సద్గురు: మానవాళిలో చాలా మందికి, మరణం అనేది జీవితంలో అత్యంత గాఢమూ, నిగూఢమైన అంశం. ఎందుకంటే, దాని గురించి ఎటువంటి కథలు విన్నప్పటికీ, అది ఏమిటో జనం ఇప్పటి వరకూ తెలుసుకోలేకపోయారు. మరణం అంటే ఏమిటో విజ్ఞాన శాస్త్రం గానీ లేక తత్వశాస్త్రం గానీ కనిపెట్టలేకపోయాయి 

శరీరమంటే జీవించడం ఇంకా మరణించడం- ఆధ్యాత్మిక సాధన మీ గురించి - మీరు జీవనమూ కాదు, మరణమూ కాదు. 

ఆధ్యాత్మిక సాధన మరణం గురించి కాదు-మీరు మరణం కంటే ఇంకా లోతైన దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరణమనేది ప్రాపంచిక విషయం, అందులో ఎటువంటి ప్రత్యేకత లేదా రహస్యమేమి లేదు. అది ప్రజలకు మళ్ళీ మళ్ళీ జరిగే ఒక సర్వసాధారణమైన విషయం. మరణం చాలా రహస్యంగా, ప్రగాఢంగా అనిపించడానికి కారణం మీకున్న “స్వల్పకాల విస్మృతి”. మీ జ్ఞాపకశక్తి ఎలాంటిదంటే, ప్రతిరోజూ మీరు ఉదయం నిద్రలేవగానే, నిన్నటి రోజు ఉందని మీకు గుర్తుండదు, మీరు నిద్రపోయారని మీకు గుర్తుండదు, మీకు తెలిసినదల్లా మీకు మెలుకువ రావడం, అప్పుడు ప్రతి రోజు, మీరు ఒక కొత్త ప్రదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇంకా చాలా విచిత్రంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని గంటల నిద్ర అత్యంత రహస్యమైన, ప్రగాఢమైన అంశంగా ఉంటుంది, ఎందుకంటే మీరు నిజానికి నిద్రపోయి, తిరిగి మేల్కొన్నారని మీకు గుర్తు ఉండదు కాబట్టి. మరణంలోని రహస్యం ఇంకా గాఢత కూడా ఇటువంటిదే.

"శివుడు లయకారుడు" అని అన్నప్పుడు, ఆయన మరణానికి కారకుడు అని మనం చెప్పటం లేదు. అతనికి మరణం పట్ల ఆసక్తి లేదు. అతనికి పుట్టుక, మరణం కేవలం ప్రాపంచిక విషయాలు. జీవితానికి సంబంధించి ఇవి అంతగా ప్రాముఖ్యత లేని పైపైని విషయాలు అని ఆయన భావిస్తారు. స్మశానవాటికలోని బూడిదను శివుడు తన శరీరానికి పూసుకోవడానికి ఒక కారణం, తనకి మరణం పట్ల ఉన్న తృణీకార భావనను చూపించడం కోసమే. ఆయన దానిని లోతైన లేదా రహస్యమైన అంశంగా పరిగణించరు. ఆధ్యాత్మిక సాధన మరణం గురించి కాదు. అది నిజానికి అసలు మరణానికి మూలమైన పుట్టుక నుండి విముక్తి పొందడం గురించి. పుట్టుక నుండి విముక్తి పొందడం అంటే సహజంగా మరణం నుండి విముక్తి పొందడం.

ఈ జనన మరణాలు కేవలం కుమ్మరి పనిలాంటిది – భూమి నుండి మట్టిని తీసుకుని, దాన్ని మానవ రూపంలోకి మలిచి, నడిచేలా ఇంకా మాట్లాడేలా చేయడం. కొంత కాలం తరవాత ఈ కుండల వ్యాపారం, తోలుబోమ్మలాటలా మారడం ఒక చిన్న కనికట్టు, అంతే. ప్రేక్షకుల దృక్కోణం నుండి నాటకాన్ని చూడడం ఒక విషయం. వేదిక వెనుక నుండి నాటకాన్ని తెలుసుకోవడం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీరు తెర వెనుక నుండి నాటకాన్ని చూడటం ప్రారంభించిన తర్వాత, కొంత సమయానికి మీకు అర్థమైపోతుంది. మీరు దాన్ని ఆడించే తీరుని ఆస్వాదించచ్చు. కాని, దాని కధ, నాటకీయత గురించి అంత ఉత్సాహం కలిగి ఉండరు. ఎందుకంటే, అదంతా ఎలా తయారైందో మీకు తెలుసు కాబట్టి. ‘స్వల్పకాలిక జ్ఞాపక శక్తి’ ఉన్నవారు మాత్రమే - ప్రతిరోజూ ఒకే నాటకంలో వచ్చి కూర్చుంటారు, వారు నిన్నటి రోజును మరచిపోతారు - కాబట్టి, ఇది వారికి చాలా ఉత్తేజకరంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది.

కాబట్టి, ఆధ్యాత్మిక ప్రక్రియ జీవించడం గురించో లేదా మరణించడం గురించో కాదు. శరీరానికే జనన మరణాలు- ఆధ్యాత్మిక ప్రక్రియ ‘మీ’ గురించి – జీవితము, మరణము రెండూ కాని మీ గురించి.