ప్రశ్న: నిజమైన ఎరుకలో ఉన్న మొదటి వ్యక్తి ఎవరు? ఆదియోగి ప్రత్యక్షమైనప్పుడు మానవ చైతన్యం దృష్ట్యా మన ప్రపంచ పరిస్థితి ఎలా ఉండేది?

సద్గురు: యోగ సంప్రదాయం ప్రకారం శివుణ్ణి భగవంతునిగా చూడరు. ఆయనను ఆదియోగి అని ఆదిగురువు అని అంటారు. ఆయన తన మొదటి శిష్యులైన సప్త ఋషులకు, హిమాలయాలలోని, కేదారనాథ్ కు కొన్ని కిలోమీటర్ల ఎగువన ఉన్న కాంతిసరోవరం ఒడ్డున యోగశాస్త్రాలను అందజేశాడు. ఇది మొదటి యోగా కార్యక్రమం. కొందరు ఈ సంఘటన అరవై వేల ఏళ్ళక్రితం జరిగిందని, కొందరు ముప్ఫై లేదా ముప్ఫై ఐదు వేల ఏళ్ళక్రితం జరిగిందని అంటారు. కానీ మనం కనీసం పదిహేను వేల ఏళ్ల క్రితం జరిగిందని గట్టి నమ్మకంగా చెప్పవచ్చు.

ఆదియోగికంటే ముందుగా ఏ జ్ఞాని లేరా? కచ్చితంగా ఎవరో ఉండి ఉంటారు. ఏది ఏమైనా జ్ఞానం వేరు, తెలుసుకోవటం వేరు. అలాగే జ్ఞానాన్ని పొందటం ఎలాగో తెలిపే వ్యవస్థ పూర్తిగా వేరు.

ఆదియోగి గొప్పతనం ఆయన జ్ఞానాన్ని పొందటంలో మాత్రమే కాక, ఆ జ్ఞానాన్ని తాను ఏర్పరచిన పద్ధతులద్వారా ప్రతి ఒక్కరు పొందగలిగే అవకాశాన్ని కల్పించటంలో ఉంది. మీరు ఎవరో, మీ స్వభావం ఏమిటో కనుగొనటానికి అన్ని కోణాలను స్పష్టంగా అన్వేషిస్తూ సాగే శాస్త్రీయ పద్ధతిని అంతరంగిక శేయస్సుకోసం ఏర్పరచాడు. ఆయన నూట పన్నెండు మార్గాలను ఇచ్చాడు. వాటినుండి ఇవాళ ఎన్నో క్రమభేదాలు ఇంకా సంయోజనలు (Permutations and combinations) పుట్టుకొచ్చాయి. ఆయనకు ముందు గానీ, ఆయన తర్వాతగానీ అంత స్పష్టంగా, వివరంగా చెప్పిన వారు లేరు. ఆయనకు అందుకే గొప్ప గౌరవం ఇస్తాము.

క్రియకు సిద్ధం!

ఆదియోగి ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేవి? కూర్చున్నప్పుడు తప్ప, ఇతర అన్ని సందర్భాల్లోనూ ఏదో చెయ్యటానికి సిద్ధంగా ఉన్న భావన ఆయనలో కనిపించేదని యోగా శాస్త్రం చెబుతుంది. ఆయన ఎప్పుడూ ఒక ఆయుధాన్ని ధరించి ఉండేవాడట. అది ఆనాటి సామాజిక స్థితిని తెలియజేస్తుంది. ఆయన ప్రత్యక్షమైనప్పటి రోజుల్ని గమనిస్తే మానవులు వివిధ జాతులుగా గణాలుగా విడివిడిగా జీవించేవారు. నిజానికి మనకు ఆనాటి పరిస్థితుల గూర్చి చాలా కొద్దిగా మాత్రమే తెలుసు. కానీ మనకు అప్పటి మానవ మనస్తత్వం తెలుసు. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో మనం ఊహించగలం. స్వయం సంరక్షణ(బ్రతుకుతెరువు)అనేది ఆరోజుల్లో చాలా ప్రబలంగా ఉండి ఉంటుంది. అందుచేత ఎవరైనా పరిమితులు దాటితే అది మరణానికి దారితీస్తుంది. కచ్చితంగా అప్పుడు హింస ఉండి ఉండాలి. ఆదియోగి అప్పటి పరిస్థితికి అనుగుణంగా తనను తాను మలచుకొన్నాడు. కూర్చున్నప్పుడు ఆయన ఒక యోగిగా ఉండేవాడో, లేచినప్పుడు అంత యోధుడు.

ఆకాలంలో స్వయం సంరక్షణ ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ, ఈ సంస్కృతిలో జ్ఞానం కోసం తపన కూడా వారిలో నింపబడి ఉండాలి. మొదట ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మనం మొదట చెప్పుకొన్న సప్తర్షులతో పాటుగా చాలామంది ఆసక్తితో ఆయన్ని గుమిగూడారు. తెలుసుకోవటానికి సంబంధించి ఎటువంటి చరిత్ర ఉండి ఉండకపోతే అలా గుమిగూడేవారు కాదు. “మాకు తెలియనిదేదో నీకు తెలిసినట్టుంది” అనే భావం రావటమంటే, అప్పటికే ‘తెలుసుకోవాలనుకోవటం’ అనేది ఉండి తీరాలి.

తన అంతిమ స్వభావాన్ని గూర్చి తెలుసుకోవటానికి తపించటం అనే భావం ప్రపంచంలో నిచాలా ప్రాంతాల్లో ఎప్పుడూ వ్యక్తం కాలేదు, కానీ ఈ సంస్కృతిలో వ్యక్తమైంది. ఆనాటి సమాజం చక్కని స్థిరత్వం పొంది ఉండాలి, లేకపోతే ప్రజలకు ‘స్వయం సంరక్షణ ఒక్కటే చాలదు - మరోపార్శ్వంలో మనలను మనం శక్తి మంతులను చేసుకొని, ఏ పరిధులూ లేకుండా ఎదగాలి’ అనుకునేటంత పరిణతి కలగటం సాధ్యం కాదు. ఏస్థాయిలో వచ్చిందో తెలియదు కాని పరిణతి మాత్రం కచ్చితంగా వచ్చింది. ప్రజలు ఆయన చుట్టూ భయంతో రాలేదు. ఆయన ఏదో ఇస్తాడు అని అక్కడ చేరుకున్నారు. అంటే ఉన్నతికి మార్గం ఉందని ఏదో రకంగా వారికి తెలుసు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు