ప్రశ్న: సద్గురు మీ బోధనలు, అభ్యాసాలు నాలో ఉన్న మొండితనాన్ని బద్దలుచేసి నా వికాసానికి తోడ్పడతాయా?

సద్గురు: మీ వికాసానికి అడ్డుపడుతున్నది మీ కఠినత్వమే అని గ్రహించినందుకు సంతోషం. మీరు క్రమంగా ఎన్నో కోణాల్లో గట్టిపడిపోతూ ఉంటారు. యోగాసనాల అభ్యాస సమయంలో శారీరకంగా మీరు ఎంత బిగిసి పోయారో అర్థమౌతుంది. మీ మనసులోనూ, ఉద్వేగాల్లోనూ మీరు ఎంత బిగిసి పోయి ఉన్నారో అర్థం కావటానికి మరికొంత అవగాహన అవసరం. తమ ఆలోచనల్లోనూ, ఉద్వేగాలలోను బిగిసిపోయి ఉన్న వారు తాము చాలా పరిపూర్ణులమని అనుకుంటారు, ఎందుకంటే వారు మరోకోణం నుండి చూడాలనిగాని, ఆలోచించాలనిగాని అనుభూతి చెందాలని గాని ఎలాంటి ప్రయత్నం చెయ్యరు. అలాంటి వ్యక్తి తటస్థ పడినప్పుడు మనకు అతను మొండి వాడనిపిస్తుంది, కానీ అతను మాత్రం తాను చాలా సమగ్రంగాను, పరిపూర్ణంగా ఉన్నానని అనుకుంటాడు. అదే విధంగా మీ శక్తి విషయంలో కూడా బిగిసి ఉండే లక్షణం ఉంటుంది. ఒకొక్కరి శక్తికి ప్రవహించే స్వభావం ఉంటుంది. వారు మొదటిరోజు ప్రాధమిక క్రియాభ్యాసం ప్రారంభించగానే అది కదలి, రూపాంతరం చెందటం ప్రారంభిస్తుంది. కానీ కొందరికి ఎంతకాలం అభ్యాసం చేసినా ఏమి జరిగినట్లు కనిపించదు. ఇది వారి శక్తికి ఎంత సుతిమెత్తగా సాగేగుణం ఉన్నదనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ఇలా ఇన్ని కోణాల్లో కఠినత్వాన్ని సంతరించుకోవటం నిజానికి వేరు వేరు విషయాలు కావు. అవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఒక కోణంలో ఉన్న బిగుతు వేరే కోణాల్లో కూడా వ్యక్తం అవుతుంది.

మీరెంత తెలివి తక్కువ వారైనా, ఎంత అవగాహనా రాహిత్యంతో ఉన్నా, ఎటువంటి కర్మబంధాల్లో ఉన్నా, పతంజలి యోగ మార్గంలో మీకు తగిన మార్గం ఒకటి ఉండనే ఉంటుంది. మీరు కనీసం మీ శరీరాన్ని వంచటానికి సిద్ధపడినా మీరు మీ కర్మబంధంలో ఒకదాన్ని తొలగించుకున్నట్లే! మీ నుదురు మీ మోకాలిని తాక గలిగితే మీరొక భౌతిక కర్మను తొలగించుకున్నట్లే! తమాషాకు చెప్పటంలేదు, ఇది వరకు ఆ పని చేసి ఉండని వారికి అది నిజంగా గొప్ప విజయసాధన. మీకున్న ఈ చిన్న పరిమితి కాస్తా కాలక్రమంలో పెద్దదై పోతుంది. కాలం గడచినకొద్దీ మీలో ఉన్న ఈమాత్రం సరళత్వం కూడా తగ్గిపోతుంది. మీ శరీరం, మనసు మొత్తం బిగిసిపోయే రోజు వచ్చేస్తుంది..

మీ జీవితాన్నే తీసుకోండి, మీరు ఒక పది పదకొండేళ్ళ వయసులో శారీరకంగా మానసికంగా ఎంత సరళంగా, లేతగా వంగే గుణంతో ఉండే వారు! మీ ఇరవయ్యో ఏట ఆ గుణం అంతకంటే తక్కువగా ఉండేది, ఒక ముప్ఫై ఏళ్ళు వచ్చేసరికి అది పూర్తిగా పోతుంది. శారీరకంగానే కాదు మానసికమైన బిగుతు కూడా అప్పటికి తీవ్రంగా వచ్చి ఉంటుంది. జీవితం అంటే చాలా మందికి తిరోగమనం, చాలా మంది పెరగటం మానేసి వెనక్కు వెళుతూ ఉంటారు. వాళ్ళు తెచ్చుకున్న ఒకటిరెండు సద్గుణాలను కూడా పెంచుకోరు. వారికి జీవితంలో వచ్చిన ప్రతి అవకాశం చివరకు ఒక శాపంగా మారుతుంది. చాలా మందికి డబ్బు, పరపతి, సౌఖ్యాలు, తెలివితేటలు జీవితంలో ఆశీర్వాదాలుగా కలిగి, చివరకు శాపాలుగా పరిణమిస్తాయి. మీకున్న తెలివితేటల్ని మీరు మీ చేతనను ఉచ్ఛస్థితికి తీసుకు వెళ్ళటానికో, మిమ్మల్ని మీరు శాంతియుతంగా, ప్రేమపూరితంగా మలచుకోవటానికో ఉపయోగించుకోరు. మీ తెలివితేటల్ని మీరు మీకు పిచ్చెకించుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. జీవితానికి, జీవానికి వ్యతిరిక్తంగా నడిచే వారు మూర్ఖులు.

మీరు సృష్టికర్తకు అనుకూలమా ? ప్రతికూలమా?

మీ జీవితంలో ప్రతిక్షణం మీరు సృష్టికర్తకు అనుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా అనే విషయాన్ని పరిశీలించుకుంటూ ఉంటే, జీవితం అదే చక్కబడుతుంది. మీ మనసు ఈ సాధన చేస్తే కుదుటపడుతుంది. అయితే అందుకు పట్టుదల ఇంకా శ్రద్ధ కావాలి. లేకపోతే అలా శాంతించటం జరగదు. మీరు ప్రతి నిముషం, ప్రతిశ్వాసలో ఈ విషయాన్ని గమనించండి. నిజంగా మీకు శ్రద్ధ ఉంటే ఇది చాలు మీకు. అది మీ మనసును పూర్తిగా ప్రక్షాళనం చేస్తుంది. మరుసటి రోజు ఉదయానికల్లా మీరు సమాధి పొందటానికి సిద్ధమౌతారు.

నిజానికి ఇది చాలా సరళమైంది. కాని వ్యక్తుల వ్యక్తిత్వాల వల్ల అది జటిలమైపోతుంది. ఆధ్యాత్మిక పథంలో ఎదుర్కొనే సమస్యలు ఆ మార్గంలోనివి కావు, మీ మనసులో ఉన్న గందరగోళం వల్ల ఆ మార్గం జటిలతరమైంది. మార్గం సులభమే! కానీ ఆ మార్గంలో మీ ఉనికి దాన్ని జటిలం చేసింది. మీ లోపల ఏ కదలికా జరగదు, ఇంచుమించు శవంలో జరిగినట్లు మీలో బిగిసిపోవటం ప్రారంభం అవుతుంది. మీ మనసులోని పిచ్చిని అణచివేయటానికి మీకు గురుకృప అవసరం. మీరు అందుకు అనుమతినిస్తే అప్పుడు ఆ మార్గం సులభతరం అవుతుంది. మార్గం సులభమైనట్లే గమ్యమూ సులభమౌతుంది.

మీరు ఊరికే అలా కూర్చుంటే మీ జీవం ఈ చరాచర జగత్తుతో కలిసి స్పందిస్తుంది. మీరు మరొ రకంగా ఉండాలనుకుంటే తప్ప మరొ మార్గమే లేదు. మీరు నివసిస్తున్న ఈ జగత్తుతొ సంబంధం లేకుండా మీరెలా జీవించగలరు? అదెలా సాధ్యం? అది మిమ్మల్ని లోపలా బయటా ఆవరించి ఉంది. దాన్నుండి ఎవరూ తప్పించుకోలేరు. బహుశః మీకు తెలియకుండా మీరు అలా దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారేమో! మీరు ఆ పని ఆపెయ్యండి, అంతా సర్దుకుంటుంది. అందుచేత మీరు అలా పనికిరాని పనులు చెయ్యకుండా ఉండడానికే మేము మీకు క్రియలను ప్రారంభించాం.

సృష్టిని ఉత్తేజితం చేయటం

సరిగ్గా చూస్తే ఇదంతా అవసరమే లేదు. కాని దురదృష్టవశాత్తు ఇప్పుడు అది అవసరమైంది. మీరు మీ శక్తులను ఎంతగా అణచి వేశారంటే, మీ అహంకారాన్ని నిలపటానికి తప్ప మరిదేనికీ మీ మనసు కదలదు. మీ అహంకారానికి ఎంత అవసరమో అంత మాత్రమే మీ శక్తులు కదులుతాయి. మరికొంచెం శక్తి ఉందా మీ అహంకారం బద్దలు అవుతుంది. మీలోని శక్తి ఒకసారి మేలుకొంటే అంతా అందులో కరిగిపోతుంది. అహానికి ఆ సంగతి తెలుసు. అందుకే దాన్ని అణచి ఉంచింది. ఒకవేళ మీకు ఏమాత్రం శక్తి లేకపోయినా అది మీ అహంకారాన్ని బలహీనం చేస్తుంది. దానికి అలా కావటం ఇష్టంలేదు. అందుచేత అది తనకు సహాయపడి, తనను నిలబెట్టేటంత శక్తిని మాత్రమే రానిస్తుంది. శక్తి ఎక్కువైతే అహం చెదిరిపోతుంది. ఒకసారి కుండలిని శక్తి లేవటం ప్రారంభిస్తే అంతా చెదిరిపోతుంది, ఇక ఏమి మిగలదు. మీరు మీచుట్టూ ఉన్న ప్రతిదానితో మమేకమయ్యే ఒక శక్తిగా మిగిలిపోతారు. మీకంటూ మీకు ఒక ఇచ్చాశక్తే మిగలదు.

మీకుగా మీరు మీ ఇచ్చాశక్తిని సమర్పించరు కాబట్టి మేము మిమ్మల్ని ఈ సాధనల ద్వారా మీ శక్తులను ఉత్తేజితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే ఈ ఆసనా, క్రియా మార్గం, మీ అంతట మీరు చేసుకోలేరు కాబట్టి సృష్టినే ఒక పద్ధతిలో చైతన్య వంతం చేయటం (అన్నమాట). ఒక సారి కదలిక మొదలైతే అంతా సర్దుకుంటుంది. అది వరదలా ఉంటుంది. అందుచేత మీ సాధన ఎక్కడికో చేరటానికి కాదు. ఇది మీలో వరదలాగా శక్తిని విడుదల చేసి, మీరు సృష్టించుకొన్న ఆ చిన్న చిన్నవాటిని తుడిచిపెట్టి, సృష్టికర్త మిమ్మల్ని ఎలా ఉండాలనుకున్నాడో అలా మిగల్చడానికి అవలంబిస్తున్న మార్గం.

Editor’s Note: Excerpted from Mystic’s Musings. Not for the faint-hearted, this book deftly guides us with answers about reality that transcend our fears, angers, hopes, and struggles. Sadhguru keeps us teetering on the edge of logic and captivates us with his answers to questions relating to life, death, rebirth, suffering, karma, and the journey of the Self. Download the sample pdf or purchase the ebook.