచ్చినప్పుడు వూ చక్రవర్తి వారిద్దరినీ చూసి చాలా నిరాశ చెందాడు. జ్ఞానోదయంపొందిన వ్యక్తి రాబోతున్నాడని తెలుసుకుని ఏదో ఆశించాడు కానీ వచ్చిన వ్యక్తి కేవలం ఇరవై రెండు సంవత్సరాల బాలుడు. పర్వతాలలో కొన్ని నెలల ప్రయాణంతో అలసిపోయిన బోధిధర్మ నిజంగా అంతగా ఆకర్షణీయంగా లేడు.

చక్రవర్తి నిరాశ చెందాడు కానీ అతను తన నిరాశను తనలోనే దాచుకుని, ఇద్దరు సన్యాసులనూ స్వాగతించాడు. అతను వారిని తన శిబిరంలోకి ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి ఆహారం ఇచ్చాడు. తనకు లభించిన మొదటి అవకాశంలో చక్రవర్తి వు బోధిధర్ముడిని “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా?” అని అడిగాడు.

 బోధిధర్మ "ఏదైనా సరే, అడగండి" అన్నాడు.

 వూ చక్రవర్తి "ఈ సృష్టికి మూలం ఏమిటి?" అని అడిగాడు.

bodhidharma

బోధిధర్మ అతని వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, “అది ఏమి మూర్ఖపు ప్రశ్న? ఇంకేమైనా అడగండి.”

వూ చక్రవర్తి కోపంతో రగిలిపోయాడు. అతని దగ్గర బోధిధర్మను అడగదలచుకున్న ఒక ప్రశ్నల జాబితానే ఉంది. అతను లోతైనవి ఇంకా ప్రఘాడమైనవిగా భావించిన ప్రశ్నలు అవి. అతను ఈ ప్రశ్న గురించి చాలా వాదనలు ఇంకా చర్చలు జరిపాడు. ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చిన ఈ మూర్ఖపు బాలుడు దానిని మూర్ఖపు ప్రశ్న అని కొట్టిపారేశాడు. అతను మనస్తాపం చెంది కోపంగా ఉన్నాడు. కానీ అతను తనను తాను తమాయించుకుని “సరే, నేను మిమ్మల్ని రెండవ ప్రశ్న అడుగుతాను. నా ఉనికికి మూలం ఏమిటి?" అని అడిగాడు.

ఇప్పుడు బోధిధర్మ మరింత బిగ్గరగా నవ్వుతూ, “ఇది పూర్తిగా తెలివితక్కువ ప్రశ్న. ఇంకేమైనా అడగండి.”  అన్నాడు. భారతదేశంలోని వాతావరణం గురించి లేదా బోధిధర్మ ఆరోగ్యం గురించి చక్రవర్తి అడిగితే బోధిధర్మ సమాధానం చెప్పేవాడు. కానీ ఈ మనిషి “సృష్టికి మూలం ఏమిటి? నేను ఎవరు అనేదానికి మూలం ఏమిటి?" అని అడిగాడు. అతను దీన్ని తోసిపుచ్చాడు.

జెన్‌ను చైనాకు తీసుకువచ్చింది బోధి ధర్మ.

ఇప్పుడు వూ చక్రవర్తి నిజంగా కోపంగా ఉన్నాడు. కానీ అతను తనను తాను నియంత్రించుకుని మూడవ ప్రశ్న అడిగాడు. అతను తన జీవితంలో చేసిన అన్ని మంచి పనుల జాబితాను రూపొందించాడు - అతను ఎంత మందికి ఆహారం ఇచ్చాడు, ఎన్ని పనులు చేసాడు, అతను చేసిన అన్ని దానాల గురించి చెప్పి, చివరికి అతను ఇలా అడిగాడు “ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను చాలా ధ్యాన మందిరాలు, వందలాది ఉద్యానవనాలు నిర్మించాను ఇంకా వేలాది మంది అనువాదకులకు శిక్షణ ఇచ్చాను. ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నాకు ముక్తి లభిస్తుందా?"

ఇప్పుడు బోధిధర్మ గంభీరంగా, లేచి నిలబడి తన పెద్ద పెద్ద కళ్ళతో చక్రవర్తి వైపు చూస్తూ, “ఏమిటి? మీకా! ముక్తా? మిమల్ని ఏడవ నరకంలో కాలుస్తారు"

అతను చెప్పేది ఏమిటంటే బౌద్ధ జీవన విధానం ప్రకారం మనస్సుకు ఏడు పొరలు ఉన్నాయి. కేవలం అవసరమైనది చేయడమే కాకుండా, ఒక వ్యక్తి ఏదైనా చేసి, “నేను ఎవరి కోసం ఎంత చేశాను” అని లెక్కలు వేసుకుంటే అతను మనస్సులోని అత్యల్ప స్థాయిలో ఉంటాడు ఇంకా అతనితో ప్రజలు మంచిగా ప్రవర్తించాలి అని ఎదురు చూస్తున్నందున అతను అనివార్యంగా బాధపడతాడు. అతనితో మంచిగా లేకపోతే మానసికంగా కుంగిపోయి ఏడవ నరకాన్ని అనుభవిస్తాడు.

కానీ వూ చక్రవర్తికి ఇవేమీ అర్థం కాలేదు. అతను కోపంతో రగిలిపోయి బోధిధర్మను తన సామ్రాజ్యం నుండి తరిమివేశాడు. బోధిధర్మకు ఎటువంటి తేడా అనిపించలేదు - లోపల లేదా బయట. అది రాజ్యమైనా లేక పర్వతమైనా పట్టింపు లేదు; అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కానీ చక్రవర్తి వూ తన జీవితంలోని ఏకైక అవకాశాన్ని కోల్పోయాడు.

బోధిధర్మ ఎవరు?

జెన్‌ని చైనాకు తీసుకువచ్చినవారు బోధిధర్మ. గౌతమ బుద్ధుడు ధ్యాన్ లేదా ధ్యానాన్ని బోధించాడు. వందల సంవత్సరాల తర్వాత బోధిధర్మ ధ్యానాన్ని చైనాకు తీసుకువచ్చాడు. అక్కడ అది చాన్‌గా మారింది. ఈ చాన్ ఇండోనేషియా, జపాన్ ఇంకా ఇతర సుదూర తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి అక్కడ జెన్‌గా మారింది.

వూ చక్రవర్తి అతన్ని సామ్రాజ్యం నుండి బయటకు పంపిన తరువాత బోధిధర్మ పర్వతాలలోకి వెళ్ళాడు. అక్కడ అతను కొంతమంది శిష్యులను సేకరించాడు. వారు పర్వత గుహలలో ధ్యానం చేసేవారు. ధ్యానం చేసేవారికి నిద్ర పెద్ద శత్రువు. పురాణాల ప్రకారం బోధి ధర్ముడు ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు నిద్రలోకి జారుకున్నాడు, అతను కోపంతో తన కనురెప్పలను కత్తిరించుకున్నాడు. అతని కనురెప్పలు నేలమీద పడి మొదటి తేయాకు మొక్కగా మారింది. ఆ తర్వాత సన్యాసులకు నిద్ర నుండి రక్షణగా టీ సరఫరా చేయబడింది.

ఈ పురాణం ఎక్కడ నుండి వచ్చింది? బోధిధర్మ, చక్రవర్తిని కలుసుకున్న తర్వాత నివసించిన కొండను తాయ్ లేదా చాయ్ అని పిలుస్తారు. వారు అక్కడికి వెళ్ళినప్పుడు సన్యాసులు బహుశా బోధిధర్మ కనుగొన్న కొన్ని ఆకులను నీటిలో ఉడకబెట్టి మేల్కొని ఉండటానికి త్రాగి ఉండవచ్చు. అప్పుడు వారు రాత్రంతా కూర్చుని ధ్యానం చేయగలరు. ఆ విధంగా టీ లేదా చాయ్ కనుగొనబడింది.