ఆధ్యాత్మిక మార్గం ఒక గందరగోళ ప్రయాణంలా ఉండవచ్చు. ఒకరు ముందుకు వెళుతున్నారా, వెనుకకు వెళుతున్నారా లేదా పూర్తిగా మార్గం తప్పారా, అనేది స్పష్టంగా కనిపించకపోవచ్చు.  "ఆధ్యాత్మిక ఎదుగుదల" గురించి ఒక అన్వేషకుడు అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.

ప్రశ్న: మనం ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగామో మనకు ఎలా తెలుస్తుంది?  మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తున్నామని ఎలా తెలుసుకోవాలి?

సద్గురు:ప్రారంభ దశలో, మీరు ముందుకు వెళ్తున్నారా లేదా వెనుకకు వెళ్తున్నారా అని ఆలోచించకండి. ఎందుకంటే మీ తార్కికమైన ఆలోచనా విధానం చాలా తప్పుదారి పట్టిస్తుంది.  పొద్దున మీరు క్రియా చేస్తున్నప్పుడు, మీ కాళ్ళు మీరు వెనుకకు వెళ్తున్నారని చెబుతాయి; మీ కుటుంబ సభ్యులు కూడా ఈ అర్ధంలేని పనిని ఇక ఆపమని గోల చేస్తారు.  కాబట్టి ప్రారంభదశలో, దేనినీ నిర్ధారించవద్దు.  ఒక నిర్దిష్ట కాలంపాటు ఎలాంటి షరతులూ లేకుండా, నిబద్ధతతో ఆధ్యాత్మిక ప్రక్రియను ప్రారంభించడం ఉత్తమమైన విధానం.  "ఆధ్యాత్మిక వృద్ధి"  లేదా మరేదైనా ప్రయోజనం మీకు కలగాల్సిన అవసరం లేదు.  కేవలం ఆరు నెలల పాటు నిబద్ధతతో సాధన చేయండి.   తర్వాత ఒకసారి మీ జీవితాన్ని అంచనా వేసుకోండి; మీరు ఎంత శాంతంగా, ఆనందంగా ఇంకా నిశ్చలంగా ఉన్నారో గమనించండి. అది మీలో ఎలాంటి మార్పు తెస్తోందో గమనించండి.

ఏదైనా జరగాలని ఆశించకుండా కొంత కాలం చిత్తశుద్ధితో సాధన చేయండి.  అద్భుతాలు జరగాలని చూడకండి.  జీవితంలోని గొప్ప అద్భుతం జీవితమే.

జ్ఞానోదయం పొందిన వ్యక్తి కూడా తనను తాను అంచనా వేసుకోవడానికి ఎల్లప్పుడూ సమయం వెచ్చిస్తాడు; బహుశా సాధారణ మార్గాల్లో కాకపోవచ్చు, కానీ అతను అనేక ఇతర మార్గాల్లో చేస్తాడు.  గౌతమ బుద్ధుని జీవితంలో ఒక సంఘటన జరిగింది.  ఒక రోజు, అందరూ వచ్చి బుద్ధుడికి నమస్కరిస్తున్నారు. కానీ ఒక వ్యక్తి వచ్చి అతని ముఖం మీద ఉమ్మేశాడు.  బుద్ధుని ఆరాధించే, పూజించే సన్నిహిత శిష్యుడైన ఆనందతీర్థునికి చాలా కోపం వచ్చింది.  అతను, “అనుమతి ఇవ్వండి, నేను ఈ వ్యక్తికి గుణపాఠం నేర్పుతాను.  అతను మీ ముఖం మీద ఎలా ఉమ్మేయగలడు? ”  అని మండిపడ్డాడు. గౌతముడు, "వద్దు" అని చెప్పి ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపాడు; “నా ముఖం మీద ఉమ్మి వేసినందుకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నాకు కోపం వస్తుందా రాదా అని తెలుసుకునే అవకాశం లభించింది.  నా ముఖం మీద ఉమ్మేసినా కోపం రాలేదని తెలిసి చాలా సంతోషిస్తున్నాను.  అది చాలా మంచి విషయం.  నన్ను నేను అంచనా వేసుకోవడంలో మీరు నాకు సహాయం చేసారు, అదే సమయంలో ఆనందతీర్థునికి కూడా ఆ అవకాశం ఇచ్చారు.  కాబట్టి చాలా ధన్యవాదాలు.  మేము ప్రస్తుతం ఎక్కడున్నామో మా ఇద్దరికీ మీరు అర్థమయ్యేలా చేసారు" అని అన్నారు.

కాబట్టి ఏదో జరగాలని ఆశించకుండా కొంతకాలం చిత్తశుద్ధితో సాధన చేయండి.  అద్భుతాలు జరగాలని చూడకండి.  జీవితంలోని గొప్ప అద్భుతం జీవితమే. మన జీవిత ప్రక్రయ, మీరు ఇక్కడ కూర్చుని ఊపిరి తీసుకుంటున్న విధానం, ఇవే ఒక అద్భుతం.  మీరు ఈ అద్భుతాన్ని అభినందించకుండా,  ఎక్కడో పైన మబ్బుల చాటు నుంచి వచ్చి దేవుడు ఇంకేదో అద్భుతం చేస్తాడని మీరు ఎదురుచూస్తున్నట్లైతే, మీరు ఇంకా ఒక చిన్న పిల్లవాడి లాగా ఆలోచిస్తున్నట్టె.  మీరు పెద్దవారిగా పరిణతి చెందలేదు. అంటే, మీరు ఇప్పటికీ ఎవో కట్టుకథలు నమ్ముతున్నారన్నమాట.  కాబట్టి మీ ఆధ్యాత్మిక ప్రక్రియను అంచనా వేయడానికి తొందరపడకండి;  అది మీ లోనికి ఇమడనివ్వండి.

తొందరపడకండి. సాధనకు కట్టుబడి ఉండండి. క్రమానుగతంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ ఉండండి.

సాధారణంగా ఈ సంప్రదాయంలో, ఏదైనా ఆధ్యాత్మిక ప్రక్రియను ప్రారంభించడానికి అవసరమైన నిబద్ధతా కాల వ్యవధి పన్నెండు సంవత్సరాలు.  పన్నెండేళ్లపాటు ఒక మంత్రం జపించి, ఆ తర్వాత మీలో ఎటువంటి మార్పు వస్తుందో గమనించండి.  ఇప్పటికీ భారతదేశంలోని అనేక ఆధ్యాత్మిక వర్గాలు ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయి.  పన్నెండు సంవత్సరాల పాటు ఉచ్చరించమని గురువు మీకొక మంత్రాన్ని ఉపదేశిస్తారు. తర్వాత మీరు మీ ఎదుగుదలను తెలుసుకోవడానికి తిరిగి వస్తారు.  కానీ ఈ కాలం ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు. పన్నెండు రోజుల నిబద్ధత అడిగినా, చాలా సమస్యలు వస్తున్నాయి.  అది కూడా చాలా ఎక్కువ సమయం అని గొణుగుతూ ఉంటారు!

గౌతమ బుద్ధుడి దగ్గర తన స్వంత పద్ధతులు ఉండేవి.  ఎవరైనా ఆయన వద్దకు వచ్చినప్పుడు, రెండేళ్లపాటు ఏమీ బోధించరు; ఆధ్యాత్మికత లేదు, మరేదీ లేదు - మీరు ఆయన దగ్గర ఊరికే ఉంటారు.  మీరు రెండు సంవత్సరాలు వేచి ఉండగలిగితే, అప్పుడు మీలో ఒక రకమైన నాణ్యత వస్తుంది. అప్పుడు మీకు ఇంకేదో చేయవచ్చు.  అప్పుడు ఆయన మీకు ఉపదేశించినప్పుడు, ఆ ప్రక్రియ మీలో చాలా పెద్ద ఎత్తున మార్పు తీసుకువస్తుంది.  కానీ ఇప్పటి ప్రజల ఆధునిక మనస్తత్వం చాలా అసహనంగా ఉన్నందున, వేచి ఉండటానికి కష్టపడుతున్నారు. తొందరపడకండి.  సాధనకి కట్టుబడి ఉండండి. క్రమానుగతంగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటూ  ఉండండి.

సంపాదకుని సూచన: “ఇన్నర్ మేనేజ్‌మెంట్” అనే ఈబుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, ఇందులో సద్గురు మన సామర్థ్యాలను మెరుగుపరుచుకోడానికి, మన జీవితాన్ని మార్చుకోడానికి ఇంకా బాహ్య ప్రభావాల నుండి మీకు స్వేఛ్చనిచ్చే సరికొత్త జీవిత కోణాన్ని తెరవడానికి సమర్థవంతమైన సాధనాలను అందిస్తారు. పుస్తకాన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేయడానికి ధర ఫీల్డ్‌లో "0"ని సెట్ చేయండి.

Inner Management

Photo courtesy maxgiani @Flickr