ప్రశ్న: ఆసనం వేసే సమయంలో ఎందుకు మాట్లాడకూడదు, ఇతరులు ఆసనం వేస్తున్నప్పుడు వారి తప్పులను ఎందుకు సరిదిద్దకూడదు?

సద్గురు: ధ్యానంలోకి వెళ్ళడానికి ఆసనం ఒక క్రియాశీలక సాధనం. మీరు స్థిరంగా కూర్చోలేరు కనుక ఇంకొక విధానం ఎంచుకున్నారు ధ్యానంలోకి వెళ్ళడానికి. పతంజలి ఆయన యోగ సూత్రాలలో - 'స్థిరం సుఖం ఆసనం' అని తెలిపారు. పూర్తిగా స్థిరంగా, సౌకర్యంగా ఉన్నదే ఆసనం. అటువంటి స్థితిలో మీ శరీరం శాంతంగా, మీ మనస్సు శాంతంగా ఉంటూ మీలోని శక్తిని చైతన్యవంతంగా ఇంకా సంతులిత పూర్వకంగా ఉంచుతుంది. సహజంగా ధ్యాన స్థితిని చేరుకోవడానికి ఆసనాలు ప్రాధమిక మెట్టు.

ఒక విధంగా, ఆసనాలు ఒక క్రియాశీలికమైన ధ్యానస్థితి. మీరు ధ్యానం చేస్తూ సంభాషించడం అనేది హాస్యాస్పదం. ఇదే ఆసనాలు చేస్తున్నప్పుడు కూడా వర్తిస్తుంది. సంభాషణ మీలో ఎన్నో మార్పులకి కారణమౌతుంది. మీరు దీనిని గమనించి తెలుసుకోవచ్చు. మొదట ప్రశాంతంగా కూర్చుని మీ నాడి వేగాన్ని చూడండి. తరువాత ఉద్వేగంతో సంభాషించి మీ నాడి వేగాన్ని మరలా చూడండి - రెంటికి తేడా ఉంటుంది. నాడి వేగం ఒక ఉదాహరణ మాత్రమే. సంభాషణ శారీరక మార్పులని మాత్రమే కాదు, మనిషిలోని శక్తి పరిమాణాలలో కూడా గొప్ప మార్పులు కలిగిస్తుంది. అన్నిటికన్నా మించి ఏకాగ్రతకు లేకుండా ఆసనం ఎలా చేయగలరు?

 

ఒకసారి, నన్ను అమెరికాలోని ఒక యోగా స్టూడియోలో ప్రసంగించమని ఆహ్వానించారు. నిర్వాహకురాలు ఈషా మెడిటేటర్ ఇంకా ఆమె ఎన్నో సంవత్సరాలుగా యోగా టీచర్. నేను యోగా స్టూడియోలో అడుగుపెట్టినప్పుడు, ఏదో సంగీతం విన్పిస్తోంది ఇంకా ఆవిడ అర్ధమత్స్యేంద్రాసనలో ఉండి, ఎడతెరిపిలేకుండా మైకులో అందరితో సంభాషిస్తోంది. ఇది చూసి, నేను వెనుతిరిపోవాలని అనుకున్నాను, కానీ ఆవిడ నన్ను గుర్తుపట్టి,'హాయ్" అని పలుకరించి ఆసనంనుండి ఒక దూకులో బయటికి వచ్చి నా ముందుకి చేరుకుంది. నేను ఆమెని ప్రక్కకు తీసుకువెళ్లి ఇది కాదు యోగా నేర్పే విధానము ఇది మనిషిలో తీవ్రమైన అసమతుల్యాలకు దారితీయవచ్చు అని వారించాను. ఆవిడ అటువంటి వాటికి గురయ్యి బాధపడుతున్నదని తెలుసుకున్నాను. కొద్ది రోజులలో ఆవిడ యోగ నేర్పడం మానివేసింది తరువాత ఆవిడ సమస్య కూడా తీరిపోయింది.

ఆసనం వేసినప్పుడు బొత్తిగా మాట్లాడటానికి వీలులేదు, ఎప్ప్పుడు పడితే అప్పుడు మీకు చేయాలనిపించినప్పుడల్లా చేయడం సరికాదు. బాత్రూం బ్రేక్ ఇచ్చినప్పుడు యోగ చేయడం నేను చూసాను, అది మేము యోగా చేస్తామని ప్రపంచానికి చూపడానికే. ఇది హాస్యాస్పదం. మీరు బాత్రూముకి వెళ్లనవసరము లేకుండా కూర్చోగలిగితే, ఎవరితో మాట్లాడ నవసరములేకుండా ఉండగలిగితే, ఏది త్రాగనవసరము లేకపొతే - ఇదే మీరు యోగ చేస్తున్నారని ప్రపంచానికి గొప్పగా తెలియపరుస్తుంది. మీరు ఏదో ఆసనం వేసి మీరు యోగా చేస్తున్నారని అందరికీ చూపించనవసరంలేదు.

మీరు ఆసనంలో ఉన్నప్పుడు విధిగా సంభాషణకు దూరంగా ఉండండి, మీ ఏకాగ్రత, శ్వాస ఇంకా మీలోని శక్తిలో జరిగే మార్పులు అత్యంత ప్రధానమైనవి. వీటినిమించి, ఆసనాలు ధ్యానానికి సోపానాలు. మీరు ధ్యానంలో ఉన్నప్పుడు సంభాషించలేరు. మీరు ఆసనం వేసేటప్పుడు మాట్లాడితే మీరు మీ శ్వాసక్రమాన్ని కోల్పోతారు, మీ మానసిక ఏకాగ్రతని కోల్పోతారు, మీ శక్తిలోని నిశ్చలత కోల్పోతారు.

ఇక తప్పులు సరిదిద్దడంలోకి వస్తే - భౌతికంగా సరిచెయ్యడం అంటే ఒక ఊతాన్ని ఇవ్వడం అవుతుంది. టీచర్ తప్పులని సరైన విధానంలో సరిచేయగలిగితే, ఎవరికి వారే తమ తప్పులని స్పృహతో సరిచేసుకోగలరు. లేకపోతే ఇదే తప్పుని వారు తిరిగి పునరావృతం చేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే, వారు ఒక ఆసన భంగిమలో ఉన్నప్పుడు మీరు వారిని భౌతికంగా తాకి సరిదిద్దడంవల్ల వారికి హాని జరిగే అవకాశం ఉంది. దానికి ఒక ఉదాహరణ – నా ఒక్క వ్రేలిని కదిలించడంలో ఎన్నో విషయాలు ఇమిడిఉన్నాయి. నా కండరాలు స్నాయువులు, అస్థిపంజరం వ్యవస్థ, మనస్సు ఇంకా శక్తి ఒక నిర్దేశమైన దిశలో పని చేయాలి. మీరు నా వ్రేలిని పట్టుకుని తిప్పితే అది వేరే విషయం. అందువల్ల టీచరు మీకు ఏ విధంగా చేయాలో అర్ధమయ్యే వరకూ వివరించాలి, కానీ దానిని సరిదిద్దుకోవడం మీరు స్వీయ ప్రయత్నంతోనే చేయాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు