ప్రశ్న: నమస్కారం సద్గురు. నేను మిమ్మల్ని నిద్ర గురించి అడగాలనుకుంటున్నాను. ఈ విషయం గురించి మీరు ఎంతో మాట్లాడారని నాకు తెలుసు. కానీ ఈ విషయంలో ఇంకొంచెం లోతుగా వెళ్ళగలమేమో చూడాలనుకుంటున్నాను. కొన్ని సరళమైన పద్ధతులు పాటించద్వారా, మనంనిద్రాసమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు అని మీరు చెప్పారు. నేను నా సాధనలు అన్నీ చేస్తున్నప్పటికీ, నాకు మిగతా చాలామంది కంటే ఎక్కువ సేపు నిద్ర పోవాల్సిన అవసరం ఉంది అనిపిస్తూ ఉంటుంది.

సద్గురు: నన్ను నిద్ర లోకి లోతుగావెళ్ళమంటున్నారా?

ప్రశ్న: అంటే, దాని వెనుక ఉన్న శాస్త్రంలోకి.

సద్గురు: మనం నిద్ర అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. నిద్ర అంటే శరీరానికి విశ్రాంతి నిచ్చే సమయం అన్నమాట. అంటే ఈ సమయంలో శరీరం తనలోని మలినాలను పోగొడుతుంది. మన రోజువారీ జీవితంలో, - శరీరానికి కణాల స్థాయిలో, శక్తి స్థాయిలో, ఇంకా ఎన్నో భిన్నమైన విధానాలలో జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికీ, తిరిగి నిర్వహణ యోగ్యంగా తయారు చేయడానికీ అవసరమయ్యే సమయం అది.

నిర్వహణ యోగ్యంగా తయారు చేయడంకోసం ఎంత సమయం అవసరమవుతుంది అన్నది, ఎంత నష్టాన్నిభర్తీ చేయాల్సింది ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. జీవన ప్రక్రియలో, మీకు మీరు ఎంతగా హాని చేసుకుంటున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న. మీలో చాలా ఎక్కువ ఘర్షణ ఉంటే, నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ వ్యవస్థ బాగా సమన్వయంలో ఉండి, చక్కగా కందెన వేయబడి ఉంటే అప్పుడు ఘర్షణ చాలా కొద్ది స్థాయిలో ఉంటుంది, అలాగే నిర్వహణ కోసం అవసరమయ్యే సమయం కూడా సహజంగానే తగ్గుతుంది.

నిద్ర సమయాన్ని తగ్గించడానికి చిట్కాలు

#1 తాజా ఆహారం తీసుకోవడం

సద్గురు: మీ నిద్రాకాలాన్ని తగ్గించడానికి మీరు చేయగలిగిన విషయాలు ఏమిటి? మొదటిది ఏమిటంటే తాజా ఆహారాన్ని తినడం. యోగ సంప్రదాయంలో, ఒక సరళమైన అవగాహన ఏంటంటే మీరు దేనినైనా వండితే, దాన్ని మహా అయితే 90 నిమిషాల లోపు తినేయాలి. ఆ తర్వాత అందులో జడత్వం పేరుకోవడం మొదలవుతుంది. మీరు జడత్వం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మీ శరీరం బద్ధకంగా తయారవుతుంది. దానికి ఎక్కువ సమయం నిద్ర అవసరం అవుతుంది. ఎందుకంటే ఈ జడత్వాన్ని ఎదుర్కోవడానికి శరీరం ఎంతో శక్తిని ఖర్చుచేయాల్సి ఉంటుంది. దానర్థం ఏంటంటే నిర్వహణ కోసం అవసరమయ్యే విశ్రాంతి సమయం పెరుగుతుంది. ఎందుకంటే మీరు మీ శారీరిక వ్యవస్థకి ఇస్తున్న ఇంధనం తక్కువ స్థాయి నాణ్యత గలది కాబట్టి.

ఆహారాన్ని వండినప్పుడు, ఒక విధంగా మీరు దాన్ని చంపుతున్నారు. అది ఇక సజీవం కాదు. ఉదాహరణకి మీరు చనిపొయాక , మీ శరీరాన్ని మూడు రోజులు ఉంచితే, అది కుళ్ళిపోతుంది. ప్రతి జీవానికి అదే జరుగుతుంది. అది కూరగాయ అయినా, జంతు మాంసం అయినా లేదా ఇతర వస్తువు ఏదైనా, మీరు వండి, దానినుండి జీవాన్ని తీసేసిన క్షణమే, అది కుళ్ళిపోవడం మొదలుపెడుతుంది.

కుళ్ళిపోవడంలో తప్పేమీ లేదు ఎందుకంటే అది మరొక రకమైన జీవం. అంటే వేరే ఇతర జీవాలు దీన్ని తమ ఆహారంగా చేసుకోవడం మొదలుపెట్టాయి. అందులో ఎంతో జీవం ఉంది, బహుశా అది సూక్ష్మ జీవం కావచ్చు - మీరు వాటిని చూడలేకపోవచ్చు, కానీ అవన్నీ పార్టీ చేసుకుంటున్నాయి. బాక్టీరియా ఇంకా ఇతర వాటితో పాటూ దాన్ని తినే పార్టీలో మీరు కూడా పాల్గొంటే, మీరు సమస్యలో పడతారు. సమస్య అంటే, వెంటనే మీకు ఏదో ఒక జబ్బు వచ్చేస్తుంది అని కాదు. ఎందుకంటే వాటిలో అన్నీ మిమ్మల్ని ఇన్ఫెక్ట్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండవు. అయితే జరిగేది ఏంటంటే, మీ శక్తి తగ్గుతుంది కాబట్టి అది వ్యవస్థలో జడత్వాన్ని కలిగిస్తుంది.

మీరు ఒక పెద్ద దుకాణానికి వెళ్లి కొనే వస్తువులను గురించి ఆలోచించండి. వాటిలో చాలా వరకూ దాదాపు నెలకు పైనే అక్కడ ఉంచబడి ఉంటాయి. ఆ తర్వాత మీరు వాటిని తెచ్చి మీ ఫ్రిజ్లో ఒక నెల పాటు ఉంచి, తినాలనిపించినప్పుడు తింటూ ఉంటారు. డాక్టర్లు మీరు ఎనిమిది గంటల నిద్ర పోవాలనీ, లేదంటే మీరు శారీరకంగా ఇంకా మానసికంగా ఆరోగ్యంగా ఉండలేరనీ సూచిస్తున్నారు, ఎందుకంటే వాళ్లు కూడా అదే ఆహారాన్ని తింటున్నారు కాబట్టి!

#2 సరళమైన వాటిని తినండి

మానవ స్వభావం ఎటువంటిదంటే, మిగతా అన్ని జీవాలు తామున్న పరిస్థితికి అనుగుణంగా జీవిస్తాయి, మానవుడు మాత్రం తనకు కావాల్సిన పరిస్థితులను సృష్టించగలడు. ఇదే మనల్ని వేరుగా నిలబెడుతుంది. మీ గురించి మీకు ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, మీ వ్యవస్థలోకి ఏం వెళ్తుంది అన్న దాని గురించి మీరు శ్రద్ద వహించాలి.

సంక్లిష్టమైన జ్ఞాపకాలు దానిలో అతి తక్కువగా ఉన్న ఆహారాన్ని మీరు తింటే, అది మీరు తిన్న రెండు నుంచి నాలుగు గంటలలోపు మీలో ఒక భాగమైపోతుంది. ఇటువంటి ఆహారం తినటం వల్ల మీ నిద్ర సమయం గణనీయంగా తగ్గుతుంది. కానీ నేటి ప్రపంచంలో మంచి నాణ్యత గల ఆహారాన్ని తినటం అనేది ఎంతో కష్టమైపోతూంది. ఎందుకంటే మీకు లభించే ఆహారం చాలా వరకు కిలోల లెక్కల్లో వ్యాపారమే తప్ప, అది నిజంగా మీ శరీరానికి అవసరమైన ఇంధనం కాదు. పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి ఆహారాన్ని తింటున్న ఎంతో మంది, నాతో చెప్పారు, ఈశా యోగా కేంద్రానికి వచ్చినప్పుడు, రెండు మూడు నెలల తర్వాత వాళ్లకి “ఆశ్చర్యంగా అనిపించింది - నేను ఎందుకు తగినంత నిద్ర పోవడం లేదు?” వాళ్లు నమ్మేది ఏంటంటే, ఎనిమిది గంటలు నిద్ర పోవాలి అని. కానీ మా ప్రమాణం నాలుగు గంటలు. మేము నాలుగు గంటలు నిద్రపోయి ఎలాగోలా నడిపించటం లేదు, మేము నాలుగు గంటల నిద్రతో గొప్పగా ఉంటున్నాము.

ఆహారంలో మరీ ఎక్కువ రసాయన పదార్థాలు ఇంకా సింథటిక్ పదార్థాలు ఉంటే, మీ శరీరం అటువంటి ఆహారాన్ని అరిగించుకోవడానికి రూపొందించబడి లేదు. మీరు తీసుకునే ఆహారంలో కనీసం ఒక్క శాతం అయినా సింథటిక్ పదార్థాలు ఉంటే - అవి ఎరువులు కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావొచ్చు, మొత్తం జీర్ణ వ్యవస్థ అంతా ఇబ్బంది పడుతుంది.

అమెరికాలో చాలా మోతాదుల్లో యాంటాసిడ్లు తీసుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే మీరు మీ పొట్టలోకి వేస్తున్నది దానికి సరిపడేది కాదు. కనీసం మీ పొట్టకి సరిపడేది కాదు. గుండె మంట అనేది మీరు ప్రేమలో ఉన్నందువల్ల కాదు. గుండెల్లో మంట అంటే, మీ మొత్తం అన్నవాహిక ఆమ్లాలతో కాలిపోతోంతుంది అని, లేదా వివిధ కారణాల వల్ల అలా జరగోచ్చు. ఆఖరికి మీరు తినే ఆహారంలో 1 కంటే తక్కువ శాతంలో సింథటిక్ పదార్థాలు ఉన్నా సరే, ఆ ఆహారాన్ని వ్యవస్థలోకి గ్రహించే మీ సామర్థ్యం నాటకీయంగా తగ్గుతుంది. ఇది కూడా పెద్ద ఎత్తున మీ నిద్రా సమయాన్ని పెంచుతుంది. శరీరంలో ఒక ఘర్షణ ఉంటుంది కాబట్టి, సహజంగానే మీరు నిద్రాణస్థితిలో ఉండాలని కోరుకుంటారు.

#3 ఎంత తినాలి

మీ శక్తులను మీరు ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తారు అన్నదే మీ అప్రమత్తతని నిర్ణయిస్తుంది. ధ్యానం చేయాలంటే కేవలం మీరు మానసికంగా మెలకువతో ఉంటే సరిపోదు, మీ ఒంట్లోని శక్తి కూడా మెలకువగా ఉండాలి. ఈ విషయంలో మద్దతివ్వడానికి, యోగా మార్గంలో ఉన్న వారికి ఏమని చెప్తారంటే, మీరు కేవలం నోటి నిండా పట్టే 24 ముద్దలు మాత్రమే తినాలి, అలాగే ప్రతి ముద్దనీ కనీసం ఇరవై నాలుగు సార్లు నమలాలీ అని. ఇది ఆహారం లోపలికి వెళ్ళడానికి ముందే నోటిలో కొంతవరకు జీర్ణమయ్యేలా చేస్తుంది. అప్పుడు అది బద్దకాన్ని కలిగించదు. మీరు ఇలా సాయంత్ర భోజన సమయంలో చేస్తే, మీరు చాలా తేలికగా ఉదయాన్నే మూడున్నరకి లేస్తారు. యోగ వ్యవస్థలో ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. అది యోగ సాధన చేయడానికి సరైన సమయం. ఎందుకంటే ఆ సమయంలో సాధన చేయడానికి ప్రకృతి నుండి మనకి అదనపు సహాయం లభ్యమవుతుంది.

#4 తిన్న వెంటనే నిద్ర పోకండి

చాలా మంది ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారంటే, నిండుగా తిని శరీరాన్ని బద్దకంగా చేస్తే తప్ప, వాళ్ళు నిద్రపోలేరు. మీరు పూర్తిగా తింటే తప్ప నిద్రలోకి జారుకోలేని పరిస్థితుల్లో ఉంటే, మీరు ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. ఇది నిద్రకి సంబంధించింది కాదు ఇది ఒక విధమైన మానసిక స్థితి. మీరు ఆహారం తీసుకున్న రెండు గంటల లోపు నిద్రపోతే, దానిలో 80% వృధాగా పోతుంది అని నేను అంటాను. నిద్రపోయే ముందు జీర్ణమవ్వడానికి తగినంత సమయం ఇవ్వాలి.

#5 నిద్ర పోవడానికి సరైన భంగిమ

మీ శరీరం భూమికి సమాంతరంగా ఉన్నప్పుడు, పల్స్ రేటు తగ్గడాన్ని మీరు వెంటనే గమనించవచ్చు. శరీరం ఆ మార్పు చేస్తుంది ఎందుకంటే రక్తాన్ని అదే ఒత్తిడితో పంపితే, మీ తలలోకి మరీ ఎక్కువ రక్తం వెళ్లి నష్టాన్ని కలిగిస్తుంది. కిందకి వెళ్లే రక్తనాళాల కంటే పైకి వెళ్లే రక్తనాళాలు కొంచెం సన్నగా ఉంటాయి. అవి మెదడులోకి వెళ్లే కొద్దీ, దాదాపూ ఒక వెంట్రుకంత సన్నగా అవుతాయి, ఎంతగా అంటే కనీసం ఒక అదనపు చుక్క కూడా తీసుకోలేనంత సన్నగా అవుతాయి.

నిద్రపోయేటప్పుడు మీ తలని ఉత్తరం వైపుకి పెట్టి, అలా 5 నుంచి 6 గంటలు ఉంటే, భూమి అయస్కాంత శక్తి మీ మెదడు మీద ఒత్తిడిని కలుగజేస్తుంది. ఎందుకంటే మీ రక్తంలో ఇనుము ఒక ముఖ్యమైన పదార్థం. ఈ విధంగా మీరు నిద్రపోతే చనిపోతారు అని కాదు. కానీ ప్రతిరోజు ఇలా చేస్తే మీరు సమస్యను కొని తెచ్చుకున్నట్టే. మీరు కొంత వయసు దాటిన వారు అయినా, లేదా మీ రక్తనాళాలు బలహీనంగా ఉన్నా, అది మీ మెదడులో రక్త స్రావాన్ని కలిగించ వచ్చు, లేదా పక్షవాతం వచ్చేలాగా చేయగలదు. ఒకవేళ మీ వ్యవస్థ బలంగా ఉంటే, మెదడులోకి వెళ్లాల్సిన దానికన్నా ఎక్కువ రక్తప్రసరణ వెళుతూ ఉంది కాబట్టి మీకు సరిగా నిద్రపట్టక పోవచ్చు.

మీరు ఉత్త రార్ధగోళంలో ఉంటే, నిద్రపోయేటప్పుడు తూర్పు దిక్కు వైపు తల పెట్టడం అనేది ఉత్తమం. ఈశాన్యం పర్వాలేదు. పశ్చిమం పర్వాలేదు, తప్పనప్పుడు దక్షిణం. ఉత్తరానికి మాత్రం తల పెట్టకూడదు. దక్షిణార్ధగోళంలో, మీ తలని దక్షిణం వైపుకి పెట్టకూడదు.

 

6# బలవంతంగా నిద్రపోకుండా ఉండకండి

మీకు ఎంత నిద్ర అవసరం అనేది మీరు చేసే భౌతిక శ్రమ స్థాయిని బట్టి ఉంటుంది. నిద్రని కానీ ఆహారాన్ని కానీ ఇంత అని నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. మీ శరీర శ్రమ తక్కువగా ఉన్నప్పుడు తక్కువ తింటారు, అది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ తింటారు. నిద్ర విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి దొరికిన తర్వాత అదే లేస్తుంది. అది ఉదయం మూడు గంటలు కావొచ్చు లేదా ఎనిమిది కావొచ్చు. మీ శరీరం ఎప్పుడూ కూడా ఒక అలారం శబ్దానికి లేవకూడదు. తగినంతగా విశ్రాంతి తీసుకున్నాను అనిపించాక అదే లేవాలి.

మీరు బలవంతంగా శరీరానికి నిద్రను నిరాకరిస్తే, మీ భౌతిక, మానసిక సామర్థ్యాలు ఇంకా ప్రస్తుతం మీకు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అలా మీరు ఎప్పుడు చేయకూడదు. మీరు శరీరానికి దానికి ఎంత నిద్ర అవసరమో అంత నిద్రని ఇవ్వాలి.

కానీ శరీరం ఏదో ఒక విధంగా, మంచాన్ని ఒక సమాధిలా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంటే, అది బయటకు రావాలి అనుకోదు. ఎవరో మిమ్మల్ని లేపాల్సి వస్తుంది! అది మీరు మీ జీవితాన్ని ఎలా వ్యవహరిస్తున్నారు అనేదానిమీద ఆధారపడి ఉంటుంది. మీరు జీవాన్ని తప్పించుకోవాలి అనుకునే మానసిక స్థితిలో ఉంటే, మీరు సహజంగానే మరింత ఎక్కువగా తిని మరింత ఎక్కువగా నిద్రపోతారు.

#7 ఒక ఆనంద / ఆహ్లాద స్థితిని కలిగి ఉండండి

నిద్ర అంటే చలనం లేకుండా ఒక రకమైన నిద్రాణ స్థితిలోకి వెళ్లడం, తాత్కాలిక మరణం, తిరిగి నిర్వహణ యోగ్యంగా తయారు చేయడానికి అవసరమయ్యే విశ్రాంతి సమయం. పగటి సమయంలో మీ శరీరాన్ని దానికి చాలా కొద్దిగా మాత్రమే నష్టం కలిగే విధంగా ఉంచుకుంటే, అప్పుడు విశ్రాంతి కోసం అవసరమయ్యే సమయం సహజంగానే తగ్గిపోవడాన్ని మీరు గమనిస్తారు. దీన్ని సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఇంకా మనసుని ఆహ్లాదకరంగా ఉంచుకోవడం ద్వారా చేయవచ్చు. మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటే, మీరు సాధించిన సమన్వయం వల్ల మీ శరీరంలో, శక్తి వ్యవస్థలో ఎటువంటి ఘర్షణ లేకపోతే, అలాగే మీ మనసులో, భావోద్వేగాలలో ఎటువంటి ఘర్షణా లేకపోతే, మీ నిద్ర సమయం దానికదే తగ్గుతుంది.

#8 జీవితంతో పోరాడకండి

శరీరానికి కావాల్సింది విశ్రాంతి, నిద్ర కాదు. చాలామంది అనుభవంలో వాళ్లకు తెలిసిన అతి గాఢమైన విశ్రాంతి నిద్రే, కాబట్టి వారు నిద్ర గురించి మాట్లాడతారు. కానీ ప్రాథమికంగా శరీరం నిద్రని అడగడం లేదు అది విశ్రాంతి కోసం చూస్తుంది. రాత్రులు విశ్రాంతి కరంగా ఉండకపోతే మీ ఉదయాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి వ్యత్యాసాన్ని తీసుకు వచ్చేది నిద్ర కాదు, విశ్రాంతి.

మీరు శరీరాన్ని రోజు మొత్తం విశ్రాంతిగా ఉంచితే, మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఒక రకమైన విశ్రాంతి అయితే, మీ నిద్ర సమయం అనేది సహజంగానే తగ్గుతుంది. సమస్య ఏంటంటే చాలామందికి ప్రతి దాన్ని కష్టపడి చేయాలి, ఒత్తిడితో చేయాలి అని నేర్పించారు. జనం పార్క్ లో ఎంతో ఒత్తిడితో నడుస్తూ ఉండటాన్ని నేను చూస్తాను. ఇటువంటి వ్యాయామం వాళ్లకి శ్రేయస్సు కంటే కూడా ఎక్కువగా హానినే చేస్తుంది. ప్రతి దాన్నీ ఒక యుద్ధంలా చేయకండి, మీరు నడుస్తున్నా, జాగింగ్ చేస్తున్నా, వ్యాయామం చేస్తున్నా, దాన్ని మీరు ప్రశాంతంగా ఎందుకు చేయలేరు, ఆనందంగా ఎందుకు చేయలేరు?

జీవితంతో పోరాడకండి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడం అనేది ఒక యుద్ధం కాదు. ఏదైనా ఆట ఆడండి, ఈత కొట్టండి, నడవండి, మీకు ఏది నచ్చితే అది చేయండి. నేను కేవలం చీజ్ కేకులు తినడం అనేది మాత్రమె చేస్తాను అంటేనే సమస్య వస్తుంది. లేదంటే ఏ పనినైనా హాయిగా చేయడానికి ఏ సమస్యా ఉండదు.

#9 యోగ సాధనలు - శాంభవి మహాముద్ర

శాంభవి మహాముద్ర లాంటి కొన్ని యోగ సాధనలను మీ జీవితంలోకి తీసుకొస్తే, మొట్టమొదట మీరు చూసే తేడా ఏంటంటే, మీ పల్స్ రేటు తగ్గుతుంది. ఉదాహరణకి ఒకరు ఇప్పుడే ప్రోగ్రామ్ చేసి శాంభవి మొదలుపెట్టారు. అతను భోజనానికి ముందూ, ఆ తర్వాత తన పల్స్ చెక్ చేసి రికార్డ్ చేసుకుని, ఆ తర్వాత ఒక ఆరు వారాల పాటు రోజుకి రెండు సార్లు శాంభవి చేసి, మళ్ళీ పల్స్ చెక్ చేస్తే, ఆ సంఖ్యలో 8 నుంచి 15 పాయింట్లు తగ్గుతాయి. ఒకరు శాంభవి లోని విశ్రాంతి స్థితిలోకి బాగా వెళితే, అది మరింత తగ్గుతుంది.

12 నుండి 18 నెలల సాధన తర్వాత, విశ్రాంతి స్థితిలో మీ పల్స్ రేట్ ని దాదాపు 50 లేదా 60 శాతానికి తీసుకురావచ్చు. ఇది జరిగితే నిద్ర సమయం నాటకీయంగా తగ్గుతుంది. ఎందుకంటే శరీరం రోజంతా సహజంగానే విశ్రాంతిగా ఉంటుంది. మీరు ఏ పని చేస్తున్నా సరే, అది విశ్రాంతిగానే ఉంటుంది, కాబట్టి అది ఎక్కువ నిద్రని కోరుకోదు.

#10 శూన్య మెడిటేషన్

మేము ఒక విధమైన ధ్యానాన్ని నేర్పిస్తాము. దాన్ని శూన్య అంటారు. ఇది మేము కేవలం దక్షిణ భారతదేశంలోని ఈశా కేంద్రంలో ఇంకా అమెరికాలోని ఈశా కేంద్రంలో మాత్రమే నేర్పిస్తాము. మేము దాన్ని వేరే ఎక్కడా నేర్పించము, ఎందుకంటే దానికి ఒక విధమైన వాతావరణము, శిక్షణా ఇంకా ఇతర ప్రక్రియలు అవసరమవుతాయి. శూన్య, నిద్ర సమయాన్ని నాటకీయంగా తగ్గించగలదు. అది కేవలం ఒక 15 నిమిషాల ధ్యానం. కానీ మీరే చూస్తారు, మీరు ఈ ధ్యానంలోకి సరిగ్గా వెళ్ళితే మీ జీవక్రియ 24 శాతానికి పడిపోతుంది. ఎరుకతో ఉండి చేసే ధ్యానాలలో మీరు జీవక్రియలను అతి తక్కువగా 24 శాతానికి తీసుకువెళ్ళవచ్చు. అంతకంటే కిందకు వెళితే మీరు చైతన్యం సాధారణ స్థాయి దాటిపోతుంది . ఒక స్థాయి ప్రశాంతత వద్దకు వెళ్లి, ఆ తర్వాత ఎరుకతో బయటికి రాగలగాలి అంటే మీరు 24 శాతం కంటే కిందకు వెళ్ళకూడదు.

ఈ పదిహేను నిమిషాలు ధ్యానం అనేది, విశ్రాంతి పరంగా రెండు నుంచి మూడు గంటల నిద్రతో సమానంగా ఉండడాన్ని మీరుగమనించవచ్చు. శరీరంలో అటువంటి నాటకీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి కాబట్టి, మరీ ముఖ్యంగా మీ రక్తంలో రసాయన స్థాయిలో గొప్ప మార్పులు వస్తాయి కాబట్టి, దీన్ని ఒక నియంత్రించబడిన ఇంకా ఏకాగ్రతతో కూడిన వాతావరణంలో మాత్రమే నేర్పించాల్సి ఉంటుంది.