సద్గురు, జ్ఞానోదయం పొందడానికి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అది సమయంతో ముడిపడిన విషయం కాదు, అది తీవ్రతకు సంబంధించిన విషయం అని వివరిస్తారు.

ప్రశ్న: జ్ఞానోదయం పొందడానికి ఎంత సమయం పడుతుంది?

సద్గురు: ఇది నిజంగా సమయానికి సంబంధించిన విషయం కాదు, మీరు దీన్ని ఎప్పుడు చేస్తారనేదే అసలైన విషయం. ‘ఎంత సమయం పడుతుంది?’ అలాంటిదేమీ ఉండదు ఎందుకంటే అది మీలోనే ఉంది కాబట్టి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకుంటే, దానికి సమయం పడుతుందా? నిజానికి దానికి సమయం పట్టకూడదు. కానీ మిమ్మల్ని మీరు పూర్తిగా ఒకేసారి సమర్పించుకోనందున, సమయం పడుతోంది. మీరు వాయిదాల పద్ధతిలో అర్పించుకుంటారు. కాబట్టి, మీరు చిన్న చిన్న వాయిదాల ద్వారా వంద జీవితకాలాలు తీసుకోవాలనుకుంటున్నారా లేదా ఈ రోజే చేయాలనుకుంటున్నారా అనేది మీ ఇష్టం. దీనికి ఎంత సమయం పడుతుందనేది, మీలో దీనిని తెలుసుకోవాలనే కోరిక ఎంత తీవ్రంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.

చనిపోయాక ఏం జరుగుతుందనే విషయం ఇంటర్నెట్‌లో   అందుబాటులో ఉంటే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు. లాగిన్ చేసి కనుక్కోగలిగితే, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే అనుకుంటారు. కానీ నిజంగా మీరు దీన్ని ఎంత తీవ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏదో అడగాలని చెప్పి ‘మరణం తర్వాత ఏమవుతుంది? నా సృష్టికి మూలం ఏమిటి?, అని అడిగితే, మీకు ఆ ప్రశ్నలోని లోతు తెలియదనే అర్థం. మీరు ఒక్కమాట కూడా మాట్లాడలేనంతగా, ఈ ప్రశ్న మిమ్మల్ని దహించి వేస్తుంటే, తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టదు.

జ్ఞానోదయం ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది - అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ జరగదు. చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాం.

ఇది చాలా సులభం. మీకిది చాలా దూరంలో ఎందుకుందంటే, తెలుసుకోవాలన్న తపన మందకొడిగా మాత్రమే ఉంది. అదింకా మిమ్మల్ని దహించి వేయడం లేదు. ఇదింకా, ముఖ్యమైన అంశంగా లేదు. సత్యాన్ని తెలుసుకోవడమనేది ఏదో వినోదాన్ని చూసినట్లు భావిస్తే, అది జరగదు. ఇది తప్ప నాకు ఇంకేమీ అక్కరలేదు అనే విధంగా మీరు దీనిని కోరుకుంటే, కేవలం ఒక క్షణంలోనే తెలుసుకోగలరు, ఎందుకంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్నది మీలోనే ఉంది. మీలో ఉన్నదాన్ని మీరు తప్ప మరెవరూ అడ్డుకోలేరు, అవునా? కాబట్టి, మీ దారికి మీరు అడ్డుపడకుండా ఉంటే చాలు. మీరు వాయిదాల పద్ధతిలో తెలుసుకోవచ్చు లేదా ఒక్కసారిగా తెలుసుకోవచ్చు.

ఎల్లప్పుడూ జ్ఞానోదయం పెద్ద శబ్దాలు చేస్తూ జరగవలసిన అవసరం లేదు. ఇది నిశ్శబ్దంగా జరగవచ్చు, ఇది ఒక పువ్వు వికసించినట్లుగా జరగవచ్చు. ఈ భూమ్మీద జరిగే గొప్ప విషయాలు ఎటువంటి చప్పుళ్ళు చేయవు, అవునా? ఒక విత్తనం మొక్కగా, మొక్క ఒక  చెట్టుగా మారుతుంది. ఇదేమీ చిన్న  అద్భుతం కాదు, ఒక మహా అద్భుతం. అలా జరుగుతునప్పుడు, అదేమైనా శబ్దం చేస్తోందా? చిన్న చిన్న విజయాలు చాలా గోల పెడతాయి. కోడి ఉదయాన లేచి గట్టిగా అరుస్తుందని మీకు తెలుసు. కానీ సృష్టిలో జరుగుతున్న పెద్ద విషయాలు ఎటువంటి శబ్దమూ చేయవు. అవి నిశ్శబ్దంగా జరుగుతాయి, అవునా కాదా? కాబట్టి జ్ఞానోదయం కూడా ఎటువంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా జరుగుతుంది - అదేమీ పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ జరగదు, చాలా నిశ్శబ్దంగా ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వంలోకి ప్రవేశిస్తాం. తోటలో పువ్వు నిశ్శబ్దంగా వికసిస్తుంది, కానీ అది వికసించిన తర్వాత మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు. అది ముఖ్యమైనది అవుతుంది. దాని సువాసన ఇంకా అందం ఎవ్వరూ కాదనలేరు.

అదే విధంగా, ఒక పార్శ్వం నుండి మరొక పార్శ్వానికి పరిణితి చెందే జ్ఞానోదయం కూడా, చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. కానీ అది జరిగినప్పుడు, దానిని మీరు గమనించిన క్షణం, అది చాలా పెద్ద విషయం అవుతుంది. మీరు దానిని పట్టించుకోకుండా ఉండలేరు.