కురు వంశజుల రాజు విశ్వామిత్రుడు

పురుకి కొన్ని తరాల తరువాత వచ్చినవాడు విశ్వామిత్రుడు. ఇతనినే కౌశిక మహారాజని కూడా పిలుస్తారు. అతను రాజ వంశంలో పుట్టినా ఋషులకు, మునులకు ఉన్న శక్తిని చూసి అందుకు ఆకర్షితుడై, తాను రాజుగా పుట్టినా, రాజుకు ఉన్న శక్తి  కంటే ఎక్కువ శక్తివున్న ఋషిగా మారాలని అడవిలోకి వెళ్ళి ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు.

విశ్వామిత్రుడి తీవ్ర తపస్సు చూసి, అతను కోరుకున్నది సాధించగలిగితే, తన అధికారానికి ముప్పు తప్పదని ఇంద్రుడు ఆందోళనపడ్డాడు. అప్సర మేనకను తపస్సు భంగం కావించడానికి పంపగా, మేనక తన అందచందాలతో విశ్వామిత్రుని తపో భంగం చేసి  ఆయనతో ఒక ఆడపిల్లను కన్నది.

తను ముందు సాధన చేసి సంపాదించినది మొత్తం ఈ తపోభంగం వల్ల పోగొట్టుకున్నానని విశ్వామిత్రుడు కొంతకాలం తరువాత తెలుసుకుని కోపంతో తల్లినీ, చంటిపిల్లనీ విడిచి వెళ్ళిపోయాడు. మేనక అప్సర కావడం వల్ల ఎక్కువ కాలం భూలోకంలో ఉండలేదు. తండ్రైన విశ్వామిత్రుడు కూడా విడిచి వెళ్ళిన పిల్లని మాలినీ నదీతీరంలో వదిలి మేనక వెళ్ళిపోయింది.

శకుంతల ఆగమనం

అక్కడున్న కొన్ని శకుని పక్షులు ఈ శిశువుని ఇతర జంతువులనుండి కాపాడి రక్షించాయి. ఒకరోజు కణ్వముని అటువెళ్తూ శకుని పక్షులు శిశువుని రక్షించడం చూసి ఆ శిశువుకి శకుంతల అని నామకరణం చేసి ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచగా ఆమె చక్కని యువతిగా ఎదిగింది.

ఆ దేశ రాజు దుష్యంత మహారాజు యుద్ధం చేసి తిరిగి వస్తూ సైనికుల భోజనం కొరకు అడవిలో దొరికిన జంతువులని చంపుతున్నాడు. ఒక పెద్ద మగ జింకను వెటాడగా, బాణం తగిలిన తరువాత కూడా అది పరుగులు పెట్టి శకుంతల వద్దకు చేరుతుంది. అది శకుంతల పెంపుడు జింక. గాయపడ్డ జింకపై శకుంతల చూపే జాలి, ప్రేమను చూసి, దుష్యంతుడు శకుంతులను ప్రేమించి ఆమెని గాంధర్వ వివాహం చేసుకుని కొద్ది రోజులు ఆమెతో ఆశ్రమంలో గడుపుతాడు.

తమ వివాహానికి గుర్తుగా రాజ ముద్రికని శకుంతల వ్రేలికి తొడుగుతాడు. ఆ ఉంగరం శకుంతల వ్రేలికి ఎంతో పెద్దదయ్యింది.

దుష్యంతుడు తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చింది. అడవి చివర వేచివున్న సైన్యాన్ని కలుసుకుని,  తన రాజ్యంలో విషయాలు చక్కబెట్టుకుని తిరిగి వచ్చి శకుంతలను తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు. తమ వివాహానికి గుర్తుగా రాజ ముద్రికని శకుంతల వ్రేలికి తొడుగుతాడు. ఆ ఉంగరం శకుంతల వ్రేలికి ఎంతో పెద్దదయ్యింది. శకుంతల మునికుమార్తె స్థితినుండి ఒక్కసారిగా మహారాణిగా కావడం వల్ల. ఆమె ఎప్పుడూ కలలు కంటూనే ఉండేది.

దుర్వాస మహాముని ఒకరోజు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన మిక్కిలి కోపిష్టి. శకుంతలని ఆయన పిలువగా, పరధ్యాసలో ఆమె వినిపించుకోలేదు. ఆమె కళ్ళు తెరిచే ఉన్నా పట్టించుకోలేదు, దుర్వాసుడికి ఇది అవమానంగా తోచింది. "నువ్వు ఇప్పుడు ఎవరినైతే తలుచుకుంటున్నావో, వారు నిన్ను మర్చిపోదురు" అంటూ శపించాడు. తెలివిలోకి వచ్చిన శకుంతల "అలా జరగరాదు, ఎందుకు మీరిలా చేసారు" అని వాపోయింది.

శకుంతలా దుష్యంతుల వివాహం గురించి దుష్యంతుడు తిరిగి వచ్చి శకుంతలని తీసుకువెళ్తానన్న విషయం గురించీ ఆశ్రమంలో ఉన్నవారు దూర్వాసుడికి అన్నీ వివరించారు. అప్పటికి వారు తనకిచ్చిన ఆతిధ్యానికి సంతోషించి, ఆమె పరధ్యాసకి కారణం విన్న దుర్వాసుడు కొంత శాంతించి " నీదగ్గర ఆయన గుర్తు ఏదన్నా చూసిన వెంటనే నిన్ను గుర్తు తెచ్చుకుంటాడు" అని సవరించాడు.

శకుంతల ఎంతో ఎదురుచూసింది కానీ దుష్యంతుడు రాలేదు. కొడుకును కని, ఆమె అతనికి భరతుడు అని పేరుపెట్టింది. భరతుడికి ఎన్నో గొప్ప లక్షణాలున్నాయి, ఆయనను ఆదర్శ మానవుడిగా గుర్తించారు. భరతుడివల్లే ఈ దేశం భారత దేశంగా పేరొందింది. ఆయన ఒక ఆదర్శ మానవుడు.

సామ్రాటు భరతుని బాల్యం

భరతుడు అడవిలో పెరిగాడు. కణ్వ మహర్షి శకుంతలతో "నువ్వు దుష్యంతుడి  వద్దకు వెళ్ళి మీ వివాహం గురించి గుర్తుచేయాలి, మీ పుత్రుడి విషయం ఆయనకు తెలియచేయాలి. రాజ కుమారుడు తండ్రికి సంబంధం లేకుండా పెరగటం సబబు కాదు" అన్నాడు.

శకుంతల కొడుకుని తీసుకుని రాజ భవనానికి బయలుదేరింది. దారిలో ఒక నదిని దాటవలసివచ్చింది. పడవలో కూర్చున్న శకుంతల పక్కన నీటిలో తన చేయి ముంచింది. పెద్దగా ఉన్న ఉంగరం నీటిలోకి జారిపోయింది. పరధ్యాసలో ఉన్న శకుంతల ఇది గమనించను కూడా లేదు.

రాజభవనాల, రాజుల తీరు తెన్నుల గురించి శకుంతలకి పరిచయం లేదు. రాజ భవనంలో దుష్యంతుడు "నీవెవరు?" అని ప్రశ్నించాడు, శకుంతల "మీకు గుర్తులేదా, నేను మీ భార్యను, ఇతడు మీ కుమారుడు భరతుడు" అని జవాబిచ్చింది. దుష్యంతుడు ఉగ్రుడై "నీకెంత ధైర్యం, ఇంతటి మాట చెప్పడానికి నువ్వెవరు" అంటూ రాజ భవనం నుంచి బయటకు పంపించాడు. శకుంతలకి జరిగినది అర్ధం కాలేదు, "ఎంతో ప్రేమ చూపించిన వ్యక్తి నన్నిప్పుడు పూర్తిగా గుర్తు కూడాపట్టలేదు" అని నిరాశతో తిరిగి వెళ్ళిపోయింది.

భరతుడు అడవి మృగాలతో కలిసి ధైర్యవంతుడుగా, బలశాలిగా, తాను పెరిగిన భూమిలో భాగంగానే పెరిగి పెద్దవాడయ్యాడు.

బయట సమాజంతో అమె సంబంధం మొట్టమొదటిసారి ఈ విధంగా ముగియడంతో, ఆమె ఆశ్రమం వెనుక అడవిలో మనుష్యులకు దూరంగా కొడుకుతో కలిసి నివసించసాగింది. భరతుడు అడవి మృగాలతో కలిసి ధైర్యవంతుడుగా, బలశాలిగా, తాను పెరిగిన భూమిలో భాగంగానే పెరిగి పెద్దవాడయ్యాడు.

దుష్యంతుడు ఒక రోజు వేటకు అడవిలోకి వచ్చి ఈ బాలుడు బలిష్టమైన సింహాలతో అడుకోవటం, ఏనుగుల మీద ఎక్కి సవారీ చేయడం చూసి "నువ్వెవరు, నీకింతటి సాహసం ఎక్కడినుంచి వచ్చింది? నువ్వు మనిషివా లేక ఇంకెక్కడినుంచైనా వచ్చావా?’’ అని అడిగాడు. ‘‘నేను భరతుడిని, దుష్యంత మహారాజు పుత్రిడిని" అని జవాబిచ్చాడు భరతుడు. "నేనే దుష్యంతుడిని. నాకు తెలియకుండా నువ్వెలా పుట్టావు" అని అడిగాడు. కణ్వ మహర్షి అక్కడికి వచ్చి జరిగినదంతా వివరించగా, దుష్యంతుడికి జరిగినది పూర్తిగా గుర్తుకు వచ్చి, శకుంతలనీ, భరతుడినీ రాజభవనానికి తీసుకు వెళ్ళాడు.

 

ఇంకా ఉంది..

మరిన్ని మహాభారత కథలు