ప్రశ్న: భావాలు, లాభాల కంటే సమస్యలనే ఎక్కువ తెచ్చిపెడుతున్నాయి. మనం భావాలు లేకుండా, మెరుగ్గా జీవించగలమా..?

సద్గురు: ఒక మనిషిలో భావాలన్నవే లేకపోతే, అసలు మనం వారిని మనిషి అనే అనలేము. మానవ జీవితంలో భావాలు ఎంతో అందమైనవి. అవి లేకపోతే, మానవుడు అందవిహీనంగా తయ్యారవుతాడు. కానీ, అన్నిటికి మల్లేనే భావాలను కూడా మనం అదుపులో పెట్టకపోతే, అవి పిచ్చిగా పరిణమిస్తాయి. మీరు మీ ఆలోచనను నియంత్రించలేకపోతే, అది కూడా పిచ్చిగానే పరిణమిస్తుంది. మీ తలంపులు కనుక నియంత్రణ తప్పితే, అది కూడా పిచ్చిగానే పరిణమిస్తుంది. భావం, అన్నది సమస్య కాదు. ప్రజలు, మనోభావాలను ఒక సమస్యగా ఎందుకు చూస్తున్నారంటే, వారికి ఎంతో బాధాకరమైన భావాలు కలుగుతున్నాయి కాబట్టి. ఒకవేళ వారిలో అందమైన తలంపులు ఉన్నట్లయితే, దానిని వారు సమస్య అని అంటారా..?

మీలో మీరు ఎప్పుడూ ఆనందంగా, ప్రేమగా, కారుణ్యంతో ఉండడం వలన, మీ మనోభావాలు కూడా ఇదే రూపాన్ని పొంది, ఇలాంటి వ్యక్తీకరణనే పొందుతాయి. అప్పుడు, మీకు అది ఒక సమస్య అనిపిస్తుందా..? లేదు. మీ శరీరం ఎంతో అందంగా, చక్కగా పని చేస్తున్నట్లయితే; మీరు దానిని ఒక సమస్య అంటారా..? అది, మీకు ఓ రోగాన్నో లేదా ఓ నొప్పినో కలిగించినప్పుడు, కూర్చోవడం, నిలుచోవడం, వంగడం అన్నీ ఎంతో బాధాకరంగానే ఉంటాయి. అప్పుడు, మీరు ఈ శరీరం ఒక సమస్య అని అనుకుంటారు. అదేవిధంగా, మీరు భావాలను కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మీ మనోభావాలను ఆ విధంగా చిందర-వందర చేసుకున్నారు కాబట్టి.

మీరు ఇక్కడ సరిగ్గా జీవించలేనప్పుడు అక్కడికి వెళ్ళగలరు అన్న గ్యారంటీ మీకు ఏమి ఉంది..?
మీలో మీకు ఎంతో అందమైన తలంపులు ఉన్నాయనుకోండి మీ జీవితాన్ని అవి ఒక పుష్పం లాగా తయారు చేస్తాయి. అప్పుడు మీరు అసలు భావాలు లేకపోవడం గురించి, ఆలోచిస్తారా ..? నేను మిమ్మల్ని, మీ భావాలని వదిలేసి, వాటికి అతీతంగా వెళ్ళమని చెప్పడం లేదు. నేనేమి చెబుతున్నానంటే అది మీ శరీరమైనా, మీ మనస్సైనా, మీ భావాలైనా, మీ శక్తి అయినా - ఈ నాలుగు పార్శ్వాలలో ఏదైనా సరే - మీ అనుభవంలో ఉన్న ఈ నాలుగు పార్శ్వాలనూ.. మీరు వీటిని ఆహ్లాదకరంగా తయారుచేసుకోవాలి. ఒకసారి అవి ఆహ్లాదకరంగా ఉన్న తరువాత ఇక అవి మీకు సమస్యే కాదు. మీరు దేనినీ ఆకాంక్షించకుండా సహజంగానే ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు మీ ప్రస్తుత స్థితికి అతీతమైనదానికి ఎదగాలి అన్న కాంక్ష కలుగుతుంది. ఇలా కానప్పుడు మీరు కోరుకుంటున్నది కేవలం మనుగడ మాత్రమే..! మీరు భగవంతుడిని పిలుస్తున్నప్పటికీ, అది కేవలం మనుగడ గురించే..! మీరు ఇక్కడ మనుగడ కొనసాగించలేనప్పుడు, మీరు స్వర్గంలో మాత్రం ఏంచెయ్యగలుగుతారు..? మీరు కనీసం ఇక్కడైనా సరిగ్గా జీవించగలిగితే; మీరు కొంత ఎదిగినట్లే. మీరు ఇక్కడ సరిగ్గా జీవించలేనప్పుడు అక్కడికి వెళ్ళగలరు అన్న గ్యారంటీ మీకు ఏమి ఉంది..?

నాలుగు రకాల దారులు

కర్ణాటక ప్రాంతంలో ఒక గొప్ప కవి, సాధువు అయినటువంటి బసవన్న ఈ విధంగా చెప్పాడు “ఇల్లి సల్లదవరు అల్లియు సల్లరయ్యా” - అంటే ఏదైతే ఇక్కడ సాధించలేరో అట్టివారు ఇక్కడా-అక్కడా ఏమీ చెయ్యలేరు - అని. అందుకని మనం భావాలకు అతీతంగా వెళ్ళడం అన్నది కాదు విషయం, మీరు అతీతంగా వెళ్ళాలి. కానీ అతీతంగా వెళ్ళడం అంటే మీ భావాలకూ, మనస్సుకూ, దీనికో-దానికో అని కాదు ఏదైతే మిమ్మల్ని ఇప్పుడు పట్టి ఉంచుతుందో, ఆ పరిమితులకు అతీతంగా వెళ్ళడం అని. మనోభావాలూ, ఆలోచనలూ అనేవి మీకు అక్కడికి వెళ్ళే మార్గానికి ఉపయోగపడే సాధనాలు కూడా కావచ్చు. మీరు, మీ మనస్సును ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని మనం జ్ఞానయోగం అని అంటాం.

మీరు మీ భావాలను ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని భక్తియోగం అంటాం. మీరు మీ శరీరాన్ని ఉపయోగించి వీటిని అధిగమిస్తే, మనం దానిని కర్మయోగం అంటాం. మీరు మీ శక్తిని ఉపయోగించి ఈ పరిమితులను అధిగమిస్తే, దానిని మనం క్రియాయోగం అని అంటాం. వీటిల్లో ప్రతీదీ కూడా మీకు ఒక ద్వారమే..! ఒక మార్గమే..! ఒక ద్వారం మీకు ఒక అడ్డంకిగా అయినా మారవచ్చు లేదా మిమ్మల్ని ఆవలికి చేర్చేదిగానైనా ఉండవచ్చు. అందుకని మీ భావాలని మీరు త్యజించడమో, విడిచిపెట్టడమో చేయ్యనక్ఖర్లేదు. మీరు వాటిని వదిలిపెట్టలేరు. మీరు భావాలు లేకుండా ఉండాలీ అనుకుంటే, మీరు భావాలని తోక్కివేస్తే, అణచివేస్తే మీరు నిర్జీవంగా మారిపోతారు. మీరు, మీ భావాలను ఎంతో లోతైన విధంగా అంగీకరించాలి. అవి, మీకు స్నేహితుడిలా మారాలి. మీకు స్నేహితుడు అంటే మీకు ఆహ్లాదాన్ని కలిగించే వారే కదా..??

ప్రేమాశీస్సులతో,
సద్గురు