పతంజలి యోగ సూత్రాలు - ఒక వివరణ

సద్గురు: పతంజలి ఒక జ్ఞాని అంతేకాదు, ఆయన మేధ ఎంత గొప్పదంటే ఈనాటి ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఆయన ముందు చిన్నపిల్లల లాగా కనిపిస్తారు. జీవితంలోని ప్రతి అంశం మీద ఆయనకున్న అవగాహన అంత గొప్పది. పతంజలి కాలంలో, అంటే వేలాది సంవత్సరాలకు పూర్వం, యోగా అనేది, అనేక వందల ప్రత్యేక యోగాలుగా మార్పు చెందింది. అది ఎలా అంటే ఈ కాలంలో వైద్య విధానంలో వచ్చిన స్పెషాలిటీల లాగా. ఉదాహరణకు ఓ 30 ఏళ్ల క్రితం మీకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాడు, కానీ ఈ నాడు మీ శరీరంలో ప్రతి దానికి వేరు వేరు డాక్టర్లు ఉన్నారు. బహుశా మరో యాభై ఏళ్లలో ఎలా తయారు అవుతుందంటే, మీరు ఒక వైద్య పరీక్ష చేయించుకోవాలంటే మీరు వంద మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. మీకు ఇంతమంది వైద్యుల నుంచి అపాయింట్మెంట్ దొరికేటప్పటికి, మీకు ఆ జబ్బైనా బాగుపడుతుంది, లేదా మీకు చావైనా మూడుతుంది.

యోగాలోని రకరకాల పార్శ్వాలను అర్థం చేసుకోడానికి రకరకాల యోగ విధానాలు తయారయ్యాయి. అవి ఆచరణ సాధ్యం కాదని పతంజలి గ్రహించాడు అందువల్ల ఆయన యోగాలను రెండు వందల సూత్రాలుగా వర్గీకరించాడు.

ఇటువంటి ప్రత్యేకతలు ఒక స్థాయిని దాటితే అది ఎంతో ఘోరంగా, ఆచరించడానికి అసాధ్యంగా అనిపించవచ్చు. అన్ని వివరాలు పరిశీలించడం ఒక ఎత్తు, కానీ మీరు వాటిని ఉపయోగించడమనేది చాలా కష్టతరమవుతుంది. ఆ కాలంలో యోగాలో ఇదే జరిగింది. యోగాలోని రకరకాల పార్శ్వాలను అర్థం చేసుకోడానికి రకరకాల యోగ విధానాలు తయారయ్యాయి. అవి ఆచరణ సాధ్యం కాదని పతంజలి గ్రహించాడు అందువల్ల ఆయన యోగాలను రెండు వందల సూత్రాలుగా వర్గీకరించాడు.

యోగ సూత్రాలు అనేది ఒక సిద్ధాంతం కాదు

ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఒక పుస్తకాన్ని ప్రచురించగలరు కాబట్టి ఈ యొక్క సూత్రాలకు అనేక వ్యాఖ్యలు తయారయ్యాయి. కానీ యోగ సూత్రాలు వ్యాఖ్య చేయగల సిద్ధాంతం కాదు. అందులో ఏ విధమైన సాధనలు లేవు, అవి కేవలం శాస్త్ర పరిశోధనా పత్రాలు. ఈ పద్ధతిలో ఏమి జరుగుతుందో అవి చెబుతాయి, అంతవరకే. ఈ పద్ధతిలో, మీకు కావలసినదాన్ని బట్టి మీరు ఒక క్రియను రూపొందించవచ్చు.

సూత్రం అంటే ఒక దారము అని అర్థం. ఒక పూలమాలలో దార ఉంటుంది, కానీ మీరు ఆ మాలను దారాన్ని చూసి ధరించరు. ఆ దారానికి ఎటువంటి పుష్పాలు, ఎటువంటి పూసలు, ఎటువంటి ముత్యాలు, వజ్రాలు గుచ్చారు అనేది వ్యక్తి  నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. పతంజలి కేవలం ఒక దారాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే మీరు దారాలు లేకుండా మాలను ధరించలేరు, అందువల్ల. ఆ సూత్రాలు చదవటానికి అర్థం చేసుకోవడానికి కాదు. మీరు వాటిని  అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, మీ తెలివితో వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అది అర్థ రహితం అవుతుంది.

ఒక ఉన్నత స్థాయి అనుభవం, అనుభూతి ఉన్నవారికి ఈ సూత్రం అనేది ఎంతో గొప్పది. ఆయన దానితో ఒక మాలను తయారు చేస్తాడు. అందుకే పతంజలి యోగ సూత్రాలూ ఒక పుస్తకంలాగా చదవటానికి కాదు. మీరు ఒక సూత్రాన్ని తీసుకుని, దానిని మీరు మీ జీవితంలో వాస్తవం చేసుకోవచ్చు మీ జీవితంలో మీకు ఒక సూత్రం వాస్తవమైతే, మీరు మిగతా సూత్రాలు చదవవలసిన అవసరం లేదు.

మొదటి సూత్రం ‘‘.....ఇక, ఇప్పుడు యోగ’’

యోగ సూత్రాలు జీవితం గురించిన అతి గొప్ప దస్తావేజులు. మరి పతంజలి ఆ గొప్ప వ్రాతలను ఒక వింత రీతిలో ఎందుకు మొదలు పెట్టాడు? పతంజలి యోగ సూత్రాలలోని మొదటి వాక్యం ‘‘.....ఇక, ఇప్పుడు యోగ’’. ఒకరకంగా ఆయన చెప్పేది ఏమిటంటే, మీరు ఇంకా ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం వల్లనో, పెళ్లి చేసుకోవడం వల్లనో, డబ్బు సంపాదించడం, ఇటువంటి మిగతా వాటి వల్ల మీ జీవితం బాగుపడుతుందనుకుంటే, ఇంకా మీకు యోగాకు సమయం రాలేదన్నమాట. అవి ఏవీ మీ జీవితాన్ని ఉన్నతం చేయవు, అని మీరు తెలుసుకుంటే, అప్పుడు యోగా.

రెండవ సూత్రం మనసు కేంద్రీకరించడం

ప్రశ్న: సద్గురూ, పతంజలి తన రెండవ యోగసూత్రంలో యోగం ‘చిత్త వృత్తి నిరోధకం’ అని అన్నారు. దానిని అర్థం, ‘‘మీరు మనసును ఏదో ఒక వస్తువుపై కేంద్రీకరించడం, మరి ఏ ఇతర పరధ్యానం లేకుండా ఆ ధ్యాసను అలా ఉంచుకోవడం’’ మరి దీని అర్థం ఏమిటి?

సద్గురు: దానిని ధారణ అంటారు. ధారణ అంటే, అక్కడ మీరు, మరో వస్తువు ఉన్నది. మీరు ఆ వస్తువు మీదే పూర్తి ధ్యాస పెడితే,  కొంతకాలానికి అక్కడ మీరే ఉంటారు లేక అదే ఉంటుంది. దానిని ధ్యాన అంటారు. అది కేంద్రీకరించటం లోని మరో స్థాయి. మీరు ధ్యానాన్ని అలాగే ఉంచుకోగలిగితే, కొంతకాలానికి అక్కడ మీరు ఉండరు, ఆ వస్తువు ఉండదు. అక్కడ మహోత్తరమైన స్థితి ఉంటుంది. దానినే సమాధి అంటారు.  సాధనలో ఇవే క్రమంగా వచ్చే ఉన్నత స్థితులు.

మీరు ఆ వస్తువు మీద ధ్యాస పెట్టండి అని  మేము అంటే, దేవుడినో, ఏదో వస్తువునో పూజించడం అనుకుంటారు, ప్రజలు. అలా కానక్కరలేదు. మీరు ఏదో ఒక పుష్పం మీదో, పత్రం మీదో, చివరకు ఒక ఇసుక రేణువు మీదనో, దేనిమీదైనా మీ మనసును కేంద్రీకరించవచ్చు. కాని మీరు దేనిమీదైనా మనసు కేంద్రీకరిస్తే, అది మీ మనోభావాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లగలగాలి. అప్పుడే  మీకు దానిమీద ధ్యాస నిలుస్తుంది. కాని, విద్యార్థులకు తమ పుస్తకాల మీద మనసు పెట్టమంటే అంత కష్టం కావడానికి కారణం అదే, ఆ విద్యార్థికి పక్కింటి పిల్ల మీద ఆసక్తి ఉంటే, మీరు అతనికి ఆ పిల్ల మీద ధ్యాస పెట్టు అని చెప్పనక్కరలేదు. ఎలాగూ అతను ఆమె మీద ధ్యాస పెట్టే ఉంటాడు. ఎందుకంటే దాని వెనక ఒక రకమైన మనోభావం ఉన్నది.

దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మీరు ఒక దానిని చాలా గొప్పగా భావించక లేకపోతే మీరు దాని మీద ధ్యాస పెట్టలేరు.

అనేక రకాల దేవుళ్ళు రూపుదిద్దుకోవడానికి ఇదే కారణం. మీరు దేనితో సంబంధం పెట్టుకోగలరో, దానిమీద ధ్యాస పెట్టండి. ఒకవేళ మీరు అప్పటికే ఉన్న ఏ దేవుడి మీద ధ్యాస పెట్టలేకపోతే, మీరు మరో దేవుడ్ని ఎంచుకోవచ్చు. మీకు అదికూడా పని చేయకపోతే, మరో దానిని తీసుకోవచ్చు. అవీ పని చేయకపోతే, మీ అంతట మీరే ఒక దేవుని తయారు చేసుకోవచ్చు. దానినే మనం ఇష్టదేవత అంటాము. దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మీరు ఒక దానిని చాలా గొప్పగా భావించక లేకపోతే మీరు దాని మీద ధ్యాస పెట్టలేరు. మీరు మీకు ఇష్టం లేని దాని మీద ప్రయత్నం చేస్తే అది మిమ్మల్ని అలసటకు లోను చేస్తుంది. ఆ వస్తువు మిమ్మల్ని పూర్తిగా ఆకర్షిస్తేనే, మీరు పూర్తిగా ధ్యాస పెట్టగలరు.

మీరు ఒక పుస్తకాన్ని చదవటం, ఒక సినిమాను చూడడం, ఎలా ఉంటుందో, ఇది కూడా అంతే. ఉదాహరణకి మీరు ఒక పాఠ్య పుస్తకాన్ని చదివారు అనుకోండి, ఈ పుస్తకం మామూలు తెలివి గల వారికే ఉద్దేశింపబడింది, అయినా మీరు దానిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అదే మీరు ఒక ప్రేమ కథ, డిటెక్టివ్ పుస్తకం గంటకు 70 పేజీల వేగంతో చదివినా, మీరు ప్రతి పదాన్ని గుర్తు పెట్టుకోగలరు. మీరు ధ్యాస పెట్టిన వస్తువు మీలో ఉత్సాహాన్ని పెంపొందించాలి, లేకపోతే మీకు అది ఒక రకమైన తలనొప్పి అవుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు