ఈ 2020 నవరాత్రిన, దేవీ అనుగ్రహాన్ని ప్రత్యక్ష ప్రసారంలో అనుభూతి చెందండి, అక్టోబర్ 17, అక్టోబర్ 22 ఇంకా అక్టోబర్ 24 న మేము లింగ భైరవి ఫేస్బుక్ ఇంకా లింగ భైరవి యూట్యూబ్ ఛానెల్లలో సాయంత్రం 5:40 కి నవరాత్రి పూజను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాము.


సద్గురు: దేవీ ఆరాధన అనేది భూమిపై అత్యంత ప్రాచీనమైన ఆరాధనా విధానంగా వస్తూ ఉంది. ఇది భారతదేశంలోనే కాదు, ఐరోపా, అరేబియా ఇంకా ఆఫ్రికాలోని అధిక శాతం ప్రాంతాలలో కొనసాగుతూ వచ్చింది. దురదృష్టవశాత్తు, పాశ్చాత్య దేశాలలో, అన్యమతవాదం, బహుదేవతారాధన ఇంకా విగ్రహారాధన అని పిలవబడే వాటి, అన్ని ఆనవాళ్లనూ తుడిచిపెట్టే ప్రయత్నంలో, దేవీ ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇదే జరిగింది.

అయితే, దేవీ ఆరాధన కొనసాగుతూ ఉన్న ఒక సంస్కృతి భారతీయ సంస్కృతి. మన అవసరాలకు అనుగుణంగా మన స్వంత దేవతలను సృష్టించుకునే స్వేచ్ఛను కల్పించిన సంస్కృతి కూడా ఇదే. ప్రతిష్ట గురించి తెలిపే శాస్త్రం, ప్రతి గ్రామానికి తమ నిర్దిష్ట స్థానిక అవసరాలకు అనుగుణంగా, తమ సొంత ఆలయాన్ని తయారు చేసుకునే వీలును కల్పించింది. దక్షిణ భారతదేశంలోని ప్రతి గ్రామంలో, ఈ రోజుకీ, ఒక అమ్మవారి లేదా దేవీ ఆలయం ఉండడాన్ని మీరు గమనించవచ్చు.

స్త్రీ తత్వం అంతరించిపోతున్న విషాద విషయం

ఈ రోజుల్లో సమాజంలో పురుషత్వం ముఖ్యమైపోయింది. కారణం, మనం కేవలం మనుగడ ప్రక్రియనే మన జీవితాల్లో అత్యుత్తమమైనదిగా చేసాము. సౌందర్యమో, లేదా నృత్యమో, లేదా సంగీతమో, ప్రేమో, లేదా దైవత్వమో, లేదా ధ్యానమో కాకుండా, ఆర్థికత - ప్రేరణా శక్తిగా మారింది. ఆర్థికత ముఖ్యమైనదిగా ఉన్నప్పుడు, జీవితంలోని సూక్ష్మమైన ఇంకా చక్కనైన అంశాలను విస్మరించినప్పుడు, సహజంగానే పురుషత్వం ఆధిపత్యం చెలాయిస్తుంది. అటువంటి ప్రపంచంలో స్త్రీ తత్వం అణగదొక్కబడడం అనేది అనివార్యం. ఇంకా పెద్ద విషాదం ఏమిటంటే, చాలా మంది మహిళలు, తాము పురుషులలాగా ఉండాలని భావించడం, ఎందుకంటే పురుషత్వం అధికారాన్ని తీసుకువస్తుందని వారు అర్థం చేసుకున్నారు. మనం ఒకవేళ స్త్రీ తత్వాన్ని కోల్పోతే, అప్పుడు జీవితంలోని అందమైనవీ, సున్నితమైనవీ, పోటీ లేనివీ ఇంకా పోషించేవీ, అన్నీ కూడా కనుమరుగైపోతాయి. జీవితంలో ప్రేరణ శాశ్వతంగా కోల్పోబడుతుంది. ఇది ఒక భయంకరమైన నష్టం, అంత సులభంగా తిరిగి పొందగలిగేది కాదు.

ఆధునిక విద్యలోని ఒక దురదృష్టకరమైన పర్యవసానం ఏమిటంటే, మనం మన తర్కానికీ లేదా విచక్షణకీ, సమంజసంగా అనిపించని ప్రతిదాన్నీ నాశనం చేయాలనుకుంటున్నాము. మనము చాలా పురుష -ఆధిపత్యత గల వారిగా అయినందువల్ల, దేవీ ఆరాధన ఈ దేశంలో కూడా చాలా వరకూ రహస్యంగా జరుగుతుంది. చాలా దేవీ ఆలాయాలలో, ప్రధాన ఆరాధన కేవలం కొద్దిమంది చేత మాత్రమే నిర్వహింపబడుతుంది. కానీ ఇది చాలా లోతుగా మిళితమై ఉన్నది కాబట్టి, దాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు.

నవరాత్రి పండుగ

భారతీయ నవరాత్రి పండుగ, దివ్యత్వంలోని స్త్రీ స్వభావానికి అంకితం చేయబడింది. దుర్గా, లక్ష్మి ఇంకా సరస్వతిని, స్త్రీ తత్వంలోని మూడు పార్శ్వాలగా చూస్తారు. భూమి, సూర్యుడు ఇంకా చంద్రుడికి ప్రతీకలుగా, లేదా తామసం (జడత్వం), రాజసం (కార్యాచరణ, అభిరుచి) ఇంకా సాత్వికం (అతీతంగా ఉండడం, జ్ఞానం, స్వచ్ఛత) అనే లక్షణాలకి ప్రతీకలుగా చూస్తారు. బలం లేదా శక్తి కోసం ఆశించేవారు, భూదేవి లేదా దుర్గా దేవి లేదా కాళికా దేవి వంటి స్త్రీ తత్వ రూపాలను ఆరాధిస్తారు. సంపద, అభిరుచి లేదా భౌతిక బహుమతులు కోరుకునే వారు, లక్ష్మీ దేవిని లేదా సూర్యుడిని ఆరాధిస్తారు. జ్ఞానం, మోక్షం లేదా అనిత్యమైన శరీరం యొక్క పరిమితులను అధిగమించాలని ఆశించే వారు సరస్వతీ దేవిని, లేదా చంద్రుడిని ఆరాధిస్తారు.

జీవం ఒక అంతు చిక్కని రహస్యం, అది ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుంది కుడా. ఈ ప్రాథమిక అంతర్దృష్టి నుంచి వచ్చినదే నవరాత్రి పండుగ.

తొమ్మిది నవరాత్రి రోజులూ, ఈ ప్రాథమిక లక్షణాల ప్రకారం వర్గీకరించబడ్డాయి. మొదటి మూడు రోజులూ దుర్గా దేవికి, తరువాతి మూడ రోజులూ లక్ష్మీ దేవికి, చివరి మూడ రోజులూ, సరస్వతీ దేవికి అంకితం చేయబడ్డాయి. పదవ రోజు, విజయదశమి, జీవితంలోని ఈ మూడు అంశాలపై విజయానికి నిదర్శనం.

ఇది కేవలం ప్రతీక మాత్రమే కాదు, శక్తి స్థాయిలో కూడా ఇది నిజం. మనుషులుగా, మనం భూమి నుండి ఉద్భవించి చురుకుగా ఉంటాము. కొంతకాలం తర్వాత, మనము మళ్ళీ జడత్వంలోకి పడిపోతాము. ఇలా జరుగుతున్నది, కేవలం వ్యక్తులమైన మనకు మాత్రమే కాదు, పాలపుంతలకీ, ఇంకా యావద్ విశ్వానికి కూడా ఇలా జరుగుతుంది. విశ్వం జడత్వ స్థితి నుండి ఉద్భవించి, క్రియాశీలంగా అయ్యి, మళ్ళీ మరోసారి జడత్వంలోకి వెళుతుంది. అయితే, మనకి ఈ చక్రాన్ని అధిగమించే సామర్థ్యం ఉంది. దేవి యొక్క మొదటి రెండు పార్శ్వాలూ, మానవ మనుగడ ఇంకా శ్రేయస్సు కోసం అవసరం. మూడవది అన్నింటికీ అతీతంగా వెళ్ళాలనే ఆకాంక్ష. మీరు సరస్వతిని కిందకి దిగివచ్చేలా చేయాలంటే, మీరు కృషి చేయాలి. లేకపోతే, మీరు ఆమెను చేరుకోలేరు.

నవరాత్రిని జరుపుకునేందుకు అత్యుత్తమ మార్గం ఏమిటి? వేడుక స్ఫూర్తితో జరుపుకోవాలి. ఎప్పటినుంచో ఉన్న జీవిత రహస్యం ఇది: దాన్ని తీవ్రంగా తీసుకోకపోవడం, కానీ అదే సమయంలో, అందులో పూర్తిగా నిమగ్నమవ్వడం. సాంప్రదాయ పరంగా దేవతలను గౌరవించే సంస్కృతులు, “మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయాలు, ఉనికిలో చాలా ఉన్నాయి,” అని తెలుసుకున్నాయి. మీరు దాన్ని ఆస్వాదించవచ్చు, దాని అందాన్ని బట్టి వేడుక చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. జీవం ఒక అంతు చిక్కని రహస్యం, అది ఎప్పటికీ ఆ విధంగానే ఉంటుంది కుడా. ఈ ప్రాథమిక అంతర్దృష్టి నుంచి వచ్చినదే నవరాత్రి పండుగ.

Editor's Note: Experience Devi live this 2020 Navratri on October 17, October 22 and October 24, as we live stream the Navratri Pooja at 5:40 PM IST on Linga Bhairavi Facebook and Linga Bhairavi YouTube channel.