సద్గురు: చాలామంది, శరీరం అంటేనే బాధ అన్న నిర్ణయానికి వచ్చేశారు. కానీ శరీరం బాధ కాదు. సరిగ్గా చూసుకుంటే, అది ఒక అద్భుతం కాగలదు. మీరు మీ శరీరాన్ని మోయనక్కర లేకుండా, అది తేలికగా మీతో పాటు తిరిగేట్టుగా తయారు చేసుకోవచ్చు. సరైన ఆహారం, సాధనలతో పాటు, మన వైఖరిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, శరీరం ఒక అద్భుతంలా తయారవుతుంది. ఇది మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు శరీరాన్ని ఒక యంత్ర నిర్మాణంలాగా చూసినట్లయితే, అది ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ అధునాతనమైనది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఉన్న సూపర్ కంప్యూటర్లు అన్నీ కూడా దీనికి సాటి రావు. మన DNA లోని ఒక అణువు, ఎన్నో సంక్లిష్టమైన కంప్యూటర్ల కంటే ఎక్కువ పనులు చేయగలదు అని చెప్తారు. DNA లోని ఒక అణువులో అన్ని ప్రక్రియలు నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి మన శరీరం ఖచ్చితంగా గొప్ప పరికరం.

సరైన ఆహారం, సాధనలతోపాటు మన వైఖరిలో చిన్న చిన్న మార్పులను తీసుకోస్తే, శరీరం ఒక అద్భుతంగా మారడాన్ని మీరు చూడవచ్చు.

సృష్టికర్త మీకు ఇచ్చిన మొదటి బహుమతి ఇది. ఆయన ఎవరైతే నేమి, ఆ సృష్టికర్త మనకి ఈ అద్భుతమైన శరీరాన్ని అందించారు. మీకు ఇచ్చిన మొదటి బహుమతి భౌతిక శరీరం. దీన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన గమనిస్తే, ఒకవేళ మీకు దీన్ని సరిగా ఉంచుకోవడం ఎలాగో తెలియకపోతే, మీకు మరిన్ని బహుమతులు ఇవ్వడం దండగ అని ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి, మన శరీరాన్ని సౌకర్యవంతంగా, సంతోషంగా ఉంచుకోవడం చాలా అవసరం. శరీరం ఆనందంగా ఉంటే, అది మీరు మరింత ముందుకి వెళ్లడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.

మీరు ఒక గొప్ప క్రీడాకారుడు కానవసరం లేదు. కానీ మీరు మీ శరీరాన్ని చక్కగా, ఆరోగ్యవంతంగా, సంతోషంగా ఇంకా సౌకర్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని సంతోషంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే మీరు ఎక్కడికి వెళ్దాం అన్నా కూడా అది చాలా సులభంగా వెనక్కి లాగేస్తుంది. భౌతిక శరీరాన్ని సంతోషంగా ఉంచవచ్చు. అది ఎలాగంటే, ఎప్పుడైనా ఒక గట్టి వాన కురిసాక మనం బయటికి వెళ్లి చూస్తే, మొక్కలన్నీ చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కేవలం వర్షంలో తడిసి, శుభ్రంగా కనిపించటమే కాదు. ఆర్ద్రమైన మనసుంటే, అవి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కూడా మీరు చూడగలరు.

ముఖ్యంగా, భౌతిక శరీరాన్ని గనుక సరైన విధంగా ఉంచుకుంటే, అది ఆనందిస్తుంది. కొన్ని రకాల పదార్థాలు తీసుకున్నప్పుడు శరీరం తేలికగా, హాయిగా ఉంటుంది. మరికొన్నిరకాల పదార్థాలను తీసుకున్నప్పుడు, శరీరం నిస్తేజంగా, నీరసంగా తయారవుతుంది, ఇంకా మీరు నిద్రపోయే సమయాన్ని పెంచేస్తుంది. మనం రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోతూ ఉంటే గనుక, మన జీవితంలో 60 ఏళ్లు బ్రతికితే అందులో 20 ఏళ్ళు మనం నిద్ర పోయామన్నమాట. అంటే మన జీవితంలో మూడోవంతు మనం నిద్రలోనే గడుపుతున్నట్టు. ఆ మిగతా 30-40 శాతం తినటానికి, టాయిలెట్ కి వెళ్ళటానికి, మిగతా కార్యక్రమాలు నిర్వహించడంలో ఖర్చవుతుంది. ఇక జీవించడానికి సమయం ఎక్కడిది? ఇక సమయం ఏమీ మిగలదు.

నిద్రని ఎవరూ ఆనందించలేరు. నిద్రలో మీకు ఉనికి ఉండదు. మీరు కేవలం విశ్రాంతిని మాత్రమే ఆనందించగలరు. నిద్ర పోయినప్పుడు భౌతిక శరీరానికి మంచి విశ్రాంతి దొరికింది- దాన్నే మీరు ఆనందిస్తారు. శరీరాన్ని విశ్రాంతిగా ఎలా ఉంచవచ్చు? అన్నిటికన్నా ముందు, దాన్ని అలిసిపోయెట్టు ఎందుకు చేయటం? చాలామందికి కలిగే అలసటకు కారణం వారు చేసే పని కాదు. ఆహారం ఒక ముఖ్యాంశం, మానసిక ధోరణులు కూడా కారణం, కానీ ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. శ్రేయస్సు కలిగించని ఆహారాన్ని తీసుకుంటే, మీరు మీ శరీరాన్ని ఈడ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. సరైన ఆహారాన్ని తీసుకోగలిగితే, మీ శరీరం మీ కన్నా ముందే పరిగెడుతుంది; శరీరం ఉండవలసిన తీరు ఇదే

Editor's note :శరీరం గురించి మరిన్ని విషయాలను సద్గురు రాసిన పుస్తకం ద్వారా తెలుసుకోండి. - శరీరం - అత్యద్భుతమైన పరికరం