ధ్యానం అంటే ఏమిటి?

సద్గురు: ధ్యానం అంటే శరీరం, మనస్సుల పరిమితులను దాటి మందుకు వెళ్లడం. మీరు ఎప్పుడైతే శరీరం, మనస్సుల పరిమితమైన దృష్టికోణాన్ని అధిగమిస్తారో, అప్పుడే మీలోని పరిపూర్ణత్వాన్ని చూడగలుగుతారు.

మీ శరీరం కేవలం మీరు తిన్నఆహారపు కుప్ప. మీ మనస్సు కేవలం మీరు బాహ్యం నుంచి పోగు చేసుకున్న జ్ఞాపకాల సమాహారం మాత్రమే.

మిమ్మల్ని మీరు ఈ శరీరంగా గుర్తించుకున్నప్పుడు, మీ జీవన దృష్టికోణం మొత్తం మనుగడ మీదే ఉంటుంది. మీరు మనస్సుతో గుర్తింపు ఏర్పరుచుకున్నప్పుడు, మీ దృష్టికోణం సామజికమైన, మతపరమైన మరియు కుటుంబపరమైన పరిస్థితులకు బానిస అవుతుంది. ఇంతకు మించి మీరు ముందుకు చూడలేరు. మీరు మీ మనస్సు యొక్క మార్పులు చేర్పుల నుండి విముక్తి పొందినప్పుడు మాత్రమే మీకు అతీతమైన పరిమాణం తెలుస్తుంది.

ఈ శరీరం, ఈ మనస్సు మీవి కాదు. అవి మీరు కొంత కాలంగా కూడబెట్టినవి. మీ శరీరం కేవలం మీరు తిన్న ఆహారపు కుప్ప. మీ మనస్సు కేవలం మీరు బాహ్యం నుంచి పోగు చేసుకున్న జ్ఞాపకాల సమాహారం మాత్రమే.

మీరు కూడబెట్టుకున్నది మీ ఆస్తి అవుతుంది. ఎలాగైతే మీరు కట్టుకున్న ఇల్లు, కూడబెట్టిన డబ్బు మీవి అవుతాయో, అలాగే మీ శరీరం, మనస్సు మీరు పోగు చేసుకున్నవి. మంచి సంపద, ఒక మంచి శరీరం మరియు మంచి మనస్సు మనకి ఒక మంచి జీవితం గడపడానికి కావాలి, కానీ అవే సరిపోవు. ఏ మనిషి కూడా వీటి ద్వారా పరిపూర్ణతని పొందలేడు. అవి జీవితాన్ని మీకు సౌకర్యవంతంగా, అనుకూలముగా మాత్రమే చేస్తాయి. మనం మనతరాన్ని గమనిస్తే, ఇంతకూ ముందు తరాలకి కలలో కూడా ఊహించని సుఖ సౌకర్యాలు మనకు ఉన్నాయి. కానీ మనము ఈ భూమిపై అత్యంత ఆనందకరమైన లేదా ప్రేమపూరిత తరం అని చెప్పుకోలేము.

ధ్యానం – శరీరం, మనస్సులను దాటేందుకు ఒక శాస్త్రీయ సాధనం

శరీరం, మనస్సు అనే సాధనాలు మనుగడకి మాత్రమేగాని, అవి మీకు పరిపూర్ణతని కలిగించవు, ఎందుకంటే ఎదో ఇంకాస్త ఎక్కువ కావాలి అని కోరుకోవడం మనిషి లక్షణం. అసలు ‘మీరు ఎవరో’ అనే విషయం మీకు తెలియకపోతే, ఇక ప్రపంచం ఏమిటో తెలుసుకోగల సామర్థ్యం మీకు ఉంటుందా? మీరు మీ శరీరం, మనస్సుల పరిమితులను దాటినప్పుడే మీ నిజతత్వాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. యోగా, ధ్యానం ఇందుకు శాస్త్రీయ సాధనాలు.

మీరు శరీరం, మనస్సు యొక్క పరిమితులను దాటితేనే అది సాధ్యం. కేవలం తినడం, నిద్రించడం, పునరుత్పత్తి మరియు మరణించడం ద్వారా జీవితంలో పరిపూర్ణతని పొందలేరు. ఆ విషయాలన్నీ మీ జీవితంలో అవసరం, కానీ మీరు ఈ విషయాలన్నీ నెరవేర్చినప్పటికీ జీవితం సంపూర్ణం కాదు. ఎందుకంటే, మనిషి తత్త్వం ఒక స్థాయి ఎరుకని దాటి ముందుకు వెళితేనే, ఇది ఇంకా ఎక్కువ కావాలి అని తపన పడుతుంది, లేకపోతే అది ఎప్పటికీ సంతృప్తి చెందదు. ఇది అపరిమితంగా మారాలి - నీవు ఎవరు అనే అపరిమిత కోణంలోకి వెళ్ళే మార్గం, ధ్యానం.

ప్రశ్న: అయితే సద్గురూ, ఒక వ్యక్తి యజ్ఞాలు లేదా ఆచారాల ద్వారా ఈ అపరిమిత కోణంలోకి వెళ్ళలేడా? ధ్యానం ఒక్కటే దీనికి మార్గమా?

సద్గురు: ఈశాలో, మేము ధ్యాన ప్రక్రియలను ఎన్నుకోవటానికి, ఇంకా ఆచారాలను కనిష్టంగా ఉంచడానికి కారణం, ధ్యానం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ. ప్రత్యేకముగా ఉండడము అనేది మన ఆధునిక సమాజంలో ఒక శాపం లాంటిది. మనుషులు ఆధునిక విద్యావంతులు అవుతున్న కొలది, ఇంకా ఇంకా ప్రత్యేకత సంతరించుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో ఇమడలేకపోతున్నారు - వారు అలా తయారవుతున్నారు. నేటికీ దక్షిణ భారతదేశంలో ఒక ఇంట్లో 400 మందికి పైగా ఉన్న కుటుంబాలు ఉన్నాయి - మావయ్యలు, అత్తలు, నానమ్మలు, తాతలు, అందరూ ఉన్న పెద్ద ఇల్లు.

ఒకరు ఇంటికి యజమాని, మిగతా ప్రతి ఒక్కరికి ఒక పాత్ర ఉంటుంది. ఇంట్లో కనీసం 70 నుండి 80 మంది పిల్లలు ఉంటారు. బహుశా వారికి ఒక నిర్దిష్టమైన వయస్సు వచ్చే వరకు, ఈ పిల్లలకు వారి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే వారి ఆలన పాలన జాగ్రత్తగా చూసుకునేందుకు 8 నుండి 10 మంది స్త్రీలు ఉంటారు. పిల్లలకు 12-13 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, వారు తమ అసలు తల్లిదండ్రులను గుర్తించలేరు. వారికి తెలుసు, కాని వారు పాఠశాలకు వెళ్లి వారి మనసులలో ఈ విధమైన ఆలోచనలు పెరిగే వరకు వారు ఈ సంబంధాలకు ఎక్కువ విలువ ఇవ్వరు.

కానీ ఆధునిక విద్య విస్తరిస్తున్న కొలదీ, ఎక్కువ మంది కలిసి ఉండడం అసాధ్యంగా మారుతోంది. కేవలం ఇద్దరు మనుషులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. సమాజ పరిస్థితి చాలా వేగంగా ఆ దిశకు చేరుతోంది. ఆధునిక విద్య మొత్తం ప్రత్యేకత గురించి, కానీ మన అస్తిత్వం మాత్రం అన్నిటిని కలుపుకొని చేసే ప్రక్రియగా సాగుతుంది.

ధ్యానం - ప్రత్యేకత నుండి కలుపుకొనే తత్వం దిశగా

ఒక ప్రక్రియగా ధ్యానం ప్రత్యేకమైనది, ఇది తరువాత సమగ్రతకు దారితీస్తుంది, కానీ మీరు దాన్ని ప్రారంభించినప్పుడు, మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటారు. ఆధ్యాత్మిక ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ చాలా ప్రత్యేక తత్త్వం కలిగి ఉంటారు - వారు ఎవరితోనూ కలవలేరు. "నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళితే, నేను సమాజంతో కలవలేను" అని ఒక భయం మనుషులలో ఉందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది తప్పనిసరిగా వ్యక్తిగతమైనది.

ధ్యాన ప్రక్రియలను దుర్వినియోగం చేయలేము, ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది మరియు ప్రత్యేకమైనది.

నేటి సమాజంలో సంఘటిత ప్రక్రియలు సాధ్యం కానందున మేము ఆ మార్గంలోకి వెళ్ళాము. మీరు ఏదైనా ఆచార వ్యవహారాలు చేయాలనుకుంటే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తామంతా ఒక్కటే అన్నవిధంగా అందులో పాల్గొనాలి. అందులో పాల్గొనడానికి లోతైన ఏకత్వతాభావన కలిగి ఉండాలి. ఆచారాలలో మరొక కోణం ఏమిటంటే, అది దుర్వినియోగం కాబోదని మీకు నిర్థారణ అయితే తప్ప, అది ఆచరించే వ్యక్తులు తమ జీవితాలలో వీటికి ఉన్నతమైన స్థానం ఇచ్చినట్లయితే తప్ప, మీరు ఆ ప్రక్రియ చేయలేరు. ఎందుకంటే అది సులభంగా దుర్వినియోగం చేయబడవచ్చు. ధ్యాన ప్రక్రియలను దుర్వినియోగం చేయలేము ఎందుకంటే ఇది వ్యక్తిగతమైనది, ప్రత్యేకమైనది.

“నీకు నేను పోటీ” “నీవు నాకు వ్యతిరేకం” అనే భావనలు ఉంటే మనం ఆచార కాండ చేయలేము. ఆ ఆచారం వికృతమైన ప్రక్రియ అవుతుంది. కలుపుగోలు వాతావరణం ఉన్నప్పుడు, అదే ఆచార కాండ ఒక్క గొప్ప ప్రక్రియ అవుతుంది. కానీ నేటి ప్రపంచంలో ఆ కలుపుగోలు తత్త్వం ఉన్న వాతావరణాన్ని సృష్టించడం చాలా కష్టమైన విషయం, ఇది కొన్ని సంఘాలలో మాత్రమే సాధ్యమైనది. మిగిలిన వారు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నవారు. ఇటువంటి సందర్భాలలో, ధ్యానం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 

Editor’s Note: Always wanted to learn how to meditate but never knew where to start? Inner Engineering Online is available free of cost for healthcare professionals and at 50% for everyone else. Register today!