యోగ విధానమంతా మనసు పరిధుల్ని అధిగమించటానికే. మీరు మనసుతో ఉన్నంతకాలం, గతం చేత శాసించబడతారు, ఎందుకంటే మనసు అనేది గతాల పోగు కాబట్టి. మీరు గనక జీవితాన్ని మనసు ద్వారా మాత్రమే చూస్తుంటే మీ భవిష్యత్తును గతంలాగే తయారుచేసుకుంటారు, అంతకంటే గొప్పగానూ కాదు, తక్కువగానూ కాదు. ఈ ప్రపంచం దీనికి తగిన ఉదాహరణే కదా? శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇతర విషయాల ద్వారా మనకి ఎన్నో అవకాశాలు వస్తుండవచ్చు, కానీ అవే చారిత్రక సన్నివేశాలను మనం మళ్లీ మళ్ళీ పునరావృతం చేసుకుంటున్నామా లేదా?

మీ జీవితం గురించి లోతుగా పరిశీలించుకుంటే అదే విషయం మళ్ళీ మళ్ళీ జరగటాన్ని మీరు చూస్తారు. ఎందుకంటే మనసు అనే పట్టకంలోంచి మీరు పని చేస్తున్నంత కాలం, మీరు పాత డేటా ప్రకారం మాత్రమే పనిచేస్తుంటారు. గతం అనేది మీ మనసులో మాత్రమే ఉంది. మీ మనస్సు క్రియాశీలకంగా ఉండటం వలనే గతానికి స్థానముంది. మీ మనస్సు గనుక మొత్తం తుడుచుపెట్టుకుపోతే, మీకు ఇక్కడ గతమనేది ఉంటుందా? ఇక్కడ గతమనేది లేదు, కేవలం వర్తమానం మాత్రమే ఉంది. యదార్థం అనేది కేవలం వర్తమానంలోనే ఉంది, కానీ గతం మాత్రం ఉండేది మన మనస్సు ద్వారానే. వేరేలా చెప్పాలంటే, మనస్సు అనేది ఒక కర్మ. మీరు మనసుని జయిస్తే, మీ మొత్తం కర్మబంధాలను జయించినట్లే. మీరు కర్మలను ఒక్కొకటిగా చెరిపేయలనుకుంటే, అది ఎన్నో లక్షల సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ఆ క్రమంలో కొత్త కర్మలను పోగేసుకుంటారు.

మీ సంచిత కర్మలు సమస్య కానేకావు. కొత్తవాటిని తయారుచేసుకోకుండా ఉండటం ఎలాగో మీరు నేర్చుకోవాలి. అదే ముఖ్యమైన విషయం. పాత కర్మల మూట దానికదే వదిలిపోతుంది, దాని గురించి పెద్దగా చేయవలసినదేమీలేదు. కానీ ప్రధానమైన విషయమేమంటే కొత్త కర్మలను తయారు చేసుకోకుండా ఉండటం ఎలాగ అనేదే. అప్పుడు, పాతవాటిని వదిలేయటం చాలా సులువు.

మీరు మనసును జయిస్తే కర్మబంధాలను కూడా పూర్తిగా దాటుతారు. నిజానికి మీరు దీనికోసం శ్రమించనవసరంలేదు, ఎందుకంటే మీరు మీ కర్మల మీద పని చేస్తున్నప్పుడు, మీరు అస్తిత్వంలో లేని విషయాలపై పని చేస్తున్నారు. ఇది మనసు వేసే గాలం. గతం ఉండదు, కానీ అది ఉందనుకుని అక్కడ లేని దానితో వ్యవహరిస్తున్నారు. అదంతా ఒక భ్రమ. మనసే దీనికి మూలం. మీరు మనసును జయిస్తే, ఒక్క దెబ్బతో అన్నింటినీ వశపరుచుకుంటారు.

ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ప్రయత్నం మనసును వశపరచుకోవటం ఎలా, మనసు పరిధుల్ని దాటి జీవితాన్ని ఎలా చూడాలి అనే! చాలామంది యోగాని వివిధరకాలుగా నిర్వచించారు. వాళ్ళు ఇలా అంటారు, "మీరు విశ్వంతో మమేకమైతే, అదే యోగా”. “మీరు మిమ్మల్ని దాటి వెళ్లగలిగితే అదే యోగా". మీరు భౌతిక ధర్మాలకతీతమైతే అదే యోగా". ఇవన్నీ గొప్ప అద్భుతమైన నిర్వచనాలు, వాటిలో తప్పేమీ లేదు, కానీ మీ అనుభవాల ప్రకారం, మీరు వాటితో సంధానించుకోలేరు. ఒకరు ఇలా చెప్పారు. "మీరు దేవునితో ఒక్కటయితే, మీరు యోగాలో ఉన్నట్లు" అని. మీరెక్కడున్నదీ మీకు తెలీదు. దేవుడెక్కడున్నదీ మీకు తెలీదు. ఏకమవటం ఎలా?

కానీ పతంజలి దానిని ఈ విధంగా తెగ్గొట్టారు - "మీ మనసులోని మార్పులకు అతీతంగా పైకి ఎదగగలిగితే, మీ మనసును పూర్తిగా దూరం పెట్టగలిగితే, మిమ్మల్ని మీరు మీ మనసులోభాగం కాకుండా నిలుపుకోగలిగితే, అదే యోగా". ప్రపంచలోని ప్రభావాలన్నీ మనసనే పరికరం ద్వారా మాత్రమే మీలోకి ప్రవేశిస్తాయి. మీరు పూర్తి స్పృహతో మీ మనసు ప్రభావానికతీతంగా ఎదగగలిగితే అప్పుడు మీరు సహజంగా ప్రతి ఒక్క దానితో ఏకమౌతారు. నువ్వు - నేను, కాలం - దూరం అనే విభజన మనసువల్ల మాత్రమే కలిగింది. అది మనస్సు వేసే చిక్కుముడి. మీరు మనసును పక్కనపెడితే, కాలాన్నీ, దూరాన్నీ వదిలేస్తారు. ఇది...అది...అనే విషయాలుండవు. ఇక్కడ...అక్కడ...అనేది ఉండదు. ఇప్పుడు...అప్పుడు...అనేదీ ఉండదు. ప్రతీదీ ఇక్కడ, ఇప్పుడు అవుతుంది.

మీరు మనసులోని అన్ని మార్పులు, వ్యక్తీకరణలకి అతీతంగా ఎదిగితే,అప్పుడు మీరు ఏవిధంగా కావాలనుకుంటే అలా ఆడుకోగలరు. మీ జీవితంలో వినాశకరమైన ప్రభావంతో మీ మనసును మీరు ఉపయోగించుకోవచ్చు. కాని మీరు దానిలోనే ఉంటే మనసు స్వభావాన్ని ఎప్పటికి తెలుసుకోలేరు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు