ప్రశ్న: సద్గురు! నేను మానసిక ఆందోళనతో బాధ పడుతూ ఉంటాను. ఇలా ఎందుకు జరుగుతున్నది? దీన్ని అదుపులో ఉంచటం ఎలా?

సద్గురు: మానసిక ఆరోగ్యం అంటే కొంచెం సున్నితమైన వ్యవహారమే....... శారీరక ఆరోగ్యం అంటారా, దానికొచ్చే ఇబ్బందులూ లోటుపాటులూ అన్నీ శరీరం లోపలి అంతర్గతమైన కారణాల మూలంగా వచ్చేవి. (కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల లాంటివి ఎప్పుడైనా బయటినుంచి సోకితే అది వేరు.) మరి అలా మీ లోపలి నుంచే అంతర్గతమైన కారణాల వల్ల అనారోగ్యం పుట్టుకొస్తుంటే, దానికి బాధ్యత మీదే కదా? అలాగే , అలా లోపలినుంచి పుట్టుకొచ్చే అనారోగ్యాన్ని నయం చేసుకొనే బాధ్యత కూడా మీదే అవుతుంది.

బారెడు పొద్దెక్కి, మధ్యాహ్నం అయ్యే దాకా ఆలుగడ్డల బస్తా లాగా మంచం మీదే పడి ఉండి, నిద్ర పోయే అలవాటు వల్ల ఏవేవో రోగాలకు గురయ్యే జనాభా లెక్కలేనంత మంది ఉన్నారు. ఉదయం ఏ అయిదు గంటలకో మేలుకొని కాస్త ఈత కొట్టటమో, ఆటలాడటమో, నడకో మరొకటో చేసేవారందరూ బుద్ధి హీనులని వీళ్ళ భావన. జీవితాన్ని కేవలం తినటానికీ పడుకోటానికి మాత్రమే వినియోగించుకొంటూ తామెంతో హాయినీ, సుఖాన్నీ అనుభవిస్తున్నామని వీళ్ళు అనుకొంటారు. కొంతకాలానికి ఇలా కేవలం తిని పడుకొనే జీవితం ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీస్తుంది. అప్పుడు వాళ్లేమంటారో తెలుసా? ఆరోగ్యం అనేది ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే లభించే మహా భాగ్యం అంటారు. తమకా అదృష్టం దొరకలేదంటారు. ఇది నిజం కానే కాదు! ఆరోగ్యం మనశరీరం లోపలినుంచి సృష్టి అయ్యేది. బయటి నుంచి ఏవైనా క్రిములు సోకి అనారోగ్యం కలిగితే అది వేరే విషయం.

ఇక, మానసిక ఆరోగ్యం విషయం అంటారా? అది కొంచెం సున్నితమైన విషయం! కానీ మీ శరీరంలో పుట్టుకొచ్చేవ్యాధికి మీదే బాధ్యత అయినప్పుడు, మీ మనసుకు పుట్టుకొచ్చే వ్యాధికి మాత్రం బాధ్యత మీది కాకుండా ఎలా పోతుంది ? శారీరక వ్యాధులకు లాగే, మానసిక వ్యాధులకు కూడా కారణాలు చాలా ఉంటాయి. అయితే మానసికమైన రుగ్మతలకూ , మామూలు చింతలూ ఆందోళనలకూ తేడా ఉంది. దీన్ని మనం గమనించాలి. మీ చింతలనూ, విచారాలనూ వైద్యుడు తొలగించలేడు. (ఆ వైద్యుడికే తన సొంత చింతలు బోలెడుంటాయి!)

మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరుగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దానికి పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి

మీకు వైద్య శాస్త్ర పరంగా ఏదయినా అనారోగ్యం ఉంటే, వాళ్ళు మీకేవయినా మందులిచ్చి, కొంత వరకు ఆరోగ్యం చేకూర్చగలుగుతారు. మందులు అనగానే, మళ్ళీ రక రకాల రసాయనిక మైన మార్పుల పరంపర. అసలు మనిషి శరీరాన్ని మించిన అత్యుత్తమ స్థాయి రసాయనాల తయారీ కర్మాగారం మరొకటి ఉండదు. ఈ రసాయనాలన్నిటి వల్లా మీలో కలిగే మార్పులు పూర్తిగా మీ స్వాధీనం లోనే ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు ఎలాంటి మార్పులు కోరుకొంటారో మీరే చెప్పండి. అపరిమిత ఆందోళనా, పరమానందమా? తప్పకుండా పరమానందాన్నే కోరుకొంటారు. అది అన్నిటికంటే గొప్ప సంతోషం అని.

కానీ ఇక్కడే సమస్య! అనేక కారణాల వల్ల మీ శరీరంలో రసాయనిక మార్పులు మీ అధీనంలో ఉండవు. అది జన్యు సంబంధమైన కారణాల వల్ల కావచ్చు. దీర్ఘ రోగాల కారణంగా కావచ్చు. బాహ్య ప్రేరణల వల్ల కావచ్చు. ఇంకా అనేక కారణాలుండచ్చు. కానీ, ఇలాంటి కారణాలు ఎన్ని ఉన్నా, మీ శారీరక , మానసిక ఆరోగ్యాల గురించి శ్రద్ధ తీసుకోవటం మీ బాధ్యత కాకుండా పోతుందా? ‘కాదు’ అని మీరు భావించారంటే, ఆట ముగిసినట్టే. మీ ఆరోగ్య సమస్య మీ చేయి దాటిపోనిచ్చినట్టే! అలా కాకుండా ‘అవును, నా బాధ్యతే!’ అని అంగీకరించారంటే, ఆరోగ్య సాధన వైపూ, శ్రేయస్సు వైపూ అడుగు వేసినట్టు. ఒకటి రెండు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం సాధిస్తారని కాదు గానీ, ఆ దిశలో ప్రస్థానం ఆరంభమయినట్టే.

ఒక ముఖ్యమైన విషయం మాత్రం మరచిపోకూడదు. మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరుగా ఉన్నారు, ఎలా ఉన్నారు అనే దానికి పూర్తి బాధ్యత మీరే తీసుకోవాలి. (ఇలాంటి సంభాషణలు మీతో చేసేటప్పుడు ) ఇది నా మొట్టమొదటి మూల లక్ష్యం - కేవలం మతపరమైన నమ్మకాల నుండి, మిమ్మల్ని మీ సొంత బాధ్యతల దిశగా మళ్లించటం. మతం అనగానే, పైన స్వర్గం ఒకటి ఉన్నదీ, అక్కడెవరో ఉన్నారూ, ఇక్కడ మీకు జరిగే అనర్థాలన్నిటికీ బాధ్యత ఆయనదే తప్ప మీది కాదు అన్న ధోరణి లోకి వెళతారు .

మనమున్నదేమో గుండ్రంగా గోళాకారంగా ఉన్న భూగ్రహం మీద. ఆ గ్రహం గూడా వెర్రివేగంతో తిరుగుతూ ఉంటుంది. ఆ గ్రహం మీద ఎక్కడా ‘ఇది పై వైపు’, ‘ఇది క్రింది వైపూ’ అని రాసి ఉండదు. పైన ఎటో, క్రింద ఎటో తెలిసే అవకాశమే లేనప్పుడు, ఇక పైన ఎవరో ఉన్నారని చూడాలంటే ఎటు చూసేటట్టు?

మనం వినియోగించగల చిట్కాలలో అన్నిటికంటే తేలికయినది, కేవలం సరిగ్గా, నిటారుగా కూర్చోవటం ఎలాగో నేర్చుకోవటం

అసలు, ఆ పైన ఎక్కడో ఉన్న శక్తి ఏదో మీ స్థితిగతులకు ఎలా బాధ్యత వహిస్తుంది చెప్పండి? ఇప్పటికయినా ఈ బాధ్యత స్వయానా మీదే అని తెలుసుకొని స్వీకరించండి. అప్పుడు కనీసం మీరు చేయగలిగినది ఏ కొంచెమో అదన్నా మీరు చేయగలుగుతారు.

ఈ భూగోళం మీద అందరికీ శారీరక, మానసిక ఆరోగ్యాలు ఒకే విధంగా ఉండవు కదా? అలా ఉండటం అనేది జరిగే పనే కాదు. కనక , మన ఆరోగ్యం గురించి కనీసం మనం చేయగలిగిందంతా చేస్తున్నామా లేదా అని మాత్రమే చూసుకోగలం. ఇది చాలా ముఖ్యం. మనం చేయగలిగిందేదో అది మాత్రం చేసి తీరాలి. మన శక్తికి మించిందేదో మనం చేయలేక పోతుంటే, ఫరవా లేదు. మన చేతిలో ఉన్నది కూడా చేయటం మానేస్తే ప్రమాదం.

మన శరీర వ్యవస్థలో ఒక సమతుల్యాన్ని (balance) తెచ్చేందుకు కొన్ని తేలికయిన ఉపాయాలున్నాయి. శరీరంలో ఉండే రసాయనాలు సరే సరి, అవి ఉండనే ఉన్నాయి. శరీరంలో ఉన్న అనేక గ్రంథులు రకరకాల రసాయనాలను స్రవించి తమ పని తాము చేసుకొంటూ ఉంటాయి.

మనం వినియోగించగల చిట్కాలలో అన్నిటికంటే తేలికయినది, కేవలం సరిగ్గా, నిటారుగా కూర్చోవటం ఎలాగో నేర్చుకోవటం. మీరు కూర్చొన్నప్పుడు మీ శరీరానికి మీ కండరాల ఆసరా అవసరం కాకుండా ఉండేట్టు కూర్చోవాలి. శరీరం సమతూకంగా ఉంచి , కూర్చొన్నప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా, అనాయాసంగా కూర్చోవాలి. ఈ ఒక్క పని ప్రతి రోజూ కొన్ని గంటలపాటు చేసి చూడండి , చాలు. మీకెంతో సౌలభ్యం కలగటం మీరే గమనిస్తారు. ఇంతకంటే కొంచెం క్లిష్టమైన ఇతర ఉపాయాయాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ముందు కనీసం అన్నిటికంటే తేలికయిన ఈ చిట్కాను ఆచరణలో పెట్టి చూడండి. మీరు కూర్చొన్నప్పుడు మీ శరీరంలో ఏర్పడే ఒంపులూ, కోణాల వల్ల , మీ శరీరానికి ఎలాంటి ఒత్తిడీ కలగకుండా ఉండేట్టు కూర్చోండి.

మొట్టమొదట్లో ఇది కూడా కొంత కష్టంగా ఉండి, కొంత ప్రయత్నపూర్వకంగా చేయాల్సి రావచ్చు. కానీ కొంచెం అలవాటు చేసుకొంటే మీరు శ్రమ లేకుండానే, శరీరం లోని ఏ భాగం మీదా ఒత్తిడి పడకుండా కూర్చోగలుగుతారు. ‘జ్యామితి’ (geometry) అంటారే, అది ముఖ్యం. రేఖలూ, ఒంపులూ, కోణాలూ, ఆకారాలూ ముఖ్యం. ఈ ప్రపంచంలో ఏ భౌతిక విషయంలో నైనా జ్యామెట్రీ ముఖ్యమే. ఒక వస్తువు ఎంత చక్కగా పనిచేస్తుంది అనేది , జ్యామెట్రీ పరంగా దాని నిర్మాణంలో ఎలాంటి రేఖలూ, ఒంపులూ, కోణాలూ, ఆకారాలూ ఉన్నాయి అన్న దాని మీద ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఇంజను ఉన్నదనుకోండి. అది మంచి ఇంజనుగా పని చేయాలంటే, దాని రూపు రేఖలన్నీ జ్యామెట్రీ పరంగా సవ్యంగా అమర్చబడి ఉండాలి. వివిధ భాగాల మధ్య రాపిడీ , ఘర్షణా (friction) ఉండకూడదు. ఓ భవనం చక్కగా నిర్మితమైంది అన్నామంటే అర్థం, జ్యామెట్రీ పరంగా, ఆ భవనం కొలతలూ, రూపు రేఖలూ చక్కగా అమరి ఉన్నాయి అని.

మన శరీర నిర్మాణ విషయం కూడా అంతే. మన శరీరమే ఏమిటి, ఈ బ్రహ్మాండనిర్మాణం అంతా అంతే. సూర్యుడి చుట్టూ గ్రహాలన్నీ వలయాలలో తిరుగుతున్నాయని మనకు తెలుసు. వాటిని ఏ ఉక్కు తీగలతోనో గట్టిగా కట్టి ఉంచటం వల్ల అవలా సక్రమంగా తిరుగుతున్నాయా? లేదే! ఉన్నదల్లా జ్యామెట్రీ ఒక్కటే !ఒక గ్రహంలో ఏ చిన్న శకలమైనా ఏ కొంచెమైనా ఈ జ్యామెట్రీ నుంచి బయటకు జరిగితే, మన సౌరకుటుంబం కథ ముగిసినట్టే. రవ్వంత కూడా తేడా ఉండని జ్యామెట్రీ వల్లే ఈ సౌరమండలం ఇలా మనగలుగుతున్నది. మీ శరీరానిది కూడా ఇలాంటి వ్యవస్థే.

భారతీయ యోగ శాస్త్రానికి ఒక స్థాయిలో లక్ష్యం మానవ శరీరపు భౌతిక వ్యవస్థకు సంబంధించిన జ్యామెట్రీని ఈ విశాల విశ్వ నిర్మాణ వ్యవస్థకు ఆధారమైన జ్యామెట్రీతో అనుసంధానం చేయటం. రెంటికీ ‘లంకె’ పెట్టటం. అలా చేసుకొంటే మనం ఈ భూగోళం మీద మన మనుగడను పూర్తిగా సునాయాసంగా జరుపుకోవచ్చు.

మీరు దాన్ని ఒత్తిడి అన్నా, ఆందోళన అన్నా, మరేమయినా అన్నా, జరుగుతున్నదేమిటంటే మీ భౌతిక వ్యవస్థలో ఏదో ఒక విధమైన ఘర్షణ, రాపిడి (friction) చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణ తొలగించాలంటే, భౌతిక శరీర వ్యవస్థను జ్యామెట్రీ సూత్రాలకు అనుగుణంగా సర్ది పెట్టుకోవాలి. ఆ పైన దానికి కావలసిన కందెన నూనె (lubricant) ను తగిన మోతాదులో వాడాలి. ఇలా చేసేందుకు మార్గాలున్నాయి. జ్యామెట్రీ సూత్రాల పరంగా, పరిపూర్ణత- perfection – ఉన్న చోట ఘర్షణ, రాపిడీ ఉండవు. శక్తితో, ప్రత్యేక ప్రయత్నంతో పని ఉండదు. చిన్న చిన్న సమస్యలు పెనుభూతాలలా మారి మిమ్మల్ని భయపెట్టి బాధించకుండా చూసుకోండి. ఒక్క చిన్న ఆందోళనా, చింతా అయినా నిరంతరం మిమ్మల్ని తొలిచేస్తుంటే అది మీ జీవితాన్ని కుదించి, కుదేలు చేస్తుంది. దాన్ని ఎంత త్వరగా వదిలించుకొంటే అంత మంచిది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు