ప్రముఖ హిందీ చలన చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సద్గురుతో సంభాషించారు. ఈ సందర్భంగా మానసిక స్వస్థతను అంతరంగం నుండి సాధించగలమా అని అడిగిన ప్రశ్నకి సద్గురు సమాధానాన్ని చదవండి.

కరణ్ జోహార్:  మానసిక రుగ్మతలు మనల్ని పీడిస్తున్న సమస్య లని నా అభిప్రాయం. కొందరైకి వైద్య సహాయం కూడా అవసరమౌతోంది. కొన్ని సందర్భాల్లో పరీక్ష చేసినప్పుడు రసాయనిక సమతుల్యత లోపించిందని తేలడంతో మందులు కూడ వాడుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో మీరు ఇందాక ప్రస్తావించిన 'ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం', 'ప్రసన్నతను అంతరంగంనుండే సాధించడం' లాంటివి ఏ విధంగా సహాయపడగలవు?

సద్గురు: ఒక మనిషిలోని ప్రసన్నతను పలు దృక్పథాలలో చూడవచ్చు. ఎటువంటి అనుభవానికైనా సరే రసాయనికతే మూలంగా చూడటం ఒక పద్ధతి.  ప్రశాంతత, ఆనందం, ప్రేమ, కలత, నిశ్చలత, వేదన, తన్మయత్వం - ఇలా ప్రతిదానికీ రసాయనిక మూలం ఉంటుంది. చివరికి ఆరోగ్యానికి, అనారోగ్యానికి కూడా రసాయనికతే కారణం. నిజానికి, నేటి ఔషధ శాస్త్రమంతా రసాయనాల వాడుకతో ఆరోగ్యం కుదుటపడే ప్రయత్నం చేస్తోంది. రసాయనాల బృంద గీతం ఆరోగ్యం అయితే ఆ సమ్మేళనాన్ని రసవత్తరంగా జరిపించడం ఒక వైద్యుని పాత్రగా మనం చెప్పుకోవచ్చు.

మానసిక రుగ్మతలను కూడా చాలావరకు మందుల ద్వారా నయం చేయవచ్చు. కానీ ఎవైతే రసాయనాలు మందులలో వాడతామో అవన్నీ ముందస్తుగానే ఈ శరీరంలో ఉన్నాయి.

సరైన ద్వారాన్ని కనుగొనడం

పరిశీలించి చూస్తే, ప్రసన్నత ఒక స్థాయికి చేరితే అదే ఆరోగ్యం. మీ శరీరం ప్రసన్నంగా ఉంటే అది ఆరోగ్యం, అదే చాలా ప్రసన్నంగా ఉంటే అది సుఖం. మీ మనసు ప్రసన్నంగా ఉంటే అది ప్రశాంతత, అదే చాలా ప్రసన్నంగా ఉంటే అది ఉల్లాసం. మీ భావాలు ప్రసన్నంగా ఉంటే అది ప్రేమ, అదే చాలా ప్రసన్నంగా ఉంటే అది కరుణ. ఒకవేళ మీ ప్రాణశక్తులు ప్రసన్నగా ఉంటే అది ఆనందం, అవే చాలా ప్రసన్నంగా ఉంటే అది పారవశ్యం. మీ పరిసరాలు గనుక ప్రసన్నంగా మారితే దానిని 'సఫలత ' అంటున్నాం.

ఇటువంటి ప్రసన్నతని మనం మందుల రూపేణా రసాయనాలతో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 70 శాతం వరకు ప్రజలకి ఎదో ఒక విధమైన మందులతో వైద్యం అందుతూనే ఉంటుందట. ప్రపంచంలోకెల్లా అత్యంత భాగ్యవంతమైన దేశం అయిఉండి, అపారమైన పౌష్టికాహారం, జీవన విధానం అందుబాటులో ఉండి 70 శాతం వరకు వైద్యం మీద ఆధారపడుతున్నారు. మీలోపల ఉన్న  స్వస్థత, ఆరోగ్యము అనే రసాయనిక స్థితులను బయటినుండి ఇచ్చే రసాయనాల ద్వారా ప్రసన్న స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మానవ శరీరం ఒక సంక్లిష్టమైన రసాయనిక కర్మాగారం. దీనిని బయటినుండి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. 

మానవ శరీరం ఒక సంక్లిష్టమైన రసాయనిక కర్మాగారం. దీనిని బయటినుండి నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. అంతర్గతంగా నిర్వహించగలము, కానీ శరీరం లోపల ఉన్న వ్యవస్థలు మన అందుబాటులోకి రావాలి కదా?!  యోగా ఇందుకు సహాయపడగలదు. దీని ద్వారా మీలో నిరంతరం జరుగుతున్న సృష్టికి ఆధారభూతమైన దానిని మీకు అందిస్తుంది. మీరు భోజనం చేసే వరి అన్నము, అరటి పండు లేదా ఒక రొట్టె ముక్క ఏదైనా సరే మారిపోయి ఒక మానవ శరీరంగా రూపాంతరం చెందే ప్రజ్ఞ మీలోనే దాగి ఉంది. ఒక్క రొట్టె ముక్కతో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సంక్లిష్టమైన మానవ యంత్రాన్ని నిర్మించగలిగే తెలివితేటలు నీకు ఉన్నాయి. ఈ తెలివితేటల్లో అణుమాత్రం మీ దైనందిన జీవితంలో ఉపయోగిస్తే మీరు అద్భుతంగా జీవించగలుగుతారు.

ఒక అసాధారణ యంత్ర రూపకర్త మీలోనే ఉన్నాడు. దీని ఆధారంగానే మేము "ఇన్నర్ ఇంజనీరింగ్"ను అందిస్తున్నాము. అంటే మీ జీవితాన్ని సమర్ధవంతంగా గడపడానికి అనువుగా అంతరంగాన్ని మలచుకోవడం. జన్మించిన విధానం, జీవించే విధానం, ఆలోచనా విధానం, జీవితాన్ని అనుభవించే విధానం చివరికి ఎక్కడ, ఎలా మరణించేదీ - ఇలా ప్రతీ అంశం   వ్యక్తులు నిర్ణయించెదే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు