కళాశాలల్లో, పుస్తకాలలో ఈ ప్రపంచంలో మనుగడ కొనసాగించడానికి అవసరమైన విషయాలు నేర్చుకోవచ్చు. కానీ మీరు మీ జీవితానుభవాలను మరింత గాడంగా, మనోహరంగా మలచుకోవాలంటే సద్గురు సూచించిన  ఈ జీవిత పాఠాలను ప్రయత్నించండి.

జీవిత పాఠం - 1:అసత్యాలను అంతం చేయండి          

ఒక్క నిమిషం ఆలోచించండి. మీ జీవితంలో అనవసరమైన ఒక అంశాన్ని గుర్తించండి, దాన్ని ఈ రోజే అంతం చేయండి. నేను అంతం చేయమని చెప్పినప్పుడు మీ బాస్ గురించో, అత్తగారి గురించో, ఇరుగు పొరుగు గురించో ఆలోచించకండి.  మీకు చెందింది, మీ జీవితానికి అనవసరమైంది ఎంచుకొని అంతం చేయండి. ‘నా క్రోధాన్ని నేనంతం చేస్తాను’ లాంటివి చాలా పెద్ద విషయాలు. వాటిని అంతం చేయడానికి కేవలం దృఢ సంకల్పం సరిపోదు – దీనికి చైతన్యం కావాలి.

‘నాలో ఇది లేకపోతే బావుంటుంది’ అని  మీకు అనిపించే ఒక విషయాన్ని గుర్తించండి. అది తొలగించుకోవడానికి ఎదో ఒక  చర్య ఈ రోజే తీసికోగలగాలి - అది ఎంత చిన్న విషయమైనా పరవాలేదు. ఒక నిర్దిష్టమైన చిన్న అంశాన్ని ఎంపిక చేసుకోండి, ఈ రోజు నుంచి ఏది ఏమైనా మీరు మళ్లీ ఆ పని చేయకోడదు. ‘నేను క్రోధం తెచ్చుకోను’ అన్నది ఒక అసత్యం, ఎందుకంటే మీకింకా దానిపై నియంత్రణ లేదు. కాని ‘నేను కోపంగా మాట్లాడను’ లాంటి నిర్ణయం తీసుకోవచ్చు.

మీరు చేయగలిగింది ఎంచుకోండి, చేయండి. మీ జీవితాన్ని పరివర్తనం చేసుకొనే పద్ధతి ఇది - చిన్న చిన్న అడుగులు వేయడం. కాని మీరు దీన్ని తప్పకుండా ఆచరించాలి - అది ఇంక మళ్లీ మీ జేవితంలో ఎప్పటికీ తలెత్తకూడదు. మీరు దేన్నైనా హతమారిస్తే, అది ఇంక అంతమైపోవాలి. మీ జీవితము సత్యం మార్గం వైపు ముందుకు సాగాలంటే, మీరు మీ జీవితంలో సత్యం కానివాటిని  తగ్గిస్తూ రావాలి. మీ జీవితంలో అసత్యం వెంటనే తొలగిపోకపోవచ్చు, కాని మీరు దాన్ని ఒక్కొక్క అడుగుతో తగ్గించుకుంటూ పోవాలి.

జీవిత పాఠం -2: స్తబ్ధత లేకుండాచూసుకోండి బద్దలు కొట్టండి

మీలో ఏ విషయంలో మార్పు తేవచ్చో ఆలోచించండి. ఆ మార్పు కలిగించడానికి, దాని గురించి ఏమైనా చేయండి.  మీరు మార్చలేని విషయాల గురించి బాధపడుతూ ఉంటే, మీరు ఉన్నచోటే ఉంటారు, ముందుకి వెళ్లరు. కనీసం నెలకొకసారి, ఏ పౌర్ణమి రోజునో, మీరు ఎరుకతో ఈ పని చేయండి. మీలో ఏదన్నా ఒక చిన్న విషయం, మీరు మార్చుకోదలచుకున్నది పరిశీలించి చూడండి. ‘నేను భోజనం చేసిన ప్రతిసారీ నాలో భాగం కాబోతున్న ఈ ఆహారానికి కృతజ్ఞతగా 10 సెకన్లు దాన్ని తలచుకుంటాను’ వంటివి, లేదా ‘నా జీవితానికి అత్యావశ్యకమైన ప్రతి అంశమూ నేల, నీరు, గాలి, వంటి నా చుట్టూ ఉన్నవన్నీ - వాటిలో 1% పొదుపు చేస్తాను’ లేదా ‘నేను తినగలిగినంతే నా పళ్లెంలో పెట్టుకుంటాను’ వంటివి. ఈ చిన్న విషయాలే మీ జీవితాన్ని మార్చి వేస్తాయి, మిమ్మల్ని తక్కిన వారికంటే మెరుగైన స్థానంలో నిలబెడతాయి.

జీవిత పాఠం -3 : మీరిక్కడ ఉండేది కొంత కాలమే అని గుర్తుంచుకోండి.

ప్రతి మనిషీ చేయవలసిన ముఖ్యమైన విషయమేమంటే తమ మానసిక, భావోద్వేగ ఆలోచనా విధానాన్ని తమ జీవితంలోని అత్యంత ప్రాథమిక సత్యం – ‘ మరణాన్ని’ - అంగీకరించేట్లుగా మలచుకోవాలి. ఇప్పుడు తాము అమరులం కామనే వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రతి వ్యక్తికీ ఒక జీవితకాలం పడుతోంది; వారికి ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఒక గుండె పోటో, కాన్సరు గడ్డో కావాల్సి వస్తోంది.

మీరు జీవితంలోని ప్రతి క్షణాన్నీ ఆనందంగా ఓ ఉత్సవంలాగా, జరుపుకోవాలి, ఎందుకంటే జీవితం మీకోసం ఒక్కక్షణం కూడా ఆగదు. మీరే కనుక అమరులయితే మీ మనోవ్యాకులతను, ఆందోళనను, వెర్రిని, దుఃఖాన్ని ఒక్కొక్కదాన్ని ఒక్కో వందేళ్లు అనుభవించి, 500 ఏళ్ల తర్వాత ఆనందంగా ఉండడం మొదలు పెట్టచ్చు. కాని అట్లా జరగదు కదా. మీరు మర్త్యులు, కాలం గడచిపోతూనే ఉంటుంది. అందుకని నిరాశలకు, వ్యాకులతలకు, ఆందోళనకు, క్రోధానికి, మరే బాధాకరమైన విషయానికైనా ఈ జీవితంలో మనకు సమయం లేదు.

ఆశ్రమంలో అందరికీ కూడా నేను  చెప్తుంటాను,” మీరు ఆశ్రమంలో ఏ పని చేస్తున్నా సరే, ప్రతిరోజూ కనీసం ఒక గంటసేపయినా , భూమి/మట్టి సంబంధించిన పని, వాటి స్పర్శ మీకు ఉండేలా చేయండి” అని. ఇలాచేయడం వల్ల  మీరు మర్త్యులనే భౌతిక స్మృతి, శారీరక స్మృతి సహజంగానే మీకు కలుగుతుంది.

జీవితపాఠం - 4: వివేకంతో జీవించండి

మీలో మీరు ప్రేమగా ఉంటే మీకు ఎక్కువ సంతోషంగా ఉంటుందా? కోపంగా, అసహ్యంగా, అసూయగా ఉంటే మీకు ఎక్కువ సంతోషంగా ఉంటుందా? ఏది వివేకంతో జీవిచడం? ప్రేమించడం, అవును కదూ. నేను చెప్తున్నది వివేకంగా జీవించమనే. ఇది ఎవరికోసమో కాదు. ఇది మీకు సంతోషకరం, సుఖ దాయకం. ప్రేమతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడం అన్నది ఎవరికో చేసే సేవ కాదు..ఇది  వివేకంతో జీవించడం అంతే...!

మీ జీవితంలో మీరు చేసే ప్రతి పనితోనూ, ప్రేమతో నిండిన ప్రపంచాన్ని సృష్టించగలరు. ప్రేమతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడమంటే ఏదో ఒకటి ఎక్కువో తక్కువో చేయడం కాదు. మీరు కోరుకున్న దానిమీద నిరంతరం మీరు దృష్టిని కేంద్రీకరిస్తే అది నిశ్చయంగా మీ పరిసరాల్లో జరిగి తీరుతుంది.  ఇది ఇంకా విస్తారంగా కూడా జరుగుతుంది.

జీవితం పాఠం - 5: మీ జీవన ప్రమాణాన్ని నిర్ణయించుకోండి.

చాలామంది, అనేక విధాలుగా బాహ్య పరిస్థితులపై మీ సంతోషాన్ని, శాంతిని, ప్రేమను ఆధారపడేలా చేస్తున్నారు. స్టాక్ మార్కెట్ పెరిగితే మీకు సంతోషం, స్టాక్ మార్కెట్ పడిపోతే మీకు దుఃఖం. కాని మీ చుట్టూ ఏముందో అదే మీ జీవన ప్రమాణం కాదు. మనం ఇక్కడ సంతోషంగా జీవించగలగడమన్నది మన ఇంటి సైజు మీదకాని, మనం నడిపే కారుమీదో ఆధారపడదు. ఇవి మీ జీవితంలో సదుపాయంగానూ, అనుకూలంగానూ ఉంటాయి. కాని మీ జీవన ప్రమాణం ఇప్పుడు మీ అంతరంగంలో మీరెలా ఉన్నారనేదానిమీద ఆధారపడి ఉంటుంది.

సంతోషంగా, శాంతంగా జీవించడం మీకు కొత్తేమీ కాదు. మీరు చిన్నప్పుడు అలాగే ఉండేవారు, కదా. అందువల్ల నేను మిమ్మల్ని ఆవల ఉన్న దాన్ని అందుకోమనడం లేదు. కేవలం, మీ జీవితంలో మొదటి అడుగు ప్రారంభించడం గురించి మాట్లాడుతున్నాను.

జీవితపాఠం -6: వినమ్రతే అసలైన మేధస్సు

ఒక మూర్ఖుడికీ, తెలివైన వాడికీ భేదం ఏమిటంటే తెలివైన వాడికి తన మూర్ఖత్వం గురించి తెలుసు. ఈ సృష్టిలోని ఏదయినా సరే - ఒక చెట్టు, ఒక గడ్డిపరక, ఒక మట్టి రేణువు, ఒక అణువు - ఈ వస్తువుల్లో దేన్నైనా మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారా? లేదు. మీ అవగాహన స్థాయి , తెలివితేటలు ఇంతే అయినప్పుడు మీరీ ప్రపంచంలో ఎలా నడుచు కోవాలి? మెల్లగా, కొంత వినయంతో, గౌరవంతో మీ చుట్టూ ఉన్న ప్రతిదాని పట్లా ప్రేమతో నడుచుకోవాలి. ఒక వేళ ప్రేమతో కాకపోయినా కనీసం విస్మయంతో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ చిన్న విషయాన్నీ కూడా మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి.

మీరీ విధంగా నడుచుకోవడం నేర్చుకుంటే, మీరు ఆధ్యాత్మిక ప్రక్రియ నుంచి తప్పించుకోలేరు. మీకేబోధనా అక్కర్లేదు. అది మీకు జరిగిపోతుంది. అందుకే తూర్పు దేశ సంస్కృతుల్లో, మీకెదురైన ప్రతిదానికీ వంగి నమస్కరించ మని చెప్పారు. అది ఒక రాయి కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు. మీరు నడిచే భూమిపట్ల, మీరు పీల్చే గాలి పట్ల, మీరు తాగే నీటిపట్ల, మీరు తినే ఆహారంపట్ల, మీకు కలిసిన మనుషులపట్ల, మీరు వాడే ప్రతి వస్తువు పట్ల, మీ శరీరం పట్ల, మీ బుద్ధి పట్ల ఆరాధనాభావం, పూజనీయ భావం కలిగి ఉండడం మీ ప్రతి ప్రయత్నంలోనూ సాఫల్యం తెస్తుంది.

జీవితపాఠం -7 : మంచీ, చెడూ అన్నవి లేవు

మీ అంతః ప్రపంచం -  మీ చుట్టూతా ఏముందో దాని ప్రతిబింబం మాత్రమే కావాలి. అంతరంగ - బహిరంగా లెన్నడూ ఒకదానినొకటి స్పృశించరాదన్న కొన్ని నైతిక సిద్ధాంతాలకు ఇది సంపూర్ణంగా విరుద్ధం కావచ్చు. ఈ రెండిటి మధ్య దూరం లేకపోతే వారి చుట్టూ ఉన్న ప్రతిదీ వారిని కలుషితం చేస్తుందని వారి భయం. ఇది సత్యం కాదు. మీకు ప్రతిదాని విషయంలోనూ అభిప్రాయాలు ఏర్పరుచుకున్నప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్నవి మిమ్మల్ని కలుషితం చేయ గలుగుతాయి.

మీరు ఒకదాన్ని మంచిదనీ, మరొకదాన్ని చెడ్డదనీ అనుకుంటారు. మీరు మంచిదనుకున్న దానిపట్ల ప్రేమ పెంచుకుంటారు. మీరు చెడ్డదనుకున్న దాన్ని, దగ్గరకు రానివ్వరు. ఇదంతా మిమల్ని లోపలినుండి నియంత్రించడం మొదలు పెడుతుంది. కాని ఈ పద్ధతి సరయింది కాదు. ప్రతిదాన్నీ అది ఉన్న విధంగానే చూడాలి – అంతర్ముఖంలో ఉండాల్సిన పధ్ధతి అదే. అక్కడ ఉన్నదానికంటే భిన్నంగా మీరక్కడ చూశారంటే మీ అభిప్రాయాలతోనూ, మీ పక్షపాతాలతోనూ ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నారన్నమాట.

సృష్టిలో ఉన్నవి అవి ఎలా ఉంటే అలా చూడాలి తప్ప, దాన్ని మీరు కోరిన రీతిలో మార్చి చూడకోడదు. సృష్టికర్త సృష్టిపై మనిషి చేస్తున్న అత్యాచారం ఇది. ఎంత అద్భుతమైన సృష్టి! - మీరింకా చేయడానికేముంది? దాన్ని ఇముడ్చుకోగలిగితే ఇముడ్చుకోండి - అంతకంటే ఏమీ అవసరం లేదు - అది కూడా అంతతేలిక కాదు, ఎందుకంటే అది బహుముఖ పార్శ్వాలు కలిగినటువంటిది. ఎన్నో అసాధారణ విషయాలిక్కడ సంభవిస్తున్నాయి - ఒక దానిలో, మరోకటి. అన్నీ ఒక్కచోటే, అన్నీ ఒక్కసారే.

మీరు భూత భవిష్యత్తులు అనుకునేవన్నీ కూడా ఇప్పుడే ఇక్కడే ఉన్నాయి. మీరు ప్రతిదీ అది ఉన్న రీతిలో చూసినట్లయితే, మొత్తం సృష్టి మీ అంతరంగంలో ప్రతిఫలించినట్లయితే, సృష్టిని మీలో ఏది ఎలా ఉందో అలా ఉంచుకోగలిగితే మీరు సృష్టిమూలం కాగలుగుతారు. అంతరంగంలో, బహిర్గతంలో కూడా, మీరు ఉండవలసిన స్థితి ఇదే.

ప్రేమాశిస్సులతో,
సద్గురు