కార్తికేయుని తమిళనాడులో ‘మురుగా’ అనీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘సుబ్రహ్మణ్య’ అనీ, ఉత్తరభారత దేశంలో ‘స్కంద’ అనీ అంటారు. ఆర్గురిని ఒకే శరీరంలో కూర్చి అవతరింపజేసిన కార్తికేయ సృష్టి ఒక గొప్ప ప్రయోగమని చెప్తారు సద్గురు. కార్తికేయునికి, అగస్త్యునికి మధ్య జరిగిన సంభాషణల సారమే మహాపురాణాలలో ఒకటైన స్కాంద పురాణం. కార్తికేయుని కొన్నిసార్లు యుద్ధానికి అధిపతిగా ఎందుకు ఆరాధిస్తారో కూడా సద్గురు వివరిస్తారు.

Sadhguru శివుని కుమారుడు కార్తికేయుని జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకటి చేసి ఒక శరీరంలో ఇమడ్చటం జరిగింది. ఇటువంటి ప్రయోగాలు పూర్వం చాలా జరిగాయి. పూర్వం ఇద్దరు యోగులు ఒకే శరీరం పంచుకున్నారు. ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్నారన్నమాట. వాళ్లు రెండు భిన్నమైన భాషలు మాట్లాడతారు, భిన్నంగా ఉంటారు. కాని ఇక్కడ ఆరు ప్రాణులు ఒకే శరీరంలో. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం.

శివుణ్ణి గొప్ప వీర్యశాలిగా వర్ణించినప్పటికీ, ఆయనకెన్నడూ సంతానం లేదు. ఏ మానవ స్త్రీ కూడా శివుని బీజాన్ని తన గర్భంలో నిలుపుకోలేదని అంటారు. అందువల్ల ఆయన తన వీర్యాన్ని హోమాగ్నిలో విడిచిపెట్టాడు. హోమాగ్ని అంటే అది నిజంగా అగ్ని కావలసిన అవసరం లేదు. అదొక హోమకుండం. హోమకుండం అనేది అనేకానేక సృజనకోసం ఋషులు ప్రయోగశాలగా ఉపయోగించేది.

శివుని బీజాన్ని ధరించిన కృత్తికలు

హోమకుండం నుండి ఆరుగురు కృత్తికలు శివుని వీర్యాన్ని తమ గర్భాలలో ధరించారు. ఈ కృత్తికలు, అప్సరలు. ఈ గ్రహానికి చెందని దివ్యాంగనలు. మానవ స్త్రీల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినవారు. ఆ విధంగా శివుని బీజం ఆరుగురు కృత్తికల గర్భాశయాలలో చేర్చడం జరిగింది. అక్కడ మూడున్నర నెలలు గడిచాయి – ప్రాణం రూపాన్ని దాల్చడం ప్రారంభమయింది – ఆరు పిండాలు అభివృద్ధి చెందాయి.

ఆ సమయం గడిచాక కృత్తికలు తమ గర్భంలోని పిండాన్ని భరించలేకపోయారు. దాని వేడిని తాళలేకపోయారు . దాన్నింకా నిలుపుకోలేకపోయారు. ఈ కృత్తికలు ఒక పార్శ్వం నుండి మరో పార్స్వానికి మారుతూ ఉంటారు. వాళ్లకు ఏ ప్రత్యేక సృష్టిరూపం విషయంలో బాధ్యతాయుత భావం ఉండదు. వాళ్లు తమ గర్భంలోని పిల్లల్ని తాము ధరించినప్పటికంటే వృద్ధి చెందిన రూపంలో, వదిలేసి వెళ్లిపోయారు.

కార్తికేయుని జననం

పార్వతి స్వయంగా శివుని శిశువును కనలేకపోయింది, అందువల్ల ఆమె దీన్ని వృథా కానివ్వదలచుకోలేదు. పూర్తిగా అభివృద్ధి చెందని ఈ ఆర్గురు శిశువుల్నీ కలిపి తామరాకుల్లో చుట్టింది. ఇది ఒకరకమైన పొదుగు అనవచ్చు. పూర్తిగా అభివృద్ధి చెందలేదు కాబట్టి విడివిడిగా ఆర్గురు శిశువులు బతకడం కష్టమని ఆమె గమనించింది. కాని ఆరుగురు శిశువులో ఆరు గొప్ప లక్షణాలను ఆమె గుర్తించింది. ఆమె, “ఈ ఆరు లక్షణాలూ ఒక్క మనిషిలో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది!” అనుకున్నది. ఆమె తన తాంత్రిక శక్తులతో ఆరుపిండాలను ఒకటి చేసింది, ఆరుగురు శిశువుల్ని ఒక్క శరీరంలో కూర్చింది, కార్తికేయుడు జన్మించాడు. ఇప్పుడు కూడా కార్తికేయుణ్ణి ‘ఆర్ముగ’ లేదా ‘షణ్ముఖు’ డంటారు. అతను అసమానమైన శక్తి సామర్ధ్యాలు కలవాడు. ఎనిమిదేళ్ల వయస్సులోనే అతను అజేయుడైన యోధుడు.

కార్తికేయుడు శివుణ్ణి వదిలి వెళ్లడం

ఒకసారి కార్తికేయునికి గణపతితో వివాదం వచ్చింది. కార్తికేయునికి అతి వేగంగా ఎగిరే తన వాహనం మయూరాన్ని చూసుకొని చాలా గర్వం. అన్నదమ్ములిద్దరూ వాదులాడుకున్నారు. భూమి చుట్టూ ఎవరు వేగంగా తిరిగి వస్తారోనని పందెం వేసుకున్నారు. గెలిచినవారికి తల్లిదండ్రుల నుండి ఒక ప్రత్యేకమైన మామిడి పండు బహుమానంగా లభిస్తుంది. 1... 2.... 3.... బయలుదేరారు. పందెం మొదలయింది. కార్తికేయుడు తన మయూరవాహనంపై వేగంగా ఎగిరిపోయాడు. అతను మొత్తం ప్రపంచాన్ని చుట్టివచ్చాడు, గణపతి అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. గణపతి అప్పటికే బహుమానం తీసికొని తినడం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఎండలో తీరిగ్గా కూర్చుని సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నాడు.

కార్తికేయునికి చాలా కోపం వచ్చింది. అయన తల్లిదండ్రులను ఇలా అడిగాడు, “ఇదెట్లా సంభవం? నేను ప్రపంచం చుట్టూ తిరిగివచ్చాను. ఈ గణపతి కనీసం బయలుదేరను కూడా లేదు. అతనికి మామిడి పండు ఎందుకు ఇచ్చారు? గణపతి చేసిందేమిటంటే శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయడం. గణపతి, “నాకు మీరే ప్రపంచం, నాకిది చాలు, అతన్ని పరిగెత్తనీ.” మని అన్నాడు. ఏది ఏమిటో అన్న విషయంలో బాలుడి జ్ఞానానికి శివుడు సంతోషించాడు, మందహాసం చేశాడు “కుమారా! ఇదిగో మామిడిపండు. దీనికి నీవే అర్హుడివి.”

కాని కార్తికేయునికి ఇది మహా అన్యాయమనిపించింది, ఆగ్రహం కలిగింది. ఆత్మాశ్రయమూ, వస్త్వాశ్రయమూ నని రెండు దృక్పథాలుంటాయనీ, అనుభవమంతా ఆత్మాశ్రయమేననీ, వస్తువులు ఆత్మాశ్రయ అనుభవాన్ని కలిగించడానికే ఉన్నాయనీ,  వాటికవే ఏమీ కావనీ వివరించడానికి ప్రయత్నించింది పార్వతీ దేవీ. గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేశాడు, “నా తల్లిదండ్రులే నా ప్రపంచం, అందువల్ల వారికే ప్రదక్షిణ చేస్తాను” అన్న వివేకాన్ని, అవగాహనను గణపతి ప్రదర్శించాడని ఆమె కార్తికేయుడికి వివరించింది. కాని కార్తికేయుడు ఈ వివరణలు వినదలచుకోలేదు, తండ్రి నుండి దూరంగా వెళ్లదలచుకున్నాడు. అందుకని ఇల్లు వదిలి వెళ్లిపోయాడు.

అగస్త్యమునికి సహాయం చేసిన కార్తికేయుడు

కార్తికేయుడు మహాక్రోధంతో దక్షిణ భారతదేశానికి వెళ్లాడు. అక్కడ ఆయన గొప్పయోధుడయ్యాడు. దక్షిణాపథంలో అనేక ప్రాంతాలను జయించాడు. కాని వాటిని జయించింది తాను పరిపాలించడానికి కాదు. తన తల్లిదండ్రులు తనకు అన్యాయం చేశారు కాబట్టి, తాను న్యాయాన్ని సృష్టించాలి అన్న ఆలోచనతో. అతనొక విప్లవకారుడు వంటి వాడు. ఎక్కడ అన్యాయం జరిగిందని తనకు అనిపించినా అతను దానిపై యుద్ధం ప్రకటించాడు. ఈ ఆగ్రహంలో అతనికి ప్రతి చిన్న విషయమూ ఘోర అన్యాయంగా కనిపించసాగింది. ఎందరినో చంపాడు. యుద్ధం తర్వాత యుద్ధం చేస్తూ దక్షిణానికి వెళ్లాడు.

అతను చేసిన పనుల్లో ఒక మంచిపని అగస్త్యునికి సహాయం చేయడం. అగస్త్యుడు దక్షిణభారతదేశానికి ఆధ్యాత్మికతను తీసికొని వచ్చాడు. అగస్త్యునికి ప్రతిఘటన ఎదురైన చోటల్లా కార్తికేయుడు యుద్ధం చేశాడు. అగస్త్యుడతనికి యుద్ధవిద్య నేర్పాడు, అతని క్రోధాన్ని జ్ఞానసాధనకు ఉపకరణంగా మలచాడు.

కుమారా పర్వత కథ : కార్తికేయుని మహాసమాధి      

చివరికి సుబ్రహ్మణ్యం అనేచోట కార్తికేయుడు ప్రశాంతతను పొందాడు. యుద్ధంతో అతను విసిగిపోయాడు. ఇలా వెయ్యేళ్ళు యుద్ధం చేసినా ఈ ప్రపంచం  మారదని అతను తెలుసుకున్నాడు. ఒక పరిష్కారం పది సమస్యలను సృష్టిస్తుంది. అందువల్ల అతను యుద్ధాలు వదిలివేశాడు, చివరిసారిగా తన ఖడ్గాన్ని “ఘటి సుబ్రహ్మణ్య”లో కడిగాడు. ఇది నేటి కర్ణాటకలో ఉంది. అక్కడ కొంతకాలం ధ్యానంలో కూర్చున్నాడు. కుమారపర్వతం పైకి వెళ్లాడు. కర్ణాటకలో సుబ్రహ్మణ్యుణ్ణి,  ‘కుమార’ అని కూడా పిలుస్తారు. కుమారుడు అంటే కొడుకు. శివుడు ప్రధాన దైవం, అతని కుమారుడు కుమారస్వామి అన్నమాట. అందువల్ల ఇది కుమార పర్వతం. ఆ పర్వత శిఖరం మీద, నిలుచున్న భంగిమలో కార్తికేయుడు మహాసమాధి పొందాడు.

చాలామంది యోగులు కూర్చున్న భంగిమలో తమ శరీరాలు విడుస్తారు.

యోగ సంప్రదాయంలో యోగులు తమ జీవితంలో పని పూర్తయిన తర్వాత అలా తమ శరీరాన్ని ఇచ్ఛారీతిలో వదిలివేసేవాళ్లు. ఇది ఆత్మహత్య కాదు. కేవలం శరీరాన్ని వదిలి వెళ్లిపోవడం. చాలామంది యోగులు కూర్చున్న భంగిమలో తమ శరీరాలు విడుస్తారు. శరీరం అందుకు అనుకూలించకపోతే ఒక పక్కకు ఒత్తిగిలి పడుకొని విడుస్తారు. కాని కార్తికేయుడు మహాయోధుడు కావడం వల్ల నిలబడే తన శరీరాన్ని విడిచి పెట్టాడు.

సాధారణంగా అందరూ సుబ్రహ్మణ్యంలో గుడికి వెళ్లి వచ్చేస్తుంటారు. గుడిలో పెద్దగా ఏమీ లేదు. కాని పర్వతం అలా ఉండదు. ప్రకృతి సౌందర్యం రీత్యా కుమారపర్వత శిఖరం చాలా అందమైంది. పైకి చేరాలంటే 15-20 కిలోమీటర్లు నడవాలి. చాలా సంవత్సరాల కిందట నేను కొంతమందితో కలిసి పర్వతం ఎక్కాను. మూడు వంతుల దూరం  వెళ్లిన తర్వాత ఒక రాత్రి అక్కడే విడిది చేశాం. మరుసటి రోజు ఉదయం మేం శిఖరానికి చేరుకోవాలి.

కార్తికేయుని శక్తి

ఈ స్థలం శక్తి ఎంత ప్రబలమైందీ, శక్తివంతమైనదీ అంటే, అది పూర్తిగా ఓ భిన్న ప్రపంచం. మీకు అనుభూతి చెందగలిగిన సున్నితత్వం ఉంటే, ఈ నాటికీ అది మీ మూలాలను కదిలించి వేస్తుంది. మేమక్కడ చిన్న గుడారం వేసుకుని పడుకుందామనుకున్నాం. కాని నేను కనీసం కూర్చోను కూడా కూర్చోలేకపోయాను. నా శరీరం దానంతటదే నిలబడి పోయింది, గుడారం లేచిపోయింది. రాత్రంతా అలా నిలబడే ఉన్నాను – ఆ ప్రదేశం అంత శక్తిమంతమైనది.

ఈ ఘటన జరిగి 15,000 సంవత్సరాలు దాటింది. కచ్చితమైన తేదీ మనకు తెలియదు. కార్తికేయుడు దేహాన్ని విడిచివెళ్లిన ఆ చోటు ఇంకా శక్త్యుత్సాహాలతో సజీవంగా ఉంది. ఈ పర్వత శిఖరం మీద చిన్ని చిన్ని రాళ్లు షణ్ముఖంగా చెక్కి ఉంటాయి. వీటిని ‘షణ్ముఖలింగా’ లంటారు. ఇన్ని వేల సంవత్సరాలూ అతని శక్తి ఇక్కడ ప్రకంపిస్తూనే ఉంది, చివరికి రాళ్లు కూడా మెల్లగా తమను తాము షణ్ముఖ ఆకారాలలోకి మలచుకున్నాయి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు