మహాభారత కథ : భీష్మ పితామహుడిని ఎవరు వధించారు?
క్రిందటి వ్యాసంలో భీష్ముడు రాజకుమార్తెలను అపహరించి విచిత్రవీర్యుని వద్దకు తీసుకువెళ్ళడం మీరు చదివారు. విచిత్రవీర్యుడు అంబను వివాహం ఆడటానికి అంగీకరించడు. ఇప్పుడెం జరుగుతుందో తెలుసుకుందాం..
5000 వేల సంవత్సరాలకు పూర్వం ఒక రాజ కుమారి, అన్ని వైపులనుండీ తిరస్కరింపబడి, ప్రేమించినవాడు దగ్గరికి తీసుకోలేదు, పెళ్ళి జరుగలేదు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. పూర్తి నిరాశతో, ఒంటరిదై దిక్కు తోచక తిరోగమించింది.
అంబ ముందు నిరాశ నుంచి నిస్పృహ, దాని నుంచి కోపం చివరికి తీవ్ర పగగా మారి ప్రతీకారంతో ఊగిపోయింది. "ఈ మనిషి నా జీవితం నాశనం చేశాడు, ఏ వీరుడైనా ఇతని ప్రాణం తీయడానికి ముందుకు రాగలడా?" అంటూ అనేక ప్రదేశాలు తిరిగింది. భీష్ముడి ప్రతాపం తెలుసుగనక అతనితో పోరాటానికి ఎవరూ ముందుకు రాలేదు.
పెళ్ళి చేసుకోనని శపధం చేసి భీష్ముడు వృషణాలు తొలగించుకున్నప్పుడు అతని తండ్రి శంతనుడు "ఈ రోజు నువ్వు నాకు చేసిన ఉపకారానికి నీకో వరం ఇస్తాను. నేను ఒక తపస్సు చేసాను, ఆ తపస్సు వల్ల నాకు వచ్చిన శక్తినంతా నీకు వరంగా మార్చుతాను, దానివల్ల ఈ జీవితంలో నీ మరణ సమయం నువ్వే నిశ్చయించుకోవచ్చు. వేరెవరూ నీ మరణం నిశ్చయించలేరు’’ అన్నాడు. అతనికున్న ఈ వరంవల్లా, అతని పరాక్రమం తెలిసీ, ఎవరూ భీష్ముని ఎదుర్కునేందుకు ముందుకు రాలేదు.
కార్తికేయుడు అంబకు వరం ప్రసాదించాడు
అంబ హిమాలయాల్లో తీవ్ర సాధన చేసింది. శివుడి కుమారుడు కార్తికేయుడు గొప్ప వీరుడు, భీష్ముడిని చంపడానికి తగినవాడు అని భావించింది. మంచు కొండల మీద కూర్చుని కార్తికేయునికై తీవ్ర తపస్సు చేసింది. తపస్సుకి మెచ్చి కార్తికేయుడు ప్రత్యక్షమయ్యాడు. "భీష్ముడిని చంపాలి" అని తన కోరికను తెలపగా, కార్తికేయుడు "నేను చంపే కాలం ముగిసింది" అని సమాధానమిచ్చాడు.
న్యాయాన్ని నిలబెట్టాలన్న తపనతో, పూర్వం కార్తికేయుడు దక్షిణానికి వెళ్ళి అన్యాయమనుకున్న దానినంతా సంహరించాడు. కర్ణాటకలో ఇప్పుడు మనం ‘సుబ్రమణ్య’ అని పిలిచే స్థలానికి చేరి నెత్తురోడిన తన కత్తిని కడిగి "ఈ కత్తి మరెప్పుడూ నెత్తురు చూడదు" అని శపథం తీసుకున్నాడు. హింసను వదిలి, మనం ఇప్పుడు కుమార పర్వతం అని పిలిచే పర్వతంపైకి వెళ్ళి శరీరాన్ని వదిలాడు.
అంబ పిలువగా తన అశరీర స్థితిలో వచ్చి "నేను హింసను విడిచిపెట్టాను, భీష్ముడిని చంపలేను, కానీ నీ శ్రద్ధనీ, పరిస్థితినీ చూసి నీకు ఒక వరం ఇస్తాను" అన్నాడు. ఎప్పటికీ వాడిపోని తామర పూల మాల ఆమె చేతికి ఇచ్చి "ఈ మాల తీసుకో, ఇది వేసుకున్నవారు భీష్ముడిని చంపగలరు" అన్నాడు.
పరశురాముడు, భీష్ముడి మధ్య యుద్ధం
గుండెలో కొండంత ఆశతో, మళ్ళీ చేతిలో పూల మాల పట్టుకుని ఈ మాల వేసుకుని ఎవరైనా భీష్ముడిని చంపడానికి ముందుకు వస్తారేమోనని కాలి నడకన పట్టణాలు, ఊర్లూ తిరగటం మొదలుపెట్టింది. ఎవ్వరూ ఇందుకు ముందుకురాలేదు. తరువాత పరశురాముడిని వెదుకుతూ బయలుదేరింది అంబ. పరశురాముడు భీష్ముడికి గురువు, ప్రత్యేకంగా విలువిద్య నేర్పిన గురువు. ఆయన ముందు సాష్టాంగ పడి జరిగినదంతా చెప్పి తన దురవస్థను వివరించగా ఆయన " నువ్వు చింతించకు, నేను దీన్ని సరిచేస్తాను" అంటూ ఓదార్చాడు.
పరశురాముడు భీష్ముని పిలిపించాడు. భీష్ముడు వచ్చి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసాడు. పరశురాముడు "ఇక జరిగింది చాలు, నీ శపధం చాలించి ఈ స్త్రీని వివాహమాడు" అన్నాడు. భీష్ముడు "మీరు నా గురువు, (కావాలంటే) నా శిరస్సును ఖండించుకోమంటే ఖండించుకుంటాను, కానీ, నా ప్రతిజ్ఞను మాత్రం వదలమని మీరు అడగకండి" అంటూ సమాధానమిచ్చాడు.
ఈ కథ ఆసాంతం, మాట ఇచ్చిన తరువాత ఎట్టి పరిస్థితులలోనైనా దాన్ని నిలబెట్టుకోవాలని ఆశించే మనుష్యులు మీకు కనిపిస్తారు. ఆ కాలంలో మనుష్యులు నాగరికతను స్థాపించాలని కాంక్షించేవారు. రాజ్యాంగాలు, శిక్షాస్మృతులూ లేవు. ఆ సమయంలో మనిషికి, ఇచ్చిన మాట అన్నిటికన్నా ముఖ్యం. చట్టం లేని రోజుల్లో మనిషి ఇచ్చిన మాటే చట్టం. మాట ఇచ్చిన తరువాత దానిని నిలబెట్టుకోవడానికి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా అందుకు వెనుకాడరు. మాట తప్పితే గౌరవం పోయి అతను దేనికీ కొరగాని వానిగా అవుతాడు.
అందువల్ల భీష్ముడు "మీరు కోరితే నేను నా శిరస్సు ఖండించుకుంటాను, కానీ నా మాటను తప్ప మంటే, అది నేను చేయలేను" అని గురువుతో వినమ్రంగా చెప్పాడు. పరశురాముడికి అవిధేయత తెలియదు, అతడు అతి విధేయుడు, తల్లి, ముగ్గురు సోదరుల తలలు ఖండించమని తండ్రి అతనిని ఆదేశిస్తే, అతను మరో ఆలోచన లేకుండా, వెంటనే నలుగురి తలలు ఖండించాడు. అతని విధేయతకు సంతోషించి తండ్రి " నీకు ఒక వరమిస్తాను కోరుకో ఏమి కావాలో" అని అడిగితే, పరశురాముడు "నా తల్లినీ, సోదరులనీ తిరిగి బ్రతికించండి" అని కోరగా, వారు తిరిగి జీవితులయ్యారు.
ఈ విధంగా పెరిగిన పరశురాముడు అవిధేయతను అంగీకరించలేడు. భీష్ముడు అంగీకరించలేదని అతనికి తీవ్రమైన కోపం వచ్చింది. ఆయన అతి కోపిష్ఠి. పూర్వం క్షత్రియులు తమ జాతిని అమర్యాద చేసారని ఇతడు తనకు కనిపించిన ప్రతి క్షత్రియుడినీ చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. అతడు చంపిన క్షత్రియుల రక్తంతో ఐదు చెరువులయ్యాయని చెపుతారు. ఈ చెరువులలో మునిగితే ఎదురులేని వీరులవుతారని క్షత్రియుల నమ్మకం.
పరశురాముడికీ భీష్ముడికీ మధ్య తీవ్ర యుద్ధం జరిగింది. పరశురాముడు భీష్ముడికి తనకు తెలిసినదంతా నేర్పాడు. రోజుల కొద్దీ జరిగిన యుద్ధంలో గెలుపు ఎవరికీ లేదు. పరశురాముడు చివరికి యుద్ధం చాలించి అంబతో " భీష్ముడిని చంపడానికి నువ్వే ఇంకెవరినైనా వెదుక్కో" అన్నాడు.
పూల మాల పట్టుకుని అంబ తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. భరతవర్షంలోని రెండవ పెద్ద రాజ్యమైన పాంచాల రాజ్యానికి వచ్చి, పాంచాల రాజు ద్రుపదుడి ఆస్థానానికి చేరుకుంది. పూల మాల తీసుకుని భీష్ముడిని చంపమని ద్రుపదుడిని కోరింది. పూల మాలను ముట్టుకోవడానికి కూడా ద్రుపదుడు ముందుకు రాలేదు. పూల మాల పట్టుకుని దెయ్యంలాగా ఊరూరూ తిరుగుతూ భీష్ముడి ప్రాణం తీయాలని తిరుగుతున్న అంబను ద్రుపదుడు కలవడానికి కూడా ముందుకు రాలేదు. నిరాశతో అంబ కార్తికేయుడు తనకిచ్చిన పూల మాలను రాజభవనంలోని ఒక స్తంభానికి తగిలించి వెళ్ళింది. ద్రుపదుడికి ఈ మాల అంటే భయం, ఎవరినీ దీనిని ముట్టుకోనివ్వలేదు. ప్రతిరోజూ పూలమాలకు దీపం వెలిగించి పూజచేసి దానికి దూరంగా ఉన్నారు.
పరమశివుడి ద్వారా పొందిన వరం
మరొకసారి నిరాశ, నిస్పృహలతో అంబ హిమాలయాలకు చేరింది. తీవ్ర తపస్సులో కూర్చుంది. మెల్లగా ఆమె శరీరం వడిలి చర్మం, ఎముకలుగా అయ్యింది. శివునికై తపస్సు చేసింది, శివుడు ప్రత్యక్షమయ్యాడు. "మీరు భీష్ముడిని చంపాలి" అంది. శివుడు "భీష్ముడిని నువ్వే చంపితే నీకు ఇంకా సంతోషకరం కదా! నీ పగ పూర్తిగా తీర్చుకోవచ్చు" అన్నాడు. అంబ కళ్ళు మెరిసాయి, "ఎలా? నేను స్త్రీని, అతను గొప్ప వీరుడు, నేనెలా చంపగలను?’’ అన్నది. శివుడు "నీ తరువాతి జన్మలో నువ్వు అతనిని చంపగలవని నేను అశీర్వాదం ఇస్తాను." "కానీ తరువాతి జన్మలో నాకు ఈ విషయం గుర్తు ఉండదు దానితో పగ తీర్చుకున్న సంతోషం నాకు దక్కదు" అంది అంబ. "చింతించకు, పగ తీర్చుకునే సమయం దగ్గరపడినప్పుడు నీకు అంతా గుర్తు వచ్చేటట్టు చేస్తాను. పగ తీర్చుకున్న సంతోషం నీకు తప్పక దక్కుతుంది" అని అభయమిచ్చాడు శివుడు. అంబ శరీరం విడిచి, అనుకున్నట్టుగానే తిరిగి వచ్చింది.
ఇంకా ఉంది...
మరిన్ని మహాభారత కథలను చదవండి: మహాభారతం