మానసిక రుగ్మతలు ఎందుకు ప్రబలుతున్నాయి..??
ప్రముఖ హిందీ చలన చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సద్గురుతో సంభాషించారు. ఈ సందర్భంగా మానసిక రుగ్మతులు ఎందుకు ఇలా ఎక్కువవుతున్నాయి అని అడిగిన ప్రశ్నకి సద్గురు సమాధానాన్ని చదవండి.
కరణ్ జోహార్: ఆందోళన, నైరాశ్యం వంటి మానసిక రుగ్మతలు ప్రస్తుతం, భారతదేశంతో సహా, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా ప్రబలిపోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం వివరించగలరా?
సద్గురు: మానసిక రుగ్మత అంటే నవ్వులాట కాదు. అది అతి బాధాకరమైన విషయం. శారీరికంగా మీకు ఎదైనా వ్యాధి సోకితే అందరూ జాలినీ, సానుభూతినీ చూపిస్తారు. అదే మనోవ్యధ ఉంటే చులకన చేస్తారు. ఇది దురదృష్టకరం. ఇలా ఎందుకు జరుగుతుందంటే అలాంటివారు నిజంగా వ్యధ చెందుతున్నారా, లేక తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారా అన్నది తేల్చడం కష్టం. ఇలాంటివారితో ఇంట్లో వారు కూడా ఏది నిజంగా వ్యాధి లక్షణమో, ఏది ప్రవర్తనో తెలియక ఇబ్బందిపడుతూ ఉంటారు. ఎప్పుడు వారిని ఊరడించాలో, ఎప్పుడు వారితో కటువుగా ఉండాలో తేల్చుకోలేని పరిస్థితి అన్నమాట.
మానసిక ఆరోగ్యం ఎంతో సున్నితమైనది. మానసిక ఆరోగ్యం (స్వస్థచిత్తత), అలాగే మానసిక అనారోగ్యం (దీనినే చిత్తచాంచల్యం, పిచ్చి అనికూడా అనవచ్చు) ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అతి పలుచనైన రేఖ. మీరు రోజు గీతదాటి ఆవలికి వెళ్లి వస్తూ ఉంటే ఎదో ఒక రోజున గీత దాటే ప్రమాదం ఉంది. అతిగా కోపం వచ్చినప్పుడు ఏమంటామో చూడండి - "నాకు పిచ్చి కోపంగా ఉంది", "నాకు పిచ్చి పిచ్చిగా ఉంది". అంటే, ఆమాత్రం గీతదాటి ప్రవర్తించడంలో ఒకరకమైన స్వేచ్ఛ, అధికారం వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అదే గీత మళ్ళీ వెనక్కి దాటలేని పరిస్థితి వస్తే అప్పటి నుండీ మనోవ్యధ మొదలౌతుంది. ఇది శారీరికమైన నొప్పి లాంటిది కాదు, అతి తీవ్రమైన బాధ. నేను మానసిక రోగులకి సహాయం చేసే ఉద్దేశ్యంతో వారితో ఉన్నాను. అటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. కానీ ప్రపంచంలో ఇదొక అంటు వ్యాధిలాగా వ్యాప్తిచెందడం దురదృష్టకరం.
అంతరించిపోతున్న ఆధారాలు
ఇలా పాశ్చాత్య దేశాలలో విపరీతంగా జరుగుతోంది. భారతదేశం కూడా ఇందులో వెనకబడి లేదు. భాతదేశంలో ప్రత్యేకించి పట్టణాలు ఈ దిశగా మారుతున్నాయి ఎందుకంటే చాలా విషయాల్లో పట్టణప్రాంతాలకు పశ్చిమదేశాలను మించిపోయేంతగా పాశ్చాత్యం అబ్బింది. అమెరికాలో కన్నా ఎక్కువమందిని జీన్స్ లో మనం ఇక్కడే చూడవచ్చు.
ప్రజలకి ఏదైతే సహకారంగా ఉందో దాన్ని క్రమంగా తొలగిస్తున్నాం కానీ దాని స్థానంలో మరో ఆధారం ఏదీ ఉంచడంలేదు. అందువల్లనే ఎన్నడూ లేనంతగా మానసిక రుగ్మతలు పెరిగిపోతున్నాయి. మనుషులు అంతర్ముఖంగా చైతన్యవంతులై, సమర్థతను పొంది ఉంటే ఎటువంటి ఆధారం లేకపోయినా సమస్య ఉండదు. కానీ అందుకు తగిన సామర్ధ్యాన్ని వారు పొందకుండానే వారికి ఆ ఆధారం తొలగిస్తే, వారు ఛిద్రమైపోతారు.
చాలాకాలంగా, మాన మానసిక భావోద్వేగ స్థిరత్వానికి కొన్ని విషయాలను ఊతం చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఈ విషయాలన్ని తీసివేయబడుతున్నాయి. వీటిలో ఒకటి కుటుంబం. కుటుంబం మనకి కొంత సహకారాన్ని ఇస్తుంది - ఏది జరిగినా సరే, మీ కోసం ఎవ్వరూ ఒకరు ఎల్లప్పుడూ ఉండేవారు. మీరు సరైన పనులను చేసినప్పుడు అందరూ మీతో పాటుగా ఉంటారు. మీరు తప్పులు చేస్తే, వారు మీకు దూరం అయిపోతారు. కానీ కుటుంబం మాత్రం మీరు చేసే ఏ సర్కస్ కైనా ఒక రక్షణ కవచం లాగా ఉండే ఒక సమూహం. మీరు ఎటు పడిపోయినా, కొన్ని క్షణాల పాటైనా మిమ్మల్ని పట్టుకోవటానికి ఎవరో ఒకరు ఉండేవారు. కానీ ఈ సహకారం చాలా మంది ప్రజలకు ఈ రోజుల్లో లేదు. ఇప్పుడు, మీరు జారితే కిందకు పడిపోవడమే, పట్టుకోవడానికి ఎవరూ ఉండడం లేదు. అందువల్లే ప్రజలు మనోవైకల్యాలకు గురౌతున్నారు.
ఒకప్పుడు భారతీయ సంస్కృతిలో, జనాభాలోని 30 శాతం వరకు సన్యాసం తీసుకొనేవారు. వీరు కుటుంబంగానీ, ఇల్లుగానీ మరి ఏ ఇతర ఆధారం లేకుండా జీవించడానికి ఇష్టపడేవారు. అంటే వారికి గతి లేక కాదు, వారు కోరి ఎంచుకొన్న జీవన విధానం అది. ఎవరికీ ఎటువంటి మానసిక దౌర్బల్యం ఉండేది కాదు. వారికి ఎటువంటి భద్రత అక్ఖర్లేదు, ఎందుకంటే, వారు ఈ అవసరాన్ని అధిగమించారు. తాడుమీద కత్తి సాము చేయడం బాగా వచ్చిన వారికి క్రింద పడకుండా కాపాడే వల అవసరం ఉండదు. కానీ అందులో నైపుణ్యం లేకపొతే అటువంటి వల ఉండడం మంచిది, లేదా నేలమీద పడి గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జరుతున్నది అదే. మనకి పరంపరగా వస్తున్న ఆధారాన్ని తొలగించేస్తున్నాం.
ఇందులో మతం అనేది మరొక ముఖ్యమైన అంశం. మనిషి మానసిక సంతులనాన్ని మతం అతి తేలికగా సమన్వయించేది. "దేవుడు ఉన్నాడు, కంగారు పడకు!" అనే ఒక్క మాట చాలా మందికి ఊరటనిచ్చేది. అలా అని అందులోని విశిష్టతని తక్కువ అంచనా వెయ్యొద్దు. ఈ రోజుల్లో మానసిక నిపుణుల వద్దకి వెళ్తున్నారు. వందకోట్ల భారత జనాభాకి సరిపడే అంతమంది నిపుణులు మనకి లేరు. ఏ దేశంలోనూ ఉండరు. అంతే కాదు, అది సరిగా పని చెయ్యదు కూడా...ఎందుకంటే ఒక నిపుణుడు ఏకకాలంలో ఒక్క రోగిని మాత్రమే చూడగలుగుతాడు. అందుకు చాలా పరికరాలు, సామాగ్రి కూడా అవసరం. మతాన్ని అగౌరవపరచడం కాదు కానీ, ఇందులో మతం వహించే పాత్రను మనం గుర్తించాలి. పైసా ఖర్చు లేకుండానే సామూహికంగా మానసిక రుగ్మతలకు వైద్యం లభిస్తుంది.