సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో కర్మ యోగం ప్రాముఖ్యత
సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో కర్మ యోగం ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తూ, ఒక సాధకుడు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో కొన్ని దశలలో కర్మ చేయడం ఎందుకు అవసరమవుతుందో, మరియు ఆ కర్మను పాలించడానికి ఉపయోగించుకుంటామా లేదా సేవించడానికి ఉపయోగించుకుంటామా అనేది మన చేతుల్లో ఎలా ఉంటుందో వివరిస్తున్నారు.
ప్రశ్న: సద్గురు, నేను చర్యను లేదా కర్మ యోగాన్ని దాటి ఎలా వెళ్ళగలను? వ్యక్తిగతంగా, నాకు ఏమీ చేయాలని అనిపించడం లేదు. ఏమీ చేయకుండా ఉండే స్థితి వైపు నేను వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది.
సద్గురు: ఒక వ్యక్తి పరమార్ధాన్ని తెలుసుకోవడం తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, చర్య చేయడం అనేది అర్థరహితమైపోతుంది. ఒకసారి చర్య చేయడం అనేది అర్థరహితమైతే, ఏ విధమైన ఆత్మగౌరవము ఉన్నా, అది ప్రాముఖ్యతను కోల్పోతుంది. కానీ ప్రస్తుతం మీరు ఉన్న స్థితిలో, మీకు ఇంకా చర్య చేయడం అనేది అవసరమే. ఎందుకంటే మీరు ఇంకా చర్యకు అతీతమైన స్థాయిని చేరుకోలేదు. మీరు చర్య చేయకుండా ఉండలేరు. కాబట్టి, ప్రస్తుతానికి మీకు ఏది సరైనది అనిపిస్తుందో, పరిస్థితికి ఏది అవసరమో అలాంటి చర్యను చేయండి.నిజమైన, తీక్షణమైన కర్మ చేయడం తెలియని వ్యక్తి ఎప్పటికీ అకర్మను చేరుకోలేడు. ఒకవేళ మీరు ప్రయత్నిస్తే, ఆ అకర్మ సోమరితనంగా మారుతుంది. ఎవరైతే జీవితంలో ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారో, వారు విశ్రాంతి మీద పట్టు సాధించి ఉండాలి, కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఎప్పుడూ ప్రజ్వలించని వారికి, నీటి చల్లదనం తెలీదు. అలాగే, ఎవరైతే అనాసక్తితో, జీవితాన్ని స్తబ్దుగా గడుపుతుంటారో, వారికి మరోలా ఉండటం ఎప్పటికీ తెలియదు. కాబట్టి, కనీసం కొంతకాలం పాటు అయినా - తీక్షణమైన చర్య చేయడం అనేది - మీ జీవశక్తులు తారాస్థాయికి చేరుకొని, కదిలేలా సహాయపడుతుంది. ఆ తరువాత, ఆ శక్తిని వేరే రూపంలోకి మార్చుకోవడం చాలా సులభం. ఇదే చర్య లేదా కర్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే సాధకుడు చర్య చేయడాన్ని ఎంచుకుంటాడు. మనం ఎలాగూ ఏదో ఒక చర్య చేస్తాము. అయితే హిట్లర్ లాంటి కర్మ చేయాలా లేదా గాంధీ లాంటి కర్మ చేయాలా అనే ఎంపిక మన చేతుల్లో ఉంటుంది, అంతే. ఎలాగూ ఏదో ఒక కర్మ చేయాల్సిందే, కాబట్టి మనస్ఫూర్తిగా చేద్దాం, అలాగే ఎలాంటి కర్మ చేయాలో ఎంచుకుందాం.
పాలించడమా లేక సేవించడమా - మీ ఎంపిక ఏది?
మీరు ప్రపంచాన్ని పాలించాలనుకుంటున్నారా లేక ప్రపంచానికి సేవ చేయాలనుకుంటున్నారా? మొత్తానికి, మీకున్నవి ఈ రెండు ఎంపికలే. సాధారణంగా, ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని పాలించాలనే అనుకుంటారు. అయితే చాలామంది అనాసక్తితో ఉంటారు కాబట్టి, వారు కేవలం తమ కుటుంబాన్ని మాత్రమే పాలించగలుగుతారు. కానీ వారి అసలు కోరిక మాత్రం ప్రపంచాన్ని పాలించాలనే. కానీ అలా చేయడానికి వారికి ఆ సామర్థ్యం లేదా తీవ్రత లేదు. లేదంటే, వాళ్ళు కూడా మరో హిట్లర్ అయ్యే అవకాశం ఉంది.
కాబట్టి, మీ ముందున్న ఎంపిక ఏమిటంటే- పాలించడం లేదా సేవించడం. దైవత్వానికి ఇంకా ఆత్మ సాక్షాత్కారానికి ఎటువంటి చర్య అయితే దగ్గరగా ఉందని మీకు అనిపిస్తుందో అటువంటి చర్యను ఎంచుకోండి. ప్రతి క్షణం కూడా, ఎలాంటి విరామం లేకుండా, అత్యంత తీక్షణంగా ఆ చర్యను చేయండి. అప్పుడు ఒకరోజు మీకు కర్మ ఏమాత్రం అవసరం లేని స్థితి వస్తుంది. మీరు నిజంగా ఈ "ఏమీ చేయకపోవడం" అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే, ముందు "చేయడం" అంటే ఏమిటో తెలుసుకోవాలి. కానీ మీరు ఇంకా అది చేయలేదు. నేను మేల్కొని ఉన్న ప్రతి క్షణంలో, అలాగే నిద్రలో కూడా, నన్ను నేను శారీరకంగా, మానసికంగా సమర్పించుకునే ఈ పనిని నిరంతరం కొనసాగిస్తున్నాను. నా జీవితంలో ఇదంతా జరగడానికి కారణం ఇదే. ఇది నాకు ఏమీ ముఖ్యం కాకపోయినా, నేను ఇరవై నాలుగు గంటలూ దీనిలోనే ఉంటాను - అందువల్లే ఇది చాలా శక్తివంతమైనదిగా మారింది. దీనికి వేరే రకమైన శక్తి ఉంది. త్యాగానికి అర్థం ఇదే. దాని వల్లే - లోపల, బయట కూడా - మాటల్లో చెప్పలేనిది జరుగుతుంది.
ప్రపంచంలో ఉన్న ప్రతి శక్తిమంతుడైన వ్యక్తి ఇలాగే తయారవుతాడు. నిజంగా శక్తిమంతుడైన వ్యక్తిని తయారు చేసే విజ్ఞానం ఇది. ఇది పాలించే శక్తి కాదు. ఇది ఎప్పుడైనా, ఎవరైనా తీసేసుకోగల శక్తి కాదు. ఎవ్వరూ దీన్ని లాగేసుకోలేరు, ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టినా, మీరు అదే పని చేస్తారు. మీరు పాలించాలనుకుంటే, మీరు పీఠం మీద ఎక్కి కూర్చోవాలి. ఎవరైనా మిమ్మల్ని ఆ పీఠం మీద నుండి కిందకు లాగితే, మీరు బాధపడతారు. కానీ ఇది అలాంటిది కాదు. మిమ్మల్ని ఎక్కడ పెట్టినా - స్వర్గంలో అయినా, నరకంలో అయినా - మీరు మీ పని చేసుకుంటూ పోతారు. ఇది మిమ్మల్ని కర్మఫలం నుండి విముక్తి చేస్తుంది. మీరు కర్మఫలం నుండి విముక్తులైన తర్వాత, చర్య దానంతట అదే జరుగుతుంది. కర్మ నుండి విముక్తి పొందడానికి మీరు పనిని ఆపాల్సిన అవసరం లేదు. అది అదంతట అదే కరిగిపోయి, మాయమైపోతుంది. మీ జీవితం నుండి కర్మఫలం పట్ల కోరిక పూర్తిగా తొలగిపోయిన తర్వాత, చర్య దానంతట అదే జరుగుతుంది. దాని గురించి మీరేమీ చేయనవసరం లేదు.
"పని లేదంటే, భోజనం లేదు"
ఒక జెన్ మఠంలో ఎనభై సంవత్సరాలు పైబడిన ఒక వృద్ధ గురువు ఉండేవారు. ఆయన ప్రతిరోజూ, ఎంతో ప్రేమగా తోటల్లో పని చేసేవారు. జెన్ మఠాలలో తోటపని అనేది సాధనలో చాలా ముఖ్యమైన భాగం. అక్కడ ప్రజలు రోజంతా, తోటలోనే గడుపుతారు. ఈ గురువు కూడా చాలా సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వయసు ఎనభై దాటింది, శరీరం కూడా బలహీనంగా ఉంది, కానీ ఆయన మాత్రం తన పని ఆపలేదు. ఆయన రోజంతా, తోటలోనే పని చేసేవారు. చాలాసార్లు ఆయన శిష్యులు ఆయనను ఆపడానికి ప్రయత్నించారు, "పని ఆపేయండి, మేమందరం ఉన్నాం కదా, మేము చేస్తాం" అని చెప్పేవారు. కానీ ఆయన మాత్రం తనకు చేతనైన పని తాను చేస్తూ ఉండేవారు. ఆయనకు శారీరకంగా పని చేసే సామర్థ్యం తగ్గి ఉండవచ్చు, కానీ ఆయన పని చేసే తీవ్రత మాత్రం తగ్గలేదు.
ఒకరోజు శిష్యులు ఆయన పనిముట్లను తీసుకొని ఎక్కడో దాచిపెట్టారు. ఎందుకంటే ఆయన ఆ పనిముట్లతోనే పని చేసేవారు కాబట్టి. ఆ రోజు ఆయన భోజనం చేయలేదు. మరుసటి రోజు కూడా పనిముట్లు కనపడలేదు, కాబట్టి ఆ రోజు కూడా ఆయన భోజనం చేయలేదు. మూడో రోజు కూడా, పనిముట్లు లేవు; ఆయన భోజనం చేయలేదు. అప్పుడు శిష్యులందరికీ భయం వేసింది, "అయ్యో! మనం గురువు గారి పనిముట్లు దాచాం కాబట్టి ఆయనకు కోపం వచ్చి తినడం లేదు" అనుకున్నారు. వాళ్ళు వెంటనే వెళ్ళి ఆయన పనిముట్లను తీసుకొచ్చి, వాటి యధాస్థానంలో పెట్టారు. నాలుగో రోజు, ఆయన పని చేసి, భోజనం చేశారు. ఆ రోజు సాయంత్రం, ఆయన తన శిష్యులకు ఒక బోధ చేశారు. "పని లేదంటే, భోజనం లేదు" అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన దేహాన్ని త్యజించారు. అదే ఆయన చివరి రోజు. నాలుగు రోజుల ఉపవాసం ఆయనకు చాలా ఎక్కువైంది. కానీ ఆయన చివరి రోజు మాత్రం పని చేసి, భోజనం చేసి, ఆ తరువాత దేహాన్ని వదిలి, "పని లేదంటే, భోజనం లేదు" అనే ఈ ఒక్క బోధను ఇచ్చి వెళ్ళిపోయారు. ఇలాంటి వ్యక్తులకు చర్య అంటే ఇదే. వారిని నరకంలో పెట్టినా, స్వర్గంలో పెట్టినా, భూమి మీద పెట్టినా, వారు ఒకేలా ఉంటారు. మీరు కూడా ఇలా ఉంటే, మీరు బాహ్య పరిస్థితుల నుండి విముక్తి పొందుతారు.
కేవలం కళ్ళు మూసుకోవడం వల్ల, మీరు విముక్తులు కాలేరు. మీరు కళ్ళు తెరిచిన మరుక్షణం, అన్నీ తిరిగి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాయి. మీరు ఇక్కడి నుండి పారిపోయి, కొండ పైకెక్కి కూర్చున్నంత మాత్రాన, మీరు విముక్తులు కాలేరు. దీన్ని మీరు సాధించుకోవాలి. దీన్ని సాధించుకోవడానికి ఇదే మార్గం.
సంపాదకుని గమనిక: "మరమజ్ఞ విలాసం" నుండి ఉల్లేఖించబడింది. ఈ పుస్తకం పిరికివాళ్ళ కోసం కాదు. ఈ పుస్తకం మన భయాలు, కోపాలు, ఆశలు, ఇంకా పోరాటాలను అధిగమించే వాస్తవికతను గురించిన సమాధానాలతో మనల్ని నడిపిస్తుంది. జీవితం, మరణం, పునర్జన్మ, బాధ, కర్మ, ఇంకా ఆత్మ ప్రయాణానికి సంబంధించిన ప్రశ్నలకు సద్గురు తమ సమాధానాలతో మనల్ని తర్కం అంచున నిలబెట్టి ఆకట్టుకుంటారు. శాంపుల్ పిడిఎఫ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి లేదా ఈ-బుక్‌ను కొనుగోలు చేయండి.