ప్రశ్న: ఒక ప్రాణాంతకమైన క్యాన్సర్ కారణంగా, ఈ మధ్యనే నేను నా స్నేహితురాలిని కోల్పోయాను. ఆఖరి రోజుల్లో ఆమెకు భరించలేని నొప్పి కలిగింది. ఆ నొప్పి ఉపశమనానికి, ఇంకా ఆమెను ప్రశాంతంగా ఉంచటానికి, మత్తుమందులను ఎంతటి మోతాదులో వాడాల్సి వచ్చిందంటే, దాదాపు ఆమె ప్రతిస్పందించకుండా ఉండే స్థాయికి వెళ్ళిపోయేది. నా ప్రశ్న ఏంటంటే, మరణ సమయంలో, మనం ప్రయత్నపూర్వకంగా పూర్తి ఎరుకతో మన శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే, ఈ నొప్పి మందుల కారణంగా ప్రతిస్పందించలేని ఇంకా మొద్దుబారిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అది ఎలా కుదురుతుంది? ఇటువంటి పరిస్థితిలో, మనం ఎరుకతో శరీరాన్ని వదిలి వెళ్ళాలి అంటే, నొప్పి మందులు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఉందా?

సద్గురు: ఎవరైనా విపరీతమైన నొప్పితో ఉన్నప్పుడు, మందు తీసుకోకుండా ఉండడం అనేది అమానుషం. అలాగే, ఎలాగూ అంతటి నొప్పి ఉన్నప్పుడు, ఎరుకతో ఉండడం కష్టమవుతుంది. కానీ, మనిషిని పూర్తిగా అపస్మారకంగా చేయకుండా, నొప్పిని గణనీయంగా తగ్గించగలిగే మధ్యేమార్గం ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. అన్నింటినీ మించి, ఒకరు బాహ్య ప్రపంచానికి ప్రతిస్పందించకుండా ఉన్నప్పటికీ, తమ లోపల వారు ఇంకా చాలా వరకూ స్పృహను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆ మందు వారి శరీరాన్ని మొద్దుబారేలా చేస్తూ ఉండి ఉండవచ్చు, ఇక శరీరం మొద్దుబారటం వల్ల, ఆ వ్యక్తి బాహ్య పరిస్థితులకు ప్రతిస్పందించ లేకపోవచ్చు. కానీ అది ఒకరు తమ లోపల ఎరుకతో ఉండేందుకు ఒక అనువైన పరిస్థితిని నెలకొల్పవచ్చు. ఒక స్థాయి దాటాక, మత్తుమందులు ఇంకా ఇతర మందులు వాడే మోతాదుని బట్టి, ఆ వ్యక్తి పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవచ్చు.

డాక్టర్లలో చాలావరకూ, నొప్పి పోవడానికి ఎంత వరకు అవసరమో, అంతవరకే శరీరం మొద్దు బారేలా చేసేందుకు మందులు ఇస్తారు. కొన్ని దేశాలలో, కొందరు డాక్టర్లు కొన్ని ఇతర పద్ధతులను కూడా పరిశోధిస్తున్నారు, నరాలలో ఒక భాగాన్ని తుంచేయడం ద్వారా, శరీరంలోని ఆ పలానా భాగంలో నొప్పి పెట్టకుండా ఉండేలా చేయడం, లేదా లేజర్ తరంగాలను ఉపయోగించి, నరాల వ్యవస్థ నొప్పి సంకేతాలను చేరవేయకుండా నిలువరించడం లాంటివి. ఆధునిక సాంకేతికత ఇంకా వైద్యం, రోగికి నొప్పి నుండి ఉపశమనం కలిగించడం కోసం ఎన్నో విధానాలను పరిశోధిస్తున్నాయి - అది మంచి విషయం. ఎవరూ కూడా ఏ కారణంగానూ ఎవరికీ నొప్పిని కోరుకోరు.

ఎవరైనా, నొప్పా లేక ఎరుకా అనేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితిలో కనుక ఉంటే, నేను ముందు నొప్పిని తగ్గించండి అంటాను, ఎందుకంటే ఎరుక అనేది మనం చేసే విషయం కాదు. ఎరుక అనేది ఎన్నో భిన్నమైన విధానాలలో జరగగలదు, ఎందుకంటే ఎరుకే జీవితం. తనను తాను కనుగొనటానికి, జీవానికి మార్గం ఉంది. ఎరుకతో ఉండేందుకు ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఒకరు గనక కనీసం కొంత ఎరుక కలిగిన జీవితాన్ని జీవించి ఉంటే, వారికి గనుక దీక్ష ఇవ్వబడి ఉంటే, వారిలో మరొక పార్శ్వం శక్తిని సంతరించుకుని ఉంటే, సహజంగానే వారు మరణ సమయంలో ఎరుక గలిగిన వారుగా అవుతారు. ఎరుక అనేది మనము చేసే ఒక చర్య కాదు - అది ఒక స్థితి. అది మన ఉనికి యొక్క ఒక పార్శ్వం. కాబట్టి, ఒకరు భరించలేని నొప్పి నుండి ఉపశమనం పొందడం కోసం, మొద్దుబారేలా చేయబడి ఉంటే, కంగారు పడాల్సిన అవసరం లేదు. వారు ప్రతిస్పందించలేక పోవచ్చు. కానీ దానర్థం వారు ఎరుకతో ఉండలేరని కాదు. ఒకవేళ గనుక కేవలం శరీరాన్ని మాత్రమే మొద్దుబారేలా చేయడానికి మందును ఉపయోగిస్తే, అప్పుడు వాస్తవానికి, ఎరుకతో ఉండడం మరింత సులభం అవుతుంది.

“Life and Death in One Breath” అనే ఈ-బుక్ లో జీవన్మరణ ప్రక్రియ గురించి మరింత పొందుపరచబడి ఉంది. దానిని ఈశా డౌన్లోడ్స్ లో కొనవచ్చు.

Life and Death in One Breath

Editor’s Note: This article is based on an excerpt from the January 2015 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.