క్రిందటి వ్యాసంలో శాంతనుడు,సత్యవతి ప్రేమ గురించి తెలుసుకున్నారు. దీనివల్ల కురు వంశంపై ఎటువంటి ప్రభావం పడిందో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మహాభారత కథలో పగా, ప్రతీకారం అనే భావనలకు ఎంతో ప్రాముఖ్యముంది. కాని ద్రౌపది కన్నా మునుపే మరో స్త్రీ తన ప్రతీకార అగ్నితో జ్వలించిపోతుండేది. ఆమె ఎవరు, ఎవరి మీద, ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది?

Sadhguruశాంతనునికి, సత్యవతికి  ఇద్దరు సంతానం కలిగారు. చిత్రాంగదుడు మొదటివాడు,  విచిత్ర వీర్యుడు రెండవవాడు. యువకుడూ, దురహంకారి అయిన చింత్రాగదుడు ఒక రోజు అడవికి వెళ్ళాడు. అసాధారణమైన సామర్ధ్యం కలిగిన ఒక గంధర్వుడు, ఎక్కడినుంచో అక్కడకు  వచ్చి వున్నాడు, అతని పేరు కూడా చిత్రాంగదుడే. గంధర్వుడు నువ్వెవరు అని ఆడుగగా, నా పేరు చిత్రాంగదుడు అని గర్వంగా చెప్పాడు. గంధర్వుడు నవ్వి, "చిత్రాంగదుడని పిలిపించుకోవడానికి నీకెంత ధైర్యం? నేను చిత్రాంగదుడిని, ఇది నా పేరు, నువ్వు నా పేరుతో పిలిపించుకోవడానికి అనర్హుడివి, నువ్వు నీ పేరు మార్చుకో" అని అన్నాడు. యువరాజు "నీకెంత ధైర్యం, నా తండ్రి నాకు ఇచ్చిన పేరు చిత్రాంగదుడు, ఇది నా పేరు, మనిద్దరం తేల్చుకుందాము" అంటూ సవాలు చేసాడు. ఒక్కడే చిత్రాంగదుడు ఉండాలని గంధర్వుడు పట్టుపట్టాడు. వాళ్ళిద్దరి పోరాటంలో యువరాజు ఒక్క క్షణంలో చనిపోయాడు.

ఒక విచిత్ర రాజకుమారుడు

ఇక వారికి మిగిలిన సంతానం విచిత్రవీర్యుడు ఒక్కడే. "విచిత్ర" అంటే వింతైనది, "వీర్య" అంటే పురుషత్వం. అంటే ఇతను వింతైన లేక విపరీతమైన పురుషత్వం కలిగినవాడు. ఇతడు నపుంసకుడో, స్వలింగ సంపర్కుడో లేక బలహీనుడో మనకు తెలియదు. ఇతడు ఇష్టంలేక పెళ్ళిచేసుకోలేదా లేక అసమర్ధుడై పెళ్ళిచేసుకోలేదా మనకు తెలియదు. ఆ రోజుల్లో పెళ్ళిచేసుకోవడం పిల్లలను కనడం ఎంతో ముఖ్యం. మహారాజు కావడంతో మగసంతానం తప్పకుండా ఉండాలి లేకపోతే తదనంతరం రాజ్యాధికారం ఎవరికి అందచేస్తారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు. అందువల్ల వీలైనంత త్వరగా పెళ్ళిచేసుకోవటం సంతానాన్ని కనడం ముఖ్యం, లేకపోతే పూర్తి సామ్రాజ్యం విఛ్ఛిన్నం కాగలదు.

చిత్రాంగదుడు చనిపోయాడు. విచిత్రవీర్యుడు పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకోవడంలేదు, భీష్ముడు కూడా వివాహాన్ని కాదన్నాడు. కురువంశం స్తంభించిపోయింది. వంశాంకురం లేదు. జీవితాంతం రాజ్యార్హత లేకుండానే భీష్ముడు రాజప్రతినిధిగా ఉండి సమస్త రాజ్య క్షేమం చూసుకుంటున్నాడు. ఒకరోజు కాశీ రాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. కురు సామ్రాజ్యం పెద్దదీ, ఎంతో గౌరవింపబడినదీ అయినా విచిత్రవీర్యుడి మగతనం గురించి విన్న పుకార్ల వల్ల కాశీ రాజు తన కుమార్తెలు అతడిని చేసుకోవడం ఇష్టంలేక అతనికి ఆహ్వానం పంపలేదు.

ఈ అమర్యాదకు భీష్ముడు కోపంతో ఊగిపోయడు. తన శ్రేయస్సు కన్నా మరెవరి శ్రేయస్సు కన్నా కూడా కురు వంశానికీ, కురుసామ్రాజ్య శ్రేయస్సుకూ అతను కట్టుబడి ఉన్నాడు. ఈ ఆవమానాన్ని సరిదిద్దడానికి భీష్ముడు స్వయంవరానికి వెళ్ళాడు. స్వయంవరంలో యువతులకు తమ తమ భవిష్యత్తు ఎన్నుకునే అవకాశం ఉంది. యువరాణికి పెళ్ళి వయస్సు వచ్చిన తరువాత ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేసి, అర్హులైన క్షత్రియులనందరినీ దానికి ఆహ్వానిస్తారు. సమాజంలో క్షత్రియులు యుద్ధకౌశలం గల  వర్గానికి చెందినవారు.

రాజకుమార్తెలను అపహరించిన భీష్ముడు

ఆ రకంగా, ఇప్పుడు స్వయంవరం జరుగుతోంది. ఇందులో రాజులకు, యోధులకు మాత్రమే అవకాశం ఉంది. రాజకన్యలు తమ తమ భర్తలను వారే ఎంచుకుంటారు, వారికి వేరెవరూ అడ్డు రారు. స్వయంవరం ముగ్గురు రాజ కన్యలకు ఏర్పాటుచేయడం జరిగింది - అంబ, అంబిక, అంబాలిక వీరికి 18,17,ఇంకా 15 సంవత్సరాల వయస్సు. అంబ అప్పటికే శల్వరాజు శల్వుడితో ప్రేమలో పడింది. తనకు నచ్చిన వాడిని భర్తను చేసుకోవడానికి స్వయంవరం ఆమెకు ఒక మంచి అవకాశం. అందరికన్నా పెద్దది కావడంవల్ల ఆమెకు ముందుగా ఎంచుకోవడానికి అవకాశం దొరికింది. రాజకుమారి పూలమాల తీసుకుని అందరినీ చూసి తను భర్తగా ఎన్నుకున్న వారి మెడలో పూలమాల వేయడం స్వయంవరంలో ఒక సాధారణ పద్ధతి. అంబ శల్వరాజు వద్దకు వెళ్ళి అతని మెడలో పూల మాల వేసింది.

భీష్ముడు స్వయంవర ప్రాంగణానికి చేరుకున్నాడు. అతడు గొప్ప వీరుడు కాబట్టి ఇతర వీరులు భయపడ్డారు. కానీ వారికందరకీ అతని బ్రహ్మచర్య శపధం ఉందని, అతను పెళ్ళి చేసుకోడని తెలుసు. "ఈ ముసలివాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు భార్య కావలసి వచ్చిందా లేక కురు వంశంలో భార్యను గెలుచుకోగల వీరుడు లేక తను స్వయంగా రావలసివచ్చిందా?” అంటూ అతనిని రెచ్చగొట్టటం ప్రారంభించారు. తన వంశాన్ని తక్కువగా మాట్లాడేసరికి భీష్ముడు కోపంతో రెచ్చిపోయాడు. ముగ్గురు రాజకుమార్తెలను ఎత్తుకుపోవడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడున్న వీరులతో యుద్ధం ఆరంభమయ్యింది, భీష్ముడు అందరినీ ఓడించాడు, శల్వుడు తన భార్యకోసం పోరాడాడు కానీ భీష్ముడు శల్వుడిని ఓడించి అతనిని అవమానించాడు. ముగ్గురు రాజ కుమార్తెలను బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు.

అంబా దుస్థితి

అంబిక, అంబాలిక ఒక యోధుడు తమను ఎత్తుకు వెళ్ళినందుకు సంతోషించారు. అంబ ఏడవటం మొదలుపెట్టింది. కురుదేశ రాజధాని హస్తినాపురానికి వెళ్ళేదారిలో భీష్ముడితో "నేను ఒకరిని ప్రేమించాను, అతనికి పూలమాల వేసి నా భర్తగా స్వీకరించాను, మీరు నన్ను బలవంతంగా తీసుకువెళ్ళటం తగదు" అనగా, భీష్ముడు "ఆ పని జరిగిపోయింది, నేను తీసుకున్నది కురు వంశానికి చెందుతుంది" అన్నాడు. అందుకు అంబ “మీరు నన్ను వివాహమాడతారా?”  అని ప్రశ్నించింది. భీష్ముడు “నేను కాదు, నువ్వు విచిత్రవీర్యుడిని వివాహమడుతావు” అని జవాబిచ్చాడు. విచిత్రవీర్యుడు అంబిక, అంబాలికను వివాహమాడి అంబను వివాహమాడటానికి అంగీకరించలేదు. "వేరొకరి మెడలో మాల వేసి తనను భర్తగా స్వీకరించడమేకాక అతనికి మనస్సు కూడా ఇచ్చింది అందువల్ల నేను వివాహం చేసుకోనని" తిరస్కరించాడు.

"ఇప్పుడు నేనేం చేయాలి" అని అంబ ప్రశ్నించగా,  భీష్ముడు "నన్ను క్షమించు, శల్వుడి దగ్గరకు తిరిగి వెళ్ళు" అన్నాడు. అంబ సంతోషంగా శల్వుడి దగ్గరకు వెళ్ళింది కానీ శల్వుడు "నేను భిక్ష తీసుకోను, ఆ ముసలివాడు నన్ను ఓడించి, ఇప్పుడు మళ్ళీ భార్యగా నిన్ను నాకు భిక్ష ఇస్తున్నాడు, నేను ఒప్పుకోను నువ్వు తిరిగి వెళ్ళి విచిత్రవీర్యుడినే వివాహమాడు" అన్నాడు. "విచిత్రవీర్యుడు నన్ను చేసుకోనన్నాడు" అని అంబ చెప్పగా శల్వుడు "అయితే భీష్ముడిని చేసుకో, నేను నిన్ను తిరిగి తీసుకోను, నేను భిక్ష తీసుకోను" అన్నాడు.

అక్కడ కూడా తిరస్కరింపబడటంతో అంబ హస్తినాపురానికి తిరిగి వెళ్ళి భీష్ముడితో "నేను ప్రేమించినవాడిని నాకు దూరం చేశావు, ఇక్కడకు బలవంతంగా తీసుకునివచ్చిన తరువాత నన్ను వివాహమాడ వలసినవాడు తిరస్కరించాడు, నా జీవితం నాశనమయ్యింది, నువ్వే నన్ను వివాహంచేసుకో" మని ప్రాధేయపడింది. భీష్ముడు "నా విధేయత నా దేశానికి, నేను పెళ్ళిచేసుకోనని మాట ఇచ్చాను, అందువల్ల నేను చేసుకోవడం కుదరదు" అని జవాబు చెప్పాడు.

ఇంకా ఉంది...

మరిన్ని మహాభారత కథలను చదవండి: మహాభారతం