భూతశుద్ధి ఎలా చేసుకోవచ్చు??

నీరు, భూమి, వాయువు, నిప్పు, ఆకాశం అనేటువంటి పంచభూతాల ఆటే ఈ దేహం. ఈ దేహం ‘పంచభూతాల కీలుబొమ్మ’ అనేది మన దేశంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి. ఈ దేహంలో ఉన్నది, నీరు 70 శాతం, భూమి 12 శాతం, గాలి 6 శాతం, నిప్పు 4 శాతం, మిగిలినది ఆకాశం. ఈ పంచభూతాలు మనలో ప్రవర్తించే తీరే మనం ఎటువంటి వాళ్ళం అనేదాన్ని నిర్ణయిస్తుంది. ‘‘భూతశుద్ధి’’ అనేది ఈ ఐదు మూలకాలలో ఉన్న దోషాల నుండి బయటపడే విధానం. అంటే, ఈ భౌతిక తత్త్వం నుండి విడుదల పొందటం. భౌతిక పరిమితులను అధిగమించేందుకు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడానికి యోగాలో ఉన్న అతి మౌలికమైన సాధన భూతశుద్ధి. భూతశుద్ధి ప్రక్రియను మనం సహజమైన రీతిలో ఆచరించడానికి  కొన్ని సులువైన పద్ధతులున్నాయి. ఇది పరిపూర్ణమైన భూతశుద్ధి కాదు కానీ, ఈ సాధనల ద్వారా మనలోని పంచభూతాలను కొంతవరకు శుద్ధి చేసుకోవచ్చు.

నీరు

ఈ పంచభూతాల్లో మనం ఎంతో శ్రద్ధ చూపించవలసింది నీటి మీదే. ఎందుకంటే దేహంలో నీరు 72 శాతం ఉంటుంది, పైగా నీటికి స్మృతి(Memory) కూడా ఉంటుంది. అందుకే నీటికి సంబంధించి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పని చేసి చూడండి, నీటిలో కొన్ని తులసి ఆకులనో, వేపాకులనో వేయండి. అవి నీటిని రసాయన పరంగా శుద్ధి చేయలేవు కాని, ఆ నీటిని అవి చాలా శక్తివంతంగా, ప్రభావవంతంగా మార్చేస్తాయి. మరో విషయం ఏంటంటే, రాగిపాత్రలో నీటిని నిల్వచేయడం. అలా చేయడం ద్వారా ఆ నీరు రాగిలోని గుణాలను పొందుతుంది. అది మనకు ఉపయోగకరం.

భూమి

మనలో భూ తత్త్వం ఉండేది 12 శాతం. ఆహారాన్ని మనం ఎలా తింటున్నాం, ఎవరు మనకు వడ్డిస్తున్నారు, మనం ఎలా దాన్ని స్వీకరిస్తున్నాం.. ఈ విషయాలన్నీ చాలా ముఖ్యం. మనం తినే ఆహారం కూడా జీవమే. ఎన్నో జీవులు తమ జీవితాలను ధారపోస్తూ మనకు పౌష్టికతను అందిస్తున్నాయి. మనల్ని బతికించడం కోసం తమ జీవితాలను అర్పిస్తున్న ఆ ప్రాణికోటి పట్ల మనం కొంత కృతఙ్ఞతా భావంతో తింటే, అప్పడు ఆహారం మనలో చాలా భిన్నరీతిలో స్పందిస్తుంది.

గాలి

ఇక మనలో గాలి లేదా వాయువు భాగం 6 శాతం. ఈ ఆరు శాతంలో మనం ఊపిరిగా పీలుస్తున్నది ఒకటి లేదా అంతకన్నా తక్కువ శాతమే. మిగతా వాయువు అనేక రకాలుగా మనలో పని చేస్తుంది. కేవలం మనం పీల్చేగాలి మాత్రమే మనపై ప్రభావం చూపదు. మనలో ఆ వాయువు ఏవిధంగా ఉన్నదన్న విషయం కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. మనం శ్వాసించే ఆ ఒక శాతం గాలి పట్ల కూడా మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి. నగరాల్లో జీవిస్తుంటే మాత్రం మీరు ఏవిధమైన గాలి పీలుస్తున్నారనేది మీ చేతుల్లో ఉండదు. అటువంటప్పుడు ఓ పార్కులో లేదా ఓ కొలను ఒడ్డున అలా చక్కగా కాసేపు నడవండి. ముఖ్యంగా మీకు పిల్లలున్నట్టయితే, ఖచ్చితంగా నెలకోసారైనా వాళ్లను బయటకు తీసుకువెళ్లండి. సినిమాలకు మాత్రం కాదు. ఎందుకంటే అక్కడ మూసేసిన తలుపుల కారణంగా ఆ కాస్త గాలిని కూడా ప్రభావితం చేసేవి కొన్ని ఉన్నాయి. అవే, స్పీకర్ల నుండి వెలువడే పెద్దపెద్ద ధ్వనులు, సినిమా తెరపై సాగే కథకారణంగా ఏర్పడే ఉద్వేగాలు, ఉద్రేకాలు!

ఇవన్నీ కలిసి మనిషి మీద ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందువల్ల పిల్లలను ఓ నది ఒడ్డుకు తీసుకువెళ్ళండి. ఆ నదిలో ఈదడం ఎలాగో వాళ్లకు నేర్పండి, పక్కనే కొండ ఉంటే దాన్ని ఎక్కడం ఎలాగో వాళ్లకు నేర్పండి. కొండ కోసం ఏ హిమాలయాలకో వెళ్లనక్కరలేదు. ఓ చిన్న కొండ లేదా గుట్టయినా చాలు. అదే పసిపిల్లలకు మహాపర్వతం. దానిపైకి ఎక్కి అక్కడే పిల్లలతో కాసేపు కూచోండి. ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా సంతోషిస్తారు, వారి శరీరం కూడా ధృఢమౌతుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. దానితో మీ శరీరం, మనసు సరికొత్తగా స్పందించడం మొదలెడతాయి. వీటన్నిటికీ మించి, సృష్టికర్త అందించిన ఈ సువిశాల సృష్టితో మీకు మరింత అనుబంధం పెరుగుతుంది. వాస్తవానికి ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది.

నిప్పు

మనలో ఎలాంటి అగ్ని జ్వలిస్తోందనే విషయం పట్ల కూడా మనం జాగ్రత్త వహించవచ్చు. ప్రతిరోజూ కొంచెంసేపు ఎండలో నిలబడి, శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోండి. ఎందుకంటే ఎండ ఇప్పటికీ ఇంకా చాలా శుద్ధాంగానే ఉంది. అదృష్టం కొద్దీ దాన్నెవరూ కలుషితం చేయలేరు. మరి మనలో ఎటువంటి అగ్ని రగులుతోంది? అది అసూయాతో ఉందా, ద్వేషంతో ఉందా, క్రోధంతో ఉందా, ప్రేమతో ఉందా లేక కరుణతో రగులుతూ ఉందా? మీరు ఈ విషయం పట్ల జాగ్రత్త తీసుకుంటే, ఇక భౌతిక, మానసిక ఆరోగ్యాల గురించి మీరేమాత్రమూ బాధపడాల్సిన పనే ఉండదు. అవన్నీ చక్కగా ఉంటాయి.

ఆకాశం

ఈ సృష్టికీ, సృష్టి మూలానికీ మధ్య ఉన్న స్థితే ఆకాశం. మిగతా నాలుగు మూలకాలనూ మనం సక్రమంగా చూసుకుంటే, ఆకాశం తనను తాను సరిచేసుకుంటుంది. మన జీవితంలో ఆకాశం యొక్క సహకారాన్ని పొందడం ఎలానో మనకు తెలిస్తే, మన జీవితం ధన్యమవుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు