యోగాతో కండరాల్ని పెంచు కోవచ్చా? జిమ్ పిచ్చితో మీరు గంటలకొద్దీ బరువుల మీద అభ్యాసం చేస్తుంటే, యోగాతో కండరాలు పెరుగుతాయి అని నమ్మబుద్ధి కాదు. ఈ వ్యాసంలో “యోగా మంచిదా లేక జిమ్ శిక్షణ మంచిదా?” అన్న అంశంపై సద్గురు వివరిస్తున్నారు

సద్గురు: ఇందులో ఒకటి చూడడానికి బాగుండటం, ఇంకొకటి నిజంగా బాగుండడం.

మానవ కండర వ్యవస్థ అత్యద్భుతమైనది. మన కండరాలు చేయగలిగిన పనులు అనూహ్యమైనవి. మన కండరాల్ని బలపరుస్తూ అదే సమయంలో వాటిని మృదువు (Flexible) గా ఉంచగలిగితే వాటి సామర్థ్యం మెరుగు చేసుకోవచ్చు. మీరు జిమ్ లో పెద్ద పెద్ద బరువులతో వ్యాయామం చెస్తే మీ కండరాలు తప్పకుండా పెరుగుతాయి. చూడటానికి ఆకర్షనీయంగా కూడా ఉంటయి. కానీ మీరు కండరాల్ని పెంచుకున్న వస్తాదులని చూసే ఉంటారు – వాళ్ళు నమస్కారం కూడా చెయ్యలేరు! అంతెందుకు వాళ్ళు వంగను కూడా వంగలేరు.

మీకు చూడటానికి మాత్రం బాగుండే కండరాలే కావాలంటే, ఈ రోజుల్లో చాలా సులభమైన ఉపాయాలున్నై. మీరు చేతులలో ఉండే కండరాలలో (biceps) సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవచ్చు. సిలికాన్ ఇంప్లాంట్స్ కేవలం స్తనాలలోనే కాదు, చేతి కండరాలలో, పిక్క కండరాలలో మిగతా చోట్లలో కూడా పెట్టించుకోవచ్చు. అవి ఎందుకూ పనికి రావన్న సంగతి ఒదిలేయండి. మీరు ఏ మాత్రమూ కష్ట పడక్కరలేదు.కార్టిజోన్స్, హార్మోన్స్ తీసుకుని బరువులతో కుస్తీ పట్టక్కరలేదు. చూడటానికి అద్భుతంగా ఉంటారు! చూడటానికి మటుకూ బాగుంటే చాలనుకుంటే ఇలాంటి సులభోపాయాలని ఎంచుకోండి.

మీరు జిమ్ లో సాధన చేస్తే మీకు పాశవిక శక్తి వస్తుంది. కాని అంతకన్నా ఎక్కువ బలాన్ని పూర్తిగా వేరే పద్ధతిలో తెచ్చుకోవచ్చు, దానితో మీరు మృగంలా కనిపించరు కూడా. మీరు మనిషిలా కనిపిస్తూ, మీ శరీరాన్ని మృదువు (Flexible) గా ఉంచుకోవచ్చు – అది చాలా ముఖ్యం.

యోగాలో మీ శరీరంతోనే వ్యాయామం చేస్తారు. అంగమర్ధన అదే – దానిలో అన్ని వ్యాయామాలూ మీ శరీర భారంతోనే చేస్తారు. అప్పుడు వ్యాయామం చెయ్యటానికి జిమ్ కోసం వెతుక్కోనక్కరలేదు. మీ శరీరం మీతోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఈ వ్యాయామం చేసుకోవచ్చు. జిమ్ లో చేసే వ్యాయామాలు ఎంత శక్తివంతమో, అంగమర్దన కూడా అంతే శక్తివంతమైనది. అదనంగా మీ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడీ ఉండదు. పై పెచ్చు మీరు మృగంలా కనిపించరు. మీరు వివేకమైన వ్యక్తిలా, బలమైన వ్యక్తిగా కనిపిస్తారు.

అంటే నేను బరువులతో వ్యాయామం చెయ్యకూడదా? అలాంటిదేమీ లేదు – మీరు బరువులతో వ్యాయామం చెయ్యవచ్చు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం పుణ్యమా అంటూ మన దైనందిక జీవితంలో వ్యాయామం చాలా తగ్గి పోయింది. మనం నీళ్ళ బక్కెట్లు మోయడం లాంటి పనులేమీ చెయ్యనక్కరలేదు – యంత్రాలే అన్ని చేసి పెడతాయి. మీరు మీ ఐ ఫోన్ తప్పించి ఇంకేమీ మొయ్యక్కరలేదు. ఔనా కాదా? మీరు దినమంతా మీ అవయవాలను ఉపయోగించటం లేదు కాబట్టి, ఒక మోస్తరు బరువులతో వ్యాయామం చెస్తే మంచిదే.

మీ శ్రేయస్సుకు సంబంధించి చాలా దృక్కోణాలు ఉన్నాయి. ఆరోగ్యం, శక్తి, మానసికం మరియు ఆధ్యాత్మికం. కాబట్టి మనం పొద్దున్న ఒక అరగంట సాధన చేస్తున్నామంటే ఒక్క కండరాలే కాక అన్ని విధాలుగా మనం వికసించాలి.

Editor’s Note: Excerpted from Sadhguru’s discourse at the Isha Hatha Yoga School’s 21-week Hatha Yoga Teacher Training program. The program offers an unparalleled opportunity to acquire a profound understanding of the yogic system and the proficiency to teach Hatha Yoga. The next 21-week session begins on July 16 to Dec 11, 2019. For more information, visit www.ishahathayoga.com or mail info@ishahatayoga.com

midiman@flickr