ప్రశ్న: నమస్కారం సద్గురూ. నేను మీ లక్ష్యం ఇంకా ఆశయం లో భాగం కావాలని, అలాగే మీరు చెప్పినట్లుగా "పరిపూర్ణమైన జీవి"గా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్షేమం చేకూరాలని కూడా నేను కోరుకుంటున్నాను. కానీ ఎక్కడో ఈ దారిలో చివరిదాకా నడవలేనేమోనని భయంగా ఉంది. ఆ భయం నన్ను ముందడుగు వేయకుండా ఆపుతోంది. ఈ భయాన్ని నేను ఎలా అధిగమించగలను?

సద్గురు: ఈ మొత్తం ప్రపంచాన్ని పరమానంద భరితం చేయాలనే ఇంత పెద్ద లక్ష్యం ఉన్నప్పుడు, మనమందరం దారిలోనే ఎక్కడో ఒకచోట పడి చనిపోతాం. కాబట్టి చివరిదాకా నడవడం గురించి ఆలోచించకండి. రేపటికి ఈ ప్రపంచం మొత్తం పరమానందంగా మారుతుందని మీరు అనుకుంటున్నారా? 25 సంవత్సరాల వయస్సులో, నేను మొదటిసారి ఆనందంతో తడిసి ముద్దై పోతూ కూర్చున్నప్పుడు, మొత్తం ప్రపంచాన్ని ఆనందమయం చేయగలనని, ప్రతి ఒక్కరూ తమ సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని నేను అనుకున్నాను. ఇది మూడు దశాబ్దాల క్రితం మాట. తమను తాము నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారని నాకు ఇప్పుడు తెలిసింది. మేము కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసాము, కానీ మొత్తం ప్రపంచాన్ని కాదు.

మీకు ఏది ముఖ్యమైనదని అనిపిస్తుందో అదే చేయండి

ఏ విధంగానూ, ‘నాకు’ ముఖ్యం అనిపించేది మీరు చేయనవసరం లేదు. మీకు ఏది ముఖ్యం అనిపిస్తుందో అదే చేయండి. మీకు ముఖ్యమనిపించేది మీరు చేయకపోతే, మీరు బాగా జీవించారా లేదా అని బేరీజు వేసుకోవడానికి మీ జీవితం చివరి వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు - ఎందుకంటే ఇప్పటికే అది వృధా జీవితం. ఈ పని ముఖ్యమైనది అని మీరు అనుకుంటే, మీరు దాన్ని చేయాలి.

నిజానికి, నేను ఎలా ఉంటానంటే, నేను కళ్ళు మూసుకుంటే, ఇంక అసలు తెరవక పోవచ్చు. నా వరకూ, కార్యకలాపాలు అనేవి ప్రపంచానికి కావల్సినవి చేయడం కోసం మాత్రమే. నేను ఒంటరిగా ఉన్నప్పుడే అత్యుత్తమ స్థితిలో ఉంటాను. అలాంటప్పుడు నేను ప్రజల మధ్య ఎందుకు ఉండాలనుకుంటున్నాను? నేను ఏదైనా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నాను? చేయాల్సింది చాలా ఉంది, కాబట్టి రోజుకు ఇరవై గంటలు పనిలో ఉంటున్నాను. నేను పొద్దున్నే లేచేసరికి, ఎవరో ఒకరు నేను చూడవలసిన దానితో అప్పటికే అక్కడ ఎదురు చూస్తుంటారు.

కార్యకలాపాలు అనేవి ఎప్పుడూ మీ గురించి కాకూడదు. మీరు ఎలా ఉంటున్నారు అనేది మిమ్మల్ని గురించినదై ఉండాలి, కానీ మీ కార్యాచరణ మాత్రం మీరు ఉన్న పరిస్థితులకు అవసరమైన విధంగా ఉండాలి.

ఈ పనులన్నీ, నేను ఏదో చేయాల్సిన అవసరం ఉందని చేయడం కాదు. మీరు ఎటువంటి కార్యకలాపాలు లేకుండా నన్ను ఒంటరిగా వదిలేస్తే, నేను హాయిగా ఉంటాను. నాకు ఏవో మాట్లాడవలసిన లేదా వ్రాయవలసిన అవసరం కూడా లేదు. నేనేమీ చేయనవసరం లేదు. ప్రస్తుతం, చేయవలసినది చాలా ఉంది, కాబట్టి కార్యాచరణ అవసరం. కార్యకలాపాలు అనేవి ఎప్పుడూ మీ గురించి కాకూడదు. మీరు ఎలా ఉంటున్నారు అనేది మిమ్మల్ని గురించినదై ఉండాలి, కానీ మీ కార్యాచరణ మాత్రం మీరు ఉన్న పరిస్థితులకు అవసరమైన విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది విషయంలో, వారి కార్యకలాపాలు వారిని గురించినవై ఉంటున్నాయి. వారు తాము ఎదగాలనుకుంటారు, కాబట్టి వారు తమని నిరూపించుకోవాలని పనులు చేస్తారు, ఈ విధానం సరైనది కాదు. ప్రజలు తమని తాము నిరూపించుకోవడానికి ప్రపంచంలో ఏదో చేయాలనుకోవడం అనే ఈ ప్రాథమిక తప్పిదం వల్లనే చాలా మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయి. మొదట, మీకు మీరు గా ఉండండి - తరువాత ఏమైనా చేయండి. దానిని పాటించినప్పుడు, ఏది జరిగితే, అది జరుగుతుంది.

ఏదైనా నిజంగా అవసరమైన పని ఉందని తెలిసి, మీకు అది చేయాలి అనిపిస్తే, మీరు అది చేసి తీరాలి. ఎలా చేస్తారు, ఏ స్థాయిలో చేస్తారు అనేది మీ ఇష్టం. పరివర్తన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ తమ స్వంత దారిలో పని చేస్తే, అది వారి సంతృప్తి కోసం మాత్రమే. మీరు నిజంగా మార్పు తేవాలనుకుంటే, వీలైనంత వరకు అందరితో కలిసికట్టుగా పని చెయ్యాలి. కానీ ఈ కార్యాచరణ అనేది దీని ద్వారా  మీరు పూర్ణత్వం పొందడం కోసం కాదు. మీరు పరిపూర్ణంగానే ఉన్నారు, కాబట్టి మీరు కార్యాచరణ చేస్తున్నారు. ఏదైనా చేయాలంటే, అది అవసరం కాబట్టి చెయ్యాలి. అంతేకానీ, మీరు దాన్ని చేయాలనుకోవడం వల్ల కాదు. ఏదైనా చేయవలసి వస్తే, ప్రతి బాధ్యతగల వ్యక్తి వచ్చి కలిసి చేయాలి. ఇదేదో మీరు చేపట్టే ఒక బృహత్కార్యం కాదు. ఇది మీ మానవత్వానికి నిదర్శనం. ఈ రకమైన కార్యాచరణ యొక్క అందం ఏమిటంటే ఇది మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతుంది.