‘కర్మ’ అంటే ఏమిటి? సాధారణంగా ఈ ప్రశ్నకు ‘మంచీ’ - ‘చెడు’ కర్మలంటే ఏమిటో నిర్వచిస్తూ జవాబు చెప్పటం పరిపాటి. కానీ కర్మ అనేది అంతకంటే చాలా లోతయిన విషయం. మార్మికులూ, యోగి అయిన సద్గురు ఈ ప్రశ్నలను తరచి చూసి, ఒక ఆధ్యాత్మిక సాధకుడి జీవితంలో కర్మకు ఉండే పాత్రను విశదీకరిస్తున్నారు.

ప్రశ్న: కర్మ అంటే ఏమిటి? కర్మలలో చాలా రకాలు ఉంటాయా? ఉంటే, మన మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది?

సద్గురు: ‘నా జీవితం’ అని మీరు చెప్పుకొనేది ఏమిటో తెలుసా? కొంత మొత్తం జీవశక్తి, దాంతోపాటు దాన్ని నియంత్రించేందుకు కావలసిన కొంత సమాచారం (information). ఈ సమాచారాన్ని, ఈ కాలపు పరిభాషలో చెప్పాలంటే ‘సాఫ్ట్ వేర్’ (software) అనవచ్చు. కొంత మొత్తం జీవ శక్తితో, కొంత సమాచారం అనుసంధానమై, జోడించబడి ఉంటుంది. ఈ రెండూ కలిస్తే ఏర్పడే సాంకేతిక పరిజ్ఞానం (information technology) వల్ల నడిచే వ్యవస్థే ‘మీరు’. మీలో అమర్చి ఉన్న సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం రూపు దిద్దుకొంటుంది.

మీ పాత సంస్కారాలు మీరు పుట్టిన సమయానికి ఎంతో కాలం ముందునుంచే ఏర్పడి వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్న మీ అవగాహన బట్టి, మీ తల్లిదండ్రులెలాంటి వారూ, కుటుంబం ఎలాంటిదీ, ఎలాంటి విద్యా బుద్ధులు అలవడ్డాయి, ఎలాంటి మతపరమైన సాంఘికపరమైన నేపథ్యం మీకు లభించిందీ, ఎలాంటి సాంస్కృతిక సంప్రదాయాలలో పెరిగారూ - ఇలాంటి విశేషాలు మాత్రమే మీ వ్యక్తిత్వాన్ని రూపు దిద్దే సమాచారం అని మీరు భావించచ్చు.

ఒక వ్యక్తిలో అమరిక చేయబడ్డ మొత్తం సమాచారం ఎలాంటిదో, దాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం, స్వభావం, విశిష్టతలూ ఏర్పడతాయి. ఆ సమాచారం అంతటినీ కలిపితే, అదే 'కర్మ' అవుతుంది. దీన్ని సంప్రదాయికంగా, ‘కర్మ’, లేక ‘కర్మ శరీరం’ (Karmic body) లేక కారణ శరీరం (causal body) అంటారు. జన్మ ఏర్పడటానికి కారణం ఇదే.

కర్మలలో రకాలు

కర్మ అనే ఈ సమాచారం రకరకాల స్థాయిలలో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాలుగు రకాలు ఉన్నా, వాటిలో రెండు మనం ఇప్పుడు చర్చిస్తున్న విషయానికి సంబంధించినవి కావు. మనకు విషయం అర్థమయ్యేందుకు, మిగిలిన రెండు రకాలూ చాలు. మొదటిది 'సంచిత కర్మ'. ఇది మన పూర్వ కర్మలన్నీ రాశి పోసి పడేసిన గిడ్డంగి. జీవ పరిణామానికి తొట్ట తొలి దశ అయిన ఏక కణ జీవి దశ నుంచి, ఆ మాటకొస్తే, అంతకంటే ఇంకా ముందున్న అప్రాణి దశ నుంచి, పోగుపడుతూ వస్తున్న కర్మల రాశి 'సంచిత కర్మ'. అప్పటి నించి వచ్చిన సమాచారమంతా ఇందులో భాగం. మీరు కళ్ళు మూసుకొని మీలోకి మీరు ధ్యాసగా చూసుకొంటే చాలు, ఈ బ్రహ్మాండ తత్త్వం అంతా తెలుసుకోగలరు. అలా తెలుసుకోటానికి మీ మేధాశక్తినంతా ఉపయోగించనక్కర్లేదు. బ్రహ్మాండ తత్త్వానికి సంబంధించిన సమాచారం అంతా, మీ శరీర నిర్మాణంలో ఇమిడే ఉంది కనక. సృష్ట్యాది నుంచి సమస్త సమాచారాన్నీ నింపుకొంటూ వస్తున్న గిడ్డంగి మీది. అదే మీ 'సంచిత కర్మ'. కానీ, మీరు నేరుగా గిడ్డంగిలో ఉన్న సరుకుతో చిల్లర (retail) వ్యాపారం చేయలేరు. చిల్లర వ్యాపారం చేసుకొనేందుకు చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకోవాలి. ఈ జన్మకు మాత్రమే సరిపడే (సరుకు ఉన్న) దుకాణాన్ని 'ప్రారబ్ధం' అంటారు.

'ప్రారబ్ధ కర్మ' అంటే, ఈ జన్మ కోసం మాత్రమే కేటాయించిన సమాచారపు మోతాదు మొత్తం. మీ జీవితం ఎంత చురుకు (vibrant) గా, ఎంత క్రియాశీలతతో సాగుతున్నదో, దాన్ని బట్టి, తనకు ఈ జన్మకు కావలసినంత సమాచారాన్ని తనే కేటాయించుకొంటుంది. సృష్టి కరుణామయమైన దృక్పథంతో సాగుతుంది. మీరు ఇంతవరకు పోగు చేసుకొన్న కర్మల రాశి మొత్తాన్నీ ఒకే విడతలో మీకిస్తే, అది మోయలేక మీరు క్రుంగి, కృశించి, నశిస్తారు. ఇప్పుడే, జనంలో చాలా మందికి ఒకే ఒక్క జన్మలో, 30-40 సంవత్సరాల కాలంలో, పోగయిన జ్ఞాపకాల బరువే మోయరానిదై కుంగదీస్తుంది. ఇక అంతకొక నూరు రెట్లు ఎక్కువ జ్ఞాపకాల బరువు వాళ్ళ నెత్తి మీద వేస్తే, వాళ్ళు అసలే బతకలేరు. అందుకే ప్రకృతి వాళ్ళు ఒక్క జన్మకు మోయగలంత పూర్వ జ్ఞాపకాల బరువును మాత్రమే వాళ్ళకు ప్రారబ్ధ కర్మగా కేటాయిస్తుంది.

కర్మ: సాధకుడి జీవితంలో దాని పాత్ర

మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తున్నారంటే, మీరొక ప్రతిజ్ఞ చేస్తున్నట్టు. ‘నేను నా చరమ గమ్యాన్ని అతి త్వరగా అందుకోవాలనే వేగిరపాటులో ఉన్నాను’ అని. దానికోసం నూరు జన్మలు గడపటం మీకు ఇష్టం లేదు. పైగా అలా నూరు జన్మలు గడిపితే, ఆ నూరు జన్మలలో మరింత కర్మ ఫలం పోగై, దాన్ని వదిలించుకోవటానికే, మరో వెయ్యి జన్మలు ఎత్తవలసి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మీ ప్రస్థానం వేగం పెంచాలని మీ కోరిక. కనక, ఆధ్యాత్మిక ప్రక్రియలను ఆరంభించి, నిర్దిష్టమైన పద్ధతిలో దీక్షా స్వీకారం చేస్తే, జీవితంలో ఆధ్యాత్మిక సాధన లేకుండా లభించని కొత్త పార్శ్వాలూ మీ ముందు ఆవిష్కృతమౌతాయి. మీకు ఆధ్యాత్మిక ఆసక్తి ఏమీ లేకపోతే, మీ జీవితం కొంత ప్రశాంతంగా గడుస్తుంది. నిజమే, కానీ అది నిర్జీవమైన జీవితం అవుతుంది. అది జీవ స్థితి కంటే, మృత్యుస్థితికి దగ్గరగా ఉంటుంది. మీలో ఉన్న జీవాన్ని కదిలించి, ఊపివేసే కుదుపులేవీ లేకుండా, మీరు అనాయాసంగా కాల వ్యయం చేసి వెళ్ళి పోతారన్న మాట.

చాలామందికి మరొక దురభిప్రాయం కూడా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారంటే, ఇక మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంకా జీవితం నిరాటంకంగా సాగిపోతుందీ అని. మీరు కొన్ని మనసుకు హాయిగా ఉండే నమ్మకాలూ, విలువలూ అలవరచుకొని, ఒక దిశలో మాత్రమే ఆలోచించటం మొదలెడితే, అంతా నిర్మలంగానూ విస్పష్టంగానూ కనిపిస్తుంది. కానీ మీరు నిజంగా ఆధ్యాత్మిక మార్గం పట్టుకొన్నారంటే మాత్రం ఏదీ అంత స్పష్టంగా కనిపించదు. అంతా అలికివేసినట్టు, అస్పష్టంగా అనిపిస్తుంది. మీరు ఎంత వేగంగా పురోగమిస్తే అస్పష్టత అంత ఎక్కువవుతుంది.

కొన్ని సంవత్సరాల క్రితం నేను జర్మనీ దేశానికి వెళ్ళాను. అక్కడ మా కార్యక్రమం పూర్తయిన తరవాత, అక్కడి నించి నేను కారులో ఫ్రాన్సు దేశానికి వెళ్లవలసి వచ్చింది. నేనున్న ప్రాంతంనుంచి, ఫ్రాన్సులో నా గమ్య స్థలం దాదాపు 440 కిలోమీటర్లు. సాధారణంగా ఆ ప్రయాణానికి అయిదు గంటలు పడుతుంది. రోడ్డు మీద అయిదు గంటలు కారు నడుపుతూ వెళ్ళే ఉద్దేశ్యం లేదు. అందుకే వేగం పెంచేశాను. దాదాపు గంటకు 200 కిలో మీటర్ల వేగంతో వెళ్ళాం. మా మార్గంలో వచ్చే గ్రామసీమలు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవి. నేనూ ఆ ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ వెళ్ల వచ్చనుకున్నాను. కానీ వేగంగా కదులుతున్న దృశ్యాలను కళ్ళు తిప్పి చూద్దామని ఎంత ప్రయత్నించినా, ఆ గ్రామ సీమలన్నీ అతి వేగంగా అస్పష్టంగా దృశ్యాదృశ్యంగా కదిలి పోయాయి. ఏమీ కనిపించలేదు. అసలు నా ముందున్న రోడ్డు మీదనుంచి ఒక్క క్షణం కూడా దృష్టి మళ్లించలేకపోయాను. మంచు కూడా కురుస్తుంది. మేము విపరీతమైన వేగంతో ప్రయాణం చేశాం.

కనక, మీరు ప్రయాణ వేగం పెంచిన కొద్దీ చుట్టూ ఉన్నవన్నీ అలికినట్టూ అస్పష్టంగా అయిపోతాయి. మీరు చేస్తున్న పని మీది నుంచి కొన్ని క్షణాలు కూడా దృష్టి మళ్లించటం కుదరదు. గ్రామసీమలన్నీకన్నుల పండుగగా చూసుకొంటూ వెళ్లాలంటే, మీరు నిదానంగా నిశ్చింతగా వెళ్ళాలి. మీరు గమ్య స్థానం తొందరగా చేరాలనుకొంటే మాత్రం వేగం వీలైనంత ఎక్కువ చేయాలి. అప్పుడిక మీరు ఏదీ చూడలేరు. ముందుకు పోతూ ఉంటారంతే!

ఆధ్యాత్మిక మార్గం అలాంటిది. మీరు నిజంగా ఆ మార్గం పట్టారంటే, మీ చుట్టూ అంతా కోలాహలమే, గందరగోళమే. కానీ ప్రయాణమంటూ సాగుతున్నది కనక ఫర్వాలేదు. ఈ వేగం మీకు సౌకర్యంగా లేదనుకుంటే జీవ పరిణామ వేగం ఉండనే ఉంది. ఆ నత్తనడక వేగంతో ఓ పది లక్షల సంవత్సరాలు పడితే పడుతుంది గమ్యం చేరటానికి.

ప్రతి సాధకుడూ ముందే నిర్ణయించుకోవాలి, తను నిదానంగా కులాసాగా, దోవంతా చూసుకుంటూ వెళ్లాలనుకుంటున్నాడా, లేక అతి త్వరగా గమ్యస్థానం చేరాలని ఆతురతలో ఉన్నాడా అని. 



ప్రేమాశీస్సులతో,

సద్గురు